దేవుని వాక్యాన్ని బోధించేవారు
తమకివ్వబడిన ఆజ్ఞను నెరవేర్చాలని ప్రోత్సహించబడ్డారు
లక్షలాదిమంది బోధకులు ఉపదేశం పొందడానికి ఇటీవలి నెలల్లో సమావేశమయ్యారు. మే నెల మొదలుకొని ప్రపంచవ్యాప్తంగా జరిగిన “దేవుని వాక్యాన్ని బోధించేవారు” అనే యెహోవాసాక్షుల సమావేశాలకు వారు సమకూడారు. ఆ సమావేశాలు వందల సంఖ్యలో జరిగాయి. బోధకులుగా మరింత యోగ్యులవ్వడానికి, తమకివ్వబడిన ఆజ్ఞను నెరవేర్చడానికి, తమకు తామే బోధించుకోవాలని సమావేశానికి హాజరైనవారందరూ ప్రోత్సహించబడ్డారు.
ఈ సమావేశాలలో ఏదైనా ఒకదానికి మీరు హాజరయ్యారా? హాజరైనట్లైతే, సత్య దేవుడైన యెహోవాను ఆరాధించడానికి జరిగిన ఈ సమావేశాలలో అందించబడ్డ చక్కని ఆధ్యాత్మిక ఆహారాన్ని మీరు మెచ్చుకొని ఉంటారనేందుకు సందేహం లేదు. ఉపదేశాత్మకమైన ఈ సమావేశ కార్యక్రమాన్ని పునఃసమీక్షించడానికి మీరు మాతో ఎందుకు చేరకూడదు?
మొదటి రోజు—దైవావేశమువలన కలిగిన లేఖనాలు బోధించడానికి ప్రయోజనకరంగా ఉన్నాయి
సమావేశ అధ్యక్షుడు హాజరైనవారందరిని “దేవుని వాక్య బోధకులారా, ఉపదేశం పొందండి” అనే ప్రసంగంతో హృదయపూర్వకంగా ఆహ్వానించాడు. యేసు క్రీస్తు, “మహోపదేశకుడైన” యెహోవా దేవునినుండి నేర్చుకుని గొప్ప బోధకుడయ్యాడు. (యెషయా 30:20 NW; మత్తయి 19:16) దేవుని వాక్యాన్ని బోధించేవారిగా అభివృద్ధి చెందాలంటే, మనం కూడా యెహోవానుండి తప్పనిసరిగా ఉపదేశం పొందాలి.
తర్వాత, “రాజ్య బోధ శ్రేష్ఠమైన ఫలాల్ని ఫలిస్తోంది” అనే భాగం నిర్వహించబడింది. అనుభవజ్ఞులైన దేవుని వాక్య బోధకులను ఇంటర్వ్యూ చేయడం ద్వారా, శిష్యులను తయారుచేయడంలోవున్న ఆనందాలు మరియు ఆశీర్వాదాల గురించి నొక్కి చెప్పబడింది.
తర్వాత, “‘దేవుని గొప్ప కార్యాల’ ద్వారా కదిలించబడడం” అనే ప్రేరణాత్మకమైన ప్రసంగం ఇవ్వబడింది. “దేవుని గొప్పకార్యము”లు మొదటి శతాబ్దంలోని ప్రజలను చర్య తీసుకొనేలా కదిలించాయి. ఆ కార్యాల్లో దేవుని రాజ్యం కూడా ఉంది. (అపొస్తలుల కార్యములు 2:11) మనం కూడా అలాంటి “గొప్పకార్యము”లను గురించి ప్రకటించడం ద్వారా చర్య తీసుకునేలా ప్రజలను కదిలించవచ్చు, ఉదాహరణకు విమోచన క్రయధనం, పునరుత్థానం మరియు క్రొత్త నిబంధన వంటి ఆధ్యాత్మిక బోధలను ప్రకటించడం ద్వారా మనమలా చేయవచ్చు.
తర్వాతి ప్రసంగం “యెహోవా నీతియందు ఆనందించండి” అని అందరిని ప్రోత్సహించింది. (కీర్తన 35:27) నీతియుక్తమైన వాటిని ప్రేమించడాన్ని, చెడ్డ వాటిని అసహ్యించుకోవడాన్ని నేర్చుకోవడం ద్వారా బైబిలు అధ్యయనం చేయడం ద్వారా ఆధ్యాత్మికతకు హానికరమైన ప్రభావాలను చురుకుగా ఎదిరించడం ద్వారా వినయాన్ని పెంపొందించుకోవడం ద్వారా నీతిని వెంబడించవచ్చు. ఇలాంటి చర్యలు హానికరమైన సహవాసాల నుంచి, ఈ లోకపు భౌతిక విషయాలకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చే విలువలనుంచి మరియు అనైతికమైన హింసలతో కూడిన వినోదం నుంచి మనల్ని కాపాడతాయి.
“దేవుని వాక్య బోధకులుగా సంపూర్ణంగా సిద్ధపడి ఉన్నాము” అనే ముఖ్యాంశ ప్రసంగం, యెహోవా మనల్ని తన వాక్యం ద్వారా, తన పరిశుద్ధాత్మ ద్వారా తన భూసంబంధ సంస్థ ద్వారా యోగ్యులైన పరిచారకులుగా చేస్తాడని గుర్తుచేసింది. దేవుని వాక్యాన్ని ఉపయోగించే విషయంలో “బైబిలు పుటల్లోనున్న సందేశాన్ని మన శ్రోతల హృదయాలపై ముద్రించడమే మన ధ్యేయంగా ఉండాలి” అని ప్రసంగీకుడు మనకు ప్రబోధించాడు.
“మనకు మనమే బోధించుకొంటూ ఇతరులకు బోధించడం” అన్నది సమావేశంలోని మొదటి గోష్ఠి అంశం. ఈ గోష్ఠి ప్రారంభ భాగంలో మనం ఇతరులకు బోధించే క్రైస్తవత్వపు నైతిక ప్రమాణాలను ముందు మనం పాటించాలని నొక్కి చెప్పబడింది. తర్వాతి భాగం ‘సత్యవాక్యమును సరిగా ఉపదేశించు’ అని మనకు సలహా ఇచ్చింది. (2 తిమోతి 2:15) మనం ఎంతకాలం నుండి దేవుణ్ణి సేవిస్తున్నప్పటికీ, మనకు మనమే బోధించుకోవాలంటే, క్రమంగా శ్రద్ధాపూర్వకంగా వ్యక్తిగత బైబిలు అధ్యయనం చేయడం ఆవశ్యకము. మనలో అహంకారం, స్వేచ్ఛా స్వభావం, స్వయం ప్రాముఖ్యతా భావం, ఈర్ష్య, అసూయవంటి లక్షణాలు, కఠినత్వం, పగ, తప్పులుపట్టడం వంటి దృక్పథాల కోసం సాతాను చూస్తున్నాడని గోష్ఠిలోని చివరి భాగం తెలియజేసింది. అయినప్పటికీ, మనము సాతానును దృఢంగా ఎదిరిస్తే అతను మన దగ్గర నుండి పారిపోతాడు. సాతానును ఎదిరించడానికి మనం దేవునికి దగ్గరవ్వాలి.—యాకోబు 4:7, 8.
“ఈ లోకపు అశ్లీల చిత్రాలు సాహిత్యాలు అనే తెగులును అసహ్యించుకోండి” అనే సమయోచితమైన ప్రసంగం మన ఆధ్యాత్మికతను క్షీణింపజేయగల ప్రమాదాన్ని ఎలా అధిగమించాలో చూపించింది. “నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది గదా; బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు గదా” అని ప్రవక్తయైన హబక్కూకు యెహోవా గురించి చెప్పాడు. (హబక్కూకు 1:13) మనము “చెడ్డదాని నసహ్యించు”కోవాలి. (రోమీయులు 12:9) తమ పిల్లలు ఇంటర్‌నెట్‌ను, టెలివిజన్‌ను చూస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టాలని ప్రోత్సహించబడ్డారు. అశ్లీల సాహిత్యాలవైపు చిత్రాలవైపు ఆకర్షితులౌతున్నవారు ఆధ్యాత్మిక పరిణతిగల స్నేహితుని సహాయం తీసుకోవాలని ప్రసంగీకుడు చెప్పాడు. కీర్తన 97:10; మత్తయి 5:28; 1 కొరింథీయులు 9:27; ఎఫెసీయులు 5:3, 12; కొలొస్సయులు 3:5; 1 థెస్సలొనీకయులు 4:4, 5 వంటి లేఖనాలను ధ్యానించి, జ్ఞాపకముంచుకోవడంకూడా సహాయకరంగా ఉండగలదు.
“దేవుని సమాధానము మీకు కావలియుండనివ్వండి” అనే తర్వాతి ప్రసంగం, మనం చింతాభారంతో కృంగినప్పుడు యెహోవా మీద మన భారం మోపవచ్చన్న హామీతో మనల్ని ఓదార్చింది. (కీర్తన 55:22) ప్రార్థనలో మన హృదయాలను కుమ్మరిస్తే, యెహోవా మనకు తన “సమాధానము”ను ఇస్తాడు. ఆయనతో మనకున్న విలువైన సంబంధం మూలంగా కలిగే నెమ్మది, అంతరంగ ప్రశాంతతే ఆ సమాధానము.—ఫిలిప్పీయులు 4:6, 7.
“వెలుగుతో యెహోవా తన ప్రజలను శృంగారిస్తాడు” అనే ప్రసంగం ద్వారా సంతోషకరమైన సందేశంతో మొదటి రోజు ముగిసింది. ఆ ప్రసంగం యెషయా 60వ అధ్యాయపు నెరవేర్పును వివరించింది. “అన్యులు,” అంటే ఈ లోకపు ప్రస్తుత అంధకారము నుండి వెలుపలికి వస్తున్న గొర్రెలవంటివారి గొప్ప సమూహము, వారు అభిషిక్త క్రైస్తవులతోపాటు యెహోవా వెలుగును అనుభవిస్తున్నారు. 19, 20 వచనాలను ప్రసంగీకుడు ఇలా వివరించాడు: “యెహోవా సూర్యునిలా ‘అస్తమించడం’ గానీ చంద్రునిలా ‘క్షీణించడం’ గానీ జరుగదు. ఆయన తన ప్రజలపై వెలుగు ప్రకాశింపజేస్తూ వారిని అలంకరించడంలో కొనసాగుతాడు. ఈ అంధకార లోకపు అంత్యదినాల్లో జీవిస్తున్న మనకు అదెంత అద్భుతమైన హామీ!” ప్రసంగాంతంలో, ప్రసంగీకుడు యెషయా ప్రవచనం—సర్వమానవాళికి వెలుగు, రెండవ సంపుటి (ఆంగ్లం) విడుదలను ప్రకటించాడు. మీరు ఈ క్రొత్త పుస్తకాన్ని చదవడం పూర్తి చేశారా?
రెండవ రోజు—ఇతరులకు బోధించుటకు సామర్థ్యముగలవారు
రెండవ రోజు దినవచనాన్ని చర్చించిన తర్వాత “ఇతరులను విశ్వాసులుగా తయారు చేసే పరిచారకులు” అన్న గోష్ఠి జరిగింది. సమావేశంలో రెండవదైన ఈ గోష్ఠిని మనందరం అత్యంత శ్రద్ధతో విన్నాము. ప్రజలు విశ్వాసులయ్యేందుకు సహాయపడడంలో, రాజ్య సువార్తను వ్యాప్తి చేయుట, కనుగొన్న ఆసక్తిని వృద్ధి చేయుట, మరియు ఆసక్తి గలవారికి క్రీస్తు ఆజ్ఞాపించిన వాటన్నింటిని గైకొనే విధంగా వారికి బోధించుట అన్న మూడు దశల్లో ఒక్కొక్క దాన్ని ఈ మూడు భాగాల గోష్ఠిని నిర్వహించిన ప్రసంగీకులు నొక్కి చెప్పారు. ఇంటర్వ్యూలు మరియు పునఃప్రదర్శనల ద్వారా, ఇతరులు శిష్యులవ్వడానికి వారికెలా బోధించవచ్చో మనం నిర్దిష్టంగా చూడగలిగాము.
తర్వాతి భాగపు అంశం “మీ సహనానికి దైవభక్తిని జతచేయండి.” మనం ‘అంతమువరకు సహించామా’ లేదా అన్నదే చివరికి లెక్కలోకి తీసుకోబడుతుందని ప్రసంగీకుడు చూపించాడు. (మత్తయి 24:13) దైవభక్తిని పెంపొందించుకునేందుకు దేవుడు మన కోసం చేసిన ఏర్పాట్లన్నింటిని అంటే ప్రార్థనను, వ్యక్తిగత అధ్యయనాన్ని, కూటాలను, పరిచర్యను ఉపయోగించుకోవాలి. లోక సంబంధ కోరికలు, కార్యకలాపాలు దైవభక్తిని అతిక్రమించకుండా లేదా నాశనం చేయకుండా మనం నివారించుకోవాల్సిన అవసరం ఉంది.
ప్రయాసపడి భారము మోసికొనుచున్న ప్రజలు నేడు సేదదీర్పును ఎలా కనుగొనగలరు? “క్రీస్తు కాడి క్రింద విశ్రాంతి పొందడం” అనే ప్రసంగం ఈ ప్రశ్నకు సమాధానమిచ్చింది. యేసు తన అనుచరులను తన కాడి క్రిందకు వచ్చి తననుంచి నేర్చుకొమ్మని దయతో ఆహ్వానించాడు. (మత్తయి 11:28-30) నిరాడంబరమైన, సమతూకమైన జీవితాన్ని జీవించిన క్రీస్తు మాదిరిని అనుకరించడం ద్వారా మనము ఆయన కాడి క్రిందకు రావచ్చు. తమ జీవితాలను సరళీకృతం చేసుకున్నవారి అనుభవాల ద్వారా ప్రసంగంలోని ముఖ్యాంశాలు నొక్కి చెప్పబడ్డాయి.
యెహోవాసాక్షుల పెద్ద సమావేశాలలోని ప్రముఖ అంశాలలో ఒకటి క్రొత్తగా సమర్పించుకున్న దేవుని సేవకుల బాప్తిస్మం. “బాప్తిస్మం మరిగొప్పదైన బోధనా ఆధిక్యతలకు నడిపిస్తుంది” అనే ప్రసంగాన్ని అందించిన సహోదరుడు బాప్తిస్మ అభ్యర్థులందరికీ ఆప్యాయంగా స్వాగతం చెప్పి వారిని ఇంకా గొప్ప సేవాధిక్యతలలో భాగం వహించమని ఆహ్వానించాడు. క్రొత్తగా బాప్తిస్మం పొందిన దేవుని వాక్యపు బోధకుల్లో ఎవరైతే లేఖనాధార యోగ్యతలను చేరుకుంటారో వారు సంఘంలోని వివిధ బాధ్యతలను పొందవచ్చు.
ఆ మధ్యాహ్నం మొదటి ప్రసంగాంశం “గొప్ప బోధకుణ్ణి అనుకరించండి.” యేసు యుగయుగాలుగా పరలోకంలో తన తండ్రిని జాగ్రత్తగా గమనించి ఆయనను అనుకరించడం ద్వారా గొప్ప బోధకుడయ్యాడు. ఆయన భూమ్మీద ఉన్నప్పుడు హృదయంలోనికి చొచ్చుకొనిపోయే ప్రశ్నలను వేయడం మరియు సరళమైనవే అయినా మనస్సులో ముద్రించుకుపోయే దృష్టాంతాలను ఉపయోగించడం వంటి ప్రభావవంతమైన బోధనా పద్ధతులను ఉపయోగించాడు. యేసు దేవుని వాక్య ఆధారంగా బోధించి, ఉత్సాహంతో, ఆప్యాయతతో, అధికారంతో మాట్లాడాడు. మనం కూడా ఆ గొప్ప బోధకుణ్ణి అనుకరించేలా కదిలించబడలేదా?
“ఇతరులకు సేవచేసేందుకు మీరిష్టపడతారా?” అనే మరో ప్రేరణాత్మక ప్రసంగం, ఇతరులకు సేవచేసే విషయంలో యేసు మాదిరిని అనుకరించమని మనల్ని ప్రోత్సహించింది. (యోహాను 13:12-15) యోగ్యులైన పురుషులు తిమోతి వలె ఇతరులకు సహాయపడే అవకాశాలను ఉపయోగించుకోవాలని ప్రసంగీకుడు ప్రోత్సహించాడు. (ఫిలిప్పియులు 2:20, 21) పిల్లలు పూర్తికాల పరిచర్యను వెంబడించేలా వారికి సహాయపడేందుకు ఎల్కానా, హన్నాల మాదిరిని అనుకరించాలని తల్లిదండ్రులు ప్రోత్సహించబడ్డారు. ఇతరులకు ఇష్టపూర్వకంగా సేవ చేయడం ద్వారా యౌవనులు యేసు క్రీస్తు, తిమోతిల మాదిరులను అనుసరించాలని ప్రబోధించబడ్డారు. (1 పేతురు 2:21) ఇతరులకు సేవచేసే అవకాశాలను వినియోగించుకున్నవారు చెప్పిన మాటలు కూడా మనలను కదిలించాయి.
మూడవ గోష్ఠి అంశం “దైవపరిపాలనా విద్యనుండి పరిపూర్తిగా ప్రయోజనం పొందండి.” గోష్ఠిలోని మొదటి ప్రసంగీకుడు మన అవధాన పరిధిని పెంచుకోవడం ఎంత ప్రాముఖ్యమో నొక్కి చెప్పాడు. దీన్ని సాధించడానికి మనం మొదట వ్యక్తిగత అధ్యయనానికి కొద్ది సమయం కేటాయించి, ఆ పిమ్మట ఆ సమయాన్ని పొడిగించడానికి ప్రయత్నించాలి. కూటాలు జరుగుతున్నప్పుడు లేఖనాలు తీసిచూడాలని, నోట్సు వ్రాసుకోవాలని కూడా ప్రేక్షకులను ఆయన ప్రోత్సహించాడు. రెండవ ప్రసంగీకుడు మనం “హితవాక్యప్రమాణమును” హత్తుకొని ఉండవలసిన అవసరత గురించి మనల్ని అప్రమత్తం చేశాడు. (2 తిమోతి 1:13, 14) అనైతిక ప్రవర్తనను ప్రోత్సహించే మాధ్యమాల నుండి, మానవ తత్త్వశాస్త్రాల నుండి, ఉచ్చతర విమర్శల నుండి మరియు మతభ్రష్ట బోధలనుండి మనల్ని మనం రక్షించుకోవాలంటే, వ్యక్తిగత అధ్యయనానికి మరియు కూటాలకు హాజరవ్వడానికి సమయం సద్వినియోగం చేసుకోవాలి. (ఎఫెసీయులు 5:15, 16) ఆ గోష్ఠి యొక్క ఆఖరి ప్రసంగీకుడు, దైవపరిపాలనా విద్యనుండి మనం పరిపూర్తిగా ప్రయోజనం పొందగలిగేందుకు, నేర్చుకున్న విషయాలను ఆచరణలో పెట్టవలసిన అవసరతను నొక్కి చెప్పాడు.—ఫిలిప్పీయులు 4:9.
“మన ఆధ్యాత్మిక పురోభివృద్ధి కోసం క్రొత్త ఏర్పాట్లు” అన్న ప్రసంగం విని మనమెంత ఉత్తేజితులమయ్యామో కదా! దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్యనుండి ప్రయోజనం పొందండి అనే క్రొత్త పుస్తకం త్వరలోనే ప్రచురించబడుతుందని తెలుసుకొని మనం ఆనందించాం. ప్రసంగీకుడు దానిలోని విషయాలను క్లుప్తంగా చెప్పినప్పుడు ఆ పుస్తకాన్ని పొందాలన్న ఆతురత మనలో పెరిగింది. ప్రసంగ సలహాపత్రంలోని అనేక విషయాలున్న ఆ పుస్తకంలోని ఒక భాగాన్ని గూర్చి మాట్లాడుతూ ఆయన, “మంచిగా చదవడం, మాట్లాడడం లేదా బోధించడానికి సంబంధించిన 53 అంశాలను వివరించడానికి ఈ క్రొత్త పుస్తకం లౌకిక విధానాన్ని అవలంబించడం లేదు. ఆ వివరణ లేఖన సూత్రాలపై ఆధారపడివుంటుంది” అని అన్నాడు. ప్రవక్తలు, యేసు, ఆయన శిష్యులు మంచి బోధనా పద్ధతులను ఎలా ప్రదర్శించారో ఈ పుస్తకం చూపిస్తుంది. అవును, మనం దేవుని వాక్యపు మెరుగైన బోధకులుగా ఉండేందుకు ఈ క్రొత్త పుస్తకము, దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలోని క్రొత్త అంశాలు నిస్సందేహంగా సహాయపడతాయి.
మూడవ రోజు—కాలమునుబట్టి బోధకులుగా ఉండండి
చివరి రోజున దినవచనాన్ని చర్చించిన తర్వాత సమావేశపు ఆఖరి గోష్ఠి నిర్వహించబడింది. “మలాకీ ప్రవచనం యెహోవా దినం కోసం మనలను సిద్ధం చేస్తుంది” అనే ఆ గోష్ఠిని మనందరం శ్రద్ధగా విన్నాము. యూదులు బబులోను నుండి తిరిగి వచ్చిన దాదాపు వంద సంవత్సరాల తర్వాత మలాకీ ప్రవచించాడు. యెహోవా యొక్క నీతియుక్తమైన నియమాలను నిర్లక్ష్యం చేయడం ద్వారా, బలి అర్పించేందుకు గ్రుడ్డి, కుంటి, జబ్బుగల జంతువులను తీసుకురావడం ద్వారా వారు ఆయన నామాన్ని అవమానపరుస్తూ, మరలా మతభ్రష్టత్వంలోను, దుష్టత్వంలోను కొట్టుకుపోయారు. అంతేకాకుండా, వారు యౌవనంలో తాము పెండ్లి చేసుకున్న తమ భార్యలకు విడాకులిచ్చేవారు. బహుశా విదేశీ వనితలను వివాహమాడాలనే ఉద్దేశంతోనే కావచ్చు.
మలాకీ ప్రవచనపు మొదటి అధ్యాయం, యెహోవాకు తన ప్రజల మీద ఉన్న ప్రేమను గురించి మనకు హామీ ఇస్తుంది. మనకు దేవునియెడల పూజ్యభావంతోకూడిన భయము, అలాగే పవిత్ర విషయాలయెడల మెప్పుదల ఉండాల్సిన అవసరాన్ని అది నొక్కి చెబుతోంది. మనం, మనకు చేతనైనంత మట్టుకు శ్రేష్ఠమైనది తనకు ఇచ్చి, నిస్వార్థ ప్రేమతో తనను ఆరాధిస్తామని యెహోవా ఎదురు చూస్తున్నాడు. దేవునికి మనం చేసే పరిశుద్ధ సేవ కేవలం లాంఛనప్రాయంగా ఉండకూడదు, మనం ఆయనకు తప్పకుండా లెక్క అప్పచెప్పవలసి ఉంది.
మలాకీ రెండవ అధ్యాయాన్ని మన కాలానికి అన్వయిస్తూ ఈ గోష్ఠిలోని రెండవ ప్రసంగీకుడు “మనం వ్యక్తిగతంగా ‘దుర్బోధనేమాత్రం చేయకుండా’ అప్రమత్తంగా ఉన్నామా?” అని అడిగాడు. (మలాకీ 2:6) బోధించడంలో నాయకత్వం వహించేవారు తాము చెప్పేవి దేవుని వాక్యము మీద స్థిరంగా ఆధారపడి ఉండేటట్లు నిశ్చయపరచుకోవాలి. అన్యాయంగా విడాకులివ్వడంవంటి విశ్వాసఘాతుక ప్రవర్తనను మనం ద్వేషించాలి.—మలాకీ 2:14-16.
గోష్ఠిలోని ఆఖరి ప్రసంగీకుడు “యెహోవా దినాన్ని ఎవరు తప్పించుకుంటారు?” అన్న అంశముపై మాట్లాడుతూ యెహోవా దినముకొరకు సిద్ధపడడానికి మనకు సహాయం చేశాడు. “మలాకీ 3వ అధ్యాయం 17వ వచనం తమ విషయంలో గొప్ప నెరవేర్పును కలిగియుందని తెలుసుకోవడం యెహోవా సేవకులకు ఎంత ఓదార్పుకరమో కదా!” అని ప్రసంగీకుడు ఉత్సాహంతో గట్టిగా అన్నాడు. “ఆ వచనమిలా చెబుతోంది: ‘నేను నియమింపబోవు దినము రాగా వారు నావారై నా స్వకీయసంపాద్యమై యుందురు; తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించునట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు’” అని అన్నాడు.
సమావేశంలోని ప్రాముఖ్యమైన మరో అంశం, “యెహోవా అధికారాన్ని గౌరవించండి” అనే నాటకం. కోరహు కుమారులను గురించి చెబుతున్న ఆ నాటకాన్ని ఆ కాలపువారు ధరించినటువంటి వస్త్రాలను ధరించి ప్రదర్శించారు. మోషే అహరోనుల పట్ల కోరహు తిరుగుబాటు వైఖరిని ప్రదర్శించినప్పటికీ, అతని కుమారులు యెహోవా పట్ల, ఆయన ప్రతినిధుల పట్ల విశ్వాసంగా కొనసాగారు. కోరహు, అతని అనుచరులు నాశనమయ్యారు గానీ, కోరహు కుమారులు తప్పించుకున్నారు. నాటకం తర్వాత ఇవ్వబడ్డ “దేవుని అధికారానికి యథార్థంగా లోబడండి” అనే ప్రసంగం, నాటకంలోని విషయాలను మనలో ప్రతి ఒక్కరికి అన్వయించింది. కోరహు, అతని అనుచరులు విఫలులైనట్లు మనం విఫలులవ్వకూడదని ప్రసంగీకుడు మనల్ని హెచ్చరించాడు. వారు విఫలమైన ఆరు రంగాలు: యెహోవా అధికారానికి యథార్థంగా మద్దతునివ్వడం; అహంకారం, ప్రసిద్ధి కావాలనే కోరిక, అసూయ తమను శాసించడానికి అనుమతించకుండా ఉండడం; యెహోవా నియమించిన వారిలోని అపరిపూర్ణతల మీద దృష్టి నిలుపకుండా ఉండడం; ఫిర్యాదుచేసే దృక్పథం పెంచుకోకుండా ఉండడం; తమకున్న సేవాధిక్యతలందు సంతృప్తిపడనివారిగా తయారుకాకుండా ఉండడం; యెహోవా యెడల యథార్థభక్తి కంటే స్నేహ బంధాలు, కుటుంబ బంధాలు ప్రముఖ స్థానాన్ని తీసుకోడానికి అనుమతించకుండా ఉండడం.
“సమస్త జనాంగాలకు సత్యమెవరు బోధిస్తున్నారు?” అన్నది బహిరంగ ప్రసంగపు ముఖ్యాంశం. దీనిలో చర్చించబడ్డ సత్యము సాధారణ సత్యము కాదు, యెహోవా సంకల్పాలను గూర్చిన సత్యము, యేసు క్రీస్తు సాక్ష్యమిచ్చినది ఆ సత్యానికే. నమ్మకాలకు సంబంధించిన సత్యాన్ని, ఆరాధనా విధానానికి సంబంధించిన సత్యాన్ని, మరియు వ్యక్తిగత ప్రవర్తనకు సంబంధించిన సత్యాన్ని ఆ ప్రసంగీకుడు చర్చించాడు. ఈ విధంగా, మొదటి శతాబ్దపు క్రైస్తవులను, నేటి యెహోవాసాక్షులతో పోల్చి చూడడం ద్వారా ‘దేవుడు నిజముగా మనలో ఉన్నాడు’ అన్న మన దృఢవిశ్వాసం ఇంకా బలపడింది.—1 కొరింథీయులు 14:25.
ఆ వారపు కావలికోట సారాంశం తర్వాత ఇవ్వబడిన, “మనం బోధించాలన్న ఆజ్ఞను అత్యవసరంగా నెరవేర్చడం” అనే ముగింపు ప్రసంగం, హాజరైన దేవుని వాక్యపు బోధకులందర్నీ క్రియాశీలురయ్యేలా కదిలించింది. ఆ సమావేశ కార్యక్రమ పునఃసమీక్ష, బోధనలో లేఖనాలను ఉపయోగించాల్సిన ప్రాముఖ్యతను, మనము యోగ్యులైన బోధకులవ్వడానికున్న మార్గాలను, మనం ఇతరులకు బోధించే సత్యమందు మనకు విశ్వాసం ఉండవలసిన అవసరతను నొక్కి చెప్పింది. “మన అభివృద్ధి అందరికి తేటగా కనబడు”నట్లు చేయాలని, ‘మన గురించి మన బోధను గురించి ఎల్లప్పుడు జాగ్రత్త కలిగియుండాలి’ అని ప్రసంగీకుడు మనల్ని ఉద్బోధించాడు.—1 తిమోతి 4:15, 16.
“దేవుని వాక్యాన్ని బోధించేవారు” సమావేశములో మనం ఎంతటి ఆధ్యాత్మిక విందును ఆరగించామో కదా! దేవుని వాక్యాన్ని ఇతరులకు బోధించుటలో మనము మన గొప్ప ఉపదేశకుడైన యెహోవాను, మన గొప్ప బోధకుడైన యేసుక్రీస్తును అనుకరిద్దాం.
[28వ పేజీలోని బాక్సు/చిత్రాలు]
ప్రత్యేక అవసరాలను తీర్చడానికి క్రొత్త ప్రచురణలు
ప్రపంచవ్యాప్తంగావున్న కొన్ని నిర్దిష్టమైన ప్రాంతాలలోని ప్రజలకు లేఖనాధార సత్యాన్ని బోధించేందుకు సహాయపడే రెండు క్రొత్త ప్రచురణలను, “దేవుని వాక్యాన్ని బోధించేవారు” సమావేశానికి హాజరైన వారందరూ ఎంతో ఉత్సాహంగా అందుకున్నారు. ‘సోల్’ ‘స్పిరిట్’ అన్న ఆంగ్ల దాలు తెలియజేసే వేర్వేరు భావాలను కొన్ని భాషలు వ్యక్తంచేయలేవు. ఆ భాషలు మాట్లాడే దేశాల ప్రజలతో సంభాషణ ప్రారంభించటానికి మీకు అమర్త్యమైన ఆత్మ ఉందా? (ఆంగ్లం) అనే కరపత్రం ఉపయోగకరమైన సాధనంగా ఉంటుంది. ఈ క్రొత్త కరపత్రం జీవశక్తి, ఆత్మప్రాణి రెండు వేరువేరని, ప్రజలు చనిపోయిన తర్వాత ఆత్మప్రాణులు కారని స్పష్టంగా చూపిస్తుంది.
సంతృప్తికరమైన జీవితం—దాన్నెలా పొందవచ్చు? (ఆంగ్లం) అనే బ్రోషూర్ సమావేశపు రెండవ రోజు చివర్లో విడుదల చేయబడింది. వ్యక్తిత్వంగల సృష్టికర్త మరియు దైవప్రేరేపిత పుస్తకం గురించి తెలియనివారితో బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి ఉపయోగించవచ్చన్న ఉద్దేశంతో ఈ బ్రోషూర్ తయారుచేయబడింది. మీరు ఈ క్రొత్త ప్రచురణలను మీ పరిచర్యలో ఉపయోగించగలిగారా?
[26వ పేజీలోని చిత్రాలు]
ఇటలీలోని మిలాన్‌లో మరియు ప్రపంచవ్యాప్తంగా జరిగిన సమావేశాలలో వందలాదిమంది బాప్తిస్మం పొందారు
[29వ పేజీలోని చిత్రం]
“యెహోవా అధికారాన్ని గౌరవించండి” అనే నాటకం ద్వారా ప్రేక్షకులు కదిలించబడ్డారు.