జీవిత కథ
గుండె పగిలేంత నష్టం జరిగినప్పటికీ ఆనందభరితురాలిని, కృతజ్ఞురాలిని
నాన్సీ ఈ. పోర్టర్ చెప్పినది
అది జూన్ 5, 1947. ఆ సాయంకాలం, అమెరికాలోని ఆగ్నేయ తీరానికి దగ్గర్లోని బహామా దీవుల్లో, వలస అధికారి నన్నూ నా భర్త జార్జ్నూ సందర్శించాడు. అది ఎదురు చూడని సంఘటన. మేము ఆ దీవుల్లో ఏ మాత్రం ఉండడానికి వీలు లేదని, మీరు “ఈ దీవులను వెంటనే వదిలివెళ్ళాలి” అని చెబుతున్న ఒక ఉత్తరాన్ని ఆయన మాకిచ్చాడు!
నేనూ, జార్జ్, బహామా దీవుల్లోని అత్యంత పెద్ద నగరమైన నాస్సావ్కి వచ్చిన యెహోవాసాక్షుల తొలి మిషనరీలము. న్యూయార్క్ ఉత్తర భాగాన ఉన్న మిషనరీ స్కూల్లో గిలియడ్ ఎనిమిదవ తరగతిలో పట్టభద్రులమైన తర్వాత, మేమిక్కడ సేవచేయడానికి నియమించబడ్డాం. మేమిక్కడికి వచ్చిన మూడు నెలల్లోనే వాళ్ళంత కఠినమైన చర్య తీసుకునేలా మేమేమి చేశాము? అది జరిగి 50 సంవత్సరాలకంటే ఎక్కువే అయిన తర్వాత కూడా నేనిప్పటికీ ఇక్కడే ఎలా ఉన్నాను?
పరిచర్య కోసం శిక్షణ
మా నాన్నగారు హ్యారీ కిల్నర్ నా జీవితంపై బలమైన ప్రభావాన్ని చూపారు. యెహోవాసాక్షుల్లో ఒకరయ్యేందుకు ఎలాంటి త్యాగాన్నైనా చేస్తూ, నాకు చక్కని మాదిరినుంచారు. ఆయన ఆరోగ్యం అంత బాగోలేనప్పటికీ, దాదాపు ప్రతి వారాంతమూ ప్రకటనా పనికి వెళ్తూ, ఉత్సాహంగా రాజ్యాసక్తులకు మొదటి స్థానం ఇచ్చేవారు. (మత్తయి 6:33) మేము అంత ఉన్నవాళ్ళం కాదు, కానీ 1930లలో కెనడాలోని ఆల్బర్టాలోని, లెత్బ్రిడ్జ్లో ఉన్న ఆయన బూట్ల దుకాణం ఆధ్యాత్మిక క్రియాశీలతకు కేంద్రంగా ఉండేది. పయినీర్లు అని పిలువబడే పూర్తికాల పరిచారకులైన యెహోవాసాక్షులు మా ఇంటికి వచ్చి, అనుభవాలను పంచుకోవడమే చిన్నప్పటి నా తొలి జ్ఞాపకాలు.
నేను 1943 లో, ఆల్బర్టాలోని ఫోర్ట్ మాక్లౌడ్, క్లార్జ్హోమ్ల సమీప ప్రాంతాల్లో పయినీరు సేవ ప్రారంభించాను. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో వ్యతిరేకులు సాక్షుల గురించి అబద్ధ సమాచారాన్ని ప్రచారం చేయడంతో, అప్పట్లో కెనడాలో మా ప్రకటనా పని నిషేధించబడివుంది. మా సేవాప్రాంతం అటు 50 ఇటు 50 కిలోమీటర్ల వరకూ విస్తరించి ఉంది. యౌవనంతో ఆరోగ్యంగా ఉన్న మాకు ఆ ప్రాంతంలోని చిన్న సమాజాలను, పొలాల్లోని ఇండ్లనూ చేరుకునేందుకు సైకిల్ మీద వెళ్ళడమైనా, నడిచి వెళ్ళడమైనా ఒక సమస్యగా అనిపించలేదు. అలా ఉండగా, గిలియడ్ పట్టభద్రులైన కొందరితో మాట్లాడే అవకాశం నాకు దొరికింది. వాళ్ళ అనుభవాలు, నేను కూడా మిషనరీని కావాలన్న కోరికను నాలో కలిగించాయి.
కెనడాలోని, సస్కత్చెవాన్కి చెందిన జార్జ్ పోర్టర్‌ని 1945 లో పెళ్ళి చేసుకున్నాను. ఆయన తల్లిదండ్రులు 1916 నుండి అత్యంతాసక్తిపరులైన సాక్షులుగా ఉన్నారు, ఆయన కూడా పూర్తికాల పరిచర్యను తన కెరీర్‌గా ఎంచుకున్నారు. మా ఇద్దరి మొదటి నియామకం, కెనడాలోని నార్త్ వాంకోవర్‌లోని అందమైన లిన్ వ్యాలీ. ఆ తర్వాత, కొద్దికాలానికి మమ్మల్ని గిలియడ్‌కి ఆహ్వానించారు.
ఎన్నో సంవత్సరాలుగా, నేను దైవశాస్త్ర సెమినరీల్లో పట్టభద్రులైన అనేకులతో మాట్లాడాను, వాళ్ళకు లభించిన దైవశాస్త్ర తర్ఫీదు, దేవుని మీదా, ఆయన వాక్యమైన బైబిలు మీదా వాళ్ళకున్న విశ్వాసాన్ని పూర్తిగా ఎలా తీసివేసిందో చూస్తూనే ఉన్నాను. దానికి భిన్నంగా, మేము గిలియడ్‌లో నేర్చుకున్న విషయాలు ఆలోచించే మా సామర్థ్యానికి పదునుపెట్టుకునేందుకు సహాయపడ్డాయి, అంత కన్నా ముఖ్యంగా, యెహోవా దేవుని మీదా, ఆయన వాక్యం మీదా మాకున్న విశ్వాసాన్ని బలపరచాయి. మా తోటివిద్యార్థులు చైనాలో, సింగపూర్‌లో, ఇండియాలో, ఆఫ్రికాలోని దక్షిణ అమెరికాలోని దేశాల్లో, మరితర దేశాల్లో నియమించబడ్డారు. మా నియామకం ఉష్ణమండల ప్రాంతాలైన బహామా దీవుల్లోనని తెలుసుకున్నప్పుడు ఎంత పులకించిపోయానో నాకిప్పటికీ జ్ఞాపకం ఉంది.
మేమిక్కడ ఎలా ఉండగలిగాం?
తోటి విద్యార్థులకు లభించిన నియామకంతో పోల్చితే, బహామా దీవులు అంత దూరంలో లేవు. త్వరలోనే, ఇక్కడి వెచ్చని వాతావరణాన్ని, నీలి ఆకాశాలను, నీలి సముద్రపు నీటిని, లేత రంగుల్లోని బిల్డింగ్‌లను, లెక్కలేనన్ని సైకిళ్ళను చూసి మేమానందించాం. అయితే నా మనస్సు అంతరాల్లో మొదట ముద్రించుకుపోయినది, మేము పడవలో ఇక్కడికి చేరుకోగానే మాకోసం ఎదురుచూస్తూ కనిపించిన ఐదుగురు సాక్షుల చిన్న బృందమే. ఇక్కడున్న సంస్కృతి మాకలవాటైన సంస్కృతికి చాలా భిన్నమైనదని మేము త్వరగానే తెలుసుకున్నాం. ఉదాహరణకు, అందరూ ఉన్నప్పుడు నన్ను స్వీట్హార్ట్ అని పిలువవద్దని నా భర్తకు చెప్పారు. ఎందుకంటే, అక్కడ ఆ మాటను వివాహానికి వెలుపల ఎవరితోనైతే సంబంధాన్ని పెట్టుకున్నారో ఆ వ్యక్తికే ఉపయోగిస్తారు.
మేము ప్రజలతో చనువుగా కలిసిపోవడం చూసిన పాదిరీలు తమకు ముప్పు వాటిల్లుతుందేమోనని భయపడి, మేం కమ్యూనిస్టులమని అబద్ధారోపణ చేశారు. దాని ఫలితంగా, మేము ఆ దేశాన్ని వదిలిపెట్టివెళ్ళాలన్న ఆర్డరు మాకు వచ్చింది. ఆ రోజుల్లో ఆ దీవుల్లో సాక్షులు 20 మంది కన్నా ఎక్కువ లేరు. వాళ్లు అంత తక్కువ మందే ఉన్నా, మేము అక్కడే ఉండాలని పిటీషన్‌ను తయారు చేసి వేలాది మంది సంతకాలను వాళ్ళు వెంటనే సంపాదించారు. ఆ విధంగా మా బహిష్కరణా ఉత్తర్వు త్రిప్పికొట్టబడింది.
క్రొత్త సేవాప్రాంతానికి
దేవుణ్ణి ప్రేమించిన హృదయాల్లో బైబిలు సత్యం చాలా శీఘ్రంగా మొలకెత్తడంతో, మరెక్కువ మంది మిషనరీలను బహామా దీవులకు పంపించారు. తర్వాత, 1950 లో ఇక్కడ బ్రాంచి కార్యాలయం స్థాపించబడింది. పది సంవత్సరాల తర్వాత, న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లోని ప్రధానకార్యాలయ సిబ్బందిలో సభ్యుడైన మిల్టన్ హెన్షెల్, బహామా దీవులను సందర్శించి, బహామా దీవుల్లో ఒకటైన మరొక దీవికి వెళ్ళి ప్రకటనా పనిని ప్రారంభించడానికి మీలో ఎవరైనా ఇష్టపడతారా అని మిషనరీలను అడిగారు. నేనూ జార్జ్ స్వచ్ఛందంగా ముందుకు వెళ్ళాం, అలా లాంగ్ ఐలాండ్‌కి వెళ్ళి అక్కడ 11 ఏళ్ళు ఉన్నాం.
అనేకమైన బహామా దీవుల్లో ఒకటైన ఈ దీవి 140 కిలోమీటర్ల పొడవూ 6 కిలోమీటర్ల వెడల్పూ ఉంటుంది. అప్పట్లో పట్టణాలున్నాయని చెప్పడానికి లేదు. రాజధానియైన క్లారన్స్ పట్టణంలో దాదాపు 50 ఇండ్లుండేవి. అక్కడి జీవితం పాతకాలంలోలా ఉండేది—విద్యుచ్ఛక్తీ, కుళాయిలూ, ఇంట్లో వంట చేసుకునే సౌకర్యాలూ, ఇంటిలోపలకి నీటిసరఫరాలూ లేవు. పనులన్నీ బయటే చేసుకునే జీవనశైలికి సర్దుకోవలసి వచ్చింది. ఆరోగ్యం అక్కడి ప్రజలకిష్టమైన సంభాషణా విషయం. వాళ్ళను పలకరించేటప్పుడు, “ఎలా ఉన్నారు?” అని ప్రశ్నించకూడదని మేము తెలుసుకున్నాం. అలా అడిగామంటే, వాళ్ళ ఆరోగ్యాన్ని గురించిన పూర్తి చరిత్రను చెబుతూ తరచూ సుదీర్ఘమైన జవాబిస్తారు.
మా సాక్ష్యపు పని ఎక్కువగా, ఒకరి వంటగది నుండి మరొకరి వంటగదికి వెళ్ళడం ద్వారా జరిగేది, ఎందుకంటే, సాధారణంగా, ఇంటి వెలుపల ఉండే తమ పాకల్లో కట్టెల పొయ్యిల దగ్గరే ప్రజలు కనిపించేవారు. ఆ సమాజాల్లో ఎక్కువ మంది పేద రైతులూ, జాలరులే. కానీ వాళ్లందరూ దయగల వాళ్ళే. దాదాపు అందరూ మత విశ్వాసులే కాక అంధ విశ్వాసులు కూడా. అసాధారణమైనవి ఏమైనా జరిగితే వాటిని వేటికో సూచనలుగా వ్యాఖ్యానించడం సర్వసాధారణమక్కడ.
పాదిరీలు, ప్రజలు తమను ఆహ్వానించకున్నా అమర్యాద అని ఏమాత్రం భావించకుండా వారి ఇండ్లలోకి జొరబడి, మేము అక్కడ ఇచ్చి వెళ్ళిన బైబిలు సాహిత్యాలను చించిపారేసేవారు. ఆ విధంగా పిరికివారిని భయపెట్టేవారు. కానీ అందరూ వాళ్ళ ముందు భయపడలేదు. ఉదాహరణకు, ధైర్యస్థురాలైన 70 ఏళ్ళ ఒక స్త్రీ, తనను అలా జడిపించడానికి ఒప్పుకోలేదు. బైబిలును అర్థం చేసుకోవాలని ఆమె కోరుకుంది. చివరికి అనేకులతో పాటు ఆమె కూడా సాక్షి అయ్యింది. ప్రజల్లో చాలా మందికి ఆసక్తి కలగడంతో, అలాంటివారికి కూటాలకు హాజరవ్వడానికి సహాయపడేందుకు కొన్ని ఆదివారాల్లో జార్జ్ 300 కిలోమీటర్లు బండి నడపాల్సి వచ్చేది.
సాక్షులు వేరెవరూ లేని మొదటి కొన్ని నెలల్లో, నేనూ జార్జ్ క్రైస్తవ కూటాలన్నింటినీ క్రమంగా జరుపుకోవడం ద్వారా మా ఆధ్యాత్మికతను కాపాడుకున్నాం. అంతేకాక, ప్రతి సోమవారం రాత్రి, కావలికోట పత్రికలోని పాఠాన్ని శ్రద్ధగా అధ్యయనం చేసేవాళ్ళం, బైబిలును శ్రద్ధగా చదివేవాళ్ళం. కావలికోట, తేజరిల్లు! పత్రికల అన్ని సంచికలనూ అవి అందిన వెంటనే చదివేవాళ్ళం.
మేము లాంగ్ ఐలాండ్‌లో ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు. ఆ తర్వాతి సంవత్సరం, అంటే 1963 వేసవికాలంలో, అమ్మ లాంగ్ ఐలాండ్‌కి వచ్చి మాకు దగ్గర్లో నివసించే ఏర్పాట్లను చేశాం. వార్ధక్యం మీదపడ్డప్పటికీ, సాధ్యమైనంత మేరకు ఆమె బాగానే సర్దుకుపోయేది, 1971 లో చనిపోయే వరకు లాంగ్ ఐలాండ్‌లోనే నివసించింది. నేడు లాంగ్ ఐలాండ్‌లో ఒక సంఘముంది. దానికి ఒక క్రొత్త రాజ్యమందిరం ఉంది.
హృదయవిదారకమైన పరిస్థితి
1980 లో తన ఆరోగ్యం క్షీణించనారంభించిందని జార్జ్ గ్రహించారు. అలా నా జీవితంలోని, అత్యంత బాధాకరమైన అనుభవాల్లో ఒకదాన్ని, అంటే, నా జతపనివాడూ, నా సహచరుడూ అయిన నా భర్త, నా కళ్ళెదుటే అల్జీమర్ వ్యాధికి ఎరగా మారుతుండడం చూశాను. ఆయన వ్యక్తిత్వం పూర్తిగా మారిపోయింది. అత్యంత ఘోరమైన చివరి ఘట్టం, 1987 లో ఆయన చనిపోవడానికి ముందు నాలుగు సంవత్సరాలపాటు కొనసాగింది. ఆయన తనకు చేతనైనంత కాలం నాతోపాటు పరిచర్యకూ కూటాలకూ వచ్చేవారు. అయితే చాలా రోజులు ఆయన చేసిన ప్రయత్నాలను చూసినప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు తిరిగేవి. మా క్రైస్తవ సహోదరులు చూపించిన ప్రేమ నిజంగా చాలా ఊరటనిచ్చినా, ఆయన లేని లోటు నాకు అనుక్షణం తెలుస్తూనే ఉంది.
నేనూ, జార్జ్ తరచూ ఉల్లాసంగా మనస్సువిప్పి మాట్లాడుకోవడం, మా వివాహ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన విషయాల్లో ఒకటి. “యెడతెగక ప్రార్థనచేయ”మనీ, “ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి” అనీ, “ప్రతి విధమైన ప్రార్థనను” చేయమని యెహోవా తన సేవకులను ఆహ్వానిస్తున్నందుకు, జార్జ్ చనిపోయాక, మునుపెన్నటికన్నా ఇప్పుడు ఎక్కువ కృతజ్ఞతాభావంతో ఉన్నాను. (1 థెస్సలొనీకయులు 5:17; రోమీయులు 12:12; ఎఫెసీయులు 6:18) మన సంక్షేమాన్ని గురించి యెహోవా ఎంతో చింతిస్తున్నాడన్న విషయం నిజంగా ఎంతో ఓదార్పునిస్తుంది. “ప్రభువు స్తుతినొందును గాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు” అని పాడిన కీర్తనకర్తకు అనిపించినట్లే నాకూ నిజంగా అనిపిస్తుంది. (కీర్తన 68:19) ఏ రోజు సమస్యల్ని ఆ రోజు చూసుకుంటూ, నా పరిమితులను అంగీకరిస్తూ, ప్రతిరోజూ ఆయన నాపై కురిపిస్తున్న ఆశీర్వాదాలకు కృతజ్ఞురాలినై ఉండడమే యేసు ఉపదేశించినట్లు నిజంగా శ్రేష్ఠమైన జీవన మార్గం.—మత్తయి 6:34.
పరిచర్యలో ఆనందకరమైన ప్రతిఫలాలు
క్రైస్తవ పరిచర్యలో నిమగ్నమై ఉండడం, నేను గతాన్ని గురించి అతిగా ఆలోచించకుండా ఉండేందుకు నాకు సహాయపడింది. ఆవిధంగా, నిరాశానిస్పృహలకు దారి తీయగల భావోద్వేగాలను అధిగమించగల్గాను. ప్రత్యేకించి, ఇతరులకు బైబిలు సత్యాన్ని బోధించడం, ఆనందాన్నిస్తోంది. అది క్రమమైన ఆధ్యాత్మిక దినచర్యగా ఉండి, నా జీవితానికి ఒక పద్ధతిని స్థిరత్వాన్ని ఇచ్చింది.—ఫిలిప్పీయులు 3:16.
నేను దాదాపు 47 సంవత్సరాల క్రితం, రాజ్య సందేశాన్ని పంచుకున్న ఒక మహిళ నాకొకసారి ఫోన్ చేసింది. 1947 లో మేము బహామా దీవుల్లో చేరుకున్నప్పటి మా మొదటి బైబిలు విద్యార్థుల్లో ఒకరి కూతురామె. వాళ్ళ అమ్మా నాన్నా, తమ్ముళ్ళూ, అక్కచెల్లెళ్ళూ అందరూ యెహోవాసాక్షులయ్యారు, అలా వాళ్ళ పిల్లలూ మనవళ్ళూ దాదాపు అందరూ కూడా యెహోవాసాక్షులయ్యారు. వాస్తవానికి, ఆమె కుటుంబానికి చెందిన 60 కన్నా ఎక్కువ మంది సభ్యులు సాక్షులే. కానీ ఆమె మాత్రం బైబిలు సత్యాన్ని ఎన్నడూ అంగీకరించలేదు. అయితే, చివరికిప్పుడు, ఆమె, యెహోవా దేవుని సేవకురాలయ్యేందుకు సిద్ధమయ్యింది. నేనూ జార్జ్ బహామా దీవులకు వచ్చినప్పుడు వ్రేళ్ళమీద లెక్కపెట్టగల్గేంత మంది మాత్రమే ఉండిన సాక్షుల సంఖ్య ఇప్పుడు 1,400 కన్నా ఎక్కువ కావడాన్ని చూడడం ఎంత ఆనందకరం!
మీకు పిల్లలు లేనందుకు మీకు బాధగా ఉందా అని కొన్నిసార్లు ప్రజలు అడుగుతారు. పిల్లలుండడం ఆశీర్వాదమే. అయినప్పటికీ, నా ఆధ్యాత్మిక పిల్లలూ, మనవళ్ళూ, మునిమనవళ్ళూ ఎడతెగక నా మీద చూపిస్తున్న ప్రేమను, పిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులందరూ అనుభవించి ఉండరు. నిజంగా, “మేలుచేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును” అయిన ప్రజలే అందరికన్నా ధన్యులైన ప్రజలు. (1 తిమోతి 6:18) అందుకే నా ఆరోగ్యం అనుమతించే మేరకు నేను పరిచర్యలో నిమగ్నమై ఉంటాను.
ఒకరోజు, నేను ఒక దంతవైద్యశాలలో ఉన్నప్పుడు, ఒక యువతి నా దగ్గరికి వచ్చి, “నేను మీకు తెలియదు, కానీ మీరు నాకు తెలుసు. నాకు మీరంటే ఎంతో ప్రేమ అని మీకు తెలపాలనుకున్నాను” అని చెప్పింది. తాను బైబిలులోని సత్యాన్ని ఎలా తెలుసుకుందో చెప్పడం మొదలు పెట్టి, ఆ తర్వాత, మిషనరీలమైన మేము బహామా దీవులకు వచ్చినందుకు తానెంత కృతజ్ఞురాలో ఆమె చెప్పింది.
మరొక సందర్భంలో, అంటే, నేను సెలవులకు వెళ్ళి, తిరిగివచ్చినప్పుడు, నేను ఇప్పుడుంటున్న నాస్సావ్లోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయంలో నా గది తలుపు దగ్గర ఒక గులాబి పువ్వూ, “మీరు ఇంటికి తిరిగి రావడం మాకెంతో ఆనందంగా ఉంది” అని వ్రాసిన చిన్న ఉత్తరం ముక్కా కనిపించాయి. యెహోవా వాక్యమూ, సంస్థా, ఆత్మా తయారు చేసిన ఇటు వంటి ప్రజలను చూసినప్పుడు నా హృదయం కృతజ్ఞతాభావంతో ఉప్పొంగిపోతుంది, నేను ఆయనను మరింత ప్రేమించేలా చేస్తుంది. నిజంగా, బలాన్నిచ్చే యెహోవా హస్తం మన చుట్టూ ఉన్నవారి ద్వారా తరచూ వెల్లడి చేయబడుతుంది.
కృతజ్ఞతాభావంతో ఉప్పొంగిపోవడం
నా జీవితం అన్నివేళలా అంత సులభంగా లేదు, కొన్ని విషయాలు ఇప్పటికీ సులభతరంగా లేవు. కానీ, పరిచర్యలోని ఆనందాలు, అనేక క్రైస్తవ సహోదర సహోదరీల ప్రేమానురాగాలు, యెహోవా సంస్థ చూపే ప్రేమపూర్వకమైన శ్రద్ధా, బైబిలులోని మనోహరమైన సత్యాలు, ప్రియమైనవారు పునరుత్థానం చేయబడినప్పుడు వారితోపాటు కలిసి ఉండవచ్చన్న నిరీక్షణ, యెహోవాకు నమ్మకంగా ఉండిన సేవకునితో 42 ఏండ్ల వివాహ జీవిత జ్ఞాపకాలు వంటి ఎన్నో విషయాలను బట్టి నేను కృతజ్ఞురాలిని. మేము వివాహం చేసుకోక ముందు, మేము పూర్తికాల పరిచర్యలో కొనసాగేందుకు నేను నా భర్తకు ఎల్లప్పుడూ సహాయంగా ఉండగల్గాలని ప్రార్థించేదాన్ని. పూర్తికాల పరిచర్య అంటే ఆయనకెంతో మక్కువ. యెహోవా నా ప్రార్థనను దయాపూర్వకంగా విన్నాడు. నేను ఎల్లవేళలా ఆయనకు నమ్మకంగా ఉండడం ద్వారా ఆయన పట్ల నాకున్న కృతజ్ఞతా భావాన్ని తెలపాలని కోరుకుంటున్నాను.
పర్యాటకులకు బహామా దీవులు ప్రసిద్ధిగాంచిన గమ్యస్థానం. వాళ్ళు ఇక్కడి ఉష్ణమండల అందాలను అనుభవించేందుకు వేలకొలది డాలర్లను ఖర్చుపెట్టి వస్తారు. యెహోవా సంస్థ ఎక్కడికి పంపిస్తే అక్కడ ఆయనను సేవించాలనే ఎంపికను చేసుకున్న నేను, ఈ దీవుల్లోని ఈ చివరి నుండి ఆ చివరి వరకు ప్రయాణించి, దేవుని రాజ్యసువార్తను ప్రకటించడంలో ఆనందించాను. అయితే అంతకన్నా ప్రాముఖ్యంగా, స్నేహశీలురైన బహామా వాసుల్లోని అతి శ్రేష్ఠమైనవారి చక్కని ప్రేమను ఎరిగి, దానిని నిధిగా ఎంచుతున్నాను.
నా తల్లిదండ్రులకు సత్యాన్ని తెలిపినవారికి నేనెంతో కృతజ్ఞురాలిని. నా తల్లిదండ్రులు దేవుని రాజ్యాన్ని మొదట వెదకాలన్న కోరికను నా చిన్నప్పుడే నా మనస్సులోను హృదయంలోను కలిగించారు. నేడు యువ యెహోవాసేవకులు కూడా విస్తృత పరిచర్యకు గొప్ప అవకాశాలను తెరిచే “గొప్ప ద్వారము”లో ప్రవేశిస్తే అనేక ఆశీర్వాదాలను పొందుతారు. (1 కొరింథీయులు 16:9, అధఃసూచి) “పరమదేవుడు” అయిన యెహోవాను ఘనపరచేందుకు మీ జీవితాన్ని ఉపయోగిస్తే, మీ హృదయం కూడ కృతజ్ఞతా భావంతో ఉప్పొంగిపోతుంది.—ద్వితీయోపదేశకాండము 10:17; దానియేలు 2:47.
[24వ పేజీలోని చిత్రం]
విక్టోరియా, బి.సి.లో 1944 లో వీధి సాక్ష్యం చేస్తున్నప్పటిది
[24వ పేజీలోని చిత్రం]
నేనూ జార్జ్ 1946 లో గిలియడ్ స్కూల్‌కి హాజరైనప్పటిది
[25వ పేజీలోని చిత్రం]
బహమాస్‌లోని, నాస్సావ్లోని మిషనరీ హోమ్ ముందు 1955 లో జార్జ్‌తోపాటు
[26వ పేజీలోని చిత్రం]
1961 నుండి 1972 వరకు మేము సేవ చేసిన డెడ్‌మ్యాన్స్ కేలోని మిషనరీ హోమ్