“దేవుని వాక్యంలో విశ్వాసం” జిల్లా సమావేశానికి రండి!
ప్రపంచవ్యాప్తంగా వందలాది స్థలాల్లో అనేక లక్షలమంది దానికి హాజరౌతారు. కేవలం భారతదేశంలోనే 16 సమావేశాలు ఏర్పాటు చేయబడ్డాయి. మొదటిది అక్టోబరు 10 నుండి 12 వరకూ చివరిది జనవరి 2 నుండి 4 వరకూ ఉంటాయి. శుక్రవారం నుండి ఆదివారం వరకూ జరిగే ఈ మూడు దినాల సమావేశాల్లో ఒకటి మీకు సమీపంగావున్న నగరంలో జరుగుతుండవచ్చు.
ఆచరణాత్మకమైన బైబిలు ఉపదేశ సంపద నుండి మీరు ప్రయోజనం పొందుతారు. అనేక స్థలాల్లో ఈ కార్యక్రమం ప్రతీ ఉదయం 9:30కి సంగీతంతో ప్రారంభమౌతుంది. 25 నిమిషాల పరిచయ కార్యక్రమం శుక్రవారం ఉదయం ఉంటుంది. దేవుని వాక్యంలో వారుంచిన విశ్వాసం ద్వారా వారి జీవితాలు ప్రగాఢంగా ప్రభావితం చెందిన వ్యక్తులను పరిచయం చేయడం జరుగుతుంది. ఆ మొదటి కార్యక్రమం “వెలిచూపు వలనగాక విశ్వాసం వలన నడవడం” అనే ముఖ్యాంశ ప్రసంగంతో ముగుస్తుంది.
శుక్రవారం మధ్యాహ్నం ఉండే మొదటి ప్రసంగం క్రైస్తవ సంఘంలో యౌవనులు కలిగివున్న ప్రధానమైన పాత్రను పరిశీలిస్తుంది. దాని తర్వాత మూడు భాగాల గోష్ఠి, ప్రవర్తనలోనూ ముస్తాబవ్వడంలోనూ క్రైస్తవ ప్రవర్తనకు సంబంధించిన బైబిలు ప్రమాణాలను గురించి చర్చిస్తుంది. “విశ్వాస లోపం విషయమై జాగ్రత్తగా ఉండండి” మరియు “దేవుని వాక్యం సజీవమైనది” అనే తర్వాతి ప్రసంగాలు, హెబ్రీయులు 3 మరియు 4 అధ్యాయాల్లోని చక్కని సలహాలపై కేంద్రీకరిస్తాయి. “అందరి కొరకైన ఒక పుస్తకం” అనే ప్రసంగంతో శుక్రవారం నాటి కార్యక్రమం ముగుస్తుంది.
“క్రియలు లేని విశ్వాసం మృతం” అనేది శనివారం ఉదయం ఇవ్వబడే మొదటి ప్రసంగం. “సత్యంలో వ్రేళ్లూని స్థిరంగా ఉండండి” అనేది ఆ ఉదయం ఇవ్వబడే మరొక ప్రాముఖ్యమైన ప్రసంగం, అది ఆత్మీయ పురోభివృద్ధిని ఎలా సాధించవచ్చనే విషయాన్ని వివరిస్తుంది. ఆ ఉదయకాల కార్యక్రమం ప్రతీ సమావేశంలోను తప్పకుండా ఉండే ప్రసంగంతో, అంటే “దేవుని వాక్యమందు విశ్వాసం బాప్తిస్మానికి నడిపిస్తుంది” అనే ప్రసంగంతో ముగుస్తుంది, దాని తర్వాత క్రొత్త శిష్యులకు బాప్తిస్మం ఇవ్వబడేందుకు ఏర్పాట్లు ఉంటాయి.
శనివారం మధ్యాహ్నం ఇవ్వబడే ప్రారంభ ప్రసంగం “విశ్వాసం కొరకు గట్టి పోరాటాన్ని సలపండి” అనేది, యూదా వ్రాసిన బైబిలు పుస్తకంలోని సలహాలను చర్చిస్తుంది. “దేవుని గృహానికి వెళ్దాము రండి” అనే శీర్షికగల గోష్ఠి క్రైస్తవ కూటాల ప్రయోజనాలను పరిశీలిస్తుంది, అది ఒక గంటసేపు కొనసాగుతుంది. “మీ విశ్వాసం యొక్క లక్షణం—ఇప్పుడు పరీక్షించబడింది” అనే ప్రసంగంతో ఆ దిన కార్యక్రమం ముగుస్తుంది.
ఆదివారం ఉదయం కార్యక్రమంలో మూడు భాగాల గోష్ఠి ఉంటుంది, అది బైబిలు పుస్తకమైన యోవేలు గ్రంథాన్ని గురించీ మన దినంలో దాని అన్వయింపును గురించీ చర్చిస్తుంది. “మీ కంటిని తేటగా ఉంచుకోండి” అనే బైబిలు నాటకం దాని తర్వాత ఉంటుంది. సమావేశం యొక్క ఉన్నతాంశం “విశ్వాసం మరియు మీ భవిష్యత్తు” అనే మధ్యాహ్న బహిరంగ ప్రసంగం.
దీనికి హాజరవ్వడం ద్వారా మీరు తప్పక ఆత్మీయంగా అభివృద్ధి చెందుతారు. ప్రతీ కార్యక్రమానికీ మీరు సాదరంగా ఆహ్వానింపబడతారు. హాజరయ్యేందుకు ఇప్పుడే పథకాలు వేసుకోండి. మీకు సమీపంలో జరిగే సమావేశ స్థలం కొరకు, యెహోవాసాక్షుల స్థానిక రాజ్య మందిరాన్ని సంప్రదించండి లేదా ఈ పత్రిక ప్రకాశకులకు వ్రాయండి. భారతదేశంలో జరిగే సమావేశాల చిరునామాలను మీరు తేజరిల్లు! యొక్క రాబోయే సంచికలో కనుగొనవచ్చు.