విశ్వాసం ఉందని అనేకులు చెప్పుకుంటారు
“యేసు అభినందించదగ్గవాడు! ఆశ్చర్యకరుడు!” అని బ్రెజిల్‌లోని ఒక మతవిశ్వాసి అంటుంది. నిజానికి యేసు పేరుకున్న శక్తిని ఎవరూ కాదనడం లేదు. చరిత్రంతటిలోనూ, ప్రజలు ఆయన కోసం ఇష్టపూర్వకంగా కష్టాలను అనుభవించారు, ఆయన కోసం చనిపోయారు కూడా.
అపొస్తలులైన పేతురు, యోహానులు యెరూషలేములో ‘యేసు నామమున’ బోధించారు. వాళ్ళు అలా చేసినందువల్ల, వాళ్ళను బంధించారు, కొరడాదెబ్బలు కొట్టారు. అయినప్పటికీ, “ఆ నామముకొరకు అవమానము పొందుటకు పాత్రులని యెంచబడినందున వారు సంతోషించుచు మహా సభయెదుటనుండి వెళ్లిపోయ[రి].”—అపొస్తలుల కార్యములు 5:28, 41.
యేసు పేరుకు గౌరవాన్నిచ్చిన మరొక తొలిశతాబ్దపు క్రైస్తవుడు అంతిపయ. బైబిలులో చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథంలో, ఆయనను గురించి, “సాతాను కాపురమున్న ఆ స్థలములో, నాయందు విశ్వాసియైయుండి నన్నుగూర్చి సాక్షియైన అంతిపయనువాడు మీ మధ్యను చంపబ[డ్డాడు]” అని యేసు చెప్పాడు. (ప్రకటన 2:13) పెర్గములోని ఇతర క్రైస్తవులతోపాటు, అంతిపయ కూడా తాను యేసును విశ్వసించడంలేదనడానికి నిరాకరించాడు. ప్రాణాపాయకరమైన పరిస్థితి ఎదురైనప్పటికీ, అంతిపయ యేసు నామాన్ని గట్టిగా హత్తుకున్నాడు!
దాదాపు అర శతాబ్దం తర్వాత, సా.శ. 155లో క్రీస్తును దూషించమని క్రైస్తవుడనని చెప్పుకుంటున్న పోలికార్ప్‌ను ఆజ్ఞాపించినప్పుడు, ఆయన కూడా అలాంటి పరీక్షనే ఎదుర్కొన్నాడు. “నేను ఎనభై ఆరు సంవత్సరాలు ఆయనకు సేవ చేశాను. ఆయన నాకింతవరకూ ఏ కీడూ చేయలేదు. నన్ను రక్షించిన నా రాజును నేనెలా దూషించగలను?” అని ఆయన ప్రతిస్పందించాడు. క్రీస్తును కాదనడానికి నిరాకరించినందుకు, పోలికార్ప్‌ను కొయ్యమీద కాల్చివేశారు.
అపొస్తలులూ, అంతిపయ, మరియు ఇతరులు క్రీస్తును గురించిన తమ సాక్ష్యాన్ని తమ మరణం ద్వారా ధృవీకరించడానికి సహితం సుముఖత చూపించారు! నేటి ప్రజల విషయమేమిటి?
నేడు యేసు పేరు
యేసు పేరు బలమైన భావోద్వేగాలను కలిగించడంలో కొనసాగుతుంది. లాటిన్ అమెరికాలో, యేసును విశ్వసిస్తున్నామని చెప్పుకుంటున్న చర్చీల సంఖ్య ఇటీవలి దశాబ్దాల్లో బాగా పెరిగిపోతోంది. అతి చిన్న గ్రామాల్లో కూడా పెంతెకొస్తు చర్చీలు ఉన్నాయి. అదే సమయంలో, అలాంటి చర్చీలపై రాజకీయ ప్రభావం చాలా ఎక్కువవుతోంది. ఉదాహరణకు, బ్రెజిల్‌లోని ఈ చర్చీల సభ్యులు అక్కడి కాంగ్రెస్ మరియు సెనెట్‌లలో 31 సీట్లను కైవశం చేసుకుని ఉన్నారు.
యేసు అమెరికాలోని ఒక క్రొత్త మతోద్యమానికి కేంద్రబిందువుగా ఉన్నాడు. దాని అనుచరులు తమ గురించి తాము మేం మాట పాటించేవాళ్ళం అని చెప్పుకుంటున్నారు. వాళ్ళ కూటాల్లో హాజరు 1991లో 4,200గా ఉండేదనీ, అది 1996లో 11,00,000లకి పెరిగిందనీ 1997లో టైమ్ మ్యాగజీన్ నివేదించింది. దాని పాటల్లో ఒకటి ఇలా ఉంది: “నా రక్షకుడైన యేసుమీద విజయం సదాకాలం ఉంటుంది.”
అయినప్పటికీ, యేసు పేరట వచ్చే అన్ని భావావేశాలూ ఉన్నతమైనవిగా ఉండటం లేదు. తరచూ యేసు పేరట యుద్ధాలు జరుగుతూ ఆయన పేరుకు అగౌరవాన్ని తెస్తున్నాయి. యూదులు సామూహికంగా హత్యచేయబడ్డారు, మతం మార్చుకోనివారు వధించబడ్డారు, భిన్నమతస్థులు చిత్రవధ చేయబడ్డారు, వాళ్ళ అవయవాలు చేధించబడ్డాయి, మ్రానుపై కాల్చబడ్డారు—ఇవన్నీ యేసు పేరిటే జరిగాయి. ఇంకా ఈ మధ్య కాలంలోనే, సువార్తపనిని వ్యాపారంగా చేసుకోవడం కుప్రసిద్ధిగాంచింది. ఇవన్నీ కూడా యేసు నామాన్ని అనుచితంగా, ఏవగింపు కలిగించే విధంగా దుర్వినియోగం చేయడమే. నిజానికి యేసు నామం దేనికి ప్రాతినిధ్యం వహిస్తుంది !
అంతేకాక, యేసు పేరుమీద విశ్వాసముంచడంలో ఏమి ఇమిడి ఉంది? ఈ విషయంలో యెహోవాసాక్షుల దృక్కోణం ఏమిటి? అనే ప్రశ్నలను ఇది రేకెత్తిస్తుంది. తరువాయి శీర్షిక ఈ ప్రశ్నలకు జవాబిస్తుంది.