దేవుడు ప్రార్థనలకు జవాబిస్తాడు
కొర్నేలీ అనే ఒకాయన దేవుని అనుగ్రహం కోసం ఎల్లప్పుడూ హృదయపూర్వకంగా ప్రార్థన చేసేవాడు. అంతేగాక, సైనికాధికారిగా తనకున్న స్థానాన్ని ఆయన చక్కగా ఉపయోగించుకున్నాడు. బైబిలు చెబుతున్నట్లుగా ఆయన అవసరంలో ఉన్నవారికి “బహు ధర్మము చేయుచు” ఉండేవాడు.—అపొస్తలుల కార్యములు 10:1, 2.
ఆ సమయంలో, విశ్వాసులైన యూదులతో, మత ప్రవిష్టులతో, సమరయులతో క్రైస్తవ సంఘం ఏర్పడింది. కొర్నేలీ సున్నతి పొందని అన్యుడు, క్రైస్తవ సంఘానికి చెందినవాడు కాదు. దానర్థం ఆయన ప్రార్థనలు వ్యర్థమైపోయాయనా? లేదు. యెహోవా దేవుడు కొర్నేలీని ఆయన ప్రార్థనా పూర్వకమైన చర్యల్ని గమనించాడు.—అపొస్తలుల కార్యములు 10:4.
దేవదూత నడిపింపు ద్వారా, కొర్నేలీకి క్రైస్తవ సంఘంతో పరిచయం ఏర్పడింది. (అపొస్తలుల కార్యములు 10:30-33) ఫలితంగా, ఆయనా ఆయన ఇంటివారూ క్రైస్తవ సంఘంలోకి అంగీకరించబడిన సున్నతి పొందని తొలి అన్యులయ్యే ఆధిక్యతను పొందారు. కొర్నేలీ వ్యక్తిగత అనుభవం బైబిలులో నమోదు చేయబడటానికి యోగ్యమైనదని యెహోవా దేవుడు ఎంచాడు. తన జీవితాన్ని పూర్తిగా దేవుని ప్రమాణాలకు అనుగుణ్యంగా మలుచుకునేందుకు ఆయన అనేక మార్పులు చేసుకున్నాడనటంలో ఏ సందేహమూ లేదు. (యెషయా 2:2-4; యోహాను 17:16) ఈనాడు యెహోవా అనుగ్రహం పొందాలనుకుంటున్న సమస్త జనులకూ కొర్నేలీ అనుభవం గొప్ప ప్రోత్సాహాన్నివ్వాలి. కొన్ని ఉదాహరణలను చూడండి.
ఆధునిక దిన ఉదాహరణలు
ఇండియాలో ఒక యువతికి ఆదరణ ఎంతో అవసరమయ్యింది. తన 21వ ఏట వివాహమైన ఆమెకు ఇద్దరు పిల్లలు. కానీ రెండవ సంతానం కల్గిన కొన్నాళ్లకే ఆమె భర్త చనిపోయాడు. అనుకోకుండా, తన 24వ ఏట, రెణ్నెల్ల కూతురూ, 22 నెలల కొడుకు ఉన్న ఆమె విధవరాలు అయింది. ఆమెకు ఆదరణ అవసరమయ్యిందంటే అందులో ఆశ్చర్యం లేదు! ఆమె ఎటు వెళ్లగలదు? ఒక రాత్రి, ఎంతో బాధతో ఆమె ఇలా ప్రార్థించింది: “పరలోకమందున్న తండ్రీ, దయచేసి నీ వాక్యం ద్వారా నన్ను ఓదార్చు.”
తెల్లవారాక, ఒకరు ఆమె ఇంటికి వచ్చారు. ఆయన ఒక యెహోవాసాక్షి. ఆరోజు, తన ఇంటింటి పరిచర్యలో చాలా తక్కువ మందే వినటానికి ఇష్టపడ్డారు గనుక ఆయనకు ఆరోజు అంత బాగా గడవలేదు. విసిగిపోయి, అంతకంటే నిరుత్సాహపడి ఆయన ఇంటికి వెళ్లిపోదామనుకున్నాడు, కానీ ఎందుకో మరో ఇంటికి వెళ్లి చూద్దామనుకున్నాడు. అది ఆ విధవరాలైన యువతి ఇల్లే. ఆమె ఆయన్ని లోపలికి ఆహ్వానించి, బైబిలు గురించి వివరించే ఒక ప్రచురణను తీసుకుంది. ఆమె దాన్ని చదివి, ఆ సాక్షితో చర్చించి గొప్ప ఆదరణను పొందింది. చనిపోయిన వారిని తిరిగి లేపుతానని దేవుడు చేసిన వాగ్దానాన్ని గురించీ, త్వరలోనే ఈ పుడమిని పరదైసుగా మార్చే దేవుని రాజ్యాన్ని గురించీ ఆమె తెలుసుకుంది. అంతకంటే ప్రాముఖ్యంగా, తన ప్రార్థనకు జవాబిచ్చిన అద్వితీయ సత్యదేవుడైన యెహోవాను తెలుసుకుని ఆయనను ప్రేమించనారంభించింది.
దక్షిణ ఆఫ్రికాలోని జార్జి సిటీలో ఉంటున్న నోరా సువార్తపనిలో పూర్తికాలం గడపటానికి ఒక నెలని కేటాయించుకుంది. దాన్ని మొదలుపెట్టక ముందు, బైబిలు పఠించటానికి నిజంగా ఆసక్తిగల ఒక్కర్నైనా కనుగొనేందుకు తనకు సహాయం చేయమని పట్టుదలగా యెహోవాకు ప్రార్థించింది. ఆమెకి నియమించబడిన ప్రాంతంలో, ఇంతకు ముందు నోరా వెళ్లినపుడు మొరటుగా ప్రవర్తించిన ఒక వ్యక్తి ఇల్లు కూడా ఉంది. నోరా ధైర్యంగా మళ్లీ ఆ ఇంటికి వెళ్లింది. ఆశ్చర్యకరంగా, ఆ ఇంట్లోకి నోలీన్ అనే పేరున్న కొత్తవాళ్లు అద్దెకు దిగి ఉన్నారు. అంతేకాదు, నోలీన్ ఆమె అమ్మగారు బైబిలును అర్థం చేసుకోవటానికి సహాయం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. “నేను వారికి బైబిలు పఠనం గూర్చి చెప్పినపుడు, వారెంతో ఆనందించారు” అని నోరా చెప్తుంది. నోలీన్ ఆమె అమ్మగారు చాలా వేగంగా అభివృద్ధి సాధించారు. తగిన సమయంలో, వారిద్దరూ ఆధ్యాత్మిక స్వస్థత పనిలో నోరాతో పాటు భాగం వహించనారంభించారు.
ప్రార్థనా శక్తిని ప్రదర్శించే మరొక ఉదాహరణ దక్షిణ ఆఫ్రికాలోని జోహన్నాస్‌బర్గ్ సిటీలో ఉంటున్న దంపతులది. 1996 లో ఒక శనివారం రాత్రి డెన్నిస్, కరోల్‌ల కాపురం కూలిపోయే స్థితికి వచ్చింది. చివరి మార్గంగా, వారు సహాయం కోసం ప్రార్థించడానికి నిర్ణయించుకున్నారు, ఆ రాత్రి చాలా పొద్దుపోయే వరకూ వారు అలా ప్రార్థిస్తూనే ఉన్నారు. తెల్లవారాక, ఉదయం 11 గంటలకు ఇద్దరు యెహోవాసాక్షులు వారి తలుపు తట్టారు. డెన్నిస్ వచ్చి తలుపు తెరిచి, వాళ్లావిడను పిలిచేంత వరకూ వేచి ఉండమని చెప్పాడు. తర్వాత డెన్నిస్, నీవు గానీ సాక్షులను లోపలికి పిలిచావంటే వాళ్లని వదిలించుకోవటం కష్టం అని కరోల్‌ని హెచ్చరించాడు. తాము సహాయంకోసం ప్రార్థన చేస్తున్నట్లు డెన్నిస్‌కి గుర్తు చేసి, బహుశ ఇది తమ ప్రార్థనలకు దేవుని సమాధానం కావచ్చునని చెప్పింది. అలా వారు సాక్షులను లోపలికి ఆహ్వానించి నిత్యజీవానికి నడిపించే జ్ఞానము పుస్తకంనుంచి బైబిలు పఠనాన్ని ప్రారంభించారు. డెన్నిస్, కరోల్ తాము తెలుసుకున్న వాటిని బట్టి ఎంతో విస్మయం చెందారు. ఆ మధ్యాహ్నమే వారు యెహోవాసాక్షుల స్థానిక రాజ్యమందిరంలో జరిగే కూటాలకు మొదటిసారిగా హాజరయ్యారు. బైబిలునుంచి తాము తెలుసుకున్న జ్ఞానాన్ని అన్వయించుకోవటం ద్వారా డెన్నిస్, కరోల్‌లు తమ వైవాహిక సమస్యలకు పరిష్కారాలను కనుగొన్నారు. ఇప్పుడు వారు బైబిలు ఆధారిత తమ నమ్మకాలను క్రమంగా తమ పొరుగువారితో పంచుకుంటున్న బాప్తిస్మం పొందిన యెహోవా స్తుతికర్తలు.
ప్రార్థించటానికి మీరు అయోగ్యులమని భావిస్తే?
తమ చెడ్డ జీవిత విధానాన్ని బట్టి, నిష్కపటులైన కొందరు తాము ప్రార్థించటానికి అయోగ్యులమని భావించవచ్చు. అలా తృణీకరించబడిన ఒక సుంకరి కథను యేసుక్రీస్తు చెప్పాడు. దేవాలయపు ఆవరణలోకి ప్రవేశించి, వాడుక చొప్పున ప్రార్థన చేసే స్థలానికి రావటానికి కూడా తాను అయోగ్యుడనని భావించి “దూరముగా నిలుచుండి, . . . రొమ్ముకొట్టుకొనుచు—దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను.” (లూకా 18:13) యేసు చెప్పినట్లుగా, ఈ మనిషి ప్రార్థన అంగీకరించబడింది. ఇది యెహోవా దేవుడు నిజంగా కృపగలవాడని, యథార్థంగా పశ్చాత్తాపపడిన వారికి సహాయం చేయాలనుకుంటున్నాడని నిరూపిస్తోంది.
దక్షిణ ఆఫ్రికాలోని పాల్ అనే యువకుడిని చూడండి. ఒక అబ్బాయిగా పాల్ తన తల్లితో పాటు క్రైస్తవ కూటాలకు హాజరయ్యేవాడు. కానీ హైస్కూల్లో చదువుతున్నప్పుడు, దేవుని మార్గాల్ని అనుసరించని కుర్రాళ్లతో కలిసి తిరగటం ప్రారంభించాడు. స్కూల్ చదువు తర్వాత, దక్షిణ ఆఫ్రికా మాజీ జాతి వెలివిధానపు ప్రభుత్వ సైన్యంలో చేరాడు. అప్పుడు, అనుకోకుండా అతని స్నేహితురాలు ఆయనతో సంబంధాన్ని తెంచుకుంది. ఈ అసంతృప్తికరమైన జీవన విధానం పాల్‌ను తీవ్రమైన నిరుత్సాహంలో పడవేసింది. ఆయనిలా గుర్తు చేసుకుంటున్నాడు, “సంవత్సరాలుగా నేను యథార్థంగా దేవునికి ప్రార్థన చేయకపోయినప్పటికీ, ఒక సాయంకాలం, నాకు సహాయం చేయమని యెహోవాకు ప్రార్థన చేశాను.”
ఆ ప్రార్థన తర్వాత, ఎంతోకాలం గడువక ముందే, క్రీస్తు మరణ వార్షిక జ్ఞాపకార్థ దినానికి రమ్మని పాల్ తల్లి ఆయనను ఆహ్వానించింది. (లూకా 22:19) మొండివాడిగా ఉండి, బైబిలుపై అంతంత మాత్రమే ఆసక్తి చూపిన తనను తన తల్లి అలా రమ్మనటం పాల్‌కు వింతగా తోచింది. “ఈ ఆహ్వానాన్ని నా ప్రార్థనకు యెహోవా ఇచ్చిన జవాబుగా దృష్టించాను, దానికి బదులు చెల్లించాలని అనుకున్నాను.” అది మొదలు, పాల్ క్రైస్తవ కూటాలన్నింటికీ హాజరవ్వడం మొదలుపెట్టాడు. నాలుగు నెలల బైబిలు పఠనం తర్వాత ఆయన బాప్తిస్మం పొందటానికి అర్హుడయ్యాడు. పైగా ఆయన తన ఇంజనీరింగ్ విద్యను విడిచిపెట్టి పూర్తికాల సువార్తపనిని చేపట్టాడు. ఈరోజు, పాల్ ఆనందంగా ఉన్న వ్యక్తి, గత జీవితాన్ని బట్టి ఇక ఎంతమాత్రం కృంగిపోవడంలేదు. గత 11 సంవత్సరాలుగా ఆయన దక్షిణ ఆఫ్రికాలోని వాచ్ టవర్ సొసైటీ బ్రాంచి ఆఫీసులో సేవచేస్తున్నాడు.
నిజంగా, యెహోవా దేవుడు ప్రార్థనలకు దయతో జవాబిస్తాడు, ‘తన్ను వెదకువారికి ఫలము దయచేస్తాడు.’ (హెబ్రీయులు 11:6) త్వరలోనే యెహోవా మహా దినం వచ్చి సమస్త దుష్టత్వానికి ముగింపు తెస్తుంది. ఈలోగా, ప్రాముఖ్యమైన సాక్ష్యపు పనిలో ఉత్సాహంగా పాల్గొంటూ, శక్తి కోసం నడిపింపు కోసం ప్రార్థిస్తున్న తన ప్రజల ప్రార్థనలకు యెహోవా జవాబునిస్తున్నాడు. అలా సమస్త దేశాలకు చెందిన లక్షలాదిమంది క్రైస్తవ సంఘానికి తీసుకురాబడుతూ, నిత్యజీవానికి నడిపించే బైబిలు జ్ఞానముతో ఆశీర్వదించబడుతున్నారు.—యోహాను 17:3.
[5వ పేజీలోని చిత్రం]
కొర్నేలీ హృదయపూర్వక ప్రార్థన అపొస్తలుడైన పేతురు ఆయన్ని సందర్శించేలా చేసింది
[6వ పేజీలోని చిత్రాలు]
విపద్దశల్లో అనేకమందికి ప్రార్థన సహాయం చేసింది
[7వ పేజీలోని చిత్రాలు]
బైబిలును అర్థం చేసుకునేందుకు సహాయం చేయమని ప్రార్థించటం మంచిది
తమ వివాహాన్ని బలపర్చుకోవటానికి సహాయంకోసం వివాహిత దంపతులు ప్రార్థన చేయవచ్చు