మీరు ఆశావాదులా లేక నిరాశావాదులా?
“అది ఎంతో శ్రేష్ఠమైన సమయం, అది ఎంతో దుర్భరమైన సమయం, . . . అది ఆశల వసంతం, అది నిరాశల శిశిరం, మా ముందు అన్నీ ఉన్నాయ్, మా ముందు ఏమీ లేవు.” చార్లెస్ డికెన్స్ వ్రాసిన ఉత్తమ సాహితీ ఖండమైన ఎ టేల్ ఆఫ్ టూ సిటీస్‌లోని ఆ ప్రారంభ పదాలు, మన ఆలోచనలనూ మన భావాలనూ మన దృక్పథాలనూ సంఘటనలు ఎలా ప్రభావితం చేయగలవనే విషయాలను నైపుణ్యవంతంగా పోల్చి చూపిస్తున్నాయి.
అక్కడ ప్రస్తావించబడిన రెండు నగరాలు, ఫ్రెంచి విప్లవం సమయంలోని లండన్ మరియు ప్యారిస్‌లు. 18వ శతాబ్దపు ఫ్రాన్స్‌లోని అణచివేయబడిన పౌరులకు, మానవ హక్కులను గురించిన విప్లవ ప్రకటనలు వాస్తవంగానే “ఆశల వసంతం”గా తోచాయి. అయితే ఏన్షియన్ రెజిమ్కు లేక విచ్ఛిన్నం కాబోతున్న రాజకీయ వ్యవస్థకు చెందిన వారికి మాత్రం అది మరణానికీ వినాశనానికీ నడిపే “నిరాశల శిశిరం”గా ఉండింది.
ఆశావాదమా లేక నిరాశావాదమా? వివాదంలో మీరు ఏ పక్షాన ఉన్నారనే దానిపై అది ఆధారపడి ఉంది. మరి నేటికీ విషయమదే.
స్వయం పరిశీలనకు సమయం
మీరు ఆశావాదులా? మీరు ఎల్లవేళలా శ్రేష్ఠమైన దాని కొరకు ఎదురు చూస్తూ జీవితంలోని ఉత్తేజవంతమైన పార్శ్వాన్ని చూస్తారా? లేక మీ అపేక్షల పట్ల ప్రతికూల దృక్పథాన్ని ఏర్పరచుకుని, శ్రేష్ఠమైన దాని కొరకు ఎదురు చూస్తూ అదే సమయంలో దుర్భరమైనది జరుగుతుందని అనుకుంటూ నిరాశావాదిగా ఉండేందుకు ఉన్ముఖులౌతారా?
అరవై ఏళ్ల క్రితం అమెరికాకు చెందిన నవలా రచయితయైన జేమ్స్ బ్రాంచ్ కాబల్ రెండు పరస్పర విరుద్ధ తత్వాల సారాంశాన్ని ఈ విధంగా చెప్పాడు: “మనం అతి శ్రేష్ఠమైన ప్రపంచంలో జీవిస్తున్నామని ఆశావాది ప్రకటిస్తాడు; బహుశ ఇది వాస్తవమేమోనని నిరాశావాది భయపడతాడు.” ఈ విధమైన దృక్పథం నిర్లిప్తతతో కూడినదని ఒకవేళ మీరు భావిస్తే, క్రింద ప్రస్తావించబడిన విధంగా, నేటి ప్రపంచంలోని కేవలం మూడు అంశాల అనుకూల మరియు ప్రతికూల కారణాంశాలను పరిశీలించండి. తర్వాత మీ ప్రతిక్రియలను విశ్లేషించుకుని, ‘నేను ఆశావాదినా లేక నిరాశావాదినా?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.
నిత్య శాంతి: ప్రపంచంలో అలజడులు చెలరేగుతున్న ఎన్ని ప్రాంతాల పేర్లను మీరు చెప్పగలరు? ఐర్లండ్, పూర్వపు యుగోస్లావియా, మధ్యప్రాచ్యం, బురుండీ, రువాండా—ఈ ప్రాంతాలన్నీ వెంటనే జ్ఞాపకం వస్తాయి. శాశ్వతమైన, భూగోళవ్యాప్త శాంతిని స్థాపించేందుకై ఈ పోరాటాలూ మరితర పోరాటాలూ ఎన్నటికైనా నిలిపివేయబడగలవా? ప్రపంచం శాంతి వైపుకు పయనిస్తోందా?
ఆర్థిక స్థిరత్వం: 1999కల్లా ఆర్థిక సంయోగాన్ని సాధించాలని ఆశిస్తూ, యూరోపియన్ యూనియన్ దేశాలు ద్రవ్యోల్బణం మరియు ప్రజల నుండి అప్పులు తీసుకోవడం వంటి సమస్యలతో వ్యవహరించేందుకు గంభీరమైన చర్యలు తీసుకుంటున్నాయి. మరో చోట, ద్రవ్యోల్బణం దాదాపు భరించలేని భారాన్ని మోపుతూ ఉండి, జాతి సంబంధమైన సమస్యలు ఇప్పటికీ విభజనను సృష్టిస్తున్న అనేక అమెరికా మరియు ఆఫ్రికా దేశాల ఆర్థిక నిర్మాణాన్ని అవినీతి హరించివేస్తుంది. ప్రపంచ ఆర్థిక స్థిరత్వం త్వరలో సాధించబడుతుందా?
నిరుద్యోగం: 1997 జాతీయ ఎన్నికల్లో, అందరికీ ఉద్యోగ ఏర్పాట్లను కలిగిస్తామనే వాగ్దానాన్ని తమ అజెండాల్లో నొక్కి చెప్పమని అన్ని రాజకీయ పార్టీలనూ పురికొల్పేందుకు బ్రిటీష్ చర్చిలు ఐక్యమయ్యాయి. అయితే ప్రపంచ కార్మిక శక్తిలో దాదాపు 30 శాతం నిరుద్యోగులుగా లేక సరైన ఉద్యోగం లేకుండా ఉండగా, శాశ్వతమైన పూర్తి ఉద్యోగావకాశాలను కల్పించడం సాధ్యమా, ముఖ్యంగా యువతకు ఉద్యోగాలను కల్పించడం సాధ్యమా?
నిరాశకు గురికావడం ఎంత సులభమో కదా! అయినప్పటికీ ఆశావాదంగా ఉండేందుకు ఆధారం ఉంది, అలాంటి దృక్పథాన్ని వృద్ధి చేసుకోవడం ఎలా సాధ్యమో పరిశీలించమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.
[3వ పేజీలోని చిత్రం]
ఫ్రెంచి విప్లవం
[క్రెడిట్ లైను]
ప్రపంచ సచిత్ర చరిత్ర (ఆంగ్లం) పుస్తకం నుండి