క్లోవిస్ బాప్తిస్మం ఫ్రాన్స్‌లో 1,500 సంవత్సరాల క్యాథలిక్ మతం
“పోప్ పేరిట, ఢాం!” 1996 సెప్టెంబరులో పోప్ జాన్ పాల్ II సందర్శించాల్సివున్న ఫ్రాన్స్‌లోని ఒక చర్చిలో కనుగొనబడిన నాటు బాంబు ప్రక్కన ఉన్న సందేశం అది. ఫ్రాన్స్‌లోని ప్రధాన భూభాగాన్ని సందర్శించడం ఆయనకు ఇది ఐదవసారి, ఆ సందర్శనంలో ఎదురైన వ్యతిరేకతకు పైన ఇవ్వబడింది ఒక విపరీతమైన ఉదాహరణ. అటువంటి పరిస్థితుల్లో కూడా ఫ్రాంక్‌ల రాజైన క్లోవిస్ క్యాథలిక్‌గా మతం మార్చుకుని 1,500 సంవత్సరాలైన సందర్భాన్ని పురస్కరించుకుని జరిగే ఉత్సవాలకు హాజరయ్యేందుకు పోప్‌తోపాటు ఆ సంవత్సరం ఫ్రాన్స్‌లోని రీమ్జ్ నగరానికి 2,00,000 మంది వచ్చారు. ఆయన బాప్తిస్మమే ఫ్రాన్స్ యొక్క బాప్తిస్మం అని చెప్పబడే, ఈ రాజెవరు? ఆ బాప్తిస్మ స్మారకోత్సవం అంత వివాదాన్ని ఎందుకు రేపింది?
పతనమౌతున్న సామ్రాజ్యం
దాదాపు సా.శ. 466 లో సాలియన్ ఫ్రాంక్‌ల రాజైన చిల్డరిక్ Iకు క్లోవిస్ జన్మించాడు. ఒక జర్మన్ తెగ అయిన ఈ సాలియన్ ఫ్రాంక్‌లు సా.శ. 358 లో రోమన్ల ఆధిపత్యానికి లోబడిన తర్వాత, సరిహద్దులను కాపాడుతూ, రోమన్ సైన్యంలోకి సైనికులను పంపించాలన్న షరతులపై ప్రస్తుత బెల్జియం దేశంలో స్థిరపడడానికి అనుమతించబడ్డారు. దాంతో స్థానిక ఫ్రెంచ్-రోమన్ ప్రజలతో దగ్గరి సంబంధాలు ఏర్పడడం మూలంగా ఈ ఫ్రాంక్‌లు క్రమేణా రోమన్లలా తయారవడం ప్రారంభమైంది. చిల్డరిక్ I రోమన్ల మిత్రుడిగా ఉంటూ, విసిగాత్లు సాక్సన్లు వంటి ఇతర జర్మన్ తెగల చొరబాట్లను త్రిప్పికొడుతూ ఉన్నాడు. అందుమూలంగా ఆయన ఫ్రెంచ్-రోమన్ ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు.
రోమా మండలమైన గాల్ ఉత్తరాన రైన్ నది నుండి దక్షిణాన పైరినీస్ వరకు విస్తరించివుంది. అయితే, సా.శ. 454 లో రోమా సైన్యాధ్యక్షుడు ఏయీషస్ మరణించిన తర్వాత దేశాన్ని పాలించే నాథుడే లేకుండా పోయాడు. అంతేకాదు, రోమ్ చివరి చక్రవర్తి రోమ్యులస్ ఆగస్ట్యులస్ సా.శ. 476 లో పతనం కావడమూ, రోమా సామ్రాజ్యపు పశ్చిమ భాగం నాశనం కావడమూ ఈ ప్రాంతంలో గొప్ప రాజకీయ అస్థిరతను తీసుకువచ్చింది. తత్ఫలితంగా, సరిహద్దుల్లో స్థిరపడిన తెగలవారు అందిపుచ్చుకోవడానికి వీలుగా గాల్ ముగ్గిన పండులా ఉంది. తన తండ్రి మరణానంతరం క్లోవిస్ తన రాజ్యపు సరిహద్దుల్ని విస్తరింపజేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించడంలో ఆశ్చర్యంలేదు. సా.శ. 486 లో ఆయన గాల్లో ఉన్న చివరి రోమ్ ప్రతినిధిని స్వాసోన్ నగరం వద్ద జరిగిన యుద్ధంలో ఓడించాడు. ఆ విజయంతో ఉత్తరానున్న సామ్ నదికీ మధ్య మరియు పశ్చిమ గాల్ గుండా ప్రవహిస్తున్న లవార్ నదికీ మధ్యనున్న ప్రాంతం ఆయన వశమైంది.
రాజు కాబోయే వ్యక్తి
ఇతర జర్మనీ తెగల్లా కాక ఫ్రాంక్‌లు అన్యులుగానే ఉండిపోయారు. అయితే బర్గుండీ రాకుమారి క్లొటిల్డాను క్లోవిస్ వివాహమాడడం ఆయన జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపింది. ఎంతో నిష్ఠగల క్యాథలిక్ అయిన క్లొటిల్డా తన భర్త తన మతాన్ని మార్చుకునేలా చేయడానికి గట్టి కృషి సల్పింది. సా.శ. ఆరవ శతాబ్దంలో టూర్‌కు చెందిన గ్రెగరీ నమోదు చేసిన చరిత్ర ప్రకారం, అలెమాన్ని తెగకు విరుద్ధంగా చేస్తున్న టోల్బీయక్ (జర్మనీలోని ట్సూల్పిక్) యుద్ధంలో క్లొటిల్డా ఆరాధించే దేవుడు తనకు విజయాన్ని ప్రసాదిస్తే తాను అన్యమతారాధనను విడిచిపెడతానని క్లోవిస్ సా.శ. 496 లో వాగ్దానం చేశాడు. క్లోవిస్ దళాలు ఓటమికి చేరువలో ఉన్నప్పటికీ అలెమాన్ని రాజు హతమయ్యాడు, ఆయన సైన్యం లొంగిపోయింది. క్లొటిల్డా ఆరాధించే దేవుడే తనకు విజయాన్ని ప్రసాదించాడని క్లోవిస్‌కు నమ్మకం ఏర్పడిపోయింది. “సెయింట్” రెమిజీయస్ రీమ్జ్లోని కెథీడ్రల్లో సా.శ. 496, డిసెంబరు 25న క్లోవిస్‌కు బాప్తిస్మం ఇచ్చాడని సాంప్రదాయిక వ్రాతలు చెబుతున్నాయి. అయితే ఆయన సా.శ. 498/9 లో బాప్తిస్మం తీసుకుని ఉండవచ్చని కొందరు అభిప్రాయపడతారు.
ఆగ్నేయాన ఉన్న బర్గుండీ రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడానికి క్లోవిస్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కానీ విసిగాత్లకు విరుద్ధంగా ఆయన చేసిన దండయాత్రల్లో సా.శ. 507 లో ప్వాట్యే దగ్గరున్న వూయీవద్ద వారిని ఓడించడంతో ఆయనకు విజయం లభించింది, దాంతో గాల్ యొక్క నైరృతి ప్రాంతంలో అధికభాగం ఆయన ఆధీనంలోకి వచ్చింది. ఈ విజయానికి గుర్తింపుగా క్లోవిస్‌కు తూర్పు రోమా సామ్రాజ్య చక్రవర్తి అనస్టేషియస్ గౌరవార్థ కాన్సల్ హోదాను ఇచ్చాడు. ఆ విధంగా ఆయన మిగతా పాశ్చాత్య రాజులందరి కన్నా ఉన్నత స్థానానికి హెచ్చించబడ్డాడు, అలాగే ఫ్రెంచ్-రోమన్ ప్రజల దృష్టిలో ఆయన పరిపాలన చట్టబద్ధం చేయబడింది.
తూర్పున, రైన్ నది తీరాల్లో జీవిస్తున్న ఫ్రాంకుల భూమిని తన ఆధిపత్యంలోకి తెచ్చుకున్న క్లోవిస్ ప్యారిస్ను తన రాజధానిగా చేసుకున్నాడు. తన జీవితపు చరమాంకంలో ఆయన తన రాజ్యానికి లెక్స్ సలీకా అనే లిఖిత న్యాయ స్మృతిని అందించడం ద్వారా, చర్చికీ ప్రభుత్వానికీ మధ్య సంబంధాలను నిర్వచించడానికిగాను ఆర్లీన్స్‌లో ఒక చర్చి సభను ఏర్పాటు చేయడం ద్వారా తన రాజ్యాన్ని బలపరచుకున్నాడు. బహుశ సా.శ. 511, నవంబరు 27న ఆయన మరణించడానికి ముందు గాల్ యొక్క మూడు వంతుల ప్రాంతానికి ఆయన ఏకైక రాజుగా ఉన్నాడు.
ద న్యూ ఎన్సైక్లోపీడియా బ్రిటానికా, క్లోవిస్ క్యాథలిక్ మతానికి మారడాన్ని “పశ్చిమ యూరప్ చరిత్రలో ఒక నిర్ణాయక సందర్భం” అని పిలుస్తోంది. ఈ అన్య రాజు మతమార్పిడి ఎందుకంత ప్రాముఖ్యమైనది? క్లోవిస్ ఏరియనిజంను కాక క్యాథలిక్ మతాన్ని ఎంపిక చేసుకోవడంలో ప్రాముఖ్యత ఉంది.
ఏరియన్ వివాదం
దాదాపు సా.శ. 320 లో ఈజిప్ట్‌లోని అలెగ్జాండ్రియాలోని ఏరియస్ అనే ప్రీస్టు త్రిత్వం సంబంధంగా విప్లవాత్మకమైన తలంపులను ప్రచురం చేయడం ప్రారంభించాడు. దేవుని కుమారుడు వస్తుతః తండ్రితో సమానుడన్న విషయాన్ని ఏరియస్ నిరాకరించాడు. కుమారుడు దేవుడు కాలేడు, లేక తండ్రికి సమానుడు కాలేడు, ఎందుకంటే కుమారునికి ఆది ఉంది. (కొలొస్సయులు 1:15) పరిశుద్ధాత్మ వ్యక్తియని, కానీ తండ్రికంటే కుమారునికంటే తక్కువస్థాయికి చెందినవాడని ఏరియస్ నమ్మాడు. విస్తృత ప్రజాదరణ పొందిన ఈ బోధ చర్చిలో తీవ్రమైన వ్యతిరేకతను రేకెత్తించింది. సా.శ. 325 లో నైసియా సభలో ఏరియస్కు దేశబహిష్కార శిక్షను విధించి, ఆయన బోధలు తప్పు అని ప్రకటించబడింది.a
అయితే దీంతో వివాదం సమసిపోలేదు. సిద్ధాంతపరమైన వాదోపవాదాలు దాదాపు 60 ఏండ్ల వరకు కొనసాగాయి, రాజ్యాధికారంలోకి వచ్చిన ప్రతి చక్రవర్తి అయితే ఇటు లేకపోతే అటు మొగ్గుచూపారు. చివరికి సా.శ. 392 లో థియోడోషియస్ I అనే చక్రవర్తి త్రిత్వ సిద్ధాంతంగల సాంప్రదాయిక క్యాథలిక్ మతాన్ని రోమా సామ్రాజ్యపు మతంగా చేశాడు. ఈలోగా జర్మనీలోని ఒక బిషప్ అయిన ఉల్ఫిలాస్, గాత్లను ఏరియనిజంకి మతమార్పిడి చేశాడు. ఇతర జర్మన్ తెగలు ఈ తరహా “క్రైస్తవత్వాన్ని” వెంటనే స్వీకరించాయి.
క్లోవిస్ కాలానికల్లా గాల్లోని క్యాథలిక్ చర్చి సంక్షోభ సాగరంలో ఉంది. ఏరియన్లయిన విసిగాత్లు, చనిపోయిన బిషప్‌ల స్థానంలో ఇతరులను నియమించడానికి నిరాకరిస్తూ క్యాథలిక్ మతాన్ని అణగద్రొక్కడానికి ప్రయత్నిస్తున్నారు. అంతేగాక పోప్ అభ్యర్థి సంబంధంగా రెండు చీలికలు ఏర్పడడంతోను, వ్యతిరేక వర్గాల ప్రీస్టులు రోమ్‌లో ఒకర్నొకరు చంపుకుంటుండడంతోను చర్చి సంక్షోభాల్లో ఉంది. కొందరు క్యాథలిక్ రచయితలు సా.శ. 500వ సంవత్సరం లోకాంతం వచ్చే సంవత్సరమన్న తలంపుని ప్రవేశపెట్టడంతో గలిబిలి మరింత ఎక్కువయ్యింది. ఆ విధంగా, ఫ్రాంక్‌ల రాజు క్యాథలిక్ మతానికి మార్పిడి చేసుకోవడం ఒక శుభసూచక సంఘటనగా, “సెయింట్ల నూతన సహస్రాబ్ది”కి ప్రారంభాన్ని ప్రకటిస్తున్నట్లుగా దృష్టించబడింది.
కానీ క్లోవిస్ ఉద్దేశాలేమిటి? ఆయన మతపరంగా ప్రేరేపించబడ్డాడనడంలో సందేహం లేకపోయినప్పటికీ ఆయనకు రాజకీయ లక్ష్యాలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. క్యాథలిక్ మతాన్ని ఎంపిక చేసుకోవడం ద్వారా క్లోవిస్ ఫ్రెంచ్-రోమన్ ప్రజల్లో అత్యధికుల అనుగ్రహాన్ని పొందాడు, అలాగే ఎంతో ప్రాబల్యంగల చర్చి అధికారుల మద్దతునూ పొందాడు. ఇది, ఆయనకు తన రాజకీయ శత్రువులపై తిరుగులేని ఆధిక్యాన్ని ఇచ్చింది. “ఆయన గాల్‌ను జయించడం, ఎంతగానో ద్వేషించబడిన చర్చివిరోధులైన ఏరియన్ల కాడి నుండి స్వేచ్ఛను పొందడానికి చేసిన యుద్ధంలో జయించడంగా ఉంది” అని ద న్యూ ఎన్సైక్లోపీడియా బ్రిటానికా చెబుతోంది.
క్లోవిస్ నిజానికి ఎలాంటి వ్యక్తి?
1996 లో జరిగిన స్మారకోత్సవాలకు ముందు రైమ్జ్ ఆర్చిబిషప్ అయిన ఝేరార్ డీఫ్వా, క్లోవిస్ “జాగ్రత్తగా పథకం వేసి మంచి వివేచనా శక్తితో చేయబడిన మతమార్పిడికి ప్రతీకగా” ఉన్నాడని వ్యాఖ్యానించాడు. అయితే ఫ్రెంచి చరిత్రకారుడైన ఎర్నెస్ లావీస్, “క్లోవిస్ మతమార్పిడి, ఆయన వ్యక్తిత్వాన్ని ఎంతమాత్రమూ మార్చలేదు; సువార్తల్లోని దయాపూర్వకమైన శాంతిపూర్వకమైన నైతిక సందేశం ఆయన హృదయాన్ని తాకలేకపోయింది” అని వ్యాఖ్యానించాడు. మరో చరిత్రకారుడు ఇలా ఉద్ఘోషించాడు: “ఆయన ఓడిన్ [నోర్స్ల దేవుడు] నామమున ప్రార్థించడానికి బదులుగా క్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థించాడు, కానీ వ్యక్తిలో మాత్రం మార్పులేదు.” కాన్స్టంటైన్ తన బూటకపు క్రైస్తవత్వ మార్పిడి తర్వాత ఉన్నట్లే, క్లోవిస్ కూడా తన పరిపాలనను దృఢపర్చుకోవడానికిగాను, సింహాసనానికి పోటీదారులుగా ఉన్నవారందరినీ ఒక పద్ధతి ప్రకారం పెద్ద ఎత్తున సంహరించాడు. ఆయన “తన దూరపు బంధువులందరినీ కూడా” సమూలంగా తుడిచిపెట్టేశాడు.
క్లోవిస్ చనిపోయిన తర్వాత ఆయన్ను క్రూరుడైన యోధుడి నుండి మంచి పేరుగల సెయింట్‌గా మార్చడానికి కథలు ప్రచారంలోకి రానారంభించాయి. ఆ తర్వాత దాదాపు ఒక శతాబ్దం తర్వాత టూర్‌కు చెందిన గ్రెగరీ వ్రాసిన వృత్తాంతం, క్లోవిస్, “క్రైస్తవత్వాన్ని” స్వీకరించిన మొదటి రోమా చక్రవర్తి అయిన కాన్స్టంటైన్ సమానుడని చూపడానికి చేయబడిన ఒక ప్రయత్నంగా వ్రాయబడిందని దృష్టించబడుతోంది. క్లోవిస్ బాప్తిస్మం సమయానికి ఆయనకు 30 ఏండ్లని చెప్పడం ద్వారా, ఆయనకు క్రీస్తుకు పోలిక ఉన్నదని చెప్పడానికి గ్రెగరీ ప్రయత్నిస్తున్నాడని అనిపిస్తోంది.—లూకా 3:23.
ఇలా కథలు ప్రచారం చేసే పద్ధతిని తొమ్మిదవ శతాబ్దంలో రైమ్జ్ బిషప్ అయిన ఆంక్మార్ కూడా కొనసాగించాడు. కెథీడ్రల్లు తీర్థయాత్రికుల కోసం పోటీ పడుతున్న సమయంలో, తన ముందు తరంవాడైన “సెయింట్” రెమిజీయస్ గురించి ఆంక్మార్ వ్రాసిన జీవితచరిత్ర బహుశ తన చర్చి ఖ్యాతిని పెంచాలనే, దాన్ని సుసంపన్నం చేయాలనే ఉద్దేశంతో వ్రాయబడినది కావచ్చు. ఆయన వృత్తాంతంలో, క్లోవిస్ బాప్తిస్మం సమయంలో ఒక తెల్లని పావురం కొంచెం నూనెను తీసుకువచ్చినట్లు ఉంది—ఇది స్పష్టంగా యేసు పరిశుద్ధాత్మతో అభిషేకించబడడాన్ని గురించి చెబుతోంది. (మత్తయి 3:16) అలా ఆంక్మార్ క్లోవిస్కూ, రైమ్జ్కూ, రాచరికానికీ మధ్య సంబంధం ఉన్నట్లు స్థాపించాడు, క్లోవిస్ నిజానికి ప్రభువు అభిషేకించిన వ్యక్తి అన్న తలంపుకు ఊతనిచ్చాడు.b
వివాదాస్పద స్మారకోత్సవం
ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఛార్లెస్ డి గాల్ ఒకసారిలా అన్నాడు: “నా అభిప్రాయంలో ఫ్రాన్స్ చరిత్ర క్లోవిస్తో ప్రారంభమౌతుంది. ఫ్రాంక్‌ల తెగ ఆయనను ఫ్రాన్స్‌కు రాజుగా ఎంపిక చేసుకుని వారే ఫ్రాన్స్‌కు తమ పేరు పెట్టారు.” అయితే, అందరూ అలాంటి అభిప్రాయాన్నే కలిగిలేరు. క్లోవిస్ బాప్తిస్మం తీసుకుని 1,500 సంవత్సరాలు గడిచిన సందర్భంగా జరుపుకున్న ఉత్సవాలు వివాదాస్పదంగా తయారయ్యాయి. 1905 నుండి చర్చి ప్రభుత్వంతో అధికారికంగా వేరుపడి ఉన్న ఒక దేశంలో, మతపర స్మారకోత్సవం అని తాము దృష్టించిన ఉత్సవంలో ప్రభుత్వం పాల్గొనడాన్ని అనేకమంది విమర్శించారు. రైమ్జ్లోని సిటీ కౌన్సిల్‌వారు, పోప్ సందర్శనంలో ఉపయోగించాలనుకున్న వేదిక ఖర్చులు తాము భరించాలనుకుంటున్నట్లు ప్రకటించినప్పుడు అది రాజ్యాంగ విరుద్ధమని ఒక సంస్థ ఆ నిర్ణయాన్ని కోర్టుద్వారా మార్చేలా చేసింది. మరితరులు, చర్చి తన నైతిక లౌకిక అధికారాన్ని ఫ్రాన్స్‌పై మరొకసారి రుద్దాలని చూస్తోందని భావించారు. క్లోవిస్ను, అతిసంప్రదాయవాదులైన నాషనల్ ఫ్రంట్‌కు చిహ్నంగా, ఛాందసవాద క్యాథలిక్ గుంపులకు చిహ్నంగా అభివర్ణించడం ఈ స్మారకోత్సవాన్ని మరింత సంక్లిష్టభరితం చేసింది.
మరి కొందరు చరిత్ర దృక్కోణంలోంచి చూస్తూ ఈ స్మారకోత్సవాన్ని విమర్శించారు. ఫ్రెంచ్-రోమన్ ప్రజల్లో క్యాథలిక్ మతం అప్పటికే లోతుగా వేళ్ళూనుకుని ఉంది గనుక, క్లోవిస్ బాప్తిస్మం మూలంగా ఫ్రాన్స్ క్యాథలిక్ దేశంగా ఏమీ మారలేదని వారు అన్నారు. అంతేగాక, ఆయన బాప్తిస్మం ఫ్రాన్స్ ఒక దేశంగా జన్మించడాన్ని కూడా సూచించదని వారన్నారు. ఫ్రాన్స్ పుట్టుక షార్లిమేన్ రాజ్యం సా.శ. 843 లో విభాగించబడడంతో జరిగిందనీ, అప్పుడు క్లోవిస్ కాక ఛార్లెస్ ద బాల్డ్ ఫ్రాన్స్‌కు మొదటి రాజయ్యాడని గుర్తించాలనీ వారు భావించారు.
1,500 సంవత్సరాల క్యాథలిక్ మతం
“చర్చి యొక్క పెద్ద కూతురుగా” 1,500 సంవత్సరాలు వెలిగిన ఫ్రాన్స్‌లో నేడు క్యాథలిక్ మతం ఎలా ఉంది? 1938 వరకు, బాప్తిస్మం పొందిన అత్యధిక క్యాథలిక్కులున్న దేశం ఫ్రాన్స్. కానీ ఇప్పుడది ఆరవ స్థానంలో, ఫిలిప్పీన్స్ అమెరికా లాంటి దేశాల తర్వాత ఉంది. ఫ్రాన్స్‌లో 4.5 కోట్లమంది క్యాథలిక్కులు ఉన్నా కేవలం 60 లక్షల మంది మాత్రమే క్రమంగా మాస్కు హాజరవుతారు. ఫ్రాన్స్‌లోని క్యాథలిక్కులపై ఇటీవల జరిపిన ఒక సర్వేలో 65 శాతంమంది “లైంగిక విషయాల్లో చర్చి బోధలను ఏమాత్రం ఖాతరు చెయ్యరని,” వారిలో 5 శాతంమంది యేసు “ఏమాత్రం ప్రాముఖ్యత లేని వ్యక్తి” అని భావిస్తున్నారని తేలింది. అలాంటి వ్యతిరేక వైఖరులే, పోప్ 1980 లో ఫ్రాన్స్‌ను సందర్శిస్తున్నప్పుడు ఇలా అడిగేలా ఆయనను ప్రేరేపించాయి: “ఫ్రాన్స్, నీ బాప్తిస్మం సమయంలో నీవు చేసిన వాగ్దానాలను నీవేం చేశావు?”
[అధస్సూచీలు]
a త్రిత్వమును మీరు నమ్మవలయునా? బ్రోషురులోని 7-9 పేజీలు చూడండి.
b లూయీ అన్న పేరు క్లోవిస్ నుండి వచ్చింది, క్లోవిస్ పేరు మీదుగానే 19 ఫ్రెంచి రాజులకు (లూయీ XVII లూయీ ఫిలిప్లతో సహా) పేర్లు పెట్టబడ్డాయి.
[27వ పేజీలోని మ్యాపు]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
సాక్సన్లు
రైన్ నది
సామ్ నది
స్వాసోన్
రైమ్జ్
పారిస్
గాల్
లవార్ నది
వూయీ
ప్వాట్యే
పైరినీస్
విసిగాత్లు
రోమ్
[26వ పేజీలోని చిత్రం]
14వ శతాబ్దపు వ్రాతప్రతిలో క్లోవిస్ బాప్తిస్మం చిత్రణ
[చిత్రసౌజన్యం]
© Cliché Bibliothèque nationale de France, Paris
[28వ పేజీలోని చిత్రం]
ఫ్రాన్స్‌లోని రైమ్జ్ కెథీడ్రల్ బయట క్లోవిస్ (మధ్యలో) బాప్తిస్మం పొందుతున్న శిల్పం
[29వ పేజీలోని చిత్రం]
క్లోవిస్ బాప్తిస్మపు స్మారకోత్సవాన్ని జరుపుకోవడానికి జాన్ పాల్ II ఫ్రాన్స్‌ను సందర్శించడం వివాదాన్ని రేపింది