కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 7/15 పేజీలు 29-31
  • పాఠకుల ప్రశ్నలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాఠకుల ప్రశ్నలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఇలాంటి మరితర సమాచారం
  • పాఠకుల ప్రశ్న
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • “మేలుచేయుటలో విసుకవద్దు”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • సంఘ శాంతిని, పవిత్రతను కాపాడడం
    యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
  • ‘మీ మధ్య ప్రయాసపడుతున్నవారిని’ గౌరవించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 7/15 పేజీలు 29-31

పాఠకుల ప్రశ్నలు

రెండవ థెస్సలొనీకయులు 3:14 నందు ప్రస్తావించబడిన “కనిపెట్టి” ఉండటమన్నది లాంఛనప్రాయమైన సంఘసంబంధిత వ్యవహారమా, లేక అవిధేయులైన వారి నుండి దూరంగా ఉండటానికి క్రైస్తవులు వ్యక్తిగతంగా చేసేదా?

అపొస్తలుడైన పౌలు థెస్సలొనీకయులకు వ్రాసినది, అలా “కనిపెట్టి” ఉండటంలో సంఘ పెద్దలకు ప్రత్యేకమైన పాత్ర ఉందని సూచిస్తోంది. అయితే, ఆ తర్వాత, క్రైస్తవులు ఆధ్యాత్మిక ఉద్దేశాలను మనస్సులో ఉంచుకుని వ్యక్తిగతంగా దాన్ని అనుసరిస్తారు. పౌలు ఏ సందర్భంలో ఈ ఉపదేశాన్ని ఇచ్చాడో ఆ సందర్భాన్ని పరిశీలించడం ద్వారా మనం దాన్ని ఇంకా చక్కగా గుణగ్రహించవచ్చు.

స్త్రీ పురుషులు విశ్వాసులయ్యేందుకు సహాయం చేయడం ద్వారా పౌలు థెస్సలొనీక సంఘాన్ని స్థాపించడానికి దోహదపడ్డాడు. (అపొస్తలుల కార్యములు 17:1-4) తర్వాత వారిని మెచ్చుకోవడానికి, ప్రోత్సహించడానికి కొరింథు నుండి వ్రాశాడు. అవసరమైన ఉపదేశాన్ని కూడా పౌలు ఇచ్చాడు. ‘పరులజోలికి పోక, సొంతకార్యములను జరుపుకొనుచూ, చేతులతో పనిచేస్తూ’ ఉండమని ఆయన వారికి ఉద్బోధించాడు. కొందరు అలా ప్రవర్తించలేదు, అందుకే పౌలు ఇంకా ఇలా జతచేశాడు: “సహోదరులారా, మేము మీకు బోధించునది ఏమనగా—అక్రమముగా నడుచుకొనువారికి బుద్ధిచెప్పుడి, ధైర్యము చెడినవారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊత నియ్యుడి.” ఉపదేశం అవసరమైన ‘అక్రమముగా నడుచుకొనువారు’a వారి మధ్య ఉన్నారని స్పష్టమౌతుంది.—1 థెస్సలొనీకయులు 1:2-10; 4:10-12; 5:14.

కొన్ని నెలల తర్వాత పౌలు, యేసు భవిష్యత్‌ ప్రత్యక్షత గురించి అదనపు వ్యాఖ్యానాలు చేస్తూ థెస్సలొనీకయులకు తన రెండవ పత్రికను వ్రాశాడు. ‘ఏ పనియు చేయక పరులజోలికి పోతున్న’ అక్రమంగా నడుచుకొనేవారితో ఎలా వ్యవహరించాలనేదాని గురించి పౌలు అదనపు నిర్దేశాన్ని ఇచ్చాడు. వారి చర్యలు, కష్టపడి పనిచేసేవానిగా మంచి మాదిరినుంచిన పౌలుకు, తమకు తాము మద్దతునిచ్చుకోవడానికి పనిచేయడం గురించి ఆయన ఇచ్చిన స్పష్టమైన ఆజ్ఞకు విరుద్ధంగా ఉన్నాయి. (2 థెస్సలొనీకయులు 3:7-12) కొన్ని చర్యలు తీసుకోవాలని పౌలు నిర్దేశించాడు. అక్రమముగా నడుచుకొనే వారిని పెద్దలు మందలించిన తర్వాత లేక ఉపదేశించిన తర్వాత ఈ చర్యలు వస్తాయి. పౌలు ఇలా వ్రాశాడు:

“సహోదరులారా, మావలన పొందిన బోధన ప్రకారముకాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్దనుండి తొలగిపోవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. సహోదరులారా, మీరైతే మేలుచేయుటలో విసుకవద్దు. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని యెడల అతనిని కనిపెట్టి, అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి. అయనను అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి.”—2 థెస్సలొనీకయులు 3:6, 13-15.

కాబట్టి తర్వాతి చర్యల్లో, అక్రమముగా నడుచుకొనే వారి నుండి తొలగిపోవటం, వారిని కనిపెట్టి ఉండటం, వారితో సహవసించక పోవటం, అయినప్పటికీ వారిని సహోదరులుగానే హెచ్చరించడం ఇమిడివున్నాయి. ఆ చర్యలు తీసుకోవడానికి సంఘంలోని సభ్యులను ఏది నడిపిస్తుంది? దీన్ని స్పష్టం చేసేందుకు గాను, పౌలు కేంద్రీకరించని మూడు పరిస్థితులను మనం పరిశీలిద్దాము.

1. క్రైస్తవులు అపరిపూర్ణులని, వారికి బలహీనతలుంటాయని మనకు తెలుసు. అయినప్పటికీ, ప్రేమ నిజక్రైస్తవత్వానికి చిహ్నం, కాబట్టి మనం ఇతరుల పొరపాట్లను అర్థం చేసుకుని క్షమించేవారిగా ఉండాలి. ఉదాహరణకు, బర్నబా పౌలుల మధ్య జరిగినట్లుగా ఒక క్రైస్తవుడు విపరీతమైన ఆగ్రహాన్ని ఎప్పుడో ఒకసారి అరుదుగా వెళ్లగ్రక్కవచ్చు. (అపొస్తలుల కార్యములు 15:36-40) లేదా అలిసిపోయి ఉండటం వల్ల ఒక వ్యక్తి కఠినంగా, గాయపర్చే విధంగా మాట్లాడవచ్చు. అలాంటి సందర్భాల్లో, ప్రేమను ప్రదర్శించడం ద్వారా, బైబిలు ఉపదేశాన్ని అన్వయించుకోవడం ద్వారా మనం తప్పును కప్పిపుచ్చి, తోటి క్రైస్తవులతో కలిసి జీవించడంలో, సహవసించడంలో, పనిచేయడంలో కొనసాగవచ్చు. (మత్తయి 5:23-25; 6:14; 7:1-5; 1 పేతురు 4:8) రెండవ థెస్సలొనీకయులకు వ్రాసిన పత్రికలో పౌలు వ్యవహరిస్తున్న పొరపాట్లు ఈ విధమైనవి కావని స్పష్టమౌతుంది.

2. ఉదాహరణకు, వినోదంపైనా లేక వస్తుసంబంధమైన వాటిపైనా ఎక్కువగా అవధానాన్ని ఉంచుతున్నట్లుగా ఉన్న, మంచి మార్గాలులేని లేక మంచి దృక్పథాలులేని వ్యక్తితో తన సహవాసాన్ని పరిమితం చేసుకోవాలని ఒక క్రైస్తవుడు వ్యక్తిగతంగా ఎంపికచేసుకునే పరిస్థితి గురించి పౌలు ప్రస్తావించడంలేదు. లేక తల్లిదండ్రుల అధికారాన్ని ధిక్కరించే లేదా మోటుగా లేక ప్రమాదకరమైన విధంగా ఆటలాడే, లేదా క్రైస్తవత్వాన్ని గంభీరంగా తీసుకోని పిల్లలతో ఒక తల్లి లేక తండ్రి తన పిల్లల సహవాసాన్ని పరిమితం చేయవచ్చు. అలాంటివి, “జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును” అని సామెతలు 13:20 నందు మనం చదివే దానికి అనుగుణ్యంగా తీసుకునే వ్యక్తిగత నిర్ణయాలు మాత్రమే.—పోల్చండి, 1 కొరింథీయులు 15:33.

3. మరింత భిన్నమైన స్థాయిలో, ఘోరమైన పాపాన్ని చేస్తూ, పశ్చాత్తాపపడని వ్యక్తి గురించి పౌలు కొరింథీయులకు వ్రాశాడు. పశ్చాత్తాపంలేని అలాంటి పాపులు సంఘం నుండి వెలివేయబడాలి. ఒక విధంగా చెప్పాలంటే, ‘దుష్టుడు’ సాతానుకు అప్పగించబడాలి. ఆ తర్వాత, నమ్మకమైన క్రైస్తవులు ఇక అలాంటి దుష్టులతో కలవకూడదు; చివరికి వారికి వందనం కూడా చెప్పవద్దని అపొస్తలుడైన యోహాను క్రైస్తవులకు ఉద్బోధించాడు. (1 కొరింథీయులు 5:1-13; 2 యోహాను 9-11) అయితే, ఇది కూడా 2 థెస్సలొనీకయులు 3:14 నందివ్వబడిన ఉపదేశంతో సరిపోవడంలేదు.

థెస్సలొనీకయులకు వ్రాసిన రెండవ పత్రికలో చర్చించబడినది “అక్రమముగా నడుచుకొనే” వారిని గురించినది, పై మూడు పరిస్థితుల నుండి భిన్నమైనది. వీళ్లు ఇంకా ‘సహోదరులేననీ’, సహోదరుల్లానే వాళ్లను గద్దించాలనీ, సహోదరులతో వ్యవహరించినట్లే వాళ్లతో వ్యవహరించాలనీ పౌలు వ్రాశాడు. కాబట్టి, “అక్రమముగా నడుచుకొనే” సహోదరులతో సమస్య క్రైస్తవుల మధ్యనున్న కేవలం వ్యక్తిగత విషయమూ కాదు, లేదా కొరింథులోని అవినీతికరమైన పరిస్థితికి సంబంధించి పౌలు చేసినట్లుగా సంఘ పెద్దలు చొరవ తీసుకుని బహిష్కరించవలసినంత గంభీరమైన చర్యా కాదు. కొరింథులోని బహిష్కరించబడిన వ్యక్తిలా, ‘అక్రమముగా నడుచుకునేవారు‘ ఘోరమైన పాపం చేసిన తప్పిదస్థులు కాదు.

థెస్సలొనీకయలోని ‘అక్రమముగా నడుచుకొనేవారు’ క్రైస్తవత్వం నుండి చెప్పుకోదగినంత దూరం వెళ్లిపోయిన తప్పిదస్థులు. వాళ్లు పని చేయరు, దానికి కారణం బహుశా క్రీస్తు రాకడ సమీపంలో ఉందని వాళ్లు భావించటం కావచ్చు లేదా బద్దకం అయినా కావచ్చు. అంతేగాక, వాళ్లు ‘తమకు సంబంధించని దానిలో జోక్యం చేసుకోవడం’ ద్వారా చెప్పుకోదగినంత ఆందోళనను కలిగిస్తున్నారు. పౌలు మొదటి ఉత్తరంలో ఇచ్చిన ఉపదేశం అనుసారంగా, ఇతర దైవిక ఉపదేశం అనుసారంగా బహుశా సంఘ పెద్దలు వారికి తరచుగా ఉపదేశం ఇచ్చివుండవచ్చు. (సామెతలు 6:6-11; 10:4, 5; 12:11, 24; 24:30-34) అయినప్పటికీ, వాళ్లు సంఘం మీదకు నింద తీసుకువచ్చే విధానాన్ని, ఇతర క్రైస్తవులకు వ్యాపించగల విధానాన్ని అవలంబిస్తూనే ఉన్నారు. కాబట్టి క్రైస్తవ పెద్ద అయిన పౌలు, వ్యక్తుల పేర్లను ఉపయోగించకుండా, వారి తప్పుడు విధానాన్ని బయల్పరుస్తూ బహిరంగంగా వాళ్ల అక్రమ ప్రవర్తనవైపుకు అవధానాన్ని మళ్లించాడు.

క్రైస్తవులుగా వారు వ్యక్తిగతంగా, అక్రమంగా నడుచుకొనే వారిని “కనిపెట్టి” ఉండటం సముచితమని సంఘం తెలుసుకునేలా కూడా ఆయన చేశాడు. సంఘం బహిరంగంగా ఎటువంటి చర్యల గురించైతే హెచ్చరించబడిందో ఆ చర్యలను ఎవరు చేస్తున్నారో వారిని వ్యక్తులు గమనించుకోవాలని కూడా ఇది సూచిస్తుంది. వాళ్లు ‘అక్రమంగా నడుచుకుంటున్న ప్రతి సహోదరుని నుండి తొలగిపోవాలని’ పౌలు వారికి ఆదేశించాడు. అంటే దాని భావం, ఆ వ్యక్తిని పూర్తిగా త్యజించాలని ఎంతమాత్రం కాదు, ఎందుకంటే వాళ్లను ‘సహోదరులుగా భావించి బుద్ధి చెప్పడంలో’ కొనసాగాలి. వాళ్లు కూటాల్లోనూ, బహుశ పరిచర్యలోనూ క్రైస్తవ సహవాసాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. తమ సహోదరుడు ఉపదేశానికి ప్రతిస్పందించి, కలతపరిచే తన మార్గాలను మార్చుకుంటాడని వాళ్లు నిరీక్షించవచ్చు.

మరి ఏ భావంలో వాళ్లు ఆయన నుండి ‘తొలగిపోవాలి’? సామాజిక సందర్భాల్లో అలా తొలగిపోవాలని స్పష్టమౌతుంది. (పోల్చండి గలతీయులు 2:12.) సామాజిక వ్యవహారాల్లోనూ, వినోదంలోనూ ఆయనతో కలవకపోవడం, కట్టుబాట్లు ఉన్న ప్రజలు తన మార్గాలను ఇష్టపడటం లేదని ఆయనకు చూపిస్తుంది. అయినా ఆయన సిగ్గుపడి మారకపోయినప్పటికీ, కనీసం ఇతరులు ఆయన మార్గాలను నేర్చుకుని ఆయనలా తయారయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. అదే సమయంలో, ఈ క్రైస్తవులు ప్రోత్సాహకరమైన విషయాలపైన అవధానాన్ని నిలపాలి. పౌలు వారికిలా ఉపదేశించాడు: “సహోదరులారా, మీరైతే మేలుచేయుటలో విసుకవద్దు.”—2 థెస్సలొనీకయులు 3:13.

అపొస్తలుడిచ్చిన ఈ ఉపదేశం, చిన్న చిన్న పొరపాట్లు లేక తప్పులు చేసే మన సహోదరులను చిన్నచూపు చూడటానికి లేక వారికి తీర్పుతీర్చటానికి ఆధారం కాదని స్పష్టమౌతుంది. బదులుగా, క్రైస్తవత్వాన్ని పూర్తిగా వ్యతిరేకించేలాంటి కలవరపరిచే మార్గాన్ని చేపట్టేవారికి సహాయం చేయాలన్నదే దాని ఉద్దేశ్యం.

ఏదో సంక్లిష్టమైన విధానాన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా పౌలు వివరమైన సూత్రాలను నెలకొల్పలేదు. కాని అక్రమంగా నడుచుకుంటున్న వ్యక్తికి పెద్దలు మొదట ఉపదేశం ఇచ్చి సహాయం చేయడానికి ప్రయత్నించాలని స్పష్టమౌతుంది. వాళ్లు విజయవంతం కాలేకపోయి, ఆ వ్యక్తి కలవరపరిచే తన మార్గంలో అలాగే కొనసాగుతున్నట్లయితే, అది అలా వ్యాప్తిచెందే అవకాశమున్నట్లయితే, సంఘాన్ని హెచ్చరించవలసిన అవసరం ఉన్నట్లు వాళ్లు భావించవచ్చు. అలాంటి అక్రమ నడతను ఎందుకు విసర్జించాలనే విషయం పైన వాళ్లు ప్రసంగం ఇవ్వడానికి ఏర్పాటు చేయవచ్చు. వాళ్లు పేర్లు చెప్పరు, గాని వాళ్లిచ్చే హెచ్చరికా ప్రసంగం సంఘాన్ని కాపాడటానికి సహాయం చేస్తుంది, ఎందుకంటే దానికి ప్రతిస్పందించేవారు, అలాంటి అక్రమ నడతను స్పష్టంగా చూపించే ఎవరైనా ఉంటే వారితో సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనడంలో పరిమితంగా ఉండేందుకు అదనపు జాగ్రత్త తీసుకుంటారు.

అక్రమంగా నడుచుకుంటున్న వ్యక్తి కొంతకాలానికి తన మార్గాల గురించి సిగ్గుపడి మారడానికి పురికొల్పబడతాడని నిరీక్షించబడుతుంది. పెద్దలు, సంఘంలోని ఇతరులు మార్పును చూసినప్పుడు, అతనితో సామాజిక విషయాల్లో, కలిసిమెలిసి ఉండటం విషయంలో ఏర్పరచుకున్న పరిధులను తొలగించడానికి వాళ్లు వ్యక్తిగతంగా నిర్ణయించుకోవచ్చు.

కాబట్టి సంక్షిప్తంగా చెప్పాలంటే: ఎవరైనా అక్రమంగా నడుచుకుంటున్నట్లయితే వారికి సహాయం చేయడంలోనూ, ఉపదేశం ఇవ్వడంలోనూ సంఘ పెద్దలు నాయకత్వం వహిస్తారు. ఆ వ్యక్తి తన ప్రవర్తనలోని పొరపాటును గ్రహించకుండా అనారోగ్యకరమైన ప్రభావం చూపిస్తూనే ఉంటే, అవిశ్వాసులతో డేటింగ్‌ చేయడం గురించైనా లేక తప్పుడు ప్రవర్తన ఏదైనప్పటికీ దాని గురించైనా పెద్దలు ఒక ప్రసంగాన్ని ఇవ్వడం ద్వారా బైబిలు దృక్పథాన్ని స్పష్టం చేస్తారు. (1 కొరింథీయులు 7:39; 2 కొరింథీయులు 6:14) అలా హెచ్చరించబడిన సంఘంలోని క్రైస్తవులు, స్పష్టంగా చెడు ప్రవర్తనలో కొనసాగుతున్నప్పటికీ సహోదరులుగానే ఉన్న వారితో సహవాసం చేయడాన్ని పరిమితం చేయాలని వ్యక్తిగతంగా నిర్ణయించుకోవచ్చు.

[అధస్సూచీలు]

a ఈ గ్రీకు పదం, క్రమం ప్రకారం నడుచుకోని లేదా క్రమశిక్షణ కలిగిలేని సైనికులను ఉద్దేశించి, అలాగే తరగతులకు హాజరుకాకుండా బడి ఎగ్గొట్టే విద్యార్థులను ఉద్దేశించి ఉపయోగించబడేది.

[31వ పేజీలోని చిత్రం]

క్రైస్తవ పెద్దలు అక్రమముగా నడుచుకునేవారికి ఉపదేశమిస్తారు అయినప్పటికీ వారిని తమ తోటి విశ్వాసులుగానే దృష్టిస్తారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి