మంచి సహవాసుల్ని ఎంపిక చేసుకోవడానికి నడిపింపు
వస్త్రధారణ, సంగీతం విషయాల్లో నడిపింపు కోసం యౌవనస్థులు తమ తల్లిదండ్రులవైపు కాక తమ తోటివారివైపు చూస్తారని రీడర్స్ డైజెస్ట్‌లోని ఒక రిపోర్టు చెబుతుంది. అందుకని తల్లిదండ్రులు తమ పిల్లలు ఎవరితో, ఎక్కడ సహవసిస్తున్నారన్నది తెలుసుకోవడం ఆవశ్యకం.
“పరిశోధన చేసి కనుక్కోవడం మీ బాధ్యత” అని దక్షిణాఫ్రికాలోని ఒక విశ్వవిద్యాలయంలోని మనస్తత్త్వశాస్త్ర విభాగంలో సీనియర్ లెక్చరర్‌గా ఉన్న ఎజ్మే ఫాన్ రెన్స్బోయెర్క్ అంటుంది. ఆమె ఇంకా ఇలా అంటుంది: “ఇందుమూలంగా మీ పిల్లలు మీమీద కోప్పడే అవకాశాలు ఉన్నాయి, కానీ వారు నెమ్మదిగా శాంతిస్తారు.” తర్వాత తల్లిదండ్రులకు ఆమె ఈ క్రింది చిట్కాలు ఇస్తుంది. ఇంట్లో నియమాలు తర్కబద్ధంగాను స్పష్టమైన సూత్రాలతో కూడినవిగాను ఉండాలి; మీ పిల్లలు చెప్పేది వినండి; అతి తీవ్రంగా ప్రతిస్పందించకండి, ప్రశాంతంగా ఉండండి, మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారో ముందే తెలుసుకుని ఉండండి. మీ పిల్లలు అప్పటికే కానివారితో స్నేహాన్ని పెంచుకున్నట్లైతే, ఆ సహవాసాన్ని ఇకముందు కొనసాగించవద్దని చెప్పడానికి బదులు ఆ స్నేహం మూలంగా ఏర్పడిన అనంగీకారమైన ప్రవర్తనపై దృష్టి కేంద్రీకరించి చర్చించండి.
దేవుని వాక్యమైన బైబిలులో తల్లిదండ్రులకు వివేకయుక్తమైన సలహాలు ఎంతోకాలంగా అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు అదిలా చెబుతుంది: “ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడు[నై] . . . యుండవలెను.” (యాకోబు 1:19) సహవాసులను ఎంపిక చేసుకునే విషయంలో కూడా లేఖనాలు ఈ చక్కని సలహాను ఇస్తున్నాయి: “జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.” (సామెతలు 13:20) ఈ ఉదాహరణలు బైబిలును మెప్పుదలతో చదివేవారికీ అది చెప్పేవాటిని దైనందిన జీవితంలో అన్వయించుకునే వారికీ అందుబాటులో ఉన్న జ్ఞానాన్ని చూపిస్తున్నాయి.