గర్వానికి చెల్లించవలసిన మూల్యం—ఎంతెక్కువ?
మీరు అల్పులైనవారని భావించేలా ఉద్దేశపూర్వకంగా ప్రవర్తించే వాళ్లతో మీరెప్పుడైనా వ్యవహరించారా? బహుశా ఒక మేనేజర్ కానీ, ఒక అధికారి కానీ, ఒక సూపర్వైజర్కానీ, లేదా మీ బంధువుల్లో ఎవరైనా మిమ్మల్ని తమ కంటే తక్కువ స్థానంలో ఉన్న వ్యక్తిగా, తమ హోదాకు సరితూగని వ్యక్తిగా మిమ్మల్ని చులకన చేశారా? ఆ వ్యక్తిని గురించి మీరు ఎలా భావిస్తారు? అతని వ్యక్తిత్వం మిమ్మల్ని ఆకర్షిస్తుందా? ఖచ్చితంగా కాదు! ఎందుకని? ఎందుకంటే, గర్వం మీరు అతనితో అరమరికలు లేకుండా సంభాషించడానికి అవరోధాలను, ఆటంకాలను ఉత్పన్నం చేస్తుంది.
గర్వం గల ఒక పురుషుడైనా స్త్రీ అయినా, తాము ఎల్లప్పుడూ ఇతరులకన్నా గొప్పవారిగా కనబడడానికి గాను ఇతరులనందర్నీ తక్కువచేస్తూ ప్రవర్తిస్తుంటారు. అలాంటి దృక్పథం ఉన్న వ్యక్తి ఇతరులను గూర్చి చాలా అరుదుగా మాత్రమే మంచిగా మాట్లాడతాడు. ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రతికూల వ్యాఖ్యానం ఉంటూనే ఉంటుంది—“సరే, అది నిజమే కావచ్చు, కానీ అతనిలో ఆ పొరబాట్లు ఉన్నాయి, లేదా ఈ లోపాలు ఉన్నాయి.”
వెండి మాటల్లో బంగారపు ఆలోచనలు (ఆంగ్లం) అనే పుస్తకం గర్వాన్ని ఇలా నిర్వచించింది, “గర్వమనేది ఎప్పుడూ మనల్ని ఓటమికి గురి చేసే ఒక చెడ్డ లక్షణం. ఇది ఒక వ్యక్తిని అప్రతిష్ఠపాలు చేస్తుంది, అతనిలో మనం మెచ్చుకోవడానికి ఏమీ లేని వానిగా అతడ్ని చేస్తుంది.” ఒక గర్విష్టి చుట్టుప్రక్కల ఉండడమే ఇబ్బందికరమని ఇతరులు భావించడంలో ఆశ్చర్యమేమైనా ఉందా? నిజానికి, గర్వానికి చెల్లించవలసిన మూల్యం ఎంతంటే, అది తరచూ నిజ స్నేహితుల కొరతే. అదే పుస్తకం ఇంకా ఇలా చెబుతుంది, “దీనికి భిన్నంగా, ప్రజలు వినయం గలవారిని ప్రేమిస్తారు—వినయాన్ని కల్గి ఉన్నామని గర్వపడేవారిని కాదు, నిజంగా వినయాన్ని కల్గి ఉన్నవారిని ప్రేమిస్తారు.” తగిన విధంగానే, బైబిలు ఇలా వర్ణిస్తుంది: “ఒకని గర్వం వానికి అవమానాన్ని తెస్తుంది, వినయస్థులు ఘనతను గెల్చుకుంటారు.”—సామెతలు 29:23, ది జెరూసలేమ్ బైబిల్.
మనుష్యులతో స్నేహంపైనా, వారినుండి లభించే ఘనతపైనా గర్వం చూపించే ప్రభావంకన్నా ప్రాముఖ్యమైన విషయం, దేవునితో ఒకరికి గల సంబంధాన్ని గర్వం ఎలా ప్రభావితం చేస్తుంది? గర్విష్టులను, అహంకారులను, దుర్మదాంధులను దేవుడు ఎలా దృష్టిస్తాడు? గర్వం లేదా నమ్రత—దేవునికి నిజంగా అంత ప్రాముఖ్యమైన విషయాలా?
నమ్రత విషయంలో ఒక పాఠం
సామెతల ప్రేరేపిత గ్రంథకర్త ఇలా చెప్పాడు: “నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును. గర్విష్ఠులతో దోపుడుసొమ్ము పంచుకొనుటకంటె దీనమనస్సు కలిగి దీనులతో పొత్తుచేయుట మేలు.” (సామెతలు 16:18, 19) ఈ మాటల్లో దాగివున్న విజ్ఞత ఇశ్రాయేలీయుల ప్రవక్తయైన ఎలీషా కాలంలో జీవించిన సిరియా సైన్యాధికారియైన నయమాను విషయంలో వెల్లడియైంది.
నయమాను ఒక కుష్ఠురోగి. తన రోగనివారణ కోసం జరిపిన అన్వేషణలో అతడు ఎలీషాతో ముఖాముఖి కలవడానికి షోమ్రోనుకు ప్రయాణమయ్యాడు. ఈ ప్రవక్త నయమానును వ్యక్తిగతంగా కలవడానికి బదులుగా, ఏడుసార్లు యొర్దాను నదిలో స్నానం చేయమని తన సేవకుని ద్వారా ఆదేశాన్ని పంపించాడు. తనతో వ్యవహరించిన విధానానికి, ఇవ్వబడిన సలహాకు నయమాను అవమానకరంగా భావించాడు. ప్రవక్త బయటికి వచ్చి తనతో వ్యక్తిగతంగా మాట్లాడడానికి బదులుగా, తన సేవకుడ్ని ఎందుకు పంపించాడు? నిశ్చయంగా, యొర్దాను నది సిరియాలోని ఏ నదితోనైనా సాటియా! గర్వం అతని సమస్య. దాని ఫలితం? సంతోషకరమైన విషయం ఏమిటంటే, ఒక జ్ఞానంతో కూడిన సలహా చేత ఆయన ఒప్పించబడ్డాడు. “అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో ఏడు మారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహమువలెనై అతడు శుద్ధుడాయెను.”—2 రాజులు 5:14.
కొన్నిసార్లు కాస్త నమ్రతను ప్రదర్శించడం మూలంగా ఎంతో గొప్ప ప్రయోజనాలను పొందుతాము.
అహంకారానికి చెల్లించవలసిన మూల్యం
గర్వం తనకు చెల్లించవలసిన మూల్యాన్ని మన నుండి బలవంతంగా గుంజుతుంది. అది కొన్నిసార్లు కేవలం ఏదో ప్రయోజనాన్ని గాని లేదా లాభాన్ని గానీ పోగొట్టుకోవడమే కాదు. గర్వంలో మరొక స్థాయి ఈవ్రిస్ అనే గ్రీకు పదంలో ఇమిడివుంది. గ్రీకు విద్వాంసుడైన విలియం బార్క్లే ప్రకారం, “ఈవ్రిస్ అంటే గర్వం, క్రూరత్వాల కలయిక . . . , అది ఒకవ్యక్తి తన పొరుగువారి హృదయాలను కాళ్లక్రింద అణగద్రొక్కేలా చేసే తృణీకార పూర్వకమైన అహంకారం.”
ఈ అతిగర్వానికి స్పష్టమైన ఉదాహరణ ఒకటి బైబిలులో కన్పిస్తుంది. అది అమ్మోను రాజైన హానూను విషయం. లేఖనాలపై అంతర్దృష్టి (ఆంగ్లం) ఆ వృత్తాంతాన్ని ఇలా వివరిస్తుంది: “నాహాషు తనపట్ల చూపిన కృప మూలంగా ఆయన చనిపోయినప్పుడు దావీదు ఆయన కుమారుడైన అమ్మోను రాజైన హానూనును ఓదార్చడానికై తన సేవకులను పంపించాడు. అయితే, దావీదు తన సేవకులను పంపించడంలో ఏదో మోసపూరితమైన ఆలోచన ఉందని అంటే, నగరాన్ని వేగు చూడడానికే పంపించాడని తన అధిపతుల చేత ఒప్పించబడ్డాడు. కాబట్టి హానూను దావీదు సేవకుల గడ్డాలను సగం వరకు గొరిగించి, వారి బట్టలను నడిమికి పిరుదుల వరకు కత్తిరించి వారిని అవమానించాడు.”a ఈ సంఘటనను బట్టి బార్క్లే ఇలా వ్యాఖ్యానించాడు: “ఇలా వ్యవహరించిన విధమే ఈవ్రిస్. ఇందులో అవమానించడం, దౌర్జన్యం చేయడం, బహిరంగంగా సిగ్గుపర్చడం ఇమిడి ఉన్నాయి.”—2 సమూయేలు 10:1-5.
అవును, గర్వం గల వ్యక్తి ఇతరులతో నీచంగా మాట్లాడడం, ప్రవర్తించడం, అలాగే చులకన చేసేవాడై ఉంటాడు. అతడు చాలా చల్లగా, ఎదుటివారిని సూటీపోటీ మాటలతో కించపరుస్తూ, ఇతరులకు ఇబ్బంది కల్గిస్తూ, వారికి తలవంపులు తెస్తూ మహదానందం అనుభవిస్తాడు. కానీ ఒకరి ఆత్మ గౌరవంపై దెబ్బ కొట్టడం లేదా నాశనం చేయడమన్నది రెండు వైపుల అంచు ఉన్న పదునైన ఖడ్గం వంటిది. దాని ఫలితం స్నేహాన్ని కోల్పోవడమే కాదు, శత్రువుల్ని కూడా సంపాదించిపెడ్తుంది.
‘తన వలె తన పొరుగువారిని ప్రేమించాలని’ తన బోధకుని చేత ఆజ్ఞాపించబడిన ఏ నిజ క్రైస్తవుడైనా అటువంటి హానికరమైన గర్వాన్ని ఎలా ప్రదర్శించగలడు? (మత్తయి 7:12; 22:39) స్పష్టంగా దేవుడు, క్రీస్తు వేటికైతే ఉదాహరణగా ఉన్నారో వాటన్నిటికీ ఇది పూర్తి విరుద్ధం. దీని సంబంధంగా, ఇటువంటి “గర్వం ఒక వ్యక్తి దేవుణ్ని ధిక్కరించేలా చేస్తుంది” అని బార్క్లే గంభీరపూర్వకమైన వ్యాఖ్యానాన్ని చేస్తున్నాడు. ‘యెహోవా లేడు’ అని చెప్పే గర్వం అది. (కీర్తనలు 14:1) లేదా కీర్తనలు 10:4 తెలియజేస్తున్నట్లుగా, “దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకొందురు దేవుడు లేడని వారెల్లప్పుడు యోచించుదురు.” ఇటువంటి గర్వం లేదా అహంకారం కేవలం స్నేహితులనుండి, బంధువులనుండి మాత్రమే గాక దేవుని నుండి కూడా ఒకరిని దూరం చేస్తుంది. దీని కోసం ఎంతటి మూల్యాన్ని చెల్లించవలసి వస్తుందో కదా!
గర్వం మిమ్మల్ని మ్రింగివేసేలా అనుమతించకండి
గర్వం అనేక ముఖాలను కల్గి ఉంది—గర్వం అనేది జాతీయతా భావం నుండి, జాత్యహంకారం నుండి, సామాజిక తరగతుల నుండి, కుల విభేదాల నుండి, విద్య, ఐశ్వర్యం, పలుకుబడి, అధికారాల నుండి పుడుతుంది. అలా గర్వం ఒక మార్గంలో గానీ, లేదా మరొక మార్గంలో గానీ మీలోకి చాలా సులభంగా ప్రాకి పోతుంది, అలాగే మీ వ్యక్తిత్వాన్ని కూడా క్షీణింపజేస్తుంది.
అనేకమంది అధికారులతోను, తోటి వ్యక్తులతోను వ్యవహరించేటప్పుడు చాలా నమ్రతగా ఉన్నట్లు కనిపిస్తారు. కానీ, అలా నమ్రత గల వ్యక్తిగా కన్పించే వ్యక్తి అధికారంలోకి వెళ్ళినప్పుడు నిజానికి సంభవించేదేమిటి? హఠాత్తుగా, అతడు నిరంకుశుడుగా మారిపోతాడు, ఇతరులు తన కంటే తక్కువ వారని తాను భావించి వారి జీవితాలను దుఃఖ సాగరంలో ముంచేస్తాడు! తమ అధికారాన్ని సూచించే యూనిఫామ్ లేదా బ్యాడ్జ్‌ని ధరించినప్పుడు బహుశా ఇది సంభవించవచ్చు. ప్రభుత్వోద్యోగులు కూడా ప్రజలతో తమ వ్యవహారంలో గర్వాన్ని చూపుతారు, తాము ప్రజలకు సేవకులన్న వాస్తవాన్ని మరచి ప్రజలే తమ సేవకులని వారు భావిస్తారు. గర్వం మిమ్మల్ని జాలి లేని, కఠినమైన వారిగా చేస్తుంది; అయితే నమ్రత మిమ్మల్ని దయ గలవారిగా చేస్తుంది.
యేసు తన శిష్యులతో గర్వంగాను, కఠినంగాను ఉండగలిగేవాడే. ఆయన పరిపూర్ణ మానవుడు దేవుని కుమారుడు, అపరిపూర్ణ, అనాలోచిత, తొందరపాటుగల అనుచరులతో వ్యవహరించాడు. అయినప్పటికీ, ఆయన ప్రజలకు ఎటువంటి ఆహ్వానాన్ని ఇచ్చాడు? “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.”—మత్తయి 11:28-30.
యేసు మాదిరిని అనుసరించడానికి మనం ఎల్లప్పుడు ప్రయత్నిస్తామా? లేక మీకే మీరు క్రూరులుగాను, లొంగనివారుగాను, నిరంకుశులుగాను, కనికరం లేనివారిగాను, గర్విష్ఠులుగాను ఉన్నట్లు మీకనిపిస్తోందా? ఇతరులను అణచివేసేవారిగా కాక, యేసు వలె ఇతరులకు సేదదీర్పును ఇచ్చేవారిగా ఉండడానికి ప్రయత్నించండి. మనల్ని మ్రింగివేసే గర్వపు ప్రభావానికి అడ్డుకట్టలు వేసుకోండి.
ఆత్మ-గౌరవానికి విరుద్ధంగా స్వాతిశయం
గర్వానికి సంబంధించినదే, కానీ ఒక అనుకూలమైన/మంచి లక్షణం సహేతుకమైన, న్యాయయుక్తమైన ఆత్మ-గౌరవం. ఆత్మ-గౌరవం అంటే మీరంటే మీకు గౌరవం ఉండడం. ఇతరులు మిమ్మల్ని గూర్చి ఏమని భావిస్తున్నారన్న దానిపై శ్రద్ధను కల్గి ఉన్నారని దానర్థం. అప్పుడు మీరు కనబడే రీతికి, మీకున్న పేరుకు శ్రద్ధనిస్తారు. “నీవు ఎవరితో నడుస్తున్నావో చెప్పు, నీవు ఎటువంటి వ్యక్తివో నేను చెబుతాను” అన్న స్పానిష్ సామెత సత్యం. నిర్లక్ష్య స్వభావం గలవారితో, బద్ధకస్థులతో, సత్ప్రవర్తన లేనివారితో, అసహ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించే ప్రజలతో కలిసి ఉండాలని మీరనుకొన్నట్లయితే, తర్వాత మీరు వారిలా అవుతారు. వారి ఆలోచనా విధానం మీలోకి బదిలీ అయ్యి మీరు వారిలా అవుతారు, అప్పుడు మీలో ఆత్మ-గౌరవం కొరవడుతుంది.
యేసు కాలంలో ఈ సంబంధంగా మరో అతివాదం ఉంది. యేసు కాలంలోని శాస్త్రులు, పరిసయ్యులు తమ పారంపర్యాచారాల విషయంలోను, తమ అతిమతభక్తిని ప్రదర్శించడంలోను గర్వాన్ని కల్గి ఉండేవారు. యేసు వారిని గూర్చి ఇలా హెచ్చరించాడు: “మనుష్యులకు కనబడునిమిత్తము తమ పనులన్నియు చేయుదురు; తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు; విందులలో అగ్రస్థానములను సమాజ మందిరములలో అగ్రపీఠములను సంత వీధులలో వందనములను మనుష్యులచేత బోధకులని పిలువబడుటయు కోరుదురు.”—మత్తయి 23:5-7.
కాబట్టి, కావాల్సిందేమిటంటే సమతుల్యతగల దృక్పథం. యెహోవా హృదయాన్ని చూస్తాడు కానీ, కేవలం బయట కన్పించేది మాత్రమే కాదని కూడా గుర్తుంచుకోండి. (1 సమూయేలు 16:7; యిర్మీయా 17:10) స్వనీతి దేవుని తరహా నీతి కాదు. అయితే, ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, మనమెలా నిజమైన నమ్రతను అలవర్చుకోగలం, గర్వానికి చెల్లించాల్సివచ్చే అత్యధిక మూల్యంనుండి ఎలా తప్పించుకోవచ్చు?
[అధస్సూచీలు]
a వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ వారిచే ప్రచురించబడింది.
[4వ పేజీలోని చిత్రం]
కాస్తంత నమ్రత నయమానుకు గొప్ప ప్రయోజనాలను తెచ్చింది