మిమ్మల్ని జీవిత మార్గంపై నడిపించే ఒక దీపం
“యెహోవా, తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును.” (యిర్మీయా 10:23) సహాయం లేకుండా మానవులు తమ జీవిత మార్గంలో విజయవంతంగా కొనసాగలేరని ప్రవక్తయైన యిర్మీయా ఆ మాటల్లో తెలియజేశాడు. అలాంటి సహాయాన్ని ఎక్కడ కనుగొనవచ్చు? కీర్తనల గ్రంథకర్త యెహోవా దేవునికి తాను చేసిన ప్రార్థనలో ఇలా సమాధానమిస్తున్నాడు: “నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది.”—కీర్తన 119:105.
దేవుని వాక్యమైన పరిశుద్ధ బైబిలును పఠించే పనిని చేపట్టి, అది చెప్పేవాటిని అన్వయించుకొనేవారు తెల్లవారు జామునే ప్రయాణం ప్రారంభించే వ్యక్తిలా ఉంటారు. మొదట్లో, చీకటిగా ఉంటుంది గనుక ఆ వ్యక్తి ఎక్కువగా చూడలేడు. కాని సూర్యుడు ఉదయించడం ప్రారంభమవ్వగానే ఆయన అంతకంతకూ ఎక్కువ చూడగలుగుతాడు. చివరికి, సూర్యుడు సూటిగా తలపై ప్రకాశిస్తాడు. ఆయన అంతా స్పష్టంగా చూస్తాడు. అలాంటి ఉపమానం ఈ బైబిలు సామెతను జ్ఞాపకం చేస్తుంది: “పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును.”—సామెతలు 4:18.
దేవుని నడిపింపును నిరాకరించే వారి మాటేమిటి? బైబిలు ఇలా చెబుతుంది: “భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము. తాము దేనిమీద పడునది వారికి తెలియదు.” (సామెతలు 4:19) అవును దుష్టులు, చీకటిలో తొట్రుపడే వ్యక్తిలా ఉంటారు. వారి విజయాల్లా కనిపించేవి కూడా తాత్కాలికమైనవే. ఎందుకంటే, “యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు.”—సామెతలు 21:30.
కాబట్టి, దేవుని వాక్యమైన బైబిలు నడిపింపును అనుసరించండి. మీరలా చేస్తే, సామెతలు 3:5, 6 నందలి ఈ మాటలు సత్యమని మీరు కనుగొంటారు: “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.”