నరకాన్ని గూర్చిన సత్యం
ఏదేమైనప్పటికీ నరకం అగ్ని గుండం కాదని చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ యొక్క సైద్ధాంతిక కమీషన్ నివేదిస్తుంది; బదులుగా, అది శూన్యానికి సంబంధించిన అస్పష్టమైన స్థలం. “ఈ మార్పుకు అనేక కారణాలున్నాయి, అయితే వాటిలో, భయపెట్టే మతానికి విరుద్ధంగా క్రైస్తవ విశ్వాసంలోని వారినుండి మరియు దాని వెలుపలివారి నుండి వచ్చిన నైతిక తిరుగుబాటు, అలాగే కోట్లాదిమందిని నిత్య హింసకు గురి చేసిన దేవుని గూర్చిన తలంపుకు దేవుడు క్రీస్తునందు చూపిన ప్రేమకు ఎంతో తేడా ఉందనే పెరుగుతున్న భావం కూడా ఇమిడి ఉన్నాయి” అని ఆ నివేదిక వివరిస్తుంది.
నరకాన్ని గూర్చిన ఈ సాంప్రదాయ దృక్కోణం నచ్చకపోవడం కేవలం చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్‌కు మాత్రమే పరిమితమై లేదు. పాపులను దహించే పగతీర్చుకొనే దేవున్ని ఆరాధించడం వివిధ శాఖలకు చెందిన ప్రజలకు కూడా కష్టంగా ఉంది. “ప్రజలకు ప్రేమ ఆప్యాయతలు కలిగివుండే దేవుడు కావాలి, పాపం మరియు అపరాధం గురించి మాట్లాడడం నేటి సాంప్రదాయానికి వ్యతిరేకం” అని డ్యూక్ విశ్వవిద్యాలయానికి చెందిన దైవత్వం పాఠశాలలో మతం మరియు సమాజం గురించి బోధించే ప్రొఫెసర్ జాక్సన్ కారోల్ చెబుతున్నాడు.
బైబిలు బోధిస్తున్నట్లుగా, నరకమంటే మరణించిన మానవజాతి యొక్క సామాన్య సమాధి మాత్రమేనని, అగ్నితో హింసించే స్థలం కాదని యెహోవాసాక్షులు ఎంతో కాలంగా విశ్వసించారు. వాళ్లు అలా విశ్వసించేది, ఆ ఆలోచన జనాదరణ పొందినదని కాదుగాని, “చచ్చినవారు ఏమియు ఎరుగరు; . . . పాతాళము [“నరకము,” కాథోలిక్ డ్యుయే వర్షన్ (ఆంగ్లం)]నందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు” అని బైబిలు చెబుతున్న దాన్నిబట్టి వారలా విశ్వసిస్తారు.—ప్రసంగి 9:5, 10.
మృతుల పరిస్థితిని గూర్చిన ఈ స్పష్టమైన అవగాహనతో, వాచ్‌టవర్ సొసైటీ మొదటి అధ్యక్షుడైన చార్లెస్ తేజ్ రస్సెల్, 1896లో ఇలా వ్రాశాడు: “తెగలు, స్తుతిగీతాల పుస్తకాలు, అనేకమంది మతనాయకులు తప్పుగా బోధిస్తున్నట్లుగా నిత్యం హింసింపబడేటటువంటి స్థలమైన దేనినీ [బైబిలు నందు] మనం కనుగొనము. అయినప్పటికీ మేము ఒక ‘నరకము’ షియోల్, హేడీస్ ఉన్నట్లు కనుగొన్నాము, ఆదాము పాపం మూలంగా మన వంశస్థులందరూ దానిలో ఉండేలా తీర్పు పొందారు, మన ప్రభువు మరణం మూలంగా అందరూ దాని నుండి విడిపించబడ్డారు; ఆ ‘నరకమే’ సమాధి అంటే మృత స్థితి.”
అందుకే ఒక శతాబ్దంపైగా, యెహోవాసాక్షులు నరకాన్ని గూర్చిన బైబిలు సంబంధిత సత్యాన్ని బోధిస్తున్నారు.
[32వ పేజీలోని చిత్రం]
చార్ల్‌స్ టి. రస్సెల్