మీరు సద్గుణాన్ని వెంబడిస్తున్నారా?
“యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, [“ఏది సద్గుణవంతమైనదో, ఏది ప్రశంసార్హమైనదో,” NW] . . . [దాని]మీద ధ్యానముంచుకొనుడి.”—ఫిలిప్పీయులు 4:8, 9.
1. దుర్గుణం అంటే ఏమిటి, అది యెహోవా ఆరాధనను ఎందుకు భ్రష్టుపర్చలేకపోయింది?
దుర్గుణం అనేది నైతిక భ్రష్టత్వం లేక నైతిక అవినీతియైవుంది. అది మనం జీవిస్తున్న ఈ లోకం అంతటా వ్యాపిస్తుంది. (ఎఫెసీయులు 2:1-3) అయితే, యెహోవా దేవుడు తన పవిత్రారాధన మలినపర్చబడడానికి అనుమతించడు. క్రైస్తవ ప్రచురణలూ, కూటాలూ, సమావేశాలూ, సభలూ అనీతిమంతమైన ప్రవర్తనకు వ్యతిరేకంగా సమయానుకూలమైన హెచ్చరికల్ని మనకు ఇస్తున్నాయి. మనం దేవుని దృష్టికి ‘మంచిదైన దానిని హత్తుకొనేందుకు’ తగిన లేఖనాధార సహాయం పొందుతున్నాం. (రోమీయులు 12:9) కాబట్టి, ఓ సంస్థగా యెహోవాసాక్షులు పవిత్రంగానూ సద్గుణవంతులుగానూ ఉండేందుకు కృషిచేస్తున్నారు. కానీ వ్యక్తులుగా మన విషయమేమిటి? వాస్తవంగా, మీరు సద్గుణాన్ని వెంబడిస్తున్నారా?
2. సద్గుణం అంటే ఏమిటి, మరి సద్గుణవంతులుగా నిలిచివుండేందుకు కృషిసల్పాల్సిన అవసరం ఎందుకుంది?
2 సద్గుణం అనేది నైతిక ఉత్కృష్టతా, మంచితనమూ, సరియైన చర్యలూ, సరియైన ఆలోచనలూ అయివుంది. ఇది జడత్వంగల లక్షణంకాదు గానీ చురుకైన, అనుకూల లక్షణమైవుంది. సద్గుణంలో పాపాన్ని విడనాడడంకన్నా ఎక్కువే చేరివుంది; ఏది మంచిదో దానిని వెంబడించడమని దాని అర్థం. (1 తిమోతి 6:11) అపొస్తలుడైన పేతురు తోటి క్రైస్తవులకు ఇలా ఉద్బోధించాడు: “మీ విశ్వాసానికి సద్గుణాన్ని సరఫరా చేయండి.” ఏ విధంగా? “[దేవుని అమూల్యమైన వాగ్దానాలకు] ప్రతిస్పందనగా పూర్ణ హృదయంతో కృషి సల్పడంద్వారా” చేస్తాం. (2 పేతురు 1:5, NW) మన పాపభరితమైన స్వభావాన్నిబట్టి, సద్గుణాన్ని కల్గివుండడానికి నిజమైన కృషి అవసరమౌతుంది. అయినప్పటికీ, దేవుని ఎడల భయంకల్గివున్న గతకాలాల్లోని వ్యక్తులు విపరీతమైన ఆటంకాల్ని ఎదుర్కొంటున్నప్పుడు కూడా ఆ విధంగా చేశారు.
ఆయన సద్గుణాన్ని వెంబడించాడు
3. రాజైన ఆహాజు ఏ దుష్టకార్యాల్ని చేశాడు?
3 సద్గుణాన్ని వెంబడించిన వ్యక్తుల్ని గూర్చిన అనేక వృత్తాంతాలు లేఖనాల్లో ఉన్నాయి. ఉదాహరణకు, సద్గుణవంతుడైన హిజ్కియాను పరిశీలించండి. ఆయన తండ్రియైన యూదారాజగు ఆహాజు మొలెకును ఆరాధించినట్లు రుజువులు చూపుతున్నాయి. “ఆహాజు ఏలనారంభించినప్పుడు ఇరువది యేండ్లవాడై యెరూషలేమునందు పదునారు సంవత్సరములు ఏలెను. తన పితరుడగు దావీదు తన దేవుడైన యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక ఇశ్రాయేలురాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించెను. అతడు ఇశ్రాయేలీయుల ముందర నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన జనులు చేసిన హేయమైన క్రియలు చేయుచు, తన కుమారుని అగ్నిగుండమును దాటించెను. మరియు అతడు ఉన్నత స్థలములలోను కొండమీదను సమస్తమైన పచ్చని వృక్షములక్రిందను బలులు అర్పించుచు ధూపము వేయుచు వచ్చెను.” (2 రాజులు 16:2-4) ‘అగ్ని గుండమును దాటించడం’ నరబలిని కాదుగానీ శుద్ధిచేయడానికి సంబంధించిన ఓ రకమైన మతకర్మను సూచిస్తోందని కొంతమంది చెబుతారు. అయితే, జాన్ డే రాసిన మొలెకు—పాతనిబంధనలో నరబలిని తీసుకునే ఓ దేవుడు (ఆంగ్లం) అనే పుస్తకం ఇలా తెలియజేస్తోంది: “కనానీయ ప్రపంచంలో . . . నరబలి ఇవ్వబడేదనడానికి ప్రాచీన గ్రీక్ రోమన్ కార్తాజియన్ సాహిత్యాల్లో రుజువు ఉంది అలాగే పురావస్తుశాస్త్ర రుజువులూ ఉన్నాయి. కాబట్టి [నరబలిని] గూర్చిన పాతనిబంధన ఉదాహరణల్ని సందేహించడానికి కారణమేమీ లేదు.” అంతేకాకుండా, ఆహాజు “తన కుమారులను అగ్నిలో దహించెను” అని 2 దినవృత్తాంతములు 28:3వ వచనం విశేషంగా చెబుతోంది. (ద్వితీయోపదేశకాండము 12:31; కీర్తన 106:37, 38 పోల్చండి.) ఎంత క్రూరమైన చర్యలో కదా!
4. దుర్గుణంతో నింపబడిన వాతావరణంలో హిజ్కియా ఎలా ప్రవర్తించాడు?
4 దుర్గుణంతో నిండిపోయిన ఈ వాతావరణంలో హిజ్కియా ఎలా నెట్టుకు రాగల్గాడు? హిజ్కియా తానింకా రాజకుమారునిగానే ఉన్నప్పుడు 119వ కీర్తనను కూర్చాడని కొంతమంది విశ్వసిస్తున్నందున ఈ కీర్తన ఆసక్తికరమైనదైవుంది. (కీర్తన 119:46, 99, 100) కాబట్టి ఆయనవున్న పరిస్థితులను ఈక్రింది మాటలు సూచించవచ్చు: “అధికారులు నాకు విరోధముగా సభతీర్చి మాటలాడు కొందురు. నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును. వ్యసనమువలన నా [“ప్రాణానికి నిద్రలేకుండా పోయింది.” NW] ప్రాణము నీరైపోయెను.” (కీర్తన 119:23, 28) హిజ్కియా అబద్ధ మతాన్ని అనుసరిస్తున్న వారిచే చుట్టుముట్టబడినవాడై, రాజసభలో ఉన్న సభ్యులమధ్య, బహుశా నిద్రపట్టనంతగా తిరస్కారానికి గురియై ఉండొచ్చు. అయినప్పటికీ, ఆయన సద్గుణాన్ని వెంబడించాడు. చివరకు రాజై, ‘యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిననుసరించి, . . . ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచాడు.’—2 రాజులు 18:1-5.
వాళ్లు సద్గుణవంతులుగానే ఉండిపోయారు
5. దానియేలూ, అతని ముగ్గురు సహవాసులూ ఏ పరీక్షల్ని ఎదుర్కున్నారు?
5 దానియేలూ, అలాగే హనన్యా, మిషాయేలు, అజర్యా అను పేర్లుగల అతని ముగ్గురు హెబ్రీ సహవాసులు కూడా సద్గుణం విషయంలో మాదిరిగా ఉన్నారు. వాళ్లు తమ స్వదేశం నుండి బలవంతంగా బబులోను చెరలోనికి కొనిపోబడ్డారు. ఆ నలుగురు యువకులకూ బెల్తెషాజరు, షద్రకు, మేషాకు, అబేద్నెగో అను బబులోను పేర్లు పెట్టబడ్డాయి. దేవుని ధర్మశాస్త్రం నిషేధించిన ఆహారపదార్థాలతోపాటూ “రాజు . . . భుజించు ఆహారము [“రుచికరమైన ఆహారపదార్థాలు,” NW]” వారికి ఇవ్వబడింది. అంతేగాక, వాళ్లు మూడు సంవత్సరాలపాటు నిర్బంధంలో “కల్దీయుల విద్యను, భాషను” నేర్చుకోవాల్సి వచ్చింది. ‘కల్దీయులు’ అనే పదం ఇక్కడ బహుశా పండిత వర్గాన్ని సూచిస్తూండవచ్చు గనుక ఇందులో కేవలం మరో భాషను నేర్చుకోవడంకన్నా ఎక్కువే చేరివుంది. ఆ విధంగా, ఈ ముగ్గురు హెబ్రీ యువకులూ పెడద్రోవ పట్టించే బబులోను బోధల ప్రభావానికి లోనయ్యే అపాయంలో ఉన్నారు.—దానియేలు 1:1-7.
6. దానియేలు సద్గుణాన్ని వెంబడించాడని మనమెందుకు చెప్పగలం?
6 అలా పెడద్రోవకు తీసుకెళ్లే అపరిమితమైన ఒత్తిళ్లున్నప్పటికీ దానియేలూ అతని ముగ్గురు సహవాసులూ దుర్గుణానికి బదులు సద్గుణాన్నే ఎంపికచేసుకున్నారు. దానియేలు 1:21వ వచనం ఇలా చెబుతోంది: “దానియేలు కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమువరకు జీవించెను.” అవును, దానియేలు యెహోవా దేవుని సద్గుణసంపన్నుడైన సేవకునిగా 80 ఏళ్లకుపైగా ‘జీవించాడు.’ అవినీతిపరులైన ప్రభుత్వాధికారులు కుట్రలూ కుతంత్రాలూ పన్నినప్పటికీ, బబులోను మతంలో లైంగిక దుర్గుణం వ్యాపించివున్నప్పటికీ ఆయన దేవుని ఎడల నమ్మకంగానే ఉన్నాడు. దానియేలు సద్గుణాన్ని వెంబడించడంలో కొనసాగాడు.
7. దానియేలూ అతని ముగ్గురు సహవాసులూ అనుసరించిన విధానం నుండి మనమేమి నేర్చుకోగలం?
7 దైవిక భయంగల దానియేలు నుండీ, ఆయన సహవాసుల నుండీ మనమెంతో నేర్చుకోగలం. వాళ్లు సద్గుణాన్ని వెంబడించేరు, బబులోను సంస్కృతిలో విలీనమైపోవడాన్ని తిరస్కరించేరు. వాళ్లకు బబులోను పేర్లు పెట్టబడినప్పటికీ, యెహోవా సేవకులుగా వాళ్లు తమ గుర్తింపును ఎన్నడూ కోల్పోలేదు. అంతెందుకు, దాదాపు 70 ఏళ్లు గడిచిన తర్వాత బబులోను రాజు దానియేలును అతని హెబ్రీ పేరుతో సంభోదించాడు! (దానియేలు 5:13) దానియేలు తాను జీవించిన కాలమంతటిలోనూ చిన్నచిన్న విషయాల్లో సహితం రాజీపడడానికి ఒప్పుకోలేదు. యౌవనునిగా ఆయన, “రాజు భుజించు భోజనమును పానముచేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని” తన హృదయంలో నిశ్చయించుకున్నాడు. (దానియేలు 1:8) దానియేలూ, అతని ముగ్గురు సహవాసులూ తీసుకున్న రాజీపడని ఈ నిర్ణయం వాళ్లు తర్వాత ఎదుర్కొన్న జీవన్మరణ పరీక్షలనుండి బ్రతికిబయట పడేలా వారిని నిస్సందేహంగా బలపర్చింది.—దానియేలు, 3, 6 అధ్యాయాలు.
సద్గుణాన్ని నేడు వెంబడించడం
8. సాతాను లోకంలోనికి విలీనమైపోవడాన్ని క్రైస్తవ యువత ఎలా నిరోధించవచ్చు?
8 దానియేలూ, అతని ముగ్గురు సహవాసులవలెనే, నేడు దేవుని ప్రజలు సాతాను దుష్టలోకంలో విలీనమైపోవడాన్ని నిరోధిస్తారు. (1 యోహాను 5:19) మీరొక క్రైస్తవ యువతయైతే, మితిమీరిన తమ వస్త్రాభిరుచుల్నీ కేశాలంకరణాభిరుచుల్నీ, సంగీతాభిరుచుల్నీ అనుకరించాలని స్నేహితులు మీపై తెచ్చే తీవ్రమైన ఒత్తిడిని మీరు ఎదుర్కొంటూ ఉండొచ్చు. అయితే, జనసామాన్యమైన ప్రతీ వేలంవెర్రినీ లేదా ప్రతీ స్టైలునూ అనుసరించకుండా స్థిరంగా నిలబడండి, ‘ఈ లోక మర్యాదను అనుసరించేందుకు’ మిమ్మల్ని మీరు అనుమతించుకోకండి. (రోమీయులు 12:2) “భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, . . . స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలె[ను.]” (తీతు 2:11-13) యెహోవా అంగీకారమే ప్రాముఖ్యం కానీ మీ స్నేహితుల అంగీకారం కాదు.—సామెతలు 12:2.
9. వ్యాపారం చేస్తున్న క్రైస్తవులు ఏ ఒత్తిళ్లను ఎదుర్కోవచ్చు, మరి వారు ఎలా ప్రవర్తించాలి?
9 వయోజనులైన క్రైస్తవులు కూడా ఒత్తిళ్లను ఎదుర్కుంటారు, మరి వాళ్లూ సద్గుణవంతులుగా ఉండాలి. వ్యాపారంచేస్తున్న క్రైస్తవులు ప్రశ్నించదగిన వ్యాపార పద్ధతుల్ని ఉపయోగించేందుకుగానీ లేదా ప్రభుత్వ కట్టడల్నీ, పన్నులు కట్టాల్సిన చట్టాల్నీ ఉపేక్షించేందుకుగానీ శోధించబడవచ్చు. అయితే, వ్యాపార పోటీదార్లూ లేక తోటి పనివారూ ఎలా ప్రవర్తించినప్పటికీ “మనం అన్ని విషయాల్లోనూ నిజాయితీగా ప్రవర్తించాలని అనుకుంటున్నాం.” (హెబ్రీయులు 13:18, NW) మనం యజమానులతోనూ, ఉద్యోగస్థులతోనూ, వినియోగదార్లతోనూ, లౌకిక ప్రభుత్వాలతోనూ నిజాయితీగా, కల్లాకపటంలేకుండా లేఖనాధారంగా ఉండాలని కోరబడుతున్నాం. (ద్వితీయోపదేశకాండము 25:13-16; మత్తయి 5:37; రోమీయులు 13:1; 1 తిమోతి 5:18; తీతు 2:9, 10) మన వ్యాపార వ్యవహారాల్లో కూడా మనం క్రమబద్ధంగా ఉండేందుకు కృషి చేద్దాం. కచ్చితమైన రికార్డులను ఉంచుకోవడం ద్వారా, ఒప్పందాల్ని రాతపూర్వకంగా కుదుర్చుకోవడం ద్వారా మనం తరచూ అపార్థాల్ని అరికట్టవచ్చు.
జాగరూకతతో ఉండండి!
10. సంగీతాన్ని మనం ఎంపిక చేసుకునే విషయానికి వచ్చినప్పుడు మనం ఎందుకు ‘జాగరూకతతో ఉండాల్సిన’ అవసరం ఉంది?
10 దేవుని దృష్టిలో సద్గుణవంతులుగా నిలిచివుండే మరో కోణాన్ని కీర్తన 119:9వ వచనం ఉన్నతపరుస్తోంది. కీర్తనల గ్రంథకర్త ఇలా పాడాడు: “యౌవనులు దేనిచేత తమ నడత శుద్ధిపరచు కొందురు? నీ వాక్యమునుబట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా?” సాతాను ఉపయోగించుకుంటున్న అత్యంత అమోఘమైన ఆయుధాల్లో సంగీతం ఒకటి, దానికి భావోద్రేకాల్ని రేపే శక్తివుంది. విచారకరంగా, సంగీతం విషయానికి వచ్చేటప్పటికీ కొంతమంది క్రైస్తవులు ‘జాగరూకతతో ఉండడంలో’ విఫలులయ్యారు. ర్యాప్, హెవీ మెటల్ వంటి సంగీతపు విపరీతమైన రూపాలవైపు వారు ఆకర్షించబడుతున్నారు. అలాంటి సంగీతం తమకు హానికలుగజేయదనీ లేక తాము పాటలపై అవధానాన్ని నిలపడంలేదనీ కొంతమంది వాదించవచ్చు. ఇతరులు తాము కేవలం స్ట్రాంగ్ బీట్‌ను లేక గిటారుచేసే పెద్దపెద్ద శబ్దాల్ని ఎంజాయ్ చేస్తున్నామని చెబుతారు. అయితే క్రైస్తవులకు, తాము దేన్నైనా ఎంజాయ్ చేస్తున్నామా లేదా అనేది వివాదాంశం కాదు. అది ‘ప్రభువుకు ప్రీతికరమైనదా’ కాదా అనేదే వాళ్ల శ్రద్ధయైవుంది. (ఎఫెసీయులు 5:10) మొత్తంమీద అపవిత్రత, జారత్వం, సాతానువాదం వంటి వాటిని పెంపొందించే హెవీ మెటల్, ర్యాప్ సంగీతాలు దేవుని ప్రజల మధ్య ఎంతమాత్రం ఉండడానికి వీల్లేదు.a (ఎఫెసీయులు 5:3) యౌవనులైనా లేక వృద్ధులైనా మనలో ప్రతి ఒక్కరమూ ఈ ప్రశ్న గురించి ఆలోచించడం మంచిది: నేను ఎంపికచేసుకునే సంగీతం ద్వారా నేను సద్గుణాన్ని వెంబడిస్తూ ఉన్నానా లేక దుర్గుణాన్ని వెంబడిస్తూ ఉన్నానా?
11. టెలివిజన్ కార్యక్రమాలకూ, వీడియోలకూ, చలనచిత్రాలకూ సంబంధించి ఓ క్రైస్తవుడు ఏ విధంగా జాగరూకతతో ఉండగలడు?
11 అనేకమైన టెలివిజన్ కార్యక్రమాలూ, వీడియోలూ, చలనచిత్రాలూ దుర్గుణాన్ని పెంపొందింపజేస్తున్నాయి. ఒక మానసిక ఆరోగ్య నిపుణుని ప్రకారంగా, నేడు నిర్మించబడుతున్న అనేక చలనచిత్రాల్లో ‘ఆనందమే పరమావధి అనే సిద్ధాంతమూ, లైంగికత్వమూ, హింసా, అత్యాశ, స్వార్థపరాయణత్వమూ’ ప్రధానాంశాలుగా ఉన్నాయి. కాబట్టి, జాగరూకతతో ఉండడంలో, మనం చూడాలనుకున్న వాటిలో మేలైనవాటిని ఎంపికచేసుకునే వారిగా ఉండడం కూడా చేరివుంది. కీర్తనల గ్రంథకర్త ఇలా ప్రార్థించాడు: “వ్యర్థమైనవాటిని చూడకుండ నా కన్నులు త్రిప్పి వేయుము.” (కీర్తన 119:37) జోసెఫ్ అనే పేరుగల ఓ క్రైస్తవ యువకుడు ఈ సూత్రాన్ని అన్వయించుకున్నాడు. ఒకానొక సినిమా విశృంఖలమైన సెక్సునీ హింసనీ చూపించడం ఆరంభించగానే అతడు థియేటర్‌ను విడిచిపెట్టి వచ్చేశాడు. అలా చేయడానికి అతడేమైనా సిగ్గుపడ్డాడా? “సిగ్గుపడనే పడలేదు, యెహోవానూ మరి ఆయనను ప్రీతిపర్చడాన్నీ నేను ప్రధమమైనదిగా తలంచాను” అని జోసెఫ్ చెబుతున్నాడు.
పఠించడమూ, ధ్యానించడమూ నిర్వహించే పాత్ర
12. సద్గుణాన్ని వెంబడించేందుకు వ్యక్తిగత పఠనమూ, ధ్యానించడమూ ఎందుకు అవసరం?
12 చెడు విషయాల్ని విడనాడడం మాత్రమే సరిపోదు. సద్గుణాన్ని వెంబడించడమందు, దేవుని వాక్యపు నీతియుక్తమైన సూత్రాల్ని జీవితంలో అన్వయించుకొనేలా దానిలో రాయబడివున్న మంచి విషయాల్ని అధ్యయనం చేయడమూ, ధ్యానించడమూ చేరివుంది. “నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది!” అని కీర్తనల గ్రంథకర్త ఆశ్చర్యాన్ని వ్యక్తపర్చాడు. “దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను.” (కీర్తన 119:97) బైబిల్నీ క్రైస్తవ ప్రచురణల్నీ అధ్యయనం చేయడం, మీ వ్యక్తిగత షెడ్యూల్‌లో ఓ భాగంగా ఉందా? నిజమే, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చేయడం కొరకూ, దానిపై ప్రార్థనాపూర్వకంగా ధ్యానించడం కొరకూ సమయాన్ని కల్పించుకోవడం ఓ సవాలుగా ఉండగలదు. కానీ ఇతర కార్యక్రమాలనుండి సమయాన్ని సంపాదించుకోవడం తరచూ సాధ్యమే. (ఎఫెసీయులు 5:15, 16) బహుశా ప్రాతఃకాలపు వేళలు, ప్రార్థన చేసుకోవడానికీ, అధ్యయనం చేసుకోవడానికీ ధ్యానించుకోవడానికీ మీకు అనుకూలమైన సమయాలుగా ఉండొచ్చు.—కీర్తన 119:147 పోల్చండి.
13, 14. (ఎ) ధ్యానించడం ఎందుకు ఎంతో అమూల్యమైనది? (బి) ఏ లేఖనాల్ని ధ్యానించడం, లైంగిక దుర్నీతిని అసహ్యించుకోవడానికి మనకు సహాయపడగలదు?
13 ధ్యానించడం, మనం నేర్చుకున్నవాటిని మర్చిపోకుండా ఉండేలా మనకు సహాయపడుతుంది గనుక అది ఎంతో అమూల్యమైనది. అత్యంత ప్రాముఖ్యంగా, అది దైవిక దృక్పథాల్ని పెంపొందించుకునేందుకు సహాయపడగలదు. ఉదాహరణకు: దేవుడు జారత్వాన్ని నిషేధిస్తాడని తెల్సుకోవడం ఒక విషయమైతే, ‘చెడ్డదాని నసహ్యించుకొని మంచిదానిని హత్తుకొనడం’ అనేది పూర్తిగా మరొక విషయమైవుంది. (రోమీయులు 12:9) “భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, [“లైంగికపరమైన ఆకలిని,” NW] కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను చంపివేయుడి” అని ఉద్బోధిస్తున్న కొలొస్సయులు 3:5వ వచనం వంటి మూల బైబిలు వచనాలను ధ్యానించడం ద్వారా లైంగిక దుర్నీతిని గురించి యెహోవా భావిస్తున్నట్లుగా మనం నిజంగా భావించగల్గుతాం. మీకుగా మీరే ఇలా ప్రశ్నించుకోండి: ‘ఏ రకమైన లైంగికపర ఆకలిని నేను చంపివేసుకోవాలి? అపవిత్రమైన కోరికను రేకెత్తించే దేనిని నేను విడనాడాలి? వ్యతిరేక లింగ వ్యక్తులతో నేను వ్యవహరించే విధానంలో నేను మార్పుల్ని చేసుకోవాల్సిన అవసరంవుందా?’—1 తిమోతి 5:1, 2, పోల్చండి.
14 “ఎవడునూ తన సహోదరుని హక్కులకు హానిని కల్గించే, ఆ హక్కులను అతిక్రమించే స్థాయికి చేరకుండా” ఉండేలా జారత్వానికి దూరంగా ఉండమనీ, ఆశానిగ్రహాన్ని అలవర్చుకుంటూ ఉండాలనీ పౌలు క్రైస్తవులకు ఉద్బోధిస్తున్నాడు. (1 థెస్సలొనీకయులు 4:3-7, NW) మిమ్మల్ని మీరే ఇలా ప్రశ్నించుకోండి: ‘జారత్వాన్ని చేయడం ఎందుకు హానికరమైనది? ఈ విషయంలో నేను పాపముచేస్తే నాకు నేనుగా ఏ హానిని చేసుకుంటాను లేక మరొకరికి ఎలాంటి హానిని కలుగచేస్తాను? ఆత్మీయంగా, భావోద్రేకపరంగా, భౌతికంగా నేనెలా ప్రభావితున్నౌతాను? దేవుని చట్టాల్ని ఉల్లంఘించి, పశ్చాత్తాపం చూపకుండా సంఘంలో ఉన్న వ్యక్తుల విషయమేమిటి? వాళ్ల విషయంలో పరిస్థితులెలా మారిపోయాయి?’ అలాంటి ప్రవర్తనను గురించి లేఖనాలు చెబుతున్న దాన్ని హృదయంలోనికి తీసుకోవడం, దేవుని దృష్టిలో చెడ్డదైన దాని ఎడల మనం విద్వేషాన్ని పెంచుకునేలా చేయగలదు. (నిర్గమకాండము 20:14; 1 కొరింథీయులు 5:11-13; 6:9, 10; గలతీయులు 5:19-21; ప్రకటన 21:8) జారుడు, ‘మనుష్యుని ఉపేక్షింపక . . . దేవునినే ఉపేక్షించుచున్నాడు’ అని పౌలు చెబుతున్నాడు. (1 థెస్సలొనీకయులు 4:8) తన పరలోకపు తండ్రిని ఏ నిజ క్రైస్తవుడు ఉపేక్షిస్తాడు?
సద్గుణమూ, సహవాసమూ
15. సద్గుణాన్ని మనం వెంబడించడంలో సహవాసం ఏ పాత్రను నిర్వహిస్తుంది?
15 సద్గుణవంతులుగా నిలిచివుండేందుకు మరో సహాయకం, మంచి సహవాసమే. కీర్తనల గ్రంథకర్త ఇలా పాడాడు: “నీయందు భయభక్తులు గలవారందరికిని నీ ఉపదేశములను అనుసరించువారికిని నేను చెలికాడను.” (కీర్తన 119:63) క్రైస్తవ సంఘాల్లో మనం పొందే క్షేమాభివృద్ధికరమైన సహవాసం మనకు అవసరం. (హెబ్రీయులు 10:24, 25) మనల్ని మనం వేరుపర్చుకున్నట్లైతే, మనం మన ఆలోచనా విధానంలో స్వార్థపరులుగా ఉంటాం. దుర్గుణం మనల్ని సులభంగా లోబర్చుకోగలదు. (సామెతలు 18:1) అయితే, వాత్సల్యపూర్వకమైన క్రైస్తవ సహవాసం, సద్గుణవంతులుగా నిలిచివుండాలనే మన తీర్మానాన్ని బలపర్చగలదు. చెడు సహవాసాలకు వ్యతిరేకంగా కూడా జాగరూకతతో ఉండాలి. మనం పొరుగువారితోనూ, తోటి పనివారితోనూ, తోటి విద్యార్థులతోనూ సాదరంగా వ్యవహరించవచ్చు. కానీ మనం నిజంగా జ్ఞానయుక్తంగా నడుస్తున్నట్లైతే, క్రైస్తవ సద్గుణాన్ని వెంబడించని వారితో మరీ స్నేహపూర్వకంగా ఉండకుండా జాగ్రత్తవహిస్తాం.—కొలొస్సయులు 4:5, పోల్చండి.
16. మొదటి కొరింథీయులు 15:33వ వచన అన్వయింపు, సద్గుణాన్ని వెంబడించేందుకు నేడు మనకెలా సహాయపడగలదు?
16 పౌలు ఇలా రాశాడు: “దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును.” ఈ వ్యాఖ్యానం చేయడం ద్వారా, పునరుత్థానాన్ని గూర్చిన లేఖనాధారిత బోధను తిరస్కరించిన నామకార్థ క్రైస్తవులతో సహవసిస్తే తమ విశ్వాసాన్ని కోల్పోతారని విశ్వాసుల్ని ఆయన హెచ్చరించాడు. పౌలు హెచ్చరిక వెనుకనున్న సూత్రం మన సహవాసాలకు అంటే సంఘానికి వెలుపలివారితోనైనా లోపలివారితోనైనా చేసే సహవాసాలకు అన్వయిస్తుంది. (1 కొరింథీయులు 15:12, 33) సహజంగానే, పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి మన అభిప్రాయాల్లో కొన్నింటితో మన ఆత్మీయ సహోదర సహోదరీలు ఏకీభవించక పోయినందున, మనం వారిని దూరంగా ఉంచాలని అనుకోం. (మత్తయి 7:4, 5; రోమీయులు 14:1-12) అయితే, సంఘంలోని కొందరు ప్రశ్నించదగిన ప్రవర్తనను కల్గివున్నట్లైతే లేక కఠినమైన స్ఫూర్తినో, ఫిర్యాదుచేసే స్ఫూర్తినో ప్రదర్శిస్తున్నట్లైతే జాగ్రత్త వహించడం అవసరం. (2 తిమోతి 2:20-22) మనం ఎవరితోనైతే “పరస్పర ప్రోత్సాహాన్ని” ఆనందించగలమో అలాంటి వారితో సన్నిహితంగా ఉండడం జ్ఞానయుక్తం. (రోమీయులు 1:11, 12, NW) సద్గుణవంతమైన నడవడిని వెంబడించేందుకూ, “జీవమార్గమున” నిలిచివుండేందుకూ ఇది మనకు సహాయపడుతుంది.—కీర్తన 16:11.
సద్గుణాన్ని వెంబడిస్తూ ఉండండి
17. సంఖ్యాకాండము 25వ అధ్యాయము ప్రకారంగా, ఇశ్రాయేలీయులకు ఏ విపత్తు సంభవించింది, ఇది మనకు ఏ పాఠాన్ని తెలియజేస్తోంది?
17 ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశాన్ని ఆక్రమించుకోవడానికి కొంచెం ముందు, వారిలో వేలాదిమంది దుర్గుణాన్ని వెంబడించేందుకు ఎంపిక చేసుకొని, గొప్ప విపత్తును అనుభవించారు. (సంఖ్యాకాండము 25వ అధ్యాయము) నేడు యెహోవా ప్రజలు, నీతియుక్తమైన నూతన లోకంలో ప్రవేశించబోతున్నారు. ఈ లోకపు దుర్గుణాల్ని ఎడతెగకుండా తిరస్కరించేవారికి, అందులో ప్రవేశించడం ఆశీర్వాదకరమైన ఆధిక్యతయైవుంటుంది. అపరిపూర్ణ మానవులుగా, బహుశా మనం చెడు తలంపులను కల్గి ఉండవచ్చు కానీ తన పరిశుద్ధాత్మ ఇచ్చే నీతియుక్తమైన నడిపింపుల్ని అనుసరించేందుకు మనకు దేవుడు సహాయపడగలడు. (గలతీయులు 5:16; 1 థెస్సలొనీకయులు 4:3, 4) కాబట్టి మనం యెహోషువ ఇశ్రాయేలీయులకు చేసిన ఈ ఉద్బోధను లక్ష్యపెడదాం: “యెహోవాయందు భయ భక్తులుగలవారై, ఆయనను నిష్కపటముగాను సత్యముగాను . . . సేవించుడి.” (యెహోషువ 24:14) యెహోవాను అప్రీతిపరుస్తామనే గౌరవనీయమైన భయం సద్గుణవంతమైన నడవడిని వెంబడించేందుకు మనకు సహాయపడుతుంది.
18. దుర్గుణ సద్గుణాల్ని గురించి, క్రైస్తవులందరి నిశ్చయమేమై ఉండాలి?
18 దేవున్ని ప్రీతిపర్చడం మీ హృదయపూర్వకమైన కోరికయైనట్లైతే, పౌలు ఇచ్చిన ఈ ఉద్బోధను లక్ష్యపెట్టేందుకు నిశ్చయించుకోండి: “యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, [“ఏది సద్గుణవంతమైనదో, ఏది ప్రశంసార్హమైనదో దాని మీద,” NW] ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటిమీద ధ్యానముంచుకొనుడి.” మీరు దీని చేసినట్లైతే, ఫలితమేమై ఉంటుంది? పౌలు ఇలా తెలియజేశాడు: “అట్టివాటిని చేయుడి; అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడైయుండును.” (ఫిలిప్పీయులు 4:8, 9) అవును, యెహోవా సహాయంతో మీరు దుర్గుణాన్ని తిరస్కరించి, సద్గుణాన్ని వెంబడించగలరు.
[అధస్సూచీలు]
a సంఘపుస్తక పఠనముల కొరకు కావలికోట శీర్షికలు అనే బ్రోషూరులో 36-40 పేజీలనూ, అలాగే ఫిబ్రవరి 8, ఫిబ్రవరి 22, మార్చి 22, 1993, నవంబరు 22, 1996 నాటి తేజరిల్లు!ల్లో (ఆంగ్లం) “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . . ” శీర్షికల పరంపరను చూడండి.
పునఃసమీక్షించాల్సిన విషయాలు
◻ సద్గుణాన్ని వెంబడించేందుకు ఏమి అవసరం?
◻ హిజ్కియా, దానియేలూ మరి ముగ్గురు హెబ్రీయులు ఏ పరిస్థితుల్లో సద్గుణవంతులుగా నిలిచివున్నారు?
◻ సాతాను కుతంత్రాల్ని నిరోధించడంలో మనం దానియేలు వలె ఎలా ఉండగలం?
◻ వినోదానికి సంబంధించి క్రైస్తవులు ఎందుకు జాగరూకతతో ఉండాలి?
◻ సద్గుణాన్ని వెంబడించడంలో పఠనమూ, ధ్యానించడమూ, సహవాసమూ ఏ పాత్రను నిర్వహిస్తాయి?
[15వ పేజీలోని చిత్రం]
యౌవనుడైన హిజ్కియా మొలెకు ఆరాధికుల మధ్య ఉన్నప్పటికీ సద్గుణాన్ని వెంబడించాడు
[17వ పేజీలోని చిత్రం]
వినోదం విషయానికి వచ్చేటప్పటికి క్రైస్తవులు జాగరూకతతో ఉండాలి