రాజ్య ప్రచారకుల నివేదిక
ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకోవడం
యెహోవా సాక్షులు తమ బైబిలు విద్యాబోధనా పనిని బట్టి ప్రపంచవ్యాప్తంగా పేరు పొందారు. అయితే సమాజానికి ఇతర ప్రయోజనాల్ని చేకూర్చే కార్యక్రమాలను కూడా వారు చేపడతారు. ఈక్వెడార్ నుండి వచ్చిన ఈ క్రింది అనుభవాలు చూపుతున్నట్లుగా, ఈ ప్రజా సేవను చక్కగా స్వీకరించడం జరిగింది.
◻ ఒక పెద్ద గాజు ఫ్యాక్టరి యాజమాన్యం తమ ఉద్యోగులకు కుటుంబ విలువలను బోధించడానికి ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంది. మానవ వనరుల డైరెక్టర్ కొంతమంది క్యాథలిక్ ప్రీస్టులను పాల్గొనడానికి ఆహ్వానించాడు, కాని ఏమాత్రం ప్రతిస్పందన లభించలేదు. ఆ అంశంపై ప్రసంగించేందుకు అర్హులైన ప్రీస్టులు చాలా తక్కువమంది ఉన్నారు గనుక బహుశ ఎవరూ అందుబాటులో ఉండకపోవచ్చని ఒక ప్రీస్టు ఆయనకు చెప్పాడు. ఇది విని, సాక్షియైన ఒక ఉద్యోగస్థురాలు తరచూ వ్యాపార ప్రాంతాల్లో పనిచేసే ఒక సహోదరుడు ఫ్యాక్టరీని సందర్శించడానికి ఏర్పాట్లు చేసింది.
మరునాడే, సాక్షి మానవ వనరుల డైరెక్టర్‌ను సమీపించి, పఠన కార్యక్రమాన్ని ప్రతిపాదించాడు. వాచ్ టవర్ సొసైటీ యొక్క వివిధ ప్రచురణలనుండి వివిధ అంశాల పట్టిక తయారు చేయబడింది. డైరెక్టర్ చాలా ప్రభావితుడయ్యాడు. ఆయన మూడు చర్చాంశాలను ఎంపిక చేశాడు—మానవ సంబంధాలు, పనిస్థలంలో నైతికత, కుటుంబంలో నైతికత. మొత్తం పనివారందరితో కలిసి సమాచారాన్ని పరిశీలించడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి.
ఉద్యోగులు ఒక్కొక్క గుంపులో 30 మంది చొప్పున ఏడు గుంపులుగా విభాగింపబడ్డారు, దాని తర్వాత అర్హులైన ముగ్గురు సహోదరులు వారితో సమాచారాన్ని పంచుకున్నారు. ఫలితం? తమ ఇళ్లను సందర్శించమని చాలామంది ఉద్యోగులు కోరారు, 216 బైబిలు పఠన సహాయకాలు అందజేయబడ్డాయి. యాజమాన్యం ఎంతగానో ప్రభావితమై, సాక్షులు మరోసారి ఇలాంటి ప్రసంగాల పరంపరను సిద్ధం చేయగలరా అని వాళ్లు అడిగారు.
◻ ఇటీవల, పాఠశాలలో మతాన్ని బోధించడాన్ని అనుమతించే ఒక చట్టాన్ని ఈక్వెడార్ జారీచేసింది. ఒక మిషనరీ సహోదరి ఒక ప్రాథమిక పాఠశాలలో మహిళా సూపరింటెండెంట్‌ను కలిసి, ఆ క్రొత్త చట్టం ఎలా పనిచేస్తోందని అడిగింది. మరియ ఆరాధనకు సంబంధించి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ప్రయత్నించడం జరిగింది కాని అది సఫలం కాలేదని సూపరింటెండెంట్ వివరించింది. అలాంటి ఆరాధన క్యాథలిక్‌లు కాని పిల్లలకు సమస్యలను తీసుకురాగలదని సహోదరి పేర్కొన్నప్పుడు, సూపరింటెండెంట్ ఏకీభవించింది. “మరో వైపున, ఫలానా మతాన్ని అంగీకరించమని ఒక వ్యక్తిని బద్దుడ్ని చేయని బైబిలు యొక్క నైతిక సూత్రాలను బోధించే కార్యక్రమం ఒకటుంది” అని ఆ మిషనరీ తెలియజేసింది. “మీరెప్పుడు రాగలరు? ఎల్లుండి రాగలరా?” అని ఆ సూపరింటెండెంట్ అడిగింది. ఆ మిషనరీ ఆమెకు మహాగొప్ప బోధకుడు చెబుతున్నది వినడం (ఆంగ్లం) అనే పుస్తకాన్ని చూపించిన తర్వాత, “శాంత స్వభావులు ధన్యులు” అనే అధ్యాయం నుండి చర్చించాలనే నిర్ణయానికి వచ్చారు.
మిషనరీ తిరిగివచ్చి, ఏడు వివిధ తరగతులను సందర్శిస్తూ మూడు గంటలు గడిపింది, సూపరింటెండెంట్ కూడా వారితోపాటు ఉండి విన్నది. ఐదవ తరగతితో కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత, ఒక విద్యార్థి ఇలా అన్నాడు: “మిస్, దయచేసి ఆరవ తరగతికి తప్పక వెళ్ళండి. వాళ్లు ఎప్పుడూ మమ్మల్ని కొట్టి గొడవపెట్టుకోవాలని చూస్తారు!” ఒక టీచర్ ఇలా పేర్కొంది: “దౌర్జన్యం చాలా ప్రాముఖ్యమైన అంశం. ఈ విషయం గురించి చర్చించడానికి మనకు మరింత ఎక్కువ సమయం కావాలి.”
విధేయత మరియు అబద్ధమాడడం వంటి అంశాలను చర్చించడానికి పాఠశాలకు పునర్దర్శనాలు చేయడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి. ఇంతవరకు, ఫలితాలు చాలా సంతృప్తికరంగా ఉన్నాయి. ఇప్పుడు మిషనరీ సహోదరి వీధిలో వెళుతుండగా, ఆమెకు అభివాదం చేసి, బైబిలు ప్రశ్నలు అడుగడానికి పిల్లలు ఆమె దగ్గరికి పరుగెత్తుకొని వస్తారు. ఇంకా ఇతర పిల్లలు ఆమెను తమ తల్లిదండ్రులకు సగర్వంగా పరిచయం చేస్తారు. అంతేగాక, బడి పిల్లలిద్దరితో గృహబైబిలు పఠనం ప్రారంభించబడింది.