పాఠకుల ప్రశ్నలు
ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే, ఆయన అంత్యక్రియలకు ఒక క్రైస్తవ సేవకుడు ప్రసంగం ఇవ్వవచ్చా?
ఆత్మహత్య చేసుకున్నట్లుగా కనిపిస్తున్న ఒక వ్యక్తి అంత్యక్రియలకు, దేవుని ఎదుట మంచి మనస్సాక్షితో ప్రసంగమివ్వగలనా లేదా అన్నది ప్రతి క్రైస్తవ సేవకుడు స్వయంగా నిర్ణయించుకోవాలి. అలా నిర్ణయం తీసుకొనేటప్పుడు, ఆయన ఈ ప్రశ్నలను పరిశీలించాలి: ఆత్మహత్యను యెహోవా ఎలా దృష్టిస్తున్నాడు? ఆ మరణం తనను తాను చంపుకోవడం వల్ల జరిగినదేనా? ఆత్మహత్యకు మానసిక లేదా భావోద్వేగ రుగ్మత కారణమైందా? స్థానికంగా ఆత్మహత్యను ఎలా దృష్టిస్తారు?
క్రైస్తవులుగా మనం, యెహోవా ఆత్మహత్యను ఎలా దృష్టిస్తాడన్న దానిపై శ్రద్ధ చూపిస్తాం. యెహోవా దృష్టిలో మానవ జీవితం విలువైనది, పవిత్రమైనది. (ఆదికాండము 9:5; కీర్తన 36:9) ఉద్దేశపూర్వకంగా తనను తాను చంపుకోవడమంటే అది ఆత్మహత్యే, కాబట్టి దేవుని దృష్టికి అది అప్రీతికరమైనది. (నిర్గమకాండము 20:13; 1 యోహాను 3:15) ఆత్యహత్య చేసుకున్న వ్యక్తి అంత్యక్రియలకు ప్రసంగం ఇవ్వకుండా ఈ వాస్తవం ఆపుతుందా?
ఇశ్రాయేలు రాజైన సౌలు విషయాన్ని పరిశీలించండి. ఫిలిష్తీయులతో చివరిగా చేస్తున్న యుద్ధంలో తాను తప్పించుకోలేనని ఆయన ఎప్పుడైతే గ్రహించాడో, తన శత్రువు చేతిలో అపహాస్యం చెందకుండా ఉండేలా “సౌలు తన కత్తి పట్టుకొని దానిమీద పడెను.” ఫిలిష్తీయులకు ఆయన శవం దొరికినప్పుడు, వారు దాన్ని బేత్షాను పట్టణపు గోడకు తగిలించారు. ఫిలిష్తీయులు చేసిన దాని గురించి తెలిసిన యాబేష్గిలాదువారు ఆయన శవాన్ని గోడమీద నుండి తీసి దహనం చేశారు. తర్వాత ఆయన శల్యములను పాతిపెట్టారు. ఇశ్రాయేలీయులకు ఉన్న సాంప్రదాయక శోకదినాలుగా ఏడు రోజులు వారు ఉపవాసం కూడా ఉన్నారు. (1 సమూయేలు 31:4, 8-13; ఆదికాండము 50:10) యెహోవా అభిషిక్తుడైన దావీదు, యాబేష్గిలాదువారు చేసిన దాని గురించి తెలుసుకొని ఇలా అన్నాడు: “మీరు ఉపకారము చూపి మీ యేలినవాడైన సౌలును పాతిపెట్టితిరి గనుక యెహోవాచేత మీరు ఆశీర్వచనము నొందుదురు గాక. యెహోవా మీకు కృపను సత్యస్వభావమును అగపరచును.” (2 సమూయేలు 2:5, 6) యాబేష్గిలాదువారు రాజైన సౌలుకు చేసింది మతసంబంధమైన ఆచారమని చెప్పవచ్చు, ఆ పనికి వారు నిందించబడ్డారని బైబిలు సూచించడం లేదు. ఈ సంఘటనను, చెడుచేయడం మూలంగా పాతిపెట్టబడనివారి విషయంతో పోల్చి చూడండి. (యిర్మీయా 25:32, 33) కాబట్టి ఆత్మహత్యకు గురైన వ్యక్తి అంత్యక్రియలకు ప్రసంగం ఇవ్వవచ్చా లేదా అని ఒక క్రైస్తవ సేవకుడు నిర్ణయించుకొనేటప్పుడు, సౌలు గురించిన వృత్తాంతాన్ని పరిశీలించవచ్చు.
ఆ సేవకుడు అంత్యక్రియల ప్రసంగపు ఉద్దేశాన్ని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఆత్మ అమర్త్యమైనదని నమ్మే ప్రజల్లా, చనిపోయిన వ్యక్తిని మరో లోకానికి పంపిస్తున్నామన్న తప్పుడు ఆలోచనతో యెహోవాసాక్షులు అంత్యక్రియలు చేయరు. బదులుగా అంత్యక్రియల ప్రసంగపు ముఖ్య ఉద్దేశం, చనిపోయిన వ్యక్తి ప్రయోజనార్థం కాదుగానీ, తమ ప్రియమైన వ్యక్తిని కోల్పోయిన వారికి ఆదరణనూ అక్కడ హాజరైనవారికి చనిపోయినవారి స్థితి గురించిన సాక్ష్యాన్నీ ఇవ్వడమే. (ప్రసంగి 9:5, 10; 2 కొరింథీయులు 1:3-5) అంత్యక్రియల ప్రసంగపు మరో ముఖ్య ఉద్దేశం, అక్కడ హాజరైనవారందరినీ క్షణికమైన జీవితం గురించి ఆలోచింపజేయడమే. (ప్రసంగి 7:2) ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కోసం ఇచ్చే అంత్యక్రియల ప్రసంగం ఈ ఉద్దేశాలను నెరవేరుస్తుందా?
నిజమే, ఉద్దేశపూర్వకంగా ప్రాణం తీసుకున్న వ్యక్తికి, తాను యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నానని పూర్తిగా తెలుసని కొందరు అనుకోవచ్చు. కానీ అన్ని సందర్భాల్లోనూ అలా భావించే అవకాశం ఉందా? అది క్షణికావేశంలో తీసుకోబడిన చర్య అయ్యుండవచ్చా? ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించిన కొందరు పశ్చాత్తాపం చెంది, మళ్ళీ అలాంటి ప్రయత్నం చేయరు. ఒక వ్యక్తి తాను చేసినదానికి మరణించిన తర్వాత పశ్చాత్తాపం చెందలేడు.
అనేక ఆత్మహత్యలకు మానసిక, భావోద్వేగ రుగ్మతలు కారణమన్నది మరొక ప్రాముఖ్యమైన విషయం. వీరిని నిజంగా ఆత్మహత్యకు గురైన వ్యక్తులు అనవచ్చు. కొన్ని గణాంక వివరాల ప్రకారం ఆత్మహత్య చేసుకున్నవారిలో 90 శాతం మందికి మానసిక, భావోద్వేగపరమైన సమస్యలు గానీ మత్తుపదార్థాలకు అలవాటుపడిన సమస్యల్లాంటివి గానీ ఉన్నాయి. అలాంటి మానసిక స్థితిలో ఉన్నవారు ఆత్మహత్య చేసుకొంటే వారిని యెహోవా క్షమిస్తాడా? చనిపోయిన వ్యక్తి యెహోవా దృష్టిలో క్షమించరాని పాపం చేశాడో లేదో మనం నిర్ధారించలేము. ఒక క్రైస్తవ సేవకుడు, ఆత్మహత్యకు గురైన వ్యక్తి అంత్యక్రియలప్పుడు ప్రసంగం ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తున్నట్లైతే, మరణించిన వ్యక్తి పరిస్థితులను, వైద్యపరమైన నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకోవాలి.
ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు ఆత్మహత్యను, ఆ వ్యక్తి మరణాన్ని ఎలా దృష్టిస్తున్నారు? అన్నది ఆలోచించాల్సిన మరో విషయం. ఇది ప్రత్యేకించి, స్థానిక యెహోవాసాక్షుల సంఘం గౌరవాన్ని కాపాడే పెద్దలు ఆలోచించాల్సిన విషయం. స్థానిక ప్రజలకు ఆత్మహత్యపట్ల, ప్రత్యేకించి అప్పుడు జరిగిన సంఘటనపట్ల సాధారణంగా ఉన్న దృక్పథాన్ని బట్టి, పెద్దలు అంత్యక్రియల ప్రసంగాన్ని బహిరంగ ప్రదేశంలో గానీ రాజ్య మందిరంలో గానీ ఇవ్వకుండా ఉండడమే మంచిదని భావించవచ్చు.
అయినప్పటికీ, ఒక క్రైస్తవ సేవకుడ్ని అంత్యక్రియల ప్రసంగం ఇవ్వమని ఇతరులు కోరితే, సంఘం తరఫున కాకుండా వ్యక్తిగతంగా ఇవ్వాలనిపిస్తే ఇవ్వవచ్చు. ఆయన ప్రసంగం ఇవ్వాలని నిర్ణయించుకుంటే, పునరుత్థానం సాధ్యమా కాదా అన్న విషయంలో ఖచ్చితమైన వ్యాఖ్యానాలు చేయకుండా జాగ్రత్తపడాలి. మరణించినవారి భవిష్యత్తు ఎలాంటిదైనా అది యెహోవా చేతుల్లోని విషయం, మరణించిన వ్యక్తి పునరుత్థానుడవుతాడా లేదా అనేది ఎవ్వరూ చెప్పలేరు. ఆ సేవకుడు మరణించినవారి గురించిన బైబిలు సత్యాలపై, దుఃఖిస్తున్నవారికి ఓదార్పునివ్వడంపై మనస్సును కేంద్రీకరించాలి.