ఇష్ట మనస్సుతో దేవుణ్ణి సేవించండి
“నాకు కలిగినది యావత్తు మీ ఆత్మలకొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను; నన్నును నేను వ్యయపరచుకొందును,” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (2 కొరింథీయులు 12:15) యెహోవా దేవుని సేవకులు వృద్ధిచేసుకోవాల్సిన దృక్కోణాన్ని, దృక్పథాన్ని గురించి ఈ మాటలు మీకు ఏమి తెలియజేస్తున్నాయి? ఒక బైబిలు పండితుడు చెప్పిన దాని ప్రకారం, పౌలు కొరింథులోని క్రైస్తవులకు ఆ మాటలను వ్రాసినప్పుడు, “తండ్రి తన పిల్లల కోసం సంతోషంగా వ్యయపరిచే రీతిలో నా బలాన్ని, నా సమయాన్ని, నా జీవితాన్ని, మీ ప్రయోజనార్థమై నాకు కలిగినదంతటిని, నేను వ్యయపరచడానికి ఇష్టపడుతున్నాను” అని చెబుతున్నాడు. పౌలు, తన క్రైస్తవ పరిచర్యను నెరవేర్చడానికి అవసరమైతే ‘తనను తాను వ్యయపరచుకోవడానికి,’ లేక, “పూర్తిగా అలసిపోవడానికి, పిండేసినట్లుగా అవ్వడానికి” కూడా సిద్ధమయ్యాడు.
అంతేకాక, పౌలు దీనంతటినీ “బహు సంతోషముగా” చేశాడు. ఆయన అలా చేయడానికి “సంపూర్ణ ఇష్టతను” కనబరిచాడని ద జెరూసలేమ్ బైబిల్ చెబుతుంది. మీ విషయం ఏమిటి? యెహోవా దేవుని సేవ నిమిత్తమై ఇతరుల ప్రయోజనార్థమై మీ సమయాన్ని, శక్తిని, ప్రజ్ఞను, వనరులను వెచ్చించడానికి మీరు ఇష్టపడుతున్నారా? ఇలా చేయడంవల్ల కొన్నిసార్లు అవసరమైతే మీరు “పూర్తిగా అలసిపోవడానికి, పిండేసినట్లుగా అవ్వడానికి” సిద్ధంగా ఉన్నారా? మీరలా “బహు సంతోషముగా” చేస్తారా?
నిజానికి వారు సేవించడాన్నే నిరాకరిస్తారు
చాలామంది వ్యక్తులు దేవుడ్ని సేవించడానికి వెనుకాడడం కాదుగాని సేవించడాన్నే ఖండితంగా నిరాకరిస్తారు. అలాంటి వారు కృతఘ్నలు, వారు స్వార్థంతో కూడిన స్వాతంత్ర్య స్ఫూర్తినే కాక తిరుగుబాటు ధోరణిని కూడా కల్గి ఉంటారు. సాతాను, ఆదాము హవ్వలను అలాంటి ఒక ఆలోచనకే నడిపించాడు. వారు ‘మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉంటారు’—అంటే ఏది తప్పు ఏది ఒప్పు అనేది తమకు తాముగా నిర్ణయించుకోగలరు అని సాతాను అబద్ధం చెప్పాడు. (ఆదికాండము 3:1-5) నేడు అలాంటి ధోరణిని కల్గివున్నవాళ్ళు దేవునికి తాము ఏవిధంగానూ బద్ధులై ఉండకుండా లేక ఆయన జోక్యం అసలు లేకుండా తమ ఇష్టమొచ్చినట్లు నడుచుకోవడానికి తమకు పూర్తి స్వాతంత్ర్యం ఉండాలనుకుంటారు. (కీర్తన 81:11, 12) తాము సంపాదించిందంతా తమ స్వప్రయోజనం కోసమే ఉపయోగిస్తారు.—సామెతలు 18:1.
బహుశా మీరు ఇంత విపరీతంగా ఆలోచించి ఉండకపోవచ్చు. సాధారణంగా మీరు ఇప్పుడు అనుభవిస్తున్న జీవం విషయమై, మరిముఖ్యంగా పరదైసు భూమిపై నిరంతరం జీవిస్తామనే అద్భుతమైన భవిష్యత్ నిరీక్షణ విషయమై మీరు నిజంగా మెప్పుదల కలిగివుంటుండవచ్చు. (కీర్తన 37:10, 11; ప్రకటన 21:1-4) యెహోవా మీకు చేసిన మేలుల నిమిత్తమై ఆయనపట్ల మీకు లోతైన ప్రసంశ ఉండవచ్చు. కాని, మన సేవ దేవునికి అనంగీకారమయ్యేలా సాతాను మన మనస్సులను చెరిపే ప్రమాదం విషయమై అప్రమత్తంగా ఉండాలి. (2 కొరింథీయులు 11:3) అలా ఎలా జరగగలదు?
ఇష్టపూర్వకంగా సేవించడం అవసరం
యెహోవా కోరేది ఇష్టపూర్వకంగా, పూర్ణ హృదయంతో చేసే సేవ. తన చిత్తం చేయమని ఆయన ఎన్నడూ మనల్ని బలవంతపెట్టడు. తన చిత్తాన్ని జరిగించేలా ప్రజల్ని ప్రలోభపెట్టేది లేక వలలో వేసుకొనేది సాతానే. దేవుని సేవించడానికి సంబంధించి విధులు, ఆజ్ఞలు, నియమాలు వంటి వాటిని పాటించడం గురించి బైబిలు మాట్లాడుతుంది. (ప్రసంగి 12:13; లూకా 1:6) కాని, దేవుడ్ని సేవించడం కోసం ప్రధానంగా ప్రేమ మనల్ని ప్రేరేపించాలి.—నిర్గమకాండము 35:21; ద్వితీయోపదేశకాండము 11:1.
పౌలు, దేవుని సేవలో తనను తాను ఎంత వెచ్చించుకున్నప్పటికీ, తాను ‘ప్రేమ లేనివాడైతే’ అదంతా వ్యర్థమని ఆయనకు తెలుసు. (1 కొరింథీయులు 13:1-3) బైబిలు రచయితలు దేవుని దాసులుగా క్రైస్తవులను సూచిస్తున్నప్పుడు, బలప్రయుక్త పాలన క్రింది హీనాతి హీనమైన దాసులుగా వారిని సూచించటంలేదు. (రోమీయులు 12:10, 11; కొలొస్సయులు 3:23, 24) దేవుని పట్ల ఆయన కుమారుడైన యేసుక్రీస్తు పట్ల ఉన్న హృదయపూర్వకమైన లోతైన ప్రేమను బట్టి వారు ఇష్టపూర్వకంగా లోబడి ఉంటారని దాని భావము.—మత్తయి 22:37; 2 కొరింథీయులు 5:14; 1 యోహాను 4:10, 11.
దేవునికి మనం చేసే సేవలో ప్రజల పట్ల లోతైన ప్రేమ కూడా ప్రతిబింబించాలి. “స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించునట్లుగా, మేము మీ మధ్యను సాధువులమై యుంటిమి,” అని పౌలు థెస్సలొనీకయ సంఘానికి వ్రాశాడు. (1 థెస్సలొనీకయులు 2:7) చాలా దేశాల్లో తల్లులు తమ పిల్లలను పెంచే చట్టబద్ధమైన బాధ్యత క్రింద ఉన్నారు. కాని కేవలం చట్టానికి విధేయులై మాత్రమే తల్లులు వాళ్ళను పెంచుతారా? లేదు. తమ పిల్లల్ని తాము ప్రేమిస్తారు గనుక వారిని పెంచుతారు. అంతెందుకు, స్తన్యమిచ్చే తల్లి తన పిల్లల కోసం ఎన్ని త్యాగాలనైనా సంతోషంగా చేస్తుంది! పౌలు కూడా తాను పరిచారం చేసినవారు ఆయనకు “బహు ప్రియులై” ఉన్నారు గనుక వారికి సహాయం చేయడం కోసం ఆయన “విశేషాపేక్ష”తో (“ఇష్టతతో,” కింగ్ జేమ్స్ వర్షన్; “సంతోషంతో,” న్యూ ఇంటర్నేషనల్ వర్షన్) తన జీవితాన్నే ఉపయోగించాడు. (1 థెస్సలొనీకయులు 2:8) పౌలు మాదిరిని అనుకరించేలా ప్రేమ మనల్ని ప్రేరేపిస్తుంది.—మత్తయి 22:39.
సేవపట్ల విముఖతను చూపించే విషయం ఏమిటి?
నిజమే, మనపై మనకున్న ప్రేమ వల్ల దేవునిపట్ల, ప్రజలపట్ల ఉన్న ప్రేమ తగ్గిపోకూడదు. లేకపోతే, మనం అర్ధహృదయంతో, విముఖతతో సేవ చేసే ప్రమాదం ఉంది. మన స్వంత కోరికల చొప్పున మన జీవితాన్ని గడపలేకపోతున్నామన్న ఉక్రోషంతో కొద్దికొద్దిగా అయిష్టతను చూపించడం ప్రారంభిస్తుండవచ్చు. దేవునిపట్ల ప్రేమను కోల్పోయిన కొంతమంది ఇశ్రాయేలీయులకు ఇదే జరిగింది. వారు, చెయ్యడం అనేది బాధ్యత కాబట్టి చేస్తున్నాం అన్నట్టు కొంత సేవను ఆయనకు చెల్లించారు. దాని ఫలితం ఏమిటి? దేవుడ్ని వారు ‘ప్రయాసతో’ సేవించారు.—మలాకీ 1:13.
దేవునికి అర్పించే అర్పణలు ఏవైనప్పటికీ అవి ఎప్పుడూ “దోషములేని[వై]” “ప్రథమఫలము”గా ఉండాలి. (లేవీయకాండము 22:17-20; నిర్గమకాండము 23:19) అయితే, మలాకీ దినాల్లోని ప్రజలు తమ జంతువుల్లో నుంచి దోషము లేని వాటిని యెహోవా కోసం అర్పించే బదులు తమకు నిజంగా అక్కరలేని వాటిని అర్పించారు. యెహోవా దానికి ఎలా ప్రతిస్పందించాడు? ఆయన యాజకులను ఇలా ప్రశ్నించాడు: “గ్రుడ్డిదానిని తీసికొని బలిగా అర్పించినయెడల అది దోషముకాదా? కుంటిదానినైనను రోగముగలదానినైనను అర్పించినయెడల అది దోషముకాదా? అట్టివాటిని నీయధికారికి నీవిచ్చినయెడల అతడు నీకు దయచూపునా? నిన్ను అంగీకరించునా? . . . దోచబడినదానిని కుంటిదానిని తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు. ఈలాగుననే మీరు నైవేద్యములు చేయుచున్నారు; మీచేత నేనిట్టిదానిని అంగీకరింతునా?”—మలాకీ 1:8, 13.
ఇది మనలో ఎవరికైనా ఎలా సంభవించవచ్చు? మనలో నిజంగా ఇష్టమనస్సు, సుముఖత కొరవడితే మన అర్పణలు మనకే “ప్రయాస”గా అన్పిస్తాయి. (నిర్గమకాండము 35:5, 21, 22; లేవీయకాండము 1:3; కీర్తన 54:6; హెబ్రీయులు 13:15, 16) ఉదాహరణకు, మన సమయంలోనుంచి మిగిలిందే యెహోవాకు ఇస్తున్నామా?
ఒక సదుద్దేశం గల కుటుంబ సభ్యుడు లేక అత్యుత్సాహవంతుడైన ఒక లేవీయుడు, ఒక ఇశ్రాయేలీయుడికి ఇష్టంలేకున్నా అర్పణ కోసం మంచి జంతువును ఎన్నుకొనేందుకు ఆయన్ను బలవంతం చేస్తే అలాంటి అర్పణ యెహోవాకు అంగీకృతమౌతుందని ఎవరైనా తలంచగలరా? (యెషయా 29:13; మత్తయి 15:7-9) యెహోవా అలాంటి అర్పణలను, చివరకు వాటిని అర్పించిన జనాంగాన్నే విసర్జించాడు.—హోషేయ 4:6; మత్తయి 21:43.
దేవుని చిత్తాన్ని చేయడం సంతోషాన్నివ్వాలి
దేవునికి అంగీకృతమైన సేవను చెయ్యాలంటే మనం యేసు మాదిరిని అనుకరించాలి. “నన్ను పంపిన వాని చిత్తప్రకారమే చేయ గోరుదును గాని నా యిష్టప్రకారము చేయగోరను,” అని ఆయన చెప్పాడు. (యోహాను 5:30) దేవుడ్ని ఇష్టపూర్వకంగా సేవించడంలో యేసు అమితానందాన్ని కనుగొన్నాడు. “నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము” అన్న దావీదు ప్రవచనార్థక మాటలను యేసు నెరవేర్చాడు.—కీర్తన 40:8.
యెహోవా చిత్తం చేయడానికి యేసు సంతోషించినప్పటికీ, అది అన్నిసమయాల్లోనూ సులభం కాలేదు. తాను బందీ అయి, విచారించబడి, మరణించడానికి కాస్త ముందు ఏమి జరిగిందో ఆలోచించండి. యేసు, గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు “బహు దుఃఖము” చెందాడు, ఆయన “వేదన”పడ్డాడు. భావోద్రేకపరమైన ఒత్తిడి ఎంతగా ఉందంటే, ఆయన ప్రార్థిస్తున్నప్పుడు “ఆయన చెమట, నేల పడుచున్న గొప్ప రక్త బిందువులవలె ఆయెను.”—మత్తయి 26:38; లూకా 22:44.
అంతటి వేదనను యేసు ఎందుకు అనుభవించాడు? కచ్చితంగా తన స్వార్థంవల్లనో లేక దేవుని చిత్తాన్ని చేయడంలో విముఖుడైనందువల్లనో కాదు. ఆయన చనిపోవడానికి సిద్ధంగానే ఉన్నాడు. “ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీ కెన్నడును కలుగదని” చెప్పిన పేతురును సహితం గద్దించాడు. (మత్తయి 16:21-23) యేసును బహుగా కలతపర్చింది ఏమిటంటే, ఒక నీచమైన నేరస్థుడిగా తను మరణించడం యెహోవాపైకి, యెహోవా పవిత్ర నామంపైకి ఎక్కడ నింద తెస్తుందోనన్నదే. దేవుని ప్రియ కుమారుడైన తాను అంత క్రూరంగా హింసించబడడం తన తండ్రికి తీవ్రమైన బాధను కలుగజేస్తుందన్నది యేసుకు తెలుసు.
యెహోవా దేవుని సంకల్ప నెరవేర్పులో ఒక కీలకమైన సమయం దగ్గరపడుతుందని కూడా యేసు గ్రహించాడు. దేవుని నియమాలకు నమ్మకంగా లోబడివున్నట్లైతే, ఆదాము కూడా అదే ఎన్నిక చేసుకొని ఉండగల్గేవాడే అన్నదానిని రూఢిపరుస్తుంది. మానవులు పరీక్షించబడినప్పుడు ఇష్టపూర్వకంగా, నమ్మకంగా దేవుడ్ని సేవించలేరన్న సాతాను అబద్ధారోపణ పూర్తిగా తప్పని యేసు చూపించిన విధేయత స్పష్టీకరించింది. యేసు ద్వారా, యెహోవా చివరకు సాతానునూ దాని తిరుగుబాటు ఫలితంగా ఏర్పడిన పరిణామాలనూ నిర్మూలిస్తాడు.—ఆదికాండము 3:15.
యేసు భుజస్కంధాలపై ఎంత పెద్ద భారం మోపబడి ఉందో కదా! తన తండ్రి నామం, విశ్వ శాంతి, మానవ జాతి రక్షణ, ఇవన్నీ యేసు విశ్వసనీయంగా ఉండడంపైనే ఆధారపడి ఉన్నాయి. యేసు దీనిని గుర్తిస్తూనే, “నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నాయొద్దనుండి తొలగి పోనిమ్ము, అయనను నా యిష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని” ప్రార్థించాడు. (మత్తయి 26:39) వేదనకరమైన బాధను అనుభవిస్తున్నప్పటికీ కూడా, యేసు ఎన్నడూ తన తండ్రి చిత్తానికి లోబడి ఉండడంలో అయిష్టతను కనపర్చలేదు.
‘ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము’
యెహోవాను సేవిస్తూండగా యేసు భావోద్రేకపరమైన వేదనను అనుభవించాడు గనుక దేవుని సేవకులమైన మనపై కూడా సాతాను తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తాడని మనం ఎదురుచూడవచ్చు. (యోహాను 15:20; 1 పేతురు 5:8) అంతేకాక, మనం అపరిపూర్ణులం గనుక మనం దేవుడ్ని ఇష్టపూర్వకంగా సేవించాలనుకున్నా, అలా సేవించడం మనకు అంత సులభమేమీ కాదు. చేయమని తన శిష్యులకు చెప్పిందంతా చేయడానికి వారు ఎంత కష్టపడ్డారో యేసు చూశాడు. అందుకే, “ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని” ఆయన చెప్పాడు. (మత్తయి 26:41) ఆయనది పరిపూర్ణ మానవ శరీరం గనుక ఆయనకు ఎలాంటి బలహీనతా సంక్రమించలేదు. అయితే, అపరిపూర్ణుడైన ఆదాము నుంచి సంక్రమించిన బలహీనత తన శిష్యుల శరీరంలో ఉందన్నదాని గురించి ఆయన ఇక్కడ మాట్లాడుతున్నాడు. వారసత్వంగా వచ్చిన అపరిపూర్ణత వల్ల, మానవ పరిమితుల వల్ల యెహోవా సేవలో వాళ్ళు చేయాలనుకున్నదంతా నెరవేర్చడానికి ఎంతో గొప్ప కృషి అవసరమవుతుందని యేసుకు తెలుసు.
కాబట్టి, యెహోవా దేవుడ్ని పూర్ణహృదయంతో సేవించడంలో అపరిపూర్ణత తనను అడ్డగించినప్పుడు ఎంతో బాధపడిన అపొస్తలుడైన పౌలు వలే మనమూ బాధపడవచ్చు. పౌలు ఇలా వ్రాశాడు: “మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు కలుగుటలేదు.” (రోమీయులు 7:18) చేయగోరు మేలు చేయలేకపోతున్నట్లుగా మనం కూడా గమనిస్తాం. (రోమీయులు 7:19) ఇలా ఎందుకు జరుగుతుందంటే, మంచిని చేయడం ఇష్టంలేకపోవడం వల్ల కాదు గాని శరీరంలో ఉన్న బలహీనత మనం చేసే మంచి ప్రయత్నాలకు అవరోధాల్ని కల్గిస్తుండడం వల్లనే.
అయితే, మనం నిరాశ పడనవసరం లేదు. మనం చేయగల్గిందంతా చేయడానికి సిద్ధమనస్సు ఉంటే దేవుడు తప్పకుండా మన సేవను అంగీకరిస్తాడు. (2 కొరింథీయులు 8:12) దేవుని చిత్తానికి పూర్తిగా లోబడి ఉండడంలో యేసు కనబరచినటువంటి మాదిరిని మనం కనబర్చడానికి ‘జాగ్రత్తపడదాం.’ (2 తిమోతి 2:15; ఫిలిప్పీయులు 2:5-7; 1 పేతురు 4:1, 2) యెహోవా అలాంటి ఇష్ట మనస్సుకు మద్దతును, ప్రతిఫలాన్ని ఇస్తాడు. మన బలహీనతల లోటును భర్తీ చేసేందుకు ఆయన మనకు “బలాధిక్యము”ను అనుగ్రహిస్తాడు. (2 కొరింథీయులు 4:7-10) పౌలు వలే, యెహోవా సహాయంతో మనం, ఆయన అమూల్యమైన సేవలో ‘కలిగినది యావత్తు బహు సంతోషముగా వ్యయపరచడానికి; మనల్ని మనం వ్యయపరచుకోవడానికి’ ప్రయత్నిద్దాం.
[21వ పేజీలోని చిత్రం]
పౌలు దేవుడ్ని ఇష్టతతో సేవించడానికి శాయశక్తులా కృషిచేశాడు
[23వ పేజీలోని చిత్రం]
తీవ్రమైన ఒత్తిడిని అనుభవించినప్పటికీ యేసు తన తండ్రి చిత్తాన్నే జరిగించాడు