“లోతు నీళ్ల”ను పైకి చేదుకొనుట
“నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ల వంటిది. వివేకముగలవాడు దానిని పైకి చేదుకొనును” అని ఒక బైబిలు సామెత చెబుతుంది. (సామెతలు 20:5) బైబిలు కాలాల్లో, నీళ్లు తెచ్చుకోవడం నేడు చాలా దేశాల్లో ఉన్నదానికంటే చాలా కష్టంగా ఉండేది. యేసు సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు, ఆమె యాకోబు బావి నుండి నీళ్లు పైకి చేదుకుంటోంది, ఆ బావి లోతు దాదాపు 23 మీటర్లు!—యోహాను 4:5-15.
సామెతలు 20:5 సూచిస్తున్నట్లుగా, ఒక వ్యక్తి హృదయంలో ఉన్న లోతైన ఆలోచనలను, భావాలను బయటికి తీయడానికి అవసరమయ్యే వివేచన ఒక బావిలో నుండి నీళ్లు చేదడానికి చేసే కృషి వంటిదే. ఇది జీవితంలోని అనేక రంగాల్లో నిజమైయుంది. ఉదాహరణకు, వ్యక్తిగతంగా అనేక సంవత్సరాలు జ్ఞానానుభవాలనే సంపదను సంపాదించుకున్న వ్యక్తులు అనేకమంది మీకు తెలిసే ఉండవచ్చు. ఒకవేళ కోరక ముందే స్వచ్ఛందంగా ఉపదేశమిచ్చేందుకు వీళ్లు ఇష్టపడక పోయినట్లయితే, మీరు వాటిని పైకి చేదుకోవలసి ఉంటుంది. ఆసక్తి చూపుతూ, ప్రశ్నలు అడుగుతూ, మరియు యుక్తిగా పరీక్షించడం ద్వారా, మీరు జ్ఞానమనే లోతు బావిలోకి బక్కెట్ వేస్తున్నట్లేనని చెప్పవచ్చు.
సామెతలు 20:5లోని సలహా కుటుంబానికి కూడా అన్వయిస్తుంది. “నా భర్త తాను ఏలా భావిస్తున్నాడో నాకు చెప్పడు!” అని తరచూ భార్యలు అనడం వింటుంటాము. “నా భార్య నాతో మాట్లాడడం మానేస్తుంది!” అని ఒక భర్త చెప్పవచ్చు. అలాంటి పరిస్థితుల్లో, వివాహ జత హృదయాంతరంగంలో ఉన్న ఆలోచనలను పైకి తీసుకురావడానికి వివేచన అవసరం. యుక్తమైన ప్రశ్నలు (ఈ రోజు ఏమైనా కష్టమనిపించిందా? ఏమైంది? నేను ఎలా సహాయం చేయగలను?) అతి సన్నిహితంగా సంభాషించుకోవడానికి తరచూ సహాయం చేయగలవు. అలాంటి వివేచన చూపించడం వల్ల భార్యాభర్తలిద్దరికీ ప్రయోజనకరమైన విధంగా వివాహ బంధం బలపర్చబడుతుంది.