కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 12/1 పేజీలు 4-8
  • భద్రమైన భవిష్యత్తున్న యౌవనస్థులు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • భద్రమైన భవిష్యత్తున్న యౌవనస్థులు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘ఉగ్రులు’
  • ముట్టడిలో
  • వెదకండి మీకు దొరుకుతుంది
  • దైవిక తర్ఫీదు ఫలితాలనిస్తుంది
  • భవిష్యత్తు కోసం భద్రతగల పునాదిని వేసుకోండి
  • యౌవనులారా, దేవుణ్ణి మహిమపరిచే లక్ష్యాలను సాధించేందుకు కృషిచేయండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • యౌవనస్థులారా—యెహోవా హృదయాన్ని సంతోషపర్చండి
    మన రాజ్య పరిచర్య—1993
  • యెహోవా సేవలో సంతోషించు యౌవనులు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • మీ యౌవనాన్ని సఫలీకృతం చేసుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 12/1 పేజీలు 4-8

భద్రమైన భవిష్యత్తున్న యౌవనస్థులు

“ఏ [రేప్‌ కేస్‌] అయినా ఎంత భయంకరంగా, ఎంత ఏవగింపు కల్గించేదిగా ఉంటుందో ఇదీ అలాగే ఉంది”—అని ఇటీవలి విచారణలో అధ్యక్షత వహించిన న్యాయమూర్తి ఆ నేరాన్ని గురించి పేర్కొన్నాడు. కౌమార దశలో ఉన్న అంటే, 14 నుండి 18 ఏండ్ల లోపు వయస్సులోవున్న ఎనిమిది మంది పిల్లల గుంపు లండన్‌ నగర నడిబొడ్డున పొంచివుండి, ఒక పర్యాటకురాలిపై దాడి చేసింది. వాళ్ళు ఆమెపై అనేకసార్లు లైంగికంగా దాడిచేసి, తను ఈదలేదని ఆమె చెప్పినా వినిపించుకోకుండా ఆమెను దగ్గర్లోవున్న కెనాల్‌లో విసిరేశారు. తన కుమారుడు చేసిన దానిని గురించిన టీవీ వార్తా నివేదికను చూసి తను అస్వస్థతకు లోనైందని ఆ గుంపులోని ఒక కుర్రవాడి తల్లి తెలియజేసిన విషయం అర్థం చేసుకోగలిగిందే.

విచారకరంగా, నేడు సమాజంలో జరుగుతున్న విషయాన్ని ఈ సంఘటన ప్రతిబింబిస్తుంది. నేర కృత్యాల్లోనైనా, కుటుంబాల్లో జరుగుతున్న పోట్లాటల్లోనైనా, బాల్కాన్స్‌లోగానీ, మధ్య మరియు పశ్చిమ ఆఫ్రికాల్లో గానీ, మరెక్కడైనా గానీ జరుగుతున్న వర్గ పోరాటాల్లోనూ క్రూరత్వం అనేది సాధారణమై పోయింది. యౌవనస్థులు అలాంటి పరిస్థితుల మధ్య పెరుగుతున్నారు. లేదా తరచూ వాటిని గూర్చి వింటున్నారు. అలాంటప్పుడు, అనేకులు కాఠిన్యాన్ని అలవరచుకొని, తమకు ‘సహజమైన అనురాగం లేదన్నది’ చూపిస్తూ, ‘ఆత్మనిగ్రహం కనబరచక’ పోవడంలో ఆశ్చర్యమేమీ లేదు.—2 తిమోతి 3:3, NW.

‘ఉగ్రులు’

క్రైస్తవ అపొస్తలుడైన పౌలు తన తోటి పెద్దయైన తిమోతికి తన రెండవ లేఖను వ్రాసినప్పుడు, రోమ్‌ రెండవ ప్రపంచ శక్తిగా ఉండేది. క్రూరత్వమూ, ఆటవిక స్వభావం అనేవి రోమ్‌ రంగస్థలాల్లో ప్రబలంగా ఉండేవి. అయితే, భవిష్యత్తులోని దినములు “వ్యవహరించడానికి కష్టంగా” ఉంటాయనీ పౌలు హెచ్చరించాడు. (2 తిమోతి 3:1, NW) ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ దినములు “వ్యవహరించడానికి కష్టంగా” ఉంటాయని వివరించే గ్రీకు పదంలో, ఈ కాలంలోనివాళ్ళు “ఉగ్రులై” ఉంటారనే తలంపు కూడా ఇమిడి ఉంది. 30 కన్నా ఎక్కువ సంవత్సరాల క్రితం, యేసు భూ పరిచర్య కాలంలో జరిగిన ఒక సంఘటన ఆయన కాలంలో జరిగిన క్రూర కృత్యాలకు వెనుకవున్న దేమిటో చూపిస్తుంది.

గలిలయ సముద్రం యొక్క తూర్పు తీరానికి యేసు అప్పుడే పడవలో చేరుకున్నాడు. ఆయన తీరంలో అడుగు పెట్టగానే, ఆయనకు ఇద్దరు మనుష్యులు ఎదురయ్యారు. వాళ్ళ ఆటవిక వేషవిధానము, వాళ్ళ అరుపులు వాళ్ళకు ఏదో అయ్యిందన్న విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. వాళ్ళు “మిగుల ఉగ్రులై” ఉన్నారు.a వాస్తవానికి, వాళ్ళను దయ్యాలు పట్టాయి. వాళ్ళు అరిచిన అరుపులు వాళ్ళ హింసాత్మక చర్యలను నియంత్రించిన దుష్టాత్మల నుండి వచ్చినవే. “ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా?” అని ఆ మనుష్యులు కేకలు వేశారు. అప్పటికే దేవుడు దయ్యాలకు తీర్పు తీర్చే సమయాన్ని నిర్ణయించేశాడని ఆ మనుష్యులను పట్టిన దయ్యాలకు బాగా తెలుసు. అంటే వాటికిక నిత్య నాశనమేనన్నమాట. అయితే, అప్పటి వరకు ఉగ్రమైన హింసను రేకెత్తించేందుకు తమకున్న మానవాతీత శక్తులను అవి ఉపయోగించబోయాయి. ఆ దయ్యాలను వెళ్ళగొట్టేందుకు యేసు అద్భుత కార్యం చేసినప్పుడే ఆ ఇద్దరు మనుష్యులకు విడుదల లభించింది.—మత్తయి 8:28-32; యూదా 6.

యౌవనస్థులతో సహా, నేటి ప్రజలు పిచ్చి పిచ్చిగా వ్యవహరించినప్పుడు మనం ఆ సంఘటనను గుర్తు చేసుకోవడం మంచిది. ఎందుకని? ఎందుకంటే, “భూమీ, సముద్రమా, మీకు శ్రమ; అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహు క్రోధముగలవాడై మీయొద్దకు దిగివచ్చియున్నాడని” బైబిలులోని చివరి పుస్తకమైన ప్రకటన వివరిస్తున్నట్లు, ఈ 20వ శతాబ్దంలోనూ మనం అలాంటి అపాయాన్నే ఎదుర్కొంటున్నాం. (ప్రకటన 12:12) తనకు కొంచెం సమయమే ఉందని సాతానుకు తెలుసు గనుక, అతడికి కలిగిన అవమానానికి “బహు క్రోధము” తోడయ్యిందని దయచేసి గమనించండి.

ముట్టడిలో

ఈ పత్రిక పుటల్లో తరచూ పేర్కొనబడినట్లే, పరలోకంలో దేవుని రాజ్యానికి రాజుగా క్రీస్తు యేసు సింహాసనాసీనుడవ్వడాన్ని 1914వ సంవత్సరం చూసింది. దేవుని ముఖ్య శత్రువైన సాతానుకు వ్యతిరేకంగా యేసు వెంటనే చర్య తీసుకున్నాడు. అలా, అపవాదీ, అతని దయ్యాలు పరలోకం నుండి బహిష్కరించబడ్డాయి. ఇప్పుడు అవి తమ అవధానాన్నంతా భూమిపైనే కేంద్రీకరిస్తున్నాయి. (ప్రకటన 12:7-9) తాను ప్రభావం చూపగల ప్రాంతం చాలా తగ్గేసరికి, సాతాను “గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.” (1 పేతురు 5:8) అతనికి సులభంగా ఎరయ్యేది ఎవరు? జీవితంలోనూ, మానవ సంబంధాల్లోనూ ఎక్కువ అనుభవం లేని వారే ఎక్కువగా ఎర అవుతారనడం అర్థం చేసుకోగలిగిందే కదా? అలా నేడు యౌవనస్థులు సాతాను లక్ష్యాలకు గురౌతున్నారు. సంగీతాన్నీ, వినోదాన్నీ వెతుక్కుంటూ వెళ్ళి ఈ అదృశ్య మోసగాడి చేతుల్లో పాచికలైపోతున్నారు.—ఎఫెసీయులు 6:11, 12.

యౌవనస్థులు తమ జీవితంలో ఏదో చెయ్యాలని ప్రయత్నిస్తుండగా, వాళ్ళు ఏవో ఆటంకాలను కనుగొంటారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసినప్పటి నుండి, మునుపు యుద్ధాల్లో పాల్గొన్న అనేక దేశాల్లోని ప్రజలు తమ కుటుంబాలకు సంపన్న జీవన విధానాన్ని కల్పించి, తమకు కలిగిన నష్టాన్ని పూరించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆస్తిపాస్తులను సంపాదించుకోవడం, అదుపు లేని విరామాలూ, వినోదాలు గొప్ప లక్ష్యాలుగా మారాయి. దాని పర్యవసానంగా, చాలా మంది బాధలననుభవించారు. “ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. . . . ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి . . . నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి” అని పౌలు తిమోతికి హెచ్చరికనిచ్చాడు. (1 తిమోతి 6:9, 10) మొత్తం మీద, నేటి భౌతికవాదపు సమాజంలోని ప్రజలు ఆర్ధిక సంబంధమైన, ఆదాయ సంబంధమైన, భావోద్వేగ సంబంధమైన బాధలతో తమను తాము పొడుచుకోవడం మనం చూస్తున్నాం. అందులో దేవుని ముఖ్య శత్రువు తంత్రాలకు ఎరయైనది అనేక మంది యౌవనస్థులే.

అయితే ఒక మంచి వార్త ఉందన్నది సంతోషకరమైన విషయం. అది తమ ముందు భద్రమైన భవిష్యత్తున్న యౌవనస్థులకు సంబంధించినది. అదెలా సాధ్యం?

వెదకండి మీకు దొరుకుతుంది

చాలా మంది యౌవనస్థులకు ఉన్నతమైన ఆశయాలున్నాయి. సాధారణంగా పెద్దవాళ్ళ మధ్యన దిగజారిపోతున్న ప్రమాణాలను వాళ్ళు తిరస్కరిస్తారు. అధికార దాహంగల రాజకీయవేత్తల, వ్యాపారస్థుల అవినీతికరమైన, కఠినమైన దృక్పథాన్ని చూసి వాళ్ళు కృంగిపోతారు. మీరూ యౌవనస్థులైతే, బహుశా మీరూ అలాగే భావిస్తుండవచ్చు.

యౌవనంలోకి అడుగుపెడుతున్న సెడ్రిక్‌ విషయమే తీసుకోండి.b ఇతని అనుభవం అసాధారణమైనదేమీ కాదు. పిల్లవాడిగా ఉన్నప్పుడు అతడికి మరణాన్ని గూర్చిన భయంతో సహా చాలా భయాలుండేవి. జీవితానికున్న సంకల్పమేమిటి అని అతడు ఆలోచించేవాడు. అతడికి 15 ఏండ్లు వస్తున్నప్పటికీ కూడా తన ప్రశ్నలకు జవాబులు లభించనందువల్ల, ఆదర్శవాదులైన వేరే యౌవనస్థుల సహవాసంలో, జీవితాన్ని గురించి ఆలోచించడమే మానేశాడు. “మేము మత్తు మందులను సేవించేవాళ్ళం, కూర్చుని గంటల తరబడి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అందరమూ ఒకేలా ఆలోచిస్తున్నామని నమ్మాము. కానీ ఎవరి దగ్గరా జవాబు లేదు” అని అతడు గుర్తు చేసుకుంటున్నాడు.

చాలా మంది యౌవనస్థులలాగే ఉత్తేజం కోసం సెడ్రిక్‌ పిచ్చిగా ఆశించాడు. కేవలం మత్తుమందులను తీసుకోవడం అతనిని తృప్తిపరచలేకపోయింది. అతడు త్వరలోనే దొంగతనంలోను మత్తుమందుల వ్యవహారాల్లోనూ నిమగ్నమయ్యాడు. అతడు ఇంకా కొత్త సవాళ్ళ కోసం చూశాడు. వచ్చిన ఆర్డర్ల ప్రకారం వస్తువులను సరఫరా చేసేందుకుగాను దొంగతనం చేయనారంభించాడు. “అలా చేయడంలో నేనెంతో ఉల్లాసాన్ని కనుగొన్నాను. కాని నేను సామాన్యుల నుండి ఎన్నడూ ఏమీ దొంగిలించలేదు. నేను ఒక కారును దొంగిలిస్తే, దానిని పాడుచేయకుండా ఉన్నది ఉన్నట్లుగానే తిరిగి వదిలి పెట్టేవాడ్ని. నేను ఏవైనా దొంగిలించాలనుకుంటే, భీమా ద్వారా నష్టపరిహారం పొందగల్గే వాళ్ళ దుకాణంలో నుండే దొంగిలించేవాడ్ని. నేను అలా చేయడం నేను చేస్తున్న దానిని సమర్థించుకోవడానికి నాకు సహాయం చేసింది.” మీరూహించగల్గినట్లే సెడ్రిక్‌ చివరికి జైలులో వేయబడ్డాడు.

“తోటి ఖైదీయైన మార్క్‌ నాతో మాట్లాడాడు. నా బాహువు మీద సిలువ ఆకారం పచ్చబొట్టు ఉండడం చూసి, ఎందుకలా పొడిపించుకున్నావు అని ఆయన నన్నడిగాడు. మతసంబంధంగా అది నాకు చాలా ప్రాముఖ్యమై ఉంటుందని ఆయన అనుకున్నాడు” అని సెడ్రిక్‌ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. రెండు వారాల తర్వాత, సెడ్రిక్‌కు మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరుc అనే పుస్తక ప్రతిని మార్క్‌ ఇచ్చాడు. “‘మీరు నిరంతరము జీవించగలరు’—అన్న ఆ కొన్ని మాటలు నన్ను వెంటనే ప్రభావితం చేశాయి. మేము ఎల్లప్పుడూ మాట్లాడుకునేది దాని గురించే, కానీ దాని గురించి లోతుగా ఆలోచించలేకపోయాము” అని ఆయన అన్నాడు. జైలును సందర్శించిన యెహోవా సాక్షుల్లో ఒకరితో అనేక చర్చలు జరిపిన తర్వాత, తాను కోరుకున్నది సాధ్యమేననీ—అయితే అది దేవుని మార్గంలో మాత్రమే సాధ్యమనీ సెడ్రిక్‌ తెలుసుకున్నాడు.

“నా పాత స్నేహితులతో సహవాసాన్ని మానుకున్న తర్వాత, నేను త్వరగా అభివృద్ధిని సాధించాను” అని సెడ్రిక్‌ పేర్కొంటున్నాడు. అయితే అవగాహనలోను సంతోషంలోను ప్రగతిని సాధించడమన్నది అతనికి అంత సులభం కాలేదు. “నేనిప్పటికీ దాని కోసం కృషి చేస్తున్నాను. నేను ఆలోచించే విధానంలో నేను జాగ్రత్తగా ఉండాలి” అని ఆయన అంటున్నాడు. అవును, తాను ఆదర్శవాదిగా ఉండి ఉత్తేజంపై కేంద్రీకరించబడిన కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మాత్రమే తన లక్ష్యాలను చేరుకోవచ్చు అని అనుకోవడం తాను అపవాది పన్నాగంలో పడేందుకు నడిపింది అని సెడ్రిక్‌ ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాడు.

సంతోషకరంగా, చివరకు సెడ్రిక్‌ జైలునుండి విడుదల చేయబడ్డాడు. తాము వెదికినదాన్ని కనుగొన్న ఇతరులతో గల క్రమమైన సహవాసంలో ఆయన ఆనందిస్తున్నాడు. ఆయన ఇప్పుడు యెహోవాసాక్షుల్లో ఒకరై, ఈ భూమిపైనే పరదైసులో జీవించే వాళ్ళ నిరీక్షణను పంచుకుంటున్నాడు. అన్ని రూపాల్లోని సాతాన్య ప్రభావం అంతం కావడం కోసం కూడా ఆయన ఎదురు చూస్తున్నాడు.

అవును, సెడ్రిక్‌లాంటి యౌవనస్థులకు మాత్రమే కాక, తమ పిల్లల హృదయాల్లో బైబిలు సత్యం ఎడల ప్రేమను నాటిన దైవభక్తిగల తల్లిదండ్రుల పెంపకంలో పెరిగిన మిగతా యౌవనస్థులకు కూడా భద్రమైన భవిష్యత్తు ఉంది.

దైవిక తర్ఫీదు ఫలితాలనిస్తుంది

“బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు” అని ప్రాచీన కాల జ్ఞానియైన సొలొమోను రాజు వ్రాశాడు. (సామెతలు 22:6) బైబిలు ప్రమాణాలను అనుసరించడాన్ని ఎన్నుకున్న ఏకదృష్టి గల అనేక మంది యౌవనస్థుల విషయంలో ఇది నిజమని తేలింది.

షీల, గోర్డన్‌, సేరా అలాగే చేశారు. రాజ్య సువార్తను ప్రకటిస్తూ, ‘వెళ్ళి, శిష్యులను తయారు చేయాలన్న’ క్రీస్తు ఆజ్ఞకు విధేయత చూపడానికే తమ తల్లిదండ్రులు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు. (మత్తయి 24:14; 28:19, 20) “ఏ నిర్ణయాలు చేయవలసి వచ్చినా, ‘అది ప్రకటనా పనిని ఎలా బాధిస్తుంది?’ అని నేనూ, అమ్మా ఒకరితోనొకరం అనుకునేవాళ్ళం” అని షీల జ్ఞాపకం చేసుకుంటుంది. “ఈ విధంగా తర్కించుకోవడం వల్ల మేము అనేక పథకాలను విడిచిపెట్టేశాం” అని ఒప్పుకుని, “కానీ మాకు ఎంతటి ఆశీర్వాదాలు కలిగాయో!” అని కూడా ఆమె అంటోంది. పగలంతా సువార్తతో ఇంటింటా సందర్శించి తిరిగి ఇంటికి బయల్దేరే సరికి చీకటిపడుతున్నప్పటికీ కూడా షీలా, షీలావాళ్ళ అమ్మా పాటలు పాడుకుంటూ ఇంటికి చేరుకునేవాళ్ళు. “నా ఆనందం సంపూర్ణమైనది,” “ఇప్పటికీ నేనా అనుభూతిని పొందగల్గుతున్నాను” అని ఆమె అంటోంది.

గోర్డన్‌ ఆస్వాద్యమైన అనేక శనివార సాయంకాలాలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. “సంఘ పెద్దలు నన్ను తమ ఇండ్లకు ఆహ్వానించేవారు. అక్కడ ప్రయోజనకరమైన క్విజ్‌లూ, చర్చలూ జరిగేవి. బైబిల్లోని వచనాలను జ్ఞాపకం ఉంచుకునేందుకూ, లేఖనాధార అంశాలపై ధారాళంగా మాట్లాడేందుకు, ప్రకటనా పనిలో కలిగిన అనుభవాలను చెప్పేందుకూ, రాజ్యపని ఎలా విస్తృతమౌతుందో తెలుసుకునేందుకూ మేము ప్రోత్సహించబడేవాళ్ళం. ఇవన్నీ నేను మంచి పునాది వేసుకునేందుకూ, యెహోవా దేవుని ఎడల ప్రేమను అలవరచుకునేందుకూ నాకు తోడ్పడ్డాయి” అని గోర్డన్‌ గుర్తు చేసుకుంటున్నాడు.

సాయంకాలాల్లో సాక్షులు తమని సందర్శించిన సంతోషకరమైన స్మృతులు సేరాకున్నాయి. “మేము కలిసి భోజనాలు చేసే వాళ్ళం. వాళ్ళు తిరిగి వెళ్ళక ముందు, దేవుని రాజ్యాన్ని గూర్చిన పాటలు పాడుకోవడమూ, పాడేవారితో పాటు మేము పియానో వాయించడమూ జరిగేది. సంగీతం నిజంగా మాకు చాలా తోడ్పడింది, ముఖ్యంగా బడిలో చదువుకుంటున్న సంవత్సరాల్లో. ఎలాగంటే మేము కలిసి పనులు చేసుకోవడానికి అది మాకు వీలుకల్పించింది” అని ఆమె చెబుతుంది.

నిజమే, యెహోవాను సంతోషపరచేందుకు ప్రయత్నించే యౌవనస్థులందరి కుటుంబ పరిస్థితులూ ఆదర్శవంతంగా లేవు. అయినప్పటికీ, సంఘంలోని మిగతా సాక్షుల కుటుంబాలతో సన్నిహిత సహవాసం కలిగి ఉండడం వారికి భద్రతా భావాన్నీ, తనవాళ్ళన్న భావాన్నీ ఇస్తుంది.

భవిష్యత్తు కోసం భద్రతగల పునాదిని వేసుకోండి

నేడు యౌవనస్థులు ఎంపిక చేసుకోవచ్చు. యేసు ప్రవచించిన రానున్న ‘మహాశ్రమ’ల్లోకి అలక్ష్యంగా దూసుకుపోతున్న ఈ దుష్ట లోకంతో పాటు వాళ్ళు కొనసాగవచ్చు. లేదా ప్రేరేపిత కీర్తన రచయిత ఆసాపు పాడినట్టు, వాళ్లు “దేవునియందు నిరీక్షణగలవారై . . . ఆయన ఆజ్ఞలను గైకొన”వచ్చు. దేవుని చిత్తానికి విధేయత చూపడం “యథార్థహృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేనివారై . . . మూర్ఖతయు తిరుగుబాటునుగల ఆ తరము”లా వాళ్ళు కావడాన్ని అరికడుతుంది.—మత్తయి 24:21; కీర్తన 78:6-8.

ప్రపంచవ్యాప్తంగావున్న 80,000 కన్నా ఎక్కువగా ఉన్న యెహోవాసాక్షుల సంఘాల్లో మీరు ప్రశంసించగల అనేక మంది యౌవనస్థులను మీరు కనుగొంటారు. “రాబోవు కాలమునకు మంచి పునాది తమకొరకు వేసికొనుచు, మేలుచేయువారును, సత్‌క్రియలు అను ధనము గలవారును, ఔదార్యముగలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై యుండవలెనని” యువకుడైన తిమోతికి పౌలు ఇచ్చిన సలహాను వాళ్ళు లక్ష్యపెట్టారు. దాని ఫలితంగా, ఇప్పుడు వాళ్ళు ‘వాస్తవమైన జీవముపై గట్టిపట్టు’ కలిగివున్నారు. (1 తిమోతి 6:18, 19) ఈ యథార్థ క్రైస్తవుల కూటాలకు హాజరై వాళ్ళ గురించి మరెక్కువగా తెలుసుకోండి. అలా భద్రమైన భవిష్యత్తును గూర్చిన ఉత్తరాపేక్షను మీరూ కలిగి ఉండగలరు.

[అధస్సూచీలు]

a ‘ఉగ్రులు’ అనే గ్రీకు పదమే మత్తయి 8:28లోనూ, 2 తిమోతి 3:1లోను ఉపయోగించబడింది.

b పేర్లు మార్చబడ్డాయి.

c వాచ్‌ టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించినది.

[7వ పేజీలోని చిత్రం]

యేసు స్వస్థపరచిన “మిగుల ఉగ్రులైన” ఆ మనుష్యుల వెనుక దుష్టాత్మలున్నారు

[8వ పేజీలోని చిత్రం]

“రాబోవు కాలమునకు మంచి పునాదిని” వేయడం

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి