రాజ్య ప్రచారకుల నివేదిక
సువార్తను ప్రకటించడానికి వెనుదీయకండి
యూరోపియన్ అన్వేషకులు గల్ఫ్ ఆఫ్ వెనిజులా మరియు లేక్ మరాకాయిబోలను మొదటిసారి సందర్శించినప్పుడు, ఆ తీరం వెంబడి అంతా కూడా లోతులేని నీటిలో పాతిన దూలాలపై చిన్న తడికెలతో కట్టిన గుడిసెలు ఉన్నాయి. ఆ స్థలం ఇటలీలోని వెనిస్ను స్ఫురింపజేస్తుంది. అక్కడి ప్రజలు కూడా నీటి ఒడ్డున ఇండ్లు కట్టుకుని నివసిస్తారు. స్పానిష్ మాట్లాడే అన్వేషకులు అలా ఆ ప్రాంతానికి వెనిజులా అనే పేరు పెట్టారు. వెనిజులా అంటే “చిన్న వెనిస్” అని అర్థం.
నేడు, ఈ అందమైన దేశం మరో రకమైన నిర్మాణ కార్యక్రమాన్ని, ఆధ్యాత్మికమైనదాన్ని ఆదరిస్తోంది. అక్కడ యెహోవాసాక్షులు సముచితమైన ప్రతి సందర్భంలోను రాజ్య విత్తనాలను విత్తడంలో నిమగ్నమై ఉన్నారు. దాని ఫలితంగా వస్తున్న ఆధ్యాత్మిక కోత “కోత యజమాని”యైన యెహోవా దేవునికి ఎంతో స్తుతిని తెస్తుంది.—మత్తయి 9:37, 38.
వాయవ్య వెనిజులాలోని సూల్య అనే స్టేట్‌లోని సంఘాన్ని ఒక ప్రయాణ పైవిచారణకర్త సందర్శించినప్పుడు, స్థానిక సాక్షులు ఆయనా ఆయన భార్యా దగ్గర్లో ఉన్న టోవాస్ అనే దీవిని దర్శించే ఏర్పాట్లు చేశారు. ఆ దీవికి వెళ్ళేందుకు ఉదయాన ఉన్న పడవ కోసం ఎదురు చూస్తుండగా, ప్రయాణ పైవిచారణకర్త భార్య మెరీ తన సహచరురాలైన పయినీరు సహోదరితో బోట్లో పనిచేసే కొందరికి సాక్ష్యమిద్దామా అని అన్నారు. ఆ పయినీర్ సహోదరి అందుకు అంగీకరించారు.
మెరీ ఒక మెకానిక్‌ను సమీపించి, నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకాన్ని అందించారు. “దేవుడ్ని ఘనపర్చే కుటుంబాన్ని కట్టుట” అనే అధ్యాయాన్ని ఆయనకు చూపారు. దానిని ప్రాముఖ్యమైనదిగా ఆయన ఎంచుతాడని అనిపించింది. ఆ ప్రచురణను ఉపయోగించి, ఆయన తన సొంత ఇంట్లోనే బైబిలు పఠనం చేసుకోవచ్చని మెరీ వివరించారు. ఆయన ఆ పుస్తకాన్ని స్వీకరించారు. ఆయనను ఆయన ఇంట్లో కలిసే ఏర్పాట్లు చేశారు.
కొంత కాలం తర్వాత, ఆ ప్రాంతంలో ఏకదిన ప్రత్యేక సమావేశం జరిగింది. సెనోర్ నావా అనే ఆ మెకానిక్‌ను తన భార్యా, ఇద్దరు పాపలతో చూడడం మెరీకి ఆశ్చర్యాన్ని కలిగించింది! మీ కుటుంబ బైబిలు పఠనాన్ని గురించి ఏమనుకుంటున్నారు అని ఆయన భార్యను మెరీ అడిగారు. ఆమె జవాబు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది.
“మేము సత్యాన్ని తెలుసుకోగలిగినందుకు యెహోవాకు కృతజ్ఞతలు తెలుపుతాను” అని ఆమె అన్నారు. “మీరు మా వారితో మాట్లాడారే, అంతకు కొంచెం ముందే ఆయన మరో స్త్రీ కోసం నన్ను వదిలేశారు. ఆయన విపరీతంగా త్రాగేవారు. కొన్నిసార్లు, ఆయన త్రాగినప్పుడు, చాలా బూతులు మాట్లాడేవారు. ఆయన పద్ధతిని ఈ ద్వీపంలోని మా చిన్న సముదాయంలోని వారెవరూ ఇష్టపడరు. ఆయన అభిచారం కూడా అభ్యసించేవారు. అయినప్పటికీ, పఠనం ద్వారా ఆయన పొందిన బైబిలు జ్ఞానం ఆయన జీవితంలో చాలా గొప్ప మార్పులు చేసుకోవడానికి సహాయపడింది. ఆయన తన అశుద్ధమైన అలవాట్లన్నింటినీ మానేశారు. క్యాథలిక్కులు అయిన ఆయన తల్లిదండ్రులు ఈ మార్పులను చూసి చాలా ముగ్ధులయ్యారు. ఆయన ఇప్పుడు బాధ్యత తీసుకునే భర్తగాను, తండ్రిగాను ఉంటున్నందుకు వాళ్ళు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు” అని ఆమె తర్వాత వివరించారు.
సెనోర్ నావా 1996లో బాప్తిస్మం తీసుకున్నారు. ప్రస్తుతం పూర్తికాల పరిచారకుడుగా పనిచేస్తున్నారు. ఆయన భార్య జెనీ 1997లో బాప్తిస్మం తీసుకున్నారు. ఈ బోట్ మెకానిక్లోని మార్పులు చూసిన ఆ పట్టణ మేయర్ ఎంతో ముగ్ధుడై, తనకు కూడా బైబిలు పఠనం కావాలని కోరారు. ఆ ఉదయం పడవ కోసం వరుసలో ఉండి ఎదురు చూస్తున్నప్పుడు సువార్తను ప్రకటించడంలో వెనుకంజవేయనందుకు ఆ సహోదరీలు ఎంత సంతోషించి ఉంటారో!
[7వ పేజీలోని చిత్రం]
బోట్ మెకానిక్‌తో సువార్తను పంచుకోవడం సంతోషకరమైన ఫలితాలను ఇచ్చింది