రాజ్య ప్రచారకుల నివేదిక
“మీరు రాంగ్ నంబర్ డయల్ చేశారు”
దక్షిణ ఆఫ్రికాలోని జోహన్నస్బర్గ్లో రిటైర్ అయిన వారుంటున్న ఒక కాలనీలో గేటువద్ద సెక్యూరిటీ ఉండడంవల్ల లెస్లీ, కరోలీన్ వంతులవారీగా అక్కడి ప్రజలకు టెలిఫోన్ సాక్ష్యమిస్తున్నారు. ఇండ్లల్లో ఎవరూ సరిగా లేరు, ఉన్నవాళ్ళు కూడా క్రైస్తవ సందేశంపై ఎక్కువ ఆసక్తి చూపించలేదు, అలాంటి పరిస్థితిలో ఒక స్త్రీ ఫోనులో జవాబిచ్చేసరికి కరోలీన్లో ఉత్సాహం కలిగింది.
“మాట్లాడేది శ్రీమతి బి—గారేనా” కరోలీన్ అడిగింది.
“కాదండీ!” ఒక స్నేహపూర్వకమైన గొంతు వినిపించింది, “నేను శ్రీమతి జి—ని. మీరు రాంగ్ నంబర్ డయల్ చేశారు.”
గొంతులోని సౌమ్యతను గమనించిన కరోలీన్ అన్నది: “ఓహ్! అలాగా, అసలు నేను శ్రీమతి బి—గారికి ఏమి చెప్పాలనుకున్నానంటేనండీ,” అలా ఆమె రాబోయే దేవుని రాజ్యపు ఆశీర్వాదాల గురించి మాట్లాడనారంభించింది. ఆతర్వాత దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? బ్రోషూరును అందజేసే ఏర్పాట్లను చేశాక, శ్రీమతి జి— అడిగింది: “ఇంతకూ మీది ఏ మతమండీ?”
“మేము యెహోవాసాక్షులమండీ,” కరోలీన్ జవాబిచ్చింది.
“అమ్మో! ఆమతమైతే వద్దు, నేను మిమ్మల్ని కలవదలచుకోవడంలేదు.”
“కానీ, జి—గారూ, గత 20 నిమిషాలనుండి అత్యంత అద్భుతమైన నిరీక్షణ గురించిన సమాచారాన్ని నేను మీతో పంచుకున్నాను. అతి త్వరలో దేవుని రాజ్యం మానవాళి కోసం ఏమి చేస్తుందో బైబిలు నుండి సూచించాను. మీరు ఈవిషయాలు ఎంతో సంతోషంగా విన్నారు, ఎంతో ఉత్సాహాన్ని కూడా కనబరచారు, ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనీ కోరుకున్నారు. ఇంతకూ మీకు యెహోవాసాక్షుల గురించి నిజంగా ఏమి తెలుసండీ? మీరు అనారోగ్యంగా ఉంటే, మెకానిక్ దగ్గరకు వెళ్ళరు కదా? అసలు యెహోవాసాక్షులు ఏమి నమ్ముతారో నన్ను చెప్పనివ్వండి” అని కరోలీన్ వేడుకుంది.
కొద్దిసేపు నిశ్శబ్దం తర్వాత జవాబు వినిపించింది: “మీరు చెప్పింది కరక్టే అనిపిస్తోంది. మీరు రావచ్చు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి. మీరు నన్ను ఏ మాత్రం మతమార్పిడి చేయించలేరు!”
“జి—గారూ, నేను కావాలనుకున్నా మిమ్మల్ని మార్చలేను, యెహోవా మాత్రమే మార్చగలడు” అని కరోలీన్ జవాబిచ్చింది.
బ్రోషూరు ఇవ్వడానికి చేసిన సందర్శనం బాగానే జరిగింది, శ్రీమతి జి—(బెట్టీ) మళ్ళీ కలవడానికి ఒప్పుకుంది. కరోలీన్ వెళ్ళినప్పుడు, బెట్టీ తాను యెహోవాసాక్షులతో చర్చలు జరుపుతున్నానని డైనింగ్హాల్లో తోటి స్త్రీలతో చెప్పానంది. అది విని వాళ్ళు “అది మీరెలా చేస్తున్నారు?” అని చిందులు తొక్కుతూ అడిగారట. “వాళ్ళసలు యేసును నమ్మనైనా నమ్మరు!”
వెంటనే కరోలీన్ బెట్టీకి, తాము గతంలో దేవుని రాజ్యం గురించి మాట్లాడిన చర్చలోని ఒక ముఖ్యమైన అంశాన్ని గుర్తుచేసింది.
“ఎవరు రాజుగా ఉంటారు?” కరోలీన్ అడిగింది.
“యేసే కదా,” బెట్టీ జవాబిచ్చింది.
“అవును, నిజమే,” యెహోవాసాక్షులు యేసు దేవుని కుమారుడని త్రిత్వంలో భాగంగా దేవునికి సమానుడు కాడని నమ్ముతారని ఆమె వివరించడం ప్రారంభించింది.—మార్కు 13:32; లూకా 22:42;యోహాను 14:28.
మరి కొన్నిసార్లు కలిసేసరికి ఆమెకు ఆశాపూర్వకమైన, సంతోషకరమైన స్ఫూర్తి ఉన్నప్పటికీ, ఆమె అనారోగ్యంతో బాధపడుతోందని అర్థమైంది. ఆమెకు కాన్సరుంది, చనిపోతానేమోనని భయపడుతోంది. “నేను ఈవిషయాలు సంవత్సరాల ముందే వినుంటే బాగుండేది, మీలాంటి విశ్వాసమే కలిగి ఉండేదాన్ని,” అని ఆమె అంది. మరణమంటే ఒక గాఢ నిద్రలాంటిదని, అలా నిద్రిస్తున్నవారు పునరుత్థానంలో లేపబడతారని లేఖనాలు చెబుతున్నాయని కరోలీన్ ఆమెకు చూపించి ఓదార్చింది. (యోహాను 11:11, 25) అది బెట్టీకెంతో ధైర్యాన్నిచ్చింది, ఇప్పుడామె క్రమంగా బైబిలు అధ్యయనం చేస్తోంది. రోజు రోజుకూ క్షీణిస్తున్న ఆమె ఆరోగ్యం మాత్రం ఆమెను రాజ్య మందిరంలోని కూటాలకు హాజరు కాకుండా చేస్తుంది.
కరోలీన్ ఇలా చెబుతోంది: “ఇది ఖచ్చితంగా దేవదూతలు నిర్దేశించే పనే అని నాకు అర్థమైంది. బెట్టీని కలిసింది ఒక ‘రాంగ్ నంబర్’ ద్వారా, పైగా ఆమెకు 89 ఏండ్లు!”—ప్రకటన 14:6.