‘దేవదారు వృక్షమువలె ఎదుగుదురు’
అందమైన లెబానోను పర్వతాలపై పెరిగే వృక్షాలు ఆర్జ్ ఆరాబ్ అని పిలువబడతాయి. “ప్రభువు యొక్క దేవదారు వృక్షములు” అని దాని భావం. ఈ వృక్షాలు ఈ పర్వతాలపై పచ్చని తివాచి పరచినట్లు కనిపిస్తాయి. అత్యంతాకర్షణీయంగా నిత్యం పచ్చదనంతో ఉండే ఈ వృక్షాల గురించి బైబిలులో ఇంచుమించు 70 సార్లు పేర్కొనబడింది. బైబిలులో మరే వృక్షం కన్నా ఈ వృక్షం గురించే ఎక్కువగా చెప్పబడింది.
లెబానోనుపై ఠీవిగా నిటారుగా కనిపించే దేవదారు వృక్షాలను వర్ణించేందుకు లేఖనాలు “శ్రేష్ఠమైన,” “రాచఠీవిగల” అనే పదాలను ఉపయోగించాయి. (పరమగీతము 5:15; యెహెజ్కేలు 17:23, NW) దేవదారు వృక్షం చాలా పెద్దగా ఉంటుంది గనుక, దాని కలప మన్నికైనదిగా ఉంటుంది గనుక, ఇండ్ల, ఓడల నిర్మాణంలో, కలప సామానుల తయారీలో ఈ కలప పేరెన్నికగంది. ఈ కలపకున్న గుబాళింపూ, దీని ఉజ్జ్వలమైన ఎరుపు రంగూ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. దీనిలో బాగా ఎక్కువ పాళ్ళలో ఉండే జిగురు కలప పాడైపోకుండా, క్రిమికీటకాలు పట్టకుండా ఉండేలా చేస్తుంది. ఈ వృక్షాలు చాలా ఎత్తుగా, పెద్దవిగా ఉంటాయి. దీని ఎత్తు 37 మీటర్ల వరకు ఉంటుంది, చుట్టుకొలత 12 మీటర్ల వరకు ఉంటుంది. వాటి వేళ్ళు చాలా లోతుకు వెళ్తాయి, దృఢంగా ఉంటాయి. అందుకే, ఆధునిక అటవీకరణలో తర్ఫీదు పొందినవాళ్ళు వాటిని “మొక్కల ప్రపంచంలో మకుటాయమానమైన శోభగలవి” అని పిలిచారు!
బైబిలు రచయితయైన యెహెజ్కేలు మెస్సీయను దేవదారు వృక్షపు పైకొమ్మగా, దేవుడే తీసి నాటే పైకొమ్మగా ప్రవచనార్థకంగా పోల్చాడు. (యెహెజ్కేలు 17:22) వాస్తవానికి, “దేవదారు” అనే పదానికి హెబ్రీ భాషలో ఉన్న పదం యొక్క మూలార్థం “గట్టిగా ఉండడం” అన్నదే. ఎత్తుగా, దేనినైనా తాళుకుని నిలబడగల దేవదారు వృక్షంలాగే, మెస్సీయయైన యేసుక్రీస్తు అనుచరులు కూడా నేడు “విశ్వాసమందు నిలుకడగా . . . బలవంతులై యుండ” వలసిన అవసరముంది. (1 కొరింథీయులు 16:13) అలా ఉండడం ఎలా సాధ్యం? క్రైస్తవ విశ్వాసానికి విరుద్ధమైన ప్రభావాలను స్థిరంగా ఎదిరించడం ద్వారా, యథార్థతతో, దైవభక్తితో కూడిన జీవన మార్గంలో సహనంతో ముందుకు సాగిపోవడం ద్వారా అలా చేయవచ్చు. అలా చేసేవారిని గురించి, ‘నీతిమంతులు . . . దేవదారు వృక్షమువలె ఎదుగుదురు’ అని బైబిలు వర్ణిస్తుంది.—కీర్తన 92:12.