యెహోవాసాక్షులు సందర్శించినప్పుడు
యెహోవాసాక్షుల్లో ఎవరైనా తమ ఇంటిని సందర్శించినప్పుడు కాథలిక్కులు ఏం చెయ్యాలి? నేషనల్ కాటకిస్టిక్ బ్యూరో ఆఫ్ ది ఇటాలియన్ బిషప్స్ కాన్ఫరెన్స్ తయారుచేసిన ఇటీవలి ప్రచురణ ఒకటి ఇలా చెబుతుంది: “మర్యాదపూర్వకంగా, అయితే దృఢంగా సంభాషణను తిరస్కరించడం అంటే ఈ సందర్భంలో నిర్దయగా ప్రవర్తించడమని అర్థం కాదు.”
ఇటలీలోని ఫాగ్గియాలో నివసించే ఒక వ్యక్తి గాడ్జెట్టా డెల్ మెడ్జోజార్నో అనే దినపత్రికకు పంపించిన ఈ ఉత్తరం చూపుతున్నట్లు కాథోలిక్కులందరూ దానికి సమ్మతించడంలేదు:
“నేను యెహోవాసాక్షిని కాను. నేనొక కాథోలిక్కును. కానీ తలుపులపై యెహోవాసాక్షులను వెనక్కివెళ్లిపొమ్మని చెప్పే నోటీసులను అంటించమని చెబుతూ విశ్వాసులపైన చర్చి విధించే కొన్ని నియమాలు చూస్తుంటే నాకు ఆశ్చర్యమేస్తుంది. ఎంతైనా ఈ ప్రజలు దేవుని వాక్యాన్ని మాత్రమే ప్రకటిస్తున్నారు. మరి వారు బైబిలును గురించిన లోతైన జ్ఞానాన్ని పొందేలా ఇతరులకు సహాయపడతారు. ఈ ఉపదేశాలు చూస్తుంటే ఇటలీపై కలరా దాడిచేసినప్పుడు ఆ అంటురోగాన్ని ఎలా నివారించాలన్నదాని గురించి మాకు సలహాలు ఇచ్చిన సమయం నాకు గుర్తుకు వస్తుంది.
“విశ్వాసుల ఇష్టాయిష్టాలను పరిగణనలోనికి తీసుకోకుండా చర్చి తన స్వంత నియమాలను విధిస్తుందని ఇది చూపుతోందన్నది నా అభిప్రాయం. కానీ కాథోలిక్కులు కూడా ఇంటింటికీ వెళ్తూ యెహోవాసాక్షుల ఇండ్లను కూడా సందర్శించడం నేను ఇప్పటికి కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను; వారు వీరిని లోపలికి రానిస్తారు, సంభాషిస్తారు, వారు ఎవర్నీ వెనక్కి తిప్పి పంపించరు.”
యెహోవాసాక్షులు తమ సందేశాన్ని స్వీకరించమని ప్రజల్ని బలవంతపెట్టరు. బదులుగా, వారు కలవరపర్చే ఈ కాలాల్లో ఆదరణకరంగా ఉన్నట్లు కనుగొన్న, దేవుని వాక్యంలో అందించబడిన నిరీక్షణను ఇతరులతో పంచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇంటింటికీ వెళ్లడంద్వారా, వీధుల్లో తాము కల్సినవారితో మాట్లాడడంద్వారా యెహోవాసాక్షులు దేవుని రాజ్యాన్ని గూర్చిన సువార్తను దానిని వినడానికిష్టపడేవారితో పంచుకుంటారు.—మత్తయి 24:14; అపొస్తలుల కార్యములు 5:42; 17:17.