కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 10/15 పేజీలు 17-22
  • మీరు మీ సహోదరుని సంపాదించుకోవచ్చు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు మీ సహోదరుని సంపాదించుకోవచ్చు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆయన ఉద్దేశమేమిటి?
  • మీ సహోదరుని సంపాదించుకోడానికి కృషి చేయండి
  • పరిణతిచెందిన వారి సహాయాన్ని పొందడం
  • ఆయనను సంపాదించుకోడానికి చివరి ప్రయత్నం
  • విభేదాలను మీరు ఎలా పరిష్కరిస్తారు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • సంఘ శాంతిని, పవిత్రతను కాపాడడం
    యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
  • నేడు దేవుని కనికరమును అనుకరించుము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • అభిప్రాయభేదాల్ని ప్రేమతో పరిష్కరించుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 10/15 పేజీలు 17-22

మీరు మీ సహోదరుని సంపాదించుకోవచ్చు

“నీవు పోయ, నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము; అతడు నీ మాట వినినయెడల నీ సహోదరుని సంపాదించుకొంటివి.”—మత్తయి 18:15.

1, 2. తప్పిదములతో వ్యవహరించడం గురించి యేసు ఏ ఆచరణాత్మకమైన ఉపదేశాన్ని ఇచ్చాడు?

తన పరిచర్య కాలంలో దాదాపు ఒక సంవత్సరం మిగిలి ఉండగా, యేసు తన శిష్యులకు ప్రాముఖ్యమైన పాఠాలు నేర్పించవలసి ఉంది. వాటిని మీరు మత్తయి 18వ అధ్యాయంలో చదువవచ్చు. మనం పిల్లల వలే దీనమనస్కులమై ఉండటం యొక్క ప్రాముఖ్యతను గురించినది ఒకటి. ఆ తర్వాత ఆయన, “ఈ చిన్నవారిలో ఒకనిని” అభ్యంతరపర్చకూడదనీ, ‘చిన్నవారు’ నశించిపోకుండా వారిని కాపాడటానికి ప్రయత్నించాలనీ నొక్కిచెప్పాడు. ఆ తర్వాత యేసు, క్రైస్తవుల మధ్య సమస్యలను పరిష్కరించుకోవడం విషయంలో విలువైన, ఆచరణాత్మకమైన ఉపదేశాన్ని ఇచ్చాడు.

2 మీరు ఆయన చెప్పిన ఈ మాటలను జ్ఞాపకం చేసుకోవచ్చు: “నీ సహోదరుడు నీయెడల తప్పిదముచేసిన యెడల నీవు పోయ, నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము; అతడు నీ మాట వినినయెడల నీ సహోదరుని సంపాదించుకొంటివి. అతడు విననియెడల, ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడునట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకొని అతనియొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు విననియెడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము; అతడు సంఘపు మాటయు విననియెడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము.” (మత్తయి 18:15-17) మనమా ఉపదేశాన్ని ఎప్పుడు అన్వయించుకోవాలి, అలా చేయడంలో మన దృక్పథం ఏమై ఉండాలి?

3. ఇతరుల తప్పిదముల గురించి మనం సాధారణంగా ఎలాంటి దృక్పథం కల్గివుండాలి?

3 మనమందరం అపరిపూర్ణులం గనుకా, తప్పులు చేస్తుంటాము గనుకా, మనం క్షమించేవారిగా ఉండే విషయంలో కృషి చేయాలని గత శీర్షిక నొక్కి తెలియజేసింది. తోటి క్రైస్తవుడు అన్నదాన్ని బట్టి, చేసినదాన్ని బట్టి గాయపడినప్పుడు అది ప్రాముఖ్యం. (1 పేతురు 4:8) సాధారణంగా తప్పును ఉపేక్షించడం మంచిది అంటే క్షమించి, మరిచిపోవడం మంచిది. క్రైస్తవ సంఘంలో శాంతి నెలకొనడానికి దోహదపడేందుకు చేసే చర్యగా మనం దీన్ని దృష్టించవచ్చు. (కీర్తన 133:1; సామెతలు 19:11) అయినప్పటికీ, మిమ్మల్ని గాయపర్చిన మీ సహోదరునితో లేక సహోదరితో విషయాన్ని సరిచేసుకోవాలని మీరు అనుకునే సందర్భం ఉండవచ్చు. అలాంటి సందర్భంలో, యేసు చెప్పిన పై మాటలు మనకు నడిపింపునిస్తాయి.

4. ఇతరులు చేసిన తప్పిదములకు మనం మత్తయి 18:15ను సూత్రబద్ధంగా ఎలా అన్వయించవచ్చు?

4 “నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము” అని యేసు ఉపదేశించాడు. (ఇటాలిక్కులు మావి.) అది జ్ఞానయుక్తమైన పని. కొన్ని జర్మను అనువాదాలు ఆ పదబంధాన్ని, అతని తప్పును “నాలుగు కళ్ల సమక్షంలో” అంటే మీరూ అతడూ ఉన్నప్పుడు తెలియజేయాలన్నట్లు వ్యక్తం చేశాయి. మీరు దయాపూర్వకంగా, ఏదైనా ఒక సమస్యను ఏకాంతంగా ఉన్నప్పుడు చర్చిస్తే, దాన్ని పరిష్కరించటం సాధారణంగా సులభమౌతుంది. ఒక సహోదరుడు మీకు అభ్యంతరం కలిగించినది లేక నిర్దయతో కూడినది ఏదైనా చేయడం గానీ అనడం గానీ జరిగితే, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు అతడు తన తప్పును మరింత సులభంగా అంగీకరించవచ్చు. ఇతరులు వింటుంటే, అపరిపూర్ణ మానవ నైజం, అతడు తన తప్పును నిరాకరించేలా లేక తాను చేసినదాన్ని సమర్థించుకోవటానికి ప్రయత్నించేలా చేయవచ్చు. కాని మీరు విషయాన్ని “నాలుగు కళ్ల సమక్షంలో” చర్చకు తెచ్చినప్పుడు, అది పాపమో లేక ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పో కాదుగానీ కేవలం అపార్థమేనని మీరు తెలుసుకోవచ్చు. ఒకసారి మీరిద్దరూ, అది కేవలం అపార్థమేనని గ్రహించాక, ఒక చిన్న విషయం పెద్దదై మీ సంబంధాన్ని విషపూరితం చేయడానికి అనుమతించకుండా, మీరు విషయాన్ని సరిచేసుకోవచ్చు. కాబట్టి, మత్తయి 18:15లోని సూత్రాన్ని అనుదిన జీవితంలోని చిన్న చిన్న విషయాలకు కూడా అన్వయించుకోవచ్చు.

ఆయన ఉద్దేశమేమిటి?

5, 6. సందర్భాన్నిబట్టి చూస్తే, మత్తయి 18:15 ఏ విధమైన తప్పిదముల గురించి మాట్లాడుతుంది, ఏది దాన్ని సూచిస్తుంది?

5 కచ్చితంగా చెప్పాలంటే, యేసు ఇచ్చిన ఉపదేశం మరింత గంభీరమైన విషయాలకు వర్తిస్తుంది. యేసు ఇలా అన్నాడు: ‘నీ సహోదరుడు తప్పిదముచేసిన యెడల.’ విస్తృతార్థంలో, “తప్పిదము” అంటే, అది పొరపాటైనా లేక అపరాధమైనా కావచ్చు. (యోబు 2:10; సామెతలు 21:4; యాకోబు 4:17) అయితే, యేసు ఉద్దేశించిన తప్పిదము గంభీరమైనదై ఉండవచ్చునని సందర్భం సూచిస్తుంది. అది ఎంత గంభీరమైనదంటే తప్పిదస్థుడిని “అన్యునిగాను సుంకరి గాను” ఎంచడానికి నడిపేంత గంభీరమైనది. ఆ పదబంధం ఏమి సూచిస్తుంది?

6 ఆ మాటలను వింటున్న యేసు శిష్యులకు, తమ దేశస్థులు అన్యులతో కలవరని తెలుసు. (యోహాను 4:9; 18:28; అపొస్తలుల కార్యములు 10:28) యూదులుగా జన్మించినప్పటికీ, ప్రజలతో దుర్వ్యవహారం చేసేవారిగా తయారైన సుంకరులను వాళ్లు దూరంగా ఉంచేవారనటంలో సందేహం లేదు. కాబట్టి కచ్చితంగా చెప్పాలంటే మత్తయి 18:15-17లోని వచనాలు, మీరు సులభంగా క్షమించి మరచిపోగల వ్యక్తిగత అభ్యంతరాలను లేక గాయాలను కాదు గానీ గంభీరమైన తప్పిదాలను సూచిస్తున్నాయి.—మత్తయి 18:21, 22.a

7, 8. (ఎ) ఏ విధమైన తప్పిదములతో పెద్దలు వ్యవహరించాలి? (బి) మత్తయి 18:15-17 అనుసారంగా, ఏ విధమైన తప్పిదములను ఇద్దరు క్రైస్తవుల మధ్య సరిచేసుకోవచ్చు?

7 ధర్మశాస్త్రం ప్రకారం, కొన్ని తప్పిదములకు అభ్యంతరపర్చబడిన వ్యక్తి క్షమించడం కంటే ఎక్కువే అవసరమయ్యేది. దేవదూషణ, మతభ్రష్టత్వం, విగ్రహారాధన, లైంగిక పాపాలైన వ్యభిచారం, జారత్వం, సలింగసంయోగం వంటివాటిని పెద్దలకు (లేక యాజకులకు) నివేదించాలి, వారు వాటితో వ్యవహరించాలి. క్రైస్తవ సంఘంలో కూడా అది వాస్తవం. (లేవీయకాండము 5:1; 20:10-13; సంఖ్యాకాండము 5:30; 35:12; ద్వితీయోపదేశకాండము 17:9; 19:16-19; సామెతలు 29:24) అయితే, యేసు ఇక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్య పరిష్కరించుకోగల తప్పిదముల గురించి మాట్లాడాడని గమనించండి. ఉదాహరణలుగా, కోపంతో లేక అసూయతో ఒక వ్యక్తి తన తోటివారిపై నిందలు వేయడం. ఒక క్రైస్తవుడు ఫలాని సామాగ్రితో, ఫలాని తేదీకి ఒక పనిని ముగిస్తానని ఒప్పందం చేయడం. ఫలాని రోజుకు లేక ఫలాని తేదీకి డబ్బును తిరిగి ఇస్తానని ఒకరు ఒప్పుకోవడం. తన యజమాని తనకు శిక్షణనిస్తే తాను కొంత పరిమిత సమయం వరకూ లేక నిశ్చయించబడిన ప్రాంతంలో తన యజమానితో (ఒకవేళ ఉద్యోగాలు మార్చుకున్నప్పటికీ) పోటీపడననీ, లేక తన యజమాని క్లయింట్లను తీసుకోవడానికి ప్రయత్నించననీ ఒక వ్యక్తి వాగ్దానం చేయడం.b ఒక సహోదరుడు తన మాటను నిలబెట్టుకోకుండా, అలాంటి తప్పిదముల విషయమై పశ్చాత్తాపపడకుండా ఉంటే, అది కచ్చితంగా గంభీరమైనదే. (ప్రకటన 21:8) కాని అలాంటి తప్పులను, దానిలో నిమగ్నమైయున్న ఇద్దరి మధ్య పరిష్కరించుకోవచ్చు.

8 అయితే అలాంటి విషయాన్ని మీరెలా పరిష్కరిస్తారు? యేసు మాటలు తరచూ మూడు చర్యలుగా దృష్టించబడతాయి. ఒకొక్కదాన్ని మనం పరిశీలిద్దాం. వాటిని కచ్చితమైన, చట్టబద్ధమైన విధానాలుగా దృష్టించే బదులు, వాటి భావాన్ని గ్రహించడానికి ప్రయత్నించండి, అదే సమయంలో మీ ప్రేమపూర్వక లక్ష్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకోండి.

మీ సహోదరుని సంపాదించుకోడానికి కృషి చేయండి

9. మత్తయి 18:15ను అన్వయించుకోవడానికి సంబంధించి మనం ఏమి మనస్సులో ఉంచుకోవాలి?

9 యేసు ఇలా ప్రారంభించాడు: “నీ సహోదరుడు నీయెడల తప్పిదముచేసిన యెడల నీవు పోయ, నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము; అతడు నీ మాట వినినయెడల నీ సహోదరుని సంపాదించుకొంటివి.” ఇది కేవలం అనుమానం ఆధారంగా తీసుకునే చర్య కాదని స్పష్టమౌతుంది. మీ సహోదరుడు తాను తప్పు చేశాననీ, విషయాలను చక్కబరచుకోవలసిన అవసరం ఉందనీ గ్రహించడానికి అతనికి సహాయం చేసేందుకు మీరు ఉపయోగించగల సాక్ష్యాధారం లేక ప్రత్యేకమైన సమాచారం మీ దగ్గర ఉండాలి. విషయం మరీ పెద్దదయ్యే వరకూ లేక అతని దృక్పథం లోతుగా పాతుకుపోయేంత వరకూ ఉండకుండా వెంటనే చర్య తీసుకోవడం మంచిది. దాని గురించి వ్యాకులపడుతూ ఉండటం మీకు కూడా హాని కలిగించగలదని మరచిపోకండి. చర్చ మీకూ అతనికీ మధ్య మాత్రమే జరగాలి గనుక, ఇతరుల సానుభూతిని పొందడానికీ లేక మీ స్వంత ప్రతిష్ఠను పెంచుకోవడానికీ ఇతరులతో ఆ విషయాల గురించి మాట్లాడకుండా ఉండండి. (సామెతలు 12:25; 17:9) ఎందుకు? కారణం మీ లక్ష్యమే.

10. మన సహోదరుడ్ని సంపాదించుకోవడానికి మనకేమి సహాయం చేస్తుంది?

10 మీ లక్ష్యం మీ సహోదరుడ్ని సంపాదించుకోవడమై ఉండాలి గానీ, అతనిని శిక్షించాలనీ, అవమానించాలనీ, లేక నాశనం చేయాలనీ కాదు. అతడు నిజంగానే తప్పు చేసి ఉంటే, యెహోవాతో అతనికున్న సంబంధం ప్రమాదంలో ఉంది. అతడు మీ క్రైస్తవ సహోదరునిగా ఉండాలని మీరు తప్పక కోరుకుంటారు. ఒంటరిగా మాట్లాడేటప్పుడు మీరు ప్రశాంతంగా ఉండి, కఠినమైన మాటలను, నిందాపూర్వకమైన స్వరాన్ని నివారించినట్లయితే, ఆ చర్చ విజయవంతమయ్యే అవకాశాలు పెరుగుతాయి. ఈ ప్రేమపూర్వకమైన సంఘర్షణలో మీరిద్దరూ అపరిపూర్ణ, పాపభరిత మానవులే అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. (రోమీయులు 3:23, 24) మీరు అతని గురించి చెడు ప్రచారం చేయలేదని అతడు గ్రహిస్తుండగా, మీరు నిజంగా సహాయం చేయాలనుకుంటున్నారని అతడు తెలుసుకుంటుండగా వెంటనే పరిష్కారం లభించగలదు. ఇలా దయాపూర్వకంగా, స్పష్టమైన విధంగా వ్యవహరించడం జ్ఞానాన్ని ప్రతిబింబిస్తుంది, ప్రత్యేకంగా మీ ఇద్దరిదీ కొంతమేరకు తప్పు ఉన్నదనీ లేక అసలు కారణం అపార్థమేననీ తేలినట్లైతే అప్పుడు అది జ్ఞానాన్ని ప్రతిబింబిస్తుంది.—సామెతలు 25:9, 10; 26:20; యాకోబు 3:5, 6.

11. తప్పిదస్థుడు మనం చెప్పేదాన్ని వినకపోయినా, మనమేమి చేయవచ్చు?

11 తప్పు జరిగిందనీ, అది గంభీరమైనదనీ అతడు తెలుసుకునేలా మీరు చేస్తే, అతడు పశ్చాత్తాపపడేలా ప్రేరేపించబడవచ్చు. అయితే, వాస్తవికంగా, అహం ఒక అవాంతరం కాగలదు. (సామెతలు 16:18; 17:19) కాబట్టి అతడు మొదట తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపపడక పోయినా, విషయాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే ముందు మీరు కాస్త ఆగవచ్చు. ‘కేవలం ఒకసారి వెళ్లి అతని గద్దించుమని’ యేసు చెప్పలేదు. అది మీరు సరిచేసుకోగల తప్పిదం గనుక, గలతీయులు 6:1 నందలి స్ఫూర్తితోనూ, “నాలుగు కళ్ల సమక్షంలో”నూ మళ్లీ అతడిని సమీపించడం గురించి ఆలోచించండి. మీరు విజయం సాధించవచ్చు. (పోల్చండి యూదా 22, 23.) అయినప్పటికీ, తప్పిదం జరిగిందనీ, అతడు ప్రతిస్పందించడనీ మీరు ఒప్పించబడితే అప్పుడేమిటి?

పరిణతిచెందిన వారి సహాయాన్ని పొందడం

12, 13. (ఎ) తప్పిదములతో వ్యవహరించడంలో యేసు ఏ రెండవ చర్య గురించి చెప్పాడు? (బి) ఈ చర్యను అనుసరించడంలో ఏ ముందు జాగ్రత్తలు తగినవి?

12 మీరు ఏదైనా గంభీరమైన తప్పిదం చేసివుంటే ఇతరులు మీపై త్వరగా ఆశలు వదులుకోడాన్ని మీరు ఇష్టపడతారా? మీరలా ఇష్టపడరు. అలాగే, అంగీకారయుక్తమైన విధంగా దేవుని సేవచేయడంలో మీతోనూ ఇతరులతోనూ అతడు ఐక్యత కల్గివుండేందుకు మీరు మీ సహోదరుడ్ని సంపాదించుకోవడానికి కేవలం మొదటి చర్య మాత్రం తీసుకుని విడిచిపెట్టకూడదని యేసు చూపించాడు. యేసు రెండవ చర్యను సూచించాడు: “అతడు విననియెడల, ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడునట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకొని అతనియొద్దకు పొమ్ము.”

13 ఆయన “ఒకరినిద్దరిని” తీసుకు వెళ్లమన్నాడు. మొదటి చర్య తీసుకున్న తర్వాత, మీరు సమస్యను అనేకమంది ఇతరులతో చర్చించవచ్చుననీ లేక ప్రయాణ పైవిచారణకర్తను సంప్రదించవచ్చుననీ, లేక సమస్య గురించి సహోదరులకు వ్రాయమనీ ఆయన చెప్పలేదు. తప్పు గురించి మీరు ఒప్పించబడినప్పటికీ, అది నిజంగా పూర్తిగా స్థాపించబడలేదు. మీరు ప్రతికూలమైన సమాచారాన్ని ప్రచారం చేయాలనుకోకూడదు, అది మీ పక్షంగా అపనింద వేసినట్లవుతుంది. (సామెతలు 16:28; 18:8) కాని ఒకరినిద్దరిని వెంట తీసుకు వెళ్లమని యేసు చెప్పాడు. ఎందుకని? వాళ్లు ఎవరై ఉండవచ్చు?

14. రెండవ చర్య కోసం మనం ఎవరిని మనతోపాటు తీసుకువెళ్లవచ్చు?

14 తప్పిదం జరిగిందని అతడిని ఒప్పించడం ద్వారా, మీతోనూ దేవునితోనూ శాంతిని కల్గివుండగల్గేలా అతడు పశ్చాత్తాపపడేందుకు అతడిని ప్రేరేపించడం ద్వారా మీరు మీ సహోదరుడ్ని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దాన్ని సాధించడానికి, సరైన పరిస్థితి ఏమిటంటే, ఆ ‘ఒకరిద్దరు,’ జరిగిన తప్పిదానికి సాక్షులై ఉండటం. అది జరిగినప్పుడు బహుశా వారు ఉండి ఉండవచ్చు, లేదా ఒక వ్యాపార విషయంలో ఏమి జరిగింది (లేక జరగాల్సినదేమి జరగలేదు) అన్నదాన్ని గురించిన విలువైన సమాచారం వారి వద్ద ఉండవచ్చు. అలాంటి సాక్షులు అందుబాటులో లేకపోతే, మీరు తీసుకువచ్చే వారికి, ఇప్పుడు వివాదంలో ఉన్న అంశానికి సంబంధించిన రంగంలో అనుభవం ఉంటే, జరిగినది నిజంగా తప్పా కాదా అనేది స్థాపించగల్గుతారు. అంతేగాక, ఆ తర్వాత అవసరమైతే, ఇవ్వబడిన వాస్తవాలనూ జరిగిన కృషినీ ధృవీకరిస్తూ చెప్పబడినదానికి వారు సాక్షులుగా ఉంటారు. (సంఖ్యాకాండము 35:30; ద్వితీయోపదేశకాండము 17:5-6) కాబట్టి వాళ్లు కేవలం తటస్థ వ్యక్తులు మాత్రమే కాదు, న్యాయనిర్ణేతలు మాత్రమే కాదు; అయినప్పటికీ, వాళ్లు అక్కడ ఉండడానికి కారణం, మీ సహోదరుని, వారి సహోదరుని సంపాదించుకోవడానికే.

15. మనం రెండవ చర్య తీసుకోవలసి ఉంటే క్రైస్తవ పెద్దలు ఎందుకు సహాయకారులుగా ఉంటారు?

15 మీరు తీసుకువచ్చే వారు సంఘ పెద్దలుగా ఉన్న పురుషులై ఉండాలని అనుకోనవసరం లేదు. అయితే, పరిణతిగల వ్యక్తులైన పెద్దలు తమ ఆధ్యాత్మిక అర్హతలతో దోహదపడగల్గుతారు. అలాంటి పెద్దలు, “మనుష్యుడు గాలికి మరుగైనచోటువలెను గాలివానకు చాటైన చోటువలెను ఉండును. ఎండినచోట నీళ్లకాలువలవలెను అలసట పుట్టించు దేశమున గొప్పబండ నీడవలెను ఉండును.” (యెషయా 32:1, 2) సహోదర సహోదరీలతో తర్కించడంలోనూ, వారిని పునఃస్థాపించడంలోనూ వారికి అనుభవం ఉంది. అలాంటి “మనుష్యులలో ఈవుల”పై నమ్మకాన్ని ఉంచడంలో తప్పిదస్థునికి మంచి కారణం ఉంది.c (ఎఫెసీయులు 4:8, 11, 12, NW) అలాంటి పరిణతిగల వారి సమక్షంలో విషయాన్ని మాట్లాడటం, వారితో ప్రార్థనలో భాగం వహించడం క్రొత్త వాతావరణాన్ని సృష్టించవచ్చు, పరిష్కరించజాలనిదని అన్పించిన దాన్ని పరిష్కరించవచ్చు.—పోల్చండి యాకోబు 5:14, 15.

ఆయనను సంపాదించుకోడానికి చివరి ప్రయత్నం

16. యేసు చెప్పిన మూడవ చర్య ఏమిటి?

16 విషయాన్ని రెండవ చర్య సరిచేయలేకపోతే, సంఘ పైవిచారణకర్తలు మూడవ చర్యలో తప్పక నిమగ్నమై ఉంటారు. “అతడు వారి మాటయు విననియెడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము; అతడు సంఘపు మాటయు విననియెడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము.” దీనిలో ఏమి ఇమిడివుంది?

17, 18. (ఎ) ‘సంఘంతో మాట్లాడటంలోని’ ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి ఏ విధానం మనకు సహాయం చేస్తుంది? (బి) నేడు మనం ఈ చర్యను ఎలా అన్వయించుకోవచ్చు?

17 మనం దాన్ని, మొత్తం సంఘమంతా కూడి ఉన్నప్పుడు అంటే క్రమ కూటములోనో లేక ప్రత్యేక కూటములోనో ఆ తప్పిదాన్ని పైకి తీసుకురావడానికి ఒక ఆదేశంగా దృష్టించకూడదు. మనం దేవుని వాక్యం నుండి తగిన విధానమేమిటో నిర్ణయించుకోవచ్చు. తిరుగుబాటు, తిండిబోతుతనం, త్రాగుబోతుతనం ఉన్నప్పుడు ప్రాచీన ఇశ్రాయేలులో ఏమి జరిగేదో చూడండి: “ఒకని కుమారుడు మొండివాడై తిరుగబడి తండ్రిమాట గాని తల్లిమాటగాని వినకయుండి, వారు అతని శిక్షించిన తరువాతయును అతడు వారికి విధేయుడు కాక పోయన యెడల అతని తలిదండ్రులు అతని పట్టుకొని ఊరి గవినియొద్ద కూర్చుండు పెద్దలయొద్దకు అతని తీసికొని వచ్చి—మా కుమారుడైన వీడు మొండివాడై తిరుగబడియున్నాడు; మా మాట వినక తిండిబోతును త్రాగుబోతును ఆయెనని ఊరి పెద్దలతో చెప్పవలెను. అప్పుడు ఊరి ప్రజలందరు రాళ్లతో అతని చావగొట్టవలెను.” (ఇటాలిక్కులు మావి.)—ద్వితీయోపదేశకాండము 21:18-21.

18 ఆ వ్యక్తి చేసిన తప్పిదములను మొత్తం జనాంగమంతా లేక అతని గోత్రమువారంతా విని తీర్పుతీర్చేవారు కాదు. బదులుగా, గుర్తింపబడిన ‘పెద్దలు’ సంఘ ప్రతినిధులుగా దానితో వ్యవహరించేవారు. (ఆయా కాలాల్లో ‘యాజకులుగా న్యాయాధిపతులుగానున్న’ వారు చేపట్టాల్సిన వివాదాల గురించి, ద్వితీయోపదేశకాండము 19:16, 17 పోల్చి చూడండి.) అలాగే నేడు, మూడవ చర్య తీసుకోవడం అవసరమైనప్పుడు, సంఘానికి ప్రాతినిధ్యం వహించే పెద్దలు విషయాన్ని చక్కబెడతారు. వారి లక్ష్యం అదే, వీలైతే క్రైస్తవ సహోదరుడ్ని సంపాదించుకోవాలన్నదే. వాళ్లు వివాదాన్ని పరిశీలించటానికి ముందే తీర్పు తీర్చడం ద్వారా లేక పక్షపాతం చూపించడం ద్వారా కాదుగానీ, న్యాయాన్ని కనబర్చడం ద్వారా వాళ్లు దాన్ని ప్రతిబింబిస్తారు.

19. విషయాన్ని వినడానికి నిర్దేశించబడిన పెద్దలు ఏమి చేయడానికి కృషి చేస్తారు?

19 వాళ్లు వాస్తవాలను బేరీజు వేయడానికీ, అసలు తప్పిదం నిజంగా జరిగిందో లేదో (లేక ఇంకా జరుగుతూ ఉందో) నిర్ణయించడానికి అవసరమైన సాక్ష్యాలను వినడానికీ కృషి చేస్తారు. వాళ్లు సంఘాన్ని కలుషితం నుండి కాపాడాలనీ, లోకాత్మను దూరంగా ఉంచాలనీ కోరుకుంటారు. (1 కొరింథీయులు 2:12; 5:7) వాళ్లు తమ ఆధ్యాత్మిక అర్హతలకు తగినట్లుగా, ‘హితబోధ విషయమై హెచ్చరించడానికి, ఎదురాడువారి మాట ఖండించడానికి’ కృషి చేస్తారు. (తీతు 1:9) తప్పిదస్థుడు, “నేను పిలువగా మీరు ఉత్తరమియ్యలేదు నేను మాటలాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదైనదాని చేసితిరి నాకిష్టము కానిదాని కోరితిరి” అని యెహోవా ప్రవక్త ఎవరి గురించైతే చెప్పాడో ఆ ఇశ్రాయేలీయులలా ఉండడని నిరీక్షించబడుతుంది.—యెషయా 65:12.

20. తప్పిదస్థుడు విని పశ్చాత్తాపపడేందుకు నిరాకరిస్తే ఏమి జరగాలని యేసు చెప్పాడు?

20 అయితే కేవలం కొన్ని కేసుల్లో మాత్రం, తప్పిదస్థుడు అదే దృక్పథాన్ని ప్రతిబింబిస్తాడు. అలాగైతే, యేసు ఇచ్చిన ఉపదేశం స్పష్టంగా ఇలా ఉంది: “అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము.” అమానుషంగా ఉండమనీ, లేక హాని చేయాలనుకునే వారిగా ఉండమనీ ప్రభువు సిఫారసు చేయలేదు. అయితే, పశ్చాత్తాపం చెందని పాపులను సంఘంలో నుండి తొలగించాలని అపొస్తలుడైన పౌలు ఇచ్చిన నిర్దేశం గురించి అనిశ్చయత ఏమీ లేదు. (1 కొరింథీయులు 5:11-13) చివరికిది తప్పిదస్థుడిని సంపాదించుకోవాలన్న లక్ష్యాన్ని సాధించడానికి దారితీయవచ్చు.

21. సంఘం నుండి వెలివేయబడినవారికి ఏ అవకాశం ఇంకా నిలిచి ఉంటుంది?

21 తప్పిపోయిన కుమారుని గురించి యేసు చెప్పిన ఉపమానంలో మనం ఆ సాధ్యతను చూడవచ్చు. ఉపమానంలో తెలియజేయబడినట్లుగా, తన తండ్రి ఇంటిలోని ప్రేమపూర్వక సహవాసం నుండి దూరంగా కొంతకాలంపాటు బయట నివసించిన తర్వాత, ఆ పాపికి ‘బుద్ధి వచ్చింది.’ (లూకా 15:11-18) కొంతమంది తప్పిదస్థులు కొంతకాలానికి పశ్చాత్తాపపడి, ‘సాతాను ఉరిలోనుండి తప్పించుకొని మేలుకొనెదరని’ పౌలు తిమోతికి చెప్పాడు. (2 తిమోతి 2:24-26) పశ్చాత్తాపపడకుండా తప్పు చేసి సంఘం నుండి బహిష్కరించబడే వారెవరైనా, దేవుని అంగీకార లోటును, అలాగే యథార్థ క్రైస్తవుల ప్రేమపూర్వకమైన సహవాస సహకారాల లోటును అనుభవించి బుద్ధి తెచ్చుకుంటారని మనం తప్పక నిరీక్షించవచ్చు.

22. చివరికి మనం మన సహోదరుడ్ని ఎలా కూడా సంపాదించుకోవచ్చు?

22 యేసు అన్యులను, సుంకరులను విమోచించలేనివారన్నట్లు పరిగణించలేదు. సుంకరి, లేవీయుడు అయిన మత్తయి పశ్చాత్తాపపడి, యథార్థంగా ‘యేసును అనుసరించి’ అపొస్తలునిగా కూడా ఎన్నుకోబడ్డాడు. (మార్కు 2:15; లూకా 15:1) చివరికి, నేడు ఒక తప్పిదస్థుడు “సంఘపు మాటయు విన”కుండా, సంఘం నుండి వెలివేయబడితే, అతడు కొంతకాలానికి పశ్చాత్తాపపడి తన మార్గాలను సరి చేసుకుంటాడని మనం ఎదురు చూడవచ్చు. అతడలా చేసి మళ్లీ సంఘ సభ్యుడైనప్పుడు, మనం మన సహోదరుడ్ని సత్యారాధనలోకి తిరిగి సంపాదించుకోగల్గినందుకు సంతోషిస్తాము.

[అధస్సూచీలు]

a మాక్‌క్లింటన్‌ మరియు స్ట్రాంగ్‌ల సైక్లోపీడియా ఇలా చెప్తుంది: “క్రొత్త నిబంధనలోని పబ్లికన్‌లు [సుంకరులు] దేశద్రోహులుగా, మతభ్రష్టులుగా, అన్యులతో తరచూ సహవసించటం మూలంగా కలుషితమైన వారిగా, వ్యతిరేకుల చేతుల్లో ఇష్టపూర్వకంగా పనిచేసే కీలుబొమ్మలుగా పరిగణించబడేవారు. వాళ్లు పాపులతో లెక్కించబడేవారు . . . అలా వెలివేయబడిన వారి నుండి మర్యాదస్థులు దూరంగా ఉండటంతో, వారికి మిగిలిన ఏకైక స్నేహితులూ లేక సహవాసులూ వారి వంటి బహిష్కృతులే.”

b కొంతమేరకు మోసం, అన్యాయం, లేక దగా చేరివున్న వ్యాపార లేక ఆర్థిక విషయాలు యేసు ఉద్దేశించిన తప్పిదం కోవకు చెందవచ్చు. ఒక సూచనగా, యేసు మత్తయి 18:15-17 నందు వ్రాయబడివున్న నిర్దేశాన్ని ఇచ్చిన తర్వాత, డబ్బు ఋణపడి ఉండి దాన్ని తిరిగి చెల్లించటానికి విఫలమైన ఇద్దరు దాసులను (ఉద్యోగులను) గురించిన ఉపమానాన్ని చెప్పాడు.

c ఒక బైబిలు పండితుడు ఇలా వ్యాఖ్యానించాడు: “కొన్నిసార్లు ఏమౌతుందంటే, తప్పిదస్థుడు ఒక వ్యక్తి ఇచ్చే ఉపదేశాన్ని, ప్రాముఖ్యంగా తన అభిప్రాయం నుండి భిన్నమైన అభిప్రాయంగల వ్యక్తి ఇచ్చే ఉపదేశాన్ని స్వీకరించడంకంటే ఇద్దరు ముగ్గురు ఇచ్చే ఉపదేశాన్ని (ప్రాముఖ్యంగా వారు గౌరవనీయులైనప్పుడు) స్వీకరించడానికి ఎక్కువ సుముఖంగా ఉంటాడు.”

మీకు జ్ఞాపకమున్నాయా?

◻ ప్రాథమికంగా, మత్తయి 18:15-17 ఏ విధమైన తప్పిదానికి వర్తిస్తుంది?

◻ మనం మొదటి చర్య తీసుకోవలసి ఉంటే ఏమి జ్ఞాపకం ఉంచుకోవాలి?

◻ మనం రెండవ చర్యకు వెళ్లవలసి ఉంటే ఎవరు సహాయకరంగా ఉండగలరు?

◻ మూడవ చర్య తీసుకోవడంలో ఎవరు ఇమిడి ఉంటారు, చివరికి మనం మన సహోదరుడ్ని ఎలా కూడా సంపాదించుకోవచ్చు?

[18వ పేజీలోని చిత్రం]

యూదులు సుంకరుల నుండి దూరంగా ఉండేవారు. మత్తయి తన మార్గాలను మార్చుకుని యేసును అనుసరించాడు

[20వ పేజీలోని చిత్రం]

మనం తరచూ “నాలుగు కళ్ల సమక్షంలో” విషయాన్ని సరిచేసుకోవచ్చు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి