యెహోవాను నమ్ముకోండి ఆయనే నిజమైన దేవుడు
నిర్మలమైన నిశీధిలో ఆకాశంలోని వేలాది తారలను మీరెప్పుడైనా చూశారా? వాటి ఉనికికి కారణాన్ని మీరెలా వివరిస్తారు?
నిశ్శబ్ద నిశీధిలోని ఆ నక్షత్రాలు, ప్రాచీన ఇశ్రాయేలు రాజైన దావీదుతో ఊసులాడి, “ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది” అని వ్రాయడానికి ఆయనను ప్రేరేపించాయి. (కీర్తన 19:1) అవును, ‘మహిమ ఘనత ప్రభావములు పొందే’ అర్హత సృష్టికి కాదు, సృష్టికర్తకే ఉంది.—ప్రకటన 4:10, 11; రోమీయులు 1:25.
“సమస్తమును కట్టినవాడు దేవుడే,” అని బైబిలు చెబుతోంది. (హెబ్రీయులు 3:3) నిజమే, “యెహోవా అను నామము ధరించిన” సత్య దేవుడు, ‘సర్వలోకములో మహోన్నతుడు.’ (కీర్తన 83:18) ఆయన ఒక ఊహా కాదు, భ్రమా కాదు. “నన్ను పంపినవాడు సత్యవంతుడు” అని యేసు క్రీస్తు తన పరలోకపు తండ్రి యెహోవా గురించి చెప్పాడు.—యోహాను 7:28.
యెహోవా—తన సంకల్పాలను నెరవేర్చేవాడు
దేవుని విశిష్టమైన నామము, యెహోవా, హీబ్రూ లేఖనాల్లోనే దాదాపు 7,000 సార్లు కనబడుతుంది. ఆయన నిజమైన దేవుడనే వాస్తవాన్ని ఆ పేరే తెలియజేస్తోంది. దేవుని పేరుకు అక్షరార్థక భావం “తానే కర్త అవుతాడు.” ఆ విధంగా, తన సంకల్పాలను నెరవేర్చేవాడినని యెహోవా దేవుడు తననుతాను వర్ణించుకుంటున్నాడు. దేవుని నామము గురించి మోషే అడిగినప్పుడు, యెహోవా దాని భావాన్ని ఇంకా స్పష్టంగా వివరించాడు: “నేను ఏమి అవ్వాలనుకుంటే అలా అవుతాను.” (నిర్గమకాండము 3:14, NW) రోథరమ్ అనువాదం ఇలా స్పష్టంగా పేర్కొంది: “నాకేది ఇష్టమైతే అలా అవుతాను.” యెహోవా తన నీతియుక్తమైన సంకల్పాలను, వాగ్దానాలను నెరవేర్చడానికి తను ఏమి అవ్వాలనుకుంటే అలా అవుతాడు లేక అలా అవ్వాలని ఎంపిక చేసుకుంటాడు. అందుకే ఆయనకు న్యాయాధిపతి, కాపరి, ప్రార్థన ఆలకించువాడు, సర్వాధిపతియైన ప్రభువు, తండ్రి, సైన్యములకధిపతియగు యెహోవా, మహోపదేశకుడు, సృష్టికర్త, విమోచకుడు అనే గమనార్హమైన అనేక బిరుదులు ఉన్నాయి.—న్యాయాధిపతులు 11:27; కీర్తన 23:1; 65:2; 73:28, NW; 89:26; యెషయా 8:13; 30:20, NW; 40:28; 41:14.
మానవులు, తమ యోచనలు ఫలప్రదమవుతాయని ఎన్నటికీ నమ్మకంగా చెప్పలేరు కాబట్టి, యెహోవా అనే నామమును ధరించే హక్కు కేవలం నిజమైన దేవునికి మాత్రమే ఉంది. (యాకోబు 4:13, 14) యెహోవా ఒక్కడే ఇలా చెప్పగలడు: “వర్షమును హిమమును ఆకాశమునుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో ఆలాగే నా నోటనుండి వచ్చు వచనమును ఉండును నిష్ఫలముగా నాయొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలముచేయును.”—యెషయా 55:10, 11.
యెహోవా తన సంకల్పాన్ని ఎంత నిశ్చయతతో నెరవేరుస్తాడంటే, మానవులకది అవాస్తవమనిపించినా తన దృష్టిలో మాత్రం వాస్తవంగానే ఉంటుంది. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు మరణించిన చాలాకాలం తర్వాత, యేసు వారి గురించి ఇలా అన్నాడు: ‘ఆయన [యెహోవా] సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడు; ఆయన దృష్టికి అందరును జీవించుచున్నారు.’ (లూకా 20:37, 38) విశ్వాసులైన ఆ ముగ్గురు పూర్వికులు మరణించారు, కాని వారిని పునరుత్థానం చేయాలనే దేవుని సంకల్పం నెరవేరుతుందన్నది ఎంతో ఖచ్చితం కాబట్టే, వారు ఆయన దృష్టిలో జీవించి ఉన్నట్లే లెక్క. యెహోవాకు, విశ్వాసులైన ఈ ప్రాచీనకాలపు సేవకులను తిరిగి జీవింపజేయడమనేది, మట్టితో మొదటి మానవుణ్ణి సృష్టించినదానికంటే కష్టమైన పనేమీ కాదు.—ఆదికాండము 2:7.
దేవుడు, తను ఏది సంకల్పించినా అది నెరవేరేలా చేస్తాడనేందుకు, అపొస్తలుడైన పౌలు మరొక ఉదాహరణను ఇస్తున్నాడు. లేఖనాల్లో, అబ్రాహాము “అనేక జనములకు తండ్రి” అని పిలువబడ్డాడు. (రోమీయులు 4:16, 17) అబ్రాముకు సంతానము కలుగకముందే, “ఒక జనసమూహానికి (బహుళ జనానికి) తండ్రి” అని భావము కలిగిన అబ్రాహాముగా యెహోవా అతని పేరును మార్చాడు. వృద్ధుడైన అబ్రాహాములో, వయసుడిగిన శారాలో సంతానోత్పత్తి శక్తులను అద్భుతమైన రీతిలో పునరుజ్జీవింపచేసి, యెహోవా అతని పేరుకున్న అర్థం నిజమయ్యేలా చేశాడు.—హెబ్రీయులు 11:11, 12.
యేసుక్రీస్తు ఎంతో శక్తి, అధికారం గలవాడిగా, వాస్తవాల గురించి మానవుల కంటే ఉన్నతమైన దృక్కోణంతో మాట్లాడాడు. ఆయన సన్నిహిత స్నేహితుడు లాజరు మరణించినా, యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు: ‘మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు; అతని మేలుకొలుప వెళ్లుచున్నాను.’ (యోహాను 11:11) యేసు, మరణించిన ఒక మనిషిని కేవలం నిద్రిస్తున్నాడని ఎందుకు అన్నాడు?
యేసు లాజరు నివసిస్తున్న బేతనియకు చేరుకున్న తర్వాత, సమాధి దగ్గరకు వెళ్ళి దాన్ని మూసివున్న రాయిని తొలగించమని చెప్పాడు. బిగ్గరగా ప్రార్థన చేసిన తర్వాత, ‘లాజరూ, బయటికి రమ్ము!’ అని ఆయన ఆజ్ఞాపించాడు. అక్కడున్న వారు సమాధివైపు కళ్ళప్పగించి చూస్తుండగా, “చనిపోయినవాడు, కాళ్లు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను; అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను.” అప్పుడు యేసు ‘మీరు అతని కట్లు విప్పి పోనియ్యుడి’ అని వారితో చెప్పాడు. (యోహాను 11:43, 44) యేసు లాజరును పునరుత్థానం చేశాడు—నాలుగు రోజుల క్రితం చనిపోయిన ఒక వ్యక్తిని జీవింపజేశాడు! తన స్నేహితుడు నిద్రిస్తున్నాడు అని యేసు అన్నప్పుడు ఆయన అబద్ధం చెప్పలేదు. యెహోవా మరియు యేసు దృష్టిలో, మరణించిన లాజరు కేవలం నిద్రిస్తున్నట్లే. అవును, యేసు మరియు ఆయన పరలోకపు తండ్రి వ్యవహరించేది నిజమైన విషయాలతోనే.
యెహోవా మన నిరీక్షణలను వాస్తవాలుగా చేయగలడు
మోసకరమైన విగ్రహాలకు, నిజమైన దేవునికి ఎంత తేడా! విగ్రహారాధకులు తాము ఆరాధిస్తున్నవాటికి మానవాతీత శక్తులను తప్పుగా ఆపాదిస్తారు. వారి భక్తి ఎంత గొప్పదైనా, అది విగ్రహాలకు అద్భుత శక్తులను మాత్రం అందించలేదు. మరోవైపు, యెహోవా దేవుడు చాలా కాలం క్రితం మరణించిన తన సేవకులకు తిరిగి జీవాన్ని ఇవ్వగలడు కాబట్టి, వారు సజీవంగా ఉన్నట్లే దృష్టిస్తాడు. “యెహోవాయే నిజమైన దేవుడు,” ఆయన తన ప్రజలను ఎన్నడూ మోసం చేయడు.—యిర్మీయా 10:10.
యెహోవా, తన స్మృతిలో ఉన్న మృతులను తగిన సమయంలో తిరిగి జీవింపజేస్తాడు అని తెలుసుకోవడం ఎంత ఓదార్పుకరం! (అపొస్తలుల కార్యములు 24:14, 15) అవును, పునరుత్థానంలో ప్రతివ్యక్తి తన గత జీవన విధానంలోనే పూర్వస్థితికి తేబడతాడు. మరణించినవారి జీవన విధానాలను జ్ఞాపకముంచుకోవడం, వారిని తిరిగి పునరుత్థానం చేయడం, ఎనలేని జ్ఞానము, శక్తిగల సృష్టికర్తకు కష్టమైన విషయమేమీ కాదు. (యోబు 12:13; యెషయా 40:26) యెహోవా అపారమైన ప్రేమగలవాడు కాబట్టి, మృతులు మరణించడానికి పూర్వం కలిగివున్న వ్యక్తిత్వంతోనే భూపరదైసులో తిరిగి జీవించేలా చేయడం కోసం ఆయన తన ఖచ్చితమైన జ్ఞాపకశక్తిని ఉపయోగిస్తాడు.—1 యోహాను 4:8.
సాతాను లోకానికి అంతం సమీపిస్తుండగా, సత్య దేవుణ్ణి నమ్ముకునేవారి భవిష్యత్తు తప్పకుండా ఉజ్జ్వలంగా ఉంటుంది. (సామెతలు 2:21, 22; దానియేలు 2:44; 1 యోహాను 5:19) కీర్తనకర్త ఇలా హామీ ఇస్తున్నాడు: “ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు . . . దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు.” (కీర్తన 37:10, 11) నేరము, దౌర్జన్యాలు గడచిపోయిన విషయాలుగా మారతాయి. న్యాయం రాజ్యమేలుతుంది, ఆర్థిక సమస్యలు సమసిపోతాయి. (కీర్తన 37:6; 72:12, 13; యెషయా 65:21-23) సాంఘికపరమైన, జాతిపరమైన, తెగపరమైన, వర్గపరమైన విచక్షణల జాడలన్నీ రూపుమాపబడతాయి. (అపొస్తలుల కార్యములు 10:34, 35) యుద్ధాలు, యుద్ధసామగ్రి ఇక ఉండవు. (కీర్తన 46:9) ఆ సమయంలో, “నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు.” (యెషయా 33:24) ప్రతి ఒక్కరూ పరిపూర్ణమైన, తేజోవంతమైన ఆరోగ్యాన్ని అనుభవిస్తారు. (ప్రకటన 21:3, 4) భూపరదైసుపై జీవితం త్వరలో నిజమవుతుంది. యెహోవా దాన్ని సంకల్పించాడు!
అవును, బైబిలు ఆధారిత నిరీక్షణలన్నీ త్వరలోనే నెరవేరుతాయి. మనం యెహోవాను దృఢంగా నమ్మే ఆధారముండగా, ఈ లోకంలో దైవసమానంగా పూజించబడేవి మనల్ని మోసం చేసే అవకాశాన్ని ఎందుకివ్వాలి? “మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని” యెహోవా ఇష్టపడుతున్నాడు. (1 తిమోతి 2:3, 4) మన సమయాన్ని, వనరులను ఈ విధానపు ఊహలు లేక భ్రమలకు, దాని దేవుళ్ళకు వెచ్చించడానికి బదులు, నిజమైన దేవుని పరిజ్ఞానములో ఎదుగుతూ, మన సంపూర్ణహృదయంతో ఆయనను నమ్ముకుందాం.—సామెతలు 3:1-6; యోహాను 17:3.
[6వ పేజీలోని చిత్రం]
యెహోవా, యేసుల దృష్టిలో లాజరు కేవలం నిద్రిస్తున్నాడు
[7వ పేజీలోని చిత్రాలు]
భూపరదైసు అతి త్వరలో నిజమవుతుంది