‘ప్రభువు నిజముగా లేచాడు!’
తమ ప్రభువు మరణానికి అప్పగించబడినప్పుడు యేసు శిష్యులు ఎంతగా కలతచెంది ఉంటారో ఒక్కసారి ఊహించండి. వారి నిరీక్షణ, అరిమతయియ యోసేపు సమాధిలో ఉంచిన మృత దేహమంత నిర్జీవంగా ఉన్నట్టు కన్పించింది. యేసు రోమా కాడి క్రింద నుంచి యూదులను స్వతంత్రుల్ని చేస్తాడన్న నిరీక్షణలు ఏవైనా ఉంటే అవి కూడా నిర్జీవమైపోయాయి.
విషయం అంతటితో పరిసమాప్తమైపోయి ఉంటే, మెస్సీయాలమని చెప్పుకున్న అనేకమంది వ్యక్తుల అనుచరుల్లానే బహుశా యేసు శిష్యులు కూడా కనుమరుగైపోయి ఉండేవారు. అయితే యేసు సజీవుడయ్యాడు! లేఖనాల ప్రకారం, యేసు తన మరణానంతరం అనుచరులకు అనేక సందర్భాల్లో కన్పించాడు. కాబట్టి, శిష్యుల్లో కొందరు “ప్రభువు నిజముగా లే[చాడు]” అని ప్రకటించడానికి కదిలించబడ్డారు.—లూకా 24:34.
యేసే మెస్సీయా అని ఆయనపై తమకున్న విశ్వాసాన్ని శిష్యులు సమర్థించుకోవాల్సి వచ్చింది. అలా సమర్థించుకోవడంలో వాళ్లు, ఆయనే మెస్సీయా అనడానికి దృఢమైన రుజువుగా మృతులలో నుంచి ఆయన పునరుత్థానమవ్వడాన్ని విశేషంగా సూచించారు. నిజమే, “అపొస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి.”—అపొస్తలుల కార్యములు 4:33.
ఎవరైనా ఎప్పుడైనా యేసు మృతదేహం సమాధిలోనే ఉందని అంగీకరించేలా కనీసం శిష్యుల్లో ఒక్కరితోనైనా చెప్పించడం ద్వారాగానీ, సమాధిలోనే ఉందని చూపించడం ద్వారాగానీ యేసు పునరుత్థానాన్ని ఒక మోసమని రుజువు చేసివుండి ఉంటే, క్రైస్తవత్వం దాని తొలినాళ్లలోనే విఫలమై ఉండేది. కానీ అలా జరగలేదు. క్రీస్తు సజీవుడయ్యాడని తెలుసుకొని యేసు అనుచరులు ఆయన పునరుత్థానాన్ని అంతటా ప్రకటించారు. పునరుత్థానుడైన క్రీస్తునందు అనేకమంది విశ్వాసాన్నుంచారు.
యేసు పునరుత్థానమందు మీరు కూడా ఎందుకు విశ్వాసముంచవచ్చు? అదొక వాస్తవిక సంఘటన అనడానికి ఏ రుజువుంది?
రుజువును ఎందుకు పరిశీలించాలి?
యేసు పునరుత్థానాన్ని గురించి నాలుగు సువార్త వృత్తాంతాలూ నివేదిస్తున్నాయి. (మత్తయి 28:1-10; మార్కు 16:1-8; లూకా 24:1-12; యోహాను 20:1-29)a క్రైస్తవ గ్రీకు లేఖనాల్లోని ఇతర భాగాలు కూడా క్రీస్తు మృతుల్లో నుంచి లేపబడడం గురించి స్థిర నిశ్చయంతో మాట్లాడుతున్నాయి.
యేసు పునరుత్థానాన్ని ఆయన శిష్యులు ప్రకటించడంలో ఆశ్చర్యమేమీ లేదు! దేవుడు ఆయనను నిజంగా పునరుత్థానుడ్ని చేస్తే, అది లోకం ఎన్నడూ విననటువంటి అత్యంత ఆశ్చర్యకరమైన వార్తైవుంటుంది. దేవుడు ఉన్నాడని దానర్థమై ఉంటుంది. అంతేగాక, ఇప్పుడు కూడా యేసు సజీవునిగా ఉన్నాడని దానర్థమై ఉంటుంది.
అది మనల్ని ఎలా ప్రభావితుల్ని చేస్తుంది? యేసు ఇలా ప్రార్థించాడు: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.” (యోహాను 17:3) అవును, మనం యేసును గూర్చిన, ఆయన తండ్రిని గూర్చిన జీవాన్ని అనుగ్రహించే జ్ఞానాన్ని సంపాదించుకోగలం. అటువంటి జ్ఞానాన్ని మనం అన్వయించుకోవడం ద్వారా, ఇప్పుడు ఒకవేళ చనిపోవలసి వచ్చినప్పటికీ యేసు పునరుత్థానుడయ్యాడు గనుక మనం కూడా పునరుత్థానం చేయబడగలం. (యోహాను 5:28, 29) రాజులకు రాజు, మహిమపర్చబడిన దేవుని కుమారుడు అయిన యేసుక్రీస్తు చేతుల్లో ఉన్న పరలోక రాజ్య పరిపాలన క్రింద పరదైసు భూమిపై నిత్యజీవాన్ని పొందుతామన్న నిరీక్షణను మనం కల్గివుండవచ్చు.—యెషయా 9:6, 7; లూకా 23:43; ప్రకటన 17:14.
కాబట్టి, మృతుల్లో నుంచి యేసు నిజంగా పునరుత్థానుడయ్యాడా లేదా అన్న ప్రశ్న కీలకమైంది. అది మన జీవితాల్ని ఇప్పుడు ప్రభావితం చేస్తుంది, భవిష్యత్తు కోసమైన మన ఉత్తరాపేక్షలను ప్రభావితం చేస్తుంది. అందువల్లనే, యేసు మరణించి పునరుత్థానుడయ్యాడు అనడానికి గల రుజువుకున్న నాలుగు కోణాల్ని పరిశీలించమని మేం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.
యేసు మ్రానుపై నిజంగా మరణించాడు
యేసు కొరత వేయబడినా నిజంగా మ్రానుపై మరణించలేదని కొంతమంది సంశయవాదులు వాదిస్తారు. ఆయన కొన ప్రాణంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడనీ, సమాధిలోని చల్లదనానికి తిరిగి స్మారకస్థితిలోకి వచ్చాడనీ వాళ్లంటారు. అయినప్పటికీ లభ్యమౌతున్న ప్రతీ మూలం, సమాధిలో ఉంచబడింది యేసు మృతదేహమేనన్న విషయాన్ని నిరూపిస్తుంది.
యేసు బహిరంగంగానే మ్రానుపై వ్రేలాడదీయబడ్డాడు గనుక ఆయన దానిపై నిజంగానే చనిపోయాడన్న వాస్తవానికి సాక్షులు ఉన్నారు. ఆ శిక్షను అమలు చేసిన రోమా శతాధిపతి ఆయన మరణాన్ని ధృవపర్చాడు. ఆ శతాధిపతి విధినిర్వహణలో మరణ ధృవీకరణ కార్యక్రమం కూడా చేరివుంది. అంతేగాక, యేసు మరణించాడన్న విషయాన్ని రూఢిచేసుకున్న తర్వాతనే రోమా గవర్నరైన పొంతి పిలాతు, యేసు మృతదేహాన్ని సమాధిచేయడానికి అరిమతయియ యోసేపుకు అప్పగించాడు.—మార్కు 15:39-46.
సమాధి ఖాళీగా ఉంది
యేసు పునరుత్థానాన్ని గూర్చిన మొదటి రుజువును శిష్యులకు ఖాళీగా ఉన్న సమాధి ఇచ్చింది, అది నిర్వివాదాంశమైన రుజువుగానే నిలిచివుంది. ఎవ్వరూ ఎప్పుడూ సమాధి చేయబడని ఒక క్రొత్త సమాధిలో యేసును సమాధి చేశారు. అది యేసును కొరత వేసిన స్థలానికి సమీపంలోనే ఉంది, ఆ కాలంలో ఆ సమాధిని కనుక్కోవడం చాలా సులభం. (యోహాను 19:41, 42) యేసు మరణించిన తర్వాత రెండో రోజు ఉదయాన సమాధి దగ్గరకు ఆయన స్నేహితులు వచ్చినప్పుడు ఆయన మృతదేహం వారికి కనబడలేదన్న విషయంతో అన్ని సువార్త వృత్తాంతాలూ ఏకీభవిస్తున్నాయి.—మత్తయి 28:1-7; మార్కు 16:1-7; లూకా 24:1-3; యోహాను 20:1-10.
ఖాళీగా ఉన్న సమాధి యేసు స్నేహితుల్ని విస్మయానికి గురిచేసినట్లే ఆయన శత్రువుల్నీ గురిచేసింది. ఆయనను చంపి, సమాధిలోకి పంపించాలని ఆయన శత్రువులు చాలాకాలం నుంచి ప్రయత్నించారు. ఆ విషయంలో సఫలీకృతులైన వారిగా వాళ్లు, ఆ సమాధికి కాపలాపెట్టి, ముద్ర వేయడానికి తగు జాగ్రత్తలు తీసుకున్నారు. అయినప్పటికీ ఆదివారం ఉదయాన చూస్తే, సమాధి ఖాళీగా ఉంది.
యేసు స్నేహితులు సమాధిలో నుంచి ఆయన మృతదేహాన్ని ఎత్తికెళ్లిపోయారా? బహుశా అలా జరిగి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాత వాళ్లు దుఃఖసాగరంలో మునిగిపోయారని సువార్తలు చూపిస్తున్నాయి. అంతేగాక, మోసంతో కూడినదని తమకు తెలిసినదాని కోసం హింసించబడడానికీ, చనిపోవడానికీ ఆయన శిష్యులు తెగించి ఉండేవారు కారు.
మరైతే సమాధిని ఎవరు ఖాళీ చేసివుంటారు? యేసు శత్రువులు ఎత్తికెళ్లే ప్రసక్తే లేదు. వాళ్లు ఒకవేళ ఎత్తికెళ్లినట్లైతే, యేసు పునరుత్థానుడై సజీవంగా ఉన్నాడన్న శిష్యుల వాదనలను త్రిప్పికొట్టేందుకు అటుతర్వాత ఆ మృతదేహాన్ని ఖచ్చితంగా చూపించి ఉండేవారు. అయితే అలాంటిదేమీ జరగలేదు, ఎందుకంటే చర్య గైకొన్నది దేవుడే.
కొన్ని వారాల తర్వాత పేతురు ఇలా ధృవపర్చినప్పుడు, యేసు శత్రువులు దాన్ని నిరాధారమైనదని నిరూపించేలా ప్రతిస్పందించలేదు: “ఇశ్రాయేలువారలారా, యీ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసుచేత అద్భుతములను మహత్కార్యములను సూచకక్రియలను మీ మధ్యను చేయించి, ఆయనను తనవలన మెప్పుపొందినవానిగా మీకు కనబరచెను; ఇది మీరే యెరుగుదురు. . . . మరణము ఆయనను బంధించియుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణవేదనలు తొలగించి ఆయనను లేపెను. ఆయననుగూర్చి దావీదు ఇట్లనెను—నేనెల్లప్పుడు నా యెదుట ప్రభువును చూచుచుంటిని . . . నా శరీరము కూడ నిరీక్షణ గలిగి నిలకడగా ఉండును నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు.”—అపొస్తలుల కార్యములు 2:22-27.
పునరుత్థానుడైన యేసును అనేకమంది చూశారు
అపొస్తలుల కార్యములలో సువార్త రచయితైన లూకా ఇలా తెలియజేశాడు: “[యేసు] శ్రమపడిన తరువాత నలువది దినములవరకు వారి కగపడుచు, దేవుని రాజ్య విషయములనుగూర్చి బోధించుచు, అనేక ప్రమాణములను చూపి వారికి [అపొస్తలులకు] తన్ను తాను సజీవునిగా కనుపరచుకొనెను.” (అపొస్తలుల కార్యములు 1:2, 3) వివిధ సందర్భాల్లో అంటే తోటలో, మార్గ మధ్యలో, భోజనం చేస్తున్న సమయంలో, తిబెరియ సముద్ర తీరాన పునరుత్థానుడైన యేసును అనేకమంది శిష్యులు చూశారు.—మత్తయి 28:8-10; లూకా 24:13-43; యోహాను 21:1-23.
యేసు కన్పించిన ఈ సందర్భాల సత్యసంధతను విమర్శకులు ప్రశ్నిస్తారు. సువార్త రచయితలు సువార్త వృత్తాంతాలను కల్పించారని వారంటారు, లేదా వాటిలో ఒకదానికొకటి పొసగనట్టుగా కన్పిస్తున్న వాటిని ఎత్తిచెబుతారు. వాస్తవానికి సువార్త వృత్తాంతాల్లో ఉన్న చిన్న చిన్న తేడాలు, ఏ విధమైన లాలూచీపడడం జరగలేదని రుజువు చేస్తున్నాయి. ఒక సువార్త రచయిత, క్రీస్తు భూ జీవితంలోని కొన్ని సంఘటనలను తెలియజేసే ఇతర సువార్త వృత్తాంతాల్లోని వివరణలకు అనుబంధంగా ఉండే వివరణలను అందించినప్పుడు, యేసును గురించిన మన జ్ఞానం విస్తృతపర్చబడుతుంది.
పునరుత్థానంతరం యేసు కన్పించిన సందర్భాలు భ్రాంతులేనా? ఆ విధంగా చేసే వాదన ఏదైనా సరే విశ్వసించదగినది కాదు, ఎందుకంటే ఆయన్ని అనేకమంది ప్రజలు చూశారు. అలా చూసిన వారిలో జాలరులు, స్త్రీలు, ఒక ప్రభుత్వోద్యోగి, సందేహించిన అపొస్తలుడైన తోమా ఉన్నారు; అతడు, మృతులలో నుంచి యేసు లేచాడనడానికి తిరుగులేని రుజువును చూసినప్పుడు మాత్రమే ఒప్పించబడ్డాడు. (యోహాను 20:24-29) అనేక సందర్భాల్లో యేసు శిష్యులు, పునరుత్థానుడైన తమ ప్రభువును మొదటిసారి చూసిన వెంటనే గుర్తించలేదు. ఒక సందర్భంలోనైతే 500కన్నా ఎక్కువమంది ఆయన్ని చూశారు; అపొస్తలుడైన పౌలు పునరుత్థానాన్ని సమర్థిస్తూ చేసిన తన వాదనలో రుజువుగా ఆ సందర్భాన్ని ఉపయోగించే నాటికి వారిలో అనేకమంది సజీవులుగానే ఉన్నారు.—1 కొరింథీయులు 15:6.
సజీవుడైన యేసు ప్రజలపై ప్రభావాన్ని కల్గివున్నాడు
యేసు పునరుత్థానమనేది కేవలం జిజ్ఞాసను రేకెత్తించే విషయాంశమో లేక వాదోపవాదాలు చేసుకునే అంశమో కాదు. ఆయన సజీవంగా ఉన్నాడనే వాస్తవం, ప్రతీచోట ఉన్న ప్రజలపై నిర్మాణాత్మకమైన రీతిలో ప్రభావాన్ని చూపించింది. మొదటి శతాబ్దం నుంచీ, అధిక సంఖ్యాకులు క్రైస్తవత్వం పట్లగల ఉదాసీన వైఖరిని లేదా పూర్తి వ్యతిరేకతను వీడి సంపూర్ణ నిశ్చయతతో అదే సత్యమతమని దానివైపుకు తిరిగారు. వాళ్లను మార్చిందేమిటి? లేఖనాలను అధ్యయనం చేయడం, పరలోకంలో మహిమగల ఆత్మ ప్రాణిగా జీవించేందుకు యేసును దేవుడు పునరుత్థానం చేశాడని వారికి రుజువును ఇచ్చింది. (ఫిలిప్పీయులు 2:8-11) యేసునందూ, క్రీస్తు బలియర్పణ ద్వారా రక్షణ కోసం యెహోవా దేవుడు చేసిన ఏర్పాటు నందూ వాళ్లు విశ్వాసాన్ని పెంపొందించుకున్నారు. (రోమీయులు 5:8) అలాంటి వ్యక్తులు, దేవుని చిత్తాన్ని చేయడం ద్వారా యేసు బోధలకు అనుగుణంగా జీవించడం ద్వారా యథార్థమైన సంతోషాన్ని కనుగొన్నారు.
మొదటి శతాబ్దంలో ఒక వ్యక్తి క్రైస్తవునిగా ఉండడమంటే అర్థమేంటో పరిశీలించండి. అందులో ప్రతిష్ఠనూ, అధికారాన్నీ, సంపదనూ పొందడం చేరివుండదు. దానికి భిన్నంగా, అనేకమంది తొలి క్రైస్తవులు తమ విశ్వాసం కోసం ‘తమ ఆస్తిని సహితం కోల్పోడానికి సంతోషముగా ఒప్పుకున్నారు.’ (హెబ్రీయులు 10:34) క్రైస్తవత్వానికి త్యాగపూరితమైన జీవితం, హింసలను భరించాల్సిన జీవితం అవసరమైంది. అనేక సందర్భాల్లో హతసాక్షిగా జీవితం ముగిసిపోతుంది.
క్రీస్తు అనుచరులుగా అవ్వడానికి ముందు కొంతమందికి ప్రతిష్ఠా సంపదల సంబంధంగా ఎంతో మంచి భవిష్యత్తు ఉండేది. తార్సువాడైన సౌలు ప్రఖ్యాతిగాంచిన ధర్మశాస్త్ర బోధకుడైన గమలీయేలు పాదాల దగ్గర విద్యనభ్యసించి, యూదుల ఎదుట తననుతాను ఉన్నతపర్చుకోనారంభించాడు. (అపొస్తలుల కార్యములు 9:1, 2; 22:3; గలతీయులు 1:14) అయినప్పటికీ, సౌలు అపొస్తలుడైన పౌలు అయ్యాడు. ఆయనా, అలాగే అనేకమంది ఇతరులూ ఈ లోకం అందించే ప్రతిష్ఠనూ, అధికారాన్నీ తృణీకరించారు. ఎందుకు? దేవుని వాగ్దానాలపై ఆధారపడిన నిజ నిరీక్షణా సందేశాన్నీ, మృతులలో నుంచి యేసుక్రీస్తు పునరుత్థానుడయ్యాడనే వాస్తవాన్నీ అంతటా తెలియజేసేందుకే. (కొలొస్సయులు 1:28) తాము కనుగొన్న విషయం సత్యంపై ఆధారపడి ఉందని వాళ్లు గ్రహించినందు వల్ల బాధను అనుభవించేందుకు వాళ్లు సుముఖత చూపించారు.
నేడు, లక్షలాదిమంది విషయంలో అది వాస్తవమే. వారిని మీరు, ప్రపంచవ్యాప్తంగా యెహోవాసాక్షుల సంఘాల్లో కనుగొంటారు. సాక్షులు, క్రీస్తు మరణ జ్ఞాపకార్థ దిన వార్షిక ఆచరణకు మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. అది, 2001 ఏప్రిల్ 8వ తారీఖు ఆదివారం సూర్యాస్తమయం తర్వాత జరుగుతుంది. ఆ సందర్భానికీ, తమ రాజ్య మందిరాల్లో జరిగే బైబిలు అధ్యయనం కోసమైన తమ కూటాలన్నింటికీ మీరు తమతోపాటు హాజరవ్వాలని వారు కోరుతున్నారు.
యేసు మరణ పునరుత్థానాలను గురించి మాత్రమేగాక ఆయన జీవితాన్ని గురించీ, బోధలను గురించీ మరింత ఎక్కువగా ఎందుకు నేర్చుకోకూడదు? తన దగ్గరకు రమ్మని ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు. (మత్తయి 11:28-30) యెహోవా దేవుని గురించిన, యేసుక్రీస్తును గురించిన ఖచ్చితమైన జ్ఞానాన్ని సంపాదించుకునేందుకు ఇప్పుడే చర్య తీసుకోండి. అలా చేయడమంటే తన ప్రియ కుమారుని చేతుల్లో ఉన్న దేవుని రాజ్యం క్రింద నిత్యజీవమని అర్థం.
[అధస్సూచి]
a సువార్త వృత్తాంతాల ఖచ్చితత్వాన్ని గురించిన రుజువు కోసం, కావలికోట మే 15, 2000 సంచికలోని “సువార్తలు చరిత్ర వృత్తాంతాలా కల్పిత కథనాలా?” అనే ఆర్టికల్‌ను చూడండి.
[7వ పేజీలోని చిత్రాలు]
యేసుక్రీస్తు అనుచరులుగా లక్షలాదిమంది నిజ సంతోషాన్ని పొందుతున్నారు
[6వ పేజీలోని చిత్రాలు]
కింగ్ జేమ్స్ మరియు రివైజ్డ్ వెర్షన్‌లు ఉన్న Self-Pronouncing Edition of the Holy Bible లోనిది