మరింత అమూల్యమైనదాని కొరకు ఎంతో వదులుకోవడం
జూలియస్ ఓవో బెల్లో చెప్పినది
నేను 32 సంవత్సరాలపాటు ఆలాడెరాగా ఉన్నాను.a విశ్వాస స్వస్థతలు, ప్రార్థనలు నా సమస్యలన్నిటినీ పరిష్కరించి నా అనారోగ్యాలన్నిటినీ బాగు చేస్తాయని నేను నమ్మాను. నేను ఎన్నడూ ఏ మందులూ కొనలేదు, చివరికి బాధానివారణ మందులను కూడా కొనలేదు. ఆ సంవత్సరాల్లో, నా కుటుంబంలోని ఎవరూ ఎన్నడూ ఆసుపత్రిలో చేర్చబడలేదు. నా పిల్లల్లో ఎవరికి అనారోగ్యంగా ఉన్నా, వాళ్లు బాగుపడే వరకు వాళ్లకోసం నేను రాత్రింబగళ్లు ప్రార్థన చేసేవాడిని. దేవుడు నా ప్రార్థనలకు సమాధానమిస్తూ, నన్ను ఆశీర్వదిస్తున్నాడని నేను నమ్మాను.
నేను పశ్చిమ నైజీరియాలో ఆకూరీ అనే పట్టణంనందు అత్యంత పేరుగాంచిన సామాజిక క్లబ్బుయైన యగ్బె జాలీలో సభ్యుడను. నా స్నేహితులు సంపన్నులు మరియు మా సమాజంలో ఎంతో అధికారమున్నవారు. ఆకూరీ రాజైన డెజీ తరచూ నన్ను దర్శించడానికి మా ఇంటికి వచ్చేవాడు.
నాకు ఆరుగురు భార్యలు, ఎంతోమంది ఉపపత్నులూ ఉండేవారు. నా వ్యాపారం వర్ధిల్లింది. నాకు అంతా సవ్యంగా సాగిపోతోంది. అయినప్పటికీ, ముత్యాన్ని గూర్చిన యేసు ఉపమానంలోని వర్తకునిలా నేను ఎంతో అమూల్యమైనదొకటి కనుగొని, దాని కోసం నా ఐదుగురు భార్యలను ఉంపుడుగత్తెలను చర్చిని సామాజిక క్లబ్బును లోకసంబంధమైన పేరుప్రతిష్ఠలను వదులుకున్నాను.—మత్తయి 13:45, 46.
నేను ఆలాడెరాగా మారడం
నేను ఆలాడెరాల గురించి మొదటిసారి 1936లో అంటే నాకు 13 సంవత్సరాలున్నప్పుడు విన్నాను. గబ్రియేల్ అనే స్నేహితుడు నాకిలా చెప్పాడు: “నీవు క్రైస్ట్ అపోస్టలిక్ చర్చికి వస్తే, దేవుడు మాట్లాడడాన్ని నీవు వింటావు.”
“దేవుడెలా మాట్లాడతాడు?” అని నేనతన్ని అడిగాను.
అతనిలా అన్నాడు: “రండి, మీరే చూస్తారు.”
దేవుడు మాట్లాడితే వినాలని నాకు ఆశ కలిగింది. కాబట్టి ఆ రాత్రి నేను గబ్రియేల్‌తోపాటు చర్చికి వెళ్లాను. ఆ చిన్న భవనం ఆరాధికులతో నిండివుంది. “ప్రజలారా రండి! యేసు ఉన్నది ఇక్కడే!” అని సంఘం వల్లించనారంభించింది.
ఇలా వల్లిస్తున్నప్పుడు, ఎవరో ఇలా అరిచారు: “పరిశుద్ధాత్మా దిగిరా!” మరెవరో గంట మ్రోగించారు, సంఘం నిశ్శబ్దమైపోయింది. ఆ తర్వాత ఒక స్త్రీ అర్థంకాని భాషలో ఉత్తేజంగా లొడలొడా వాగడం మొదలుపెట్టింది. హఠాత్తుగా ఆమె ఇలా అరిచింది: “ప్రజలారా, దేవుని సందేశం వినండి! దేవుడిలా చెప్పాడు: ‘వేటగాళ్లు మానవులను చంపకుండా ఉండేలా వారికొరకు ప్రార్థించండి!’” వాతావరణం భావోద్రేకపూరితంగా మారిపోయింది.
దేవుడు ఆమె ద్వారా మాట్లాడాడని నేను నమ్మాను, కాబట్టి ఆ తర్వాతి సంవత్సరం నేను క్రైస్ట్ అపోస్టలిక్ చర్చి సభ్యునిగా బాప్తిస్మం తీసుకున్నాను.
యెహోవాసాక్షులతో తొలి పరిచయం
నేను 1951లో, అడెడెజీ బోబోయీ అనే పేరుగల సాక్షి నుండి ఒక కావలికోట పత్రికను తీసుకున్నాను. ఆ పత్రిక ఆసక్తికరంగా ఉండింది, కాబట్టి నేను దానికి చందా కట్టి, దాన్ని క్రమంగా చదివాను. 1952లో, అడో ఈకీటీలో నాలుగు రోజులు జరిగే యెహోవాసాక్షుల జిల్లా సమావేశానికి నేను హాజరయ్యాను.
నేను సమావేశం వద్ద చూసింది నాపై చెరగని ముద్రవేసింది. నేను యెహోవాసాక్షినవ్వడం గురించి గంభీరంగా తలంచాను, కాని ఆ ఆలోచనను విరమించుకున్నాను. నా సమస్యేమిటంటే ఆ సమయంలో నాకు ముగ్గురు భార్యలు, ఒక ఉపపత్ని ఉన్నారు. నేను కేవలం ఒకే భార్యతో జీవించే అవకాశం ఎంతమాత్రం లేదని నేను భావించాను.
నేను ఆకూరీకి తిరిగివచ్చినప్పుడు, ఇక నా వద్దకు రావద్దని అడెడెజీకి చెప్పి, నేను నా కావలికోట చందాను తిరిగి కట్టలేదు. నేను నా చర్చిలో ఇంకా చురుకుగా తయారయ్యాను. నేను క్రైస్ట్ అపోస్టలిక్ చర్చిలో చేరినప్పటి నుండి దేవుడు నన్ను ఆశీర్వదించాడు కదా అని నేను తర్కించుకున్నాను. నేను ముగ్గురు భార్యలను వివాహం చేసుకుని, అనేకమంది పిల్లలకు తండ్రినయ్యాను. నేను స్వంత ఇల్లు కట్టుకున్నాను. నేను ఎన్నడూ ఆసుపత్రిలో చేరలేదు. దేవుడు నా ప్రార్థనలకు జవాబిస్తున్నట్లు ఉంది కాబట్టి, నేను నా మతాన్ని ఎందుకు మార్చుకోవాలి?
పెరుగుతున్న పేరుప్రతిష్ఠలతోపాటు భ్రమ తొలగి పోయింది
నేను చర్చికి ఎక్కువ డబ్బు విరాళంగా ఇవ్వడం ప్రారంభించాను. త్వరలో నా వాళ్లు నన్ను చర్చి పెద్దగా చేశారు, చర్చి యొక్క అంతర్గత పనుల గురించి తెలుసుకోవడానికి ఆ స్థానం నాకు దోహదపడింది. నేను ఏదైతే చూశానో అది నన్ను కలతపర్చింది. పాస్టరు, “ప్రవక్తలు” డబ్బును ప్రేమించేవారు; వారి దురాశ నన్ను భయపెట్టింది.
ఉదాహరణకు, 1967 మార్చిలో నా ముగ్గురు భార్యలకు ముగ్గురు పిల్లలు జన్మించారు. చర్చిలో పిల్లలకు నామకరణోత్సవం చేసే ఆచారం ఉండేది. కాబట్టి నేను ఆ ఉత్సవం కొరకు సిద్ధపాటులో భాగంగా పాస్టరు కోసం బహుమానాలు అంటే చేపలు, నిమ్మకాయరసం, సోడా తీసుకువెళ్లాను.
చర్చిలో ప్రార్థన జరిగే రోజున, పాస్టరు సంఘమంతటి ఎదుట ఇలా చెప్పాడు: “ఈ చర్చిలోని సంపన్నులు నన్ను ఆశ్చర్యపరిచారు. వాళ్లు నామకరణోత్సవం చేసుకోవాలనుకున్నప్పుడు, వాళ్లు కేవలం సోడా, చేపలు మాత్రమే తెచ్చారు. మాంసం తేలేదు! మేకలు తేలేదు! ఆలోచించండి! కయీను పెద్ద దుంపను దేవునికి బలిగా తీసుకువెళ్లాడు, అయినప్పటికీ దానిలో రక్తం లేదు గనుక దేవుడు ఆ బలిని అంగీకరించలేదు. దేవునికి రక్తం ఉన్నవి కావాలి. హేబెలు జంతువును తీసుకువచ్చాడు, ఆయన బలి అంగీకరించబడింది.”
దానితో నేను విసురుగా లేచి బయటికి వెళ్లిపోయాను. అయితే, నేను ఇంకా చర్చికి వెళ్తూనే ఉన్నాను. క్రమంగా, నేను నా స్నేహితులతోను, మా క్లబ్బులో సమావేశాలకు హాజరవ్వడంలోను ఎక్కువ సమయం గడిపాను. కొన్నిసార్లు నేను రాజ్యమందిరంలో కూటాలకు హాజరయ్యేవాడిని, నేను కావలికోటకు తిరిగి చందా కట్టాను. అయినప్పటికీ, నేను యెహోవాసాక్షినయ్యేందుకు ఇంకా సిద్ధంగా లేను.
యెహోవా సేవ చేయాలనే నిర్ణయం
1968లో నా జీవితం మలుపు తిరిగింది. ఒకరోజు నేను మలావీలోని యెహోవాసాక్షులు క్రూరంగా హింసించబడడాన్ని వివరించిన కావలికోటలోని శీర్షికను చదవడం ప్రారంభించాను. తన విశ్వాసంతో రాజీపడడానికి నిరాకరించినందున ఒక చెట్టుకు కట్టబడి ఆరుసార్లు అత్యాచారం చేయబడిన ఒక 15 సంవత్సరాల బాలిక గురించి అది తెలియజేసింది. ఎంతో దిగ్భ్రాంతి చెంది, నేను పత్రిక ప్రక్కన పెట్టేశాను, కాని నేను దాని గురించే ఆలోచిస్తూ ఉన్నాను. మా చర్చిలోని ఏ బాలికా ఆ విధమైన విశ్వాసాన్ని చూపించదని నేను గ్రహించాను. ఆ తర్వాత ఆ సాయంకాలం, నేను పత్రిక తీసుకుని మళ్లీ ఆ పేజీని చదివాను.
నేను గంభీరంగా బైబిలు చదవడం ప్రారంభించాను. నేను జ్ఞానమందు ఎదుగుతుండగా, చర్చి మనల్ని ఎంతగా తప్పుదోవ పట్టించిందో నేను గ్రహించనారంభించాను. ప్రాచీన కాలాల్లో జరిగినట్లే, మా ప్రీస్టులు ‘ఘోరమైన కాముకత్వము జరిగిస్తున్నారు.’ (హూషేయ 6:9) అలాంటి వ్యక్తులు యేసు హెచ్చరించిన అబద్ధ ప్రవక్తలలో చేరివున్నారు! (మత్తయి 24:24) నేను వారి దర్శనాలను శక్తివంతమైన కార్యాలను ఇక ఎంతమాత్రం విశ్వసించలేదు. నేను అబద్ధమతం నుండి విడుదలై, ఇతరులు కూడా అలా చేయడానికి సహాయపడాలని నిర్ణయించుకున్నాను.
నన్ను చర్చిలోనే ఉంచడానికి ప్రయత్నాలు
నేను చర్చిని వదిలిపోవాలని నిశ్చయించుకున్నానని చర్చి పెద్దలు తెలుసుకున్నప్పుడు నన్ను వేడుకోడానికి వారు ఒక ప్రతినిధివర్గాన్ని పంపారు. డబ్బు రావడానికి ముఖ్యమైన మూలాన్ని వదులుకోవడం వాళ్లకిష్టం లేదు. ఆకూరీలోని క్రైస్ట్ అపోస్టలిక్ చర్చీల్లో ఒకదానిలో నన్ను బాబా ఎగ్బ అంటే పాట్రన్‌ను చేస్తామన్నారు.
నేను దానికి నిరాకరించి, కారణమేమిటో చెప్పాను. నేనిలా చెప్పాను, “చర్చి మనకు అబద్ధం చెబుతూ వచ్చింది. మంచివాళ్లందరూ పరలోకానికి వెళ్తారని వారు చెబుతారు. కాని నేను బైబిలు చదివాను, కేవలం 1,44,000 మంది మాత్రమే పరలోకానికి వెళ్తారని నేను గ్రహించాను. నీతిమంతులైన ఇతరులు పరదైసు భూమిపై నివసిస్తారు.”—మత్తయి 5:5; ప్రకటన 14:1, 3.
చర్చి పాస్టరు నా భార్యలను నాకు వ్యతిరేకంగా త్రిప్పాలని ప్రయత్నించాడు. యెహోవాసాక్షులు మా ఇంటికి రాకుండా చేయమని ఆయన వారికి చెప్పాడు. నా భార్యల్లో ఒకామె నా భోజనంలో విషం కలిపింది. చర్చిలో తాము చూసిన దర్శనం గురించి వారిలో ఇద్దరు నన్ను హెచ్చరించారు. నేను చర్చిని విడిచిపెడితే నేను చనిపోతానని ఆ దర్శనం తెలియజేసింది. అయినా నాతోపాటు కూటాలకు రమ్మని నా భార్యలను ఆహ్వానించి, వారికి సాక్ష్యమిస్తూ వచ్చాను. “మీకు అక్కడ వేరే భర్తలు దొరుకుతారు” అని నేను చెప్పాను. అయితే, వారిలో ఎవరూ ఆసక్తి చూపించలేదు, వారు నన్ను నిరుత్సాహపర్చడానికి ప్రయత్నిస్తూ వచ్చారు.
చివరికి, 1970 ఫిబ్రవరి 2న నేను పొరుగు పట్టణానికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి, ఇల్లు ఖాళీగా ఉంది. నా భార్యలందరూ పిల్లలను తీసుకుని ఇల్లు విడిచి వెళ్లిపోయారు.
ఒకే భార్యకు హత్తుకొని ఉండడం
‘ఇప్పుడు నేను నా వైవాహిక స్థితిని మెరుగుపరచుకోవచ్చు’ అని నేను తలంచాను. నేను నా పెద్ద భార్య జానెట్‌ను ఇంటికి తిరిగి రమ్మని ఆహ్వానించాను. ఆమె అంగీకరించింది. అయితే ఆమె కుటుంబం దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. నేను జానెట్‌ను తిరిగి రమ్మని పిలిచానని నా ఇతర భార్యలు తెలుసుకున్నప్పుడు, వాళ్లు ఆమె తండ్రి ఇంటికి వెళ్లి ఆమెను కొట్టడానికి ప్రయత్నించారు. ఆమె కుటుంబం నన్ను ఒక మీటింగ్ కొరకు పిలిచింది.
ఆ మీటింగ్‌కు దాదాపు 80 మంది వ్యక్తులు వచ్చారు. కుటుంబ పెద్ద అయిన జానెట్ బాబాయి ఇలా అన్నాడు: “నీవు ఆ అమ్మాయిని తిరిగి పెళ్లి చేసుకోవాలనుకుంటే, నీవు ఇతర స్త్రీలను కూడా తిరిగి చేర్చుకోవాలి. కాని నీవు నీ క్రొత్త మతాన్ని అనుసరిస్తూ ఒకే భార్యతో ఉండాలనుకుంటే, నీవు మరో స్త్రీని వెతుక్కోవాల్సి ఉంటుంది. నీవు జానెట్‌ను తిరిగి తీసుకువెళ్తే, నీ ఇతర భార్యలు ఆమెను చంపేస్తారు, మా అమ్మాయి చనిపోవడం మాకు ఇష్టం లేదు.”
చాలాసేపు మాట్లాడిన తర్వాత, నేను కేవలం ఒకే భార్యను కలిగివుండడానికి నిశ్చయించుకున్నానని ఆ కుటుంబం గుర్తించింది. చివరికి వాళ్లు మెత్తబడ్డారు. బాబాయి ఇలా చెప్పాడు: “మేము నీ భార్యను నీ నుండి వేరు చేయము. నీవు ఆమెను నీతో తీసుకు వెళ్లవచ్చు.”
1970 మే 21న జానెట్ నేను చట్టబద్ధంగా వివాహం చేసుకున్నాము. తొమ్మిది రోజుల తర్వాత నేను యెహోవాసాక్షుల్లో ఒకరిగా బాప్తిస్మం తీసుకున్నాను. అదే సంవత్సరం డిశంబరులో, జానెట్ కూడా బాప్తిస్మం తీసుకుంది.
యెహోవా ఆశీర్వాదాన్ని అనుభవించడం
మేము సాక్షులమౌతే మేము చనిపోతామని మా మునుపటి చర్చి సభ్యులు ప్రవచించారు. అది దాదాపు 30 సంవత్సరాల క్రితం. ఇప్పుడు నేను మరణించినా, అది నేను యెహోవాసాక్షినైనందుకే అవుతుందా? ఇప్పుడు నా భార్య మరణిస్తే, ఆమె యెహోవా సాక్షుల్లో ఒకరైనందుకని ఎవరైనా చెప్పవచ్చా?
నా 17 మంది పిల్లలకు సత్యమార్గాన్ని చూపించడానికి నేను కృషిసల్పాను. నేను సాక్షినయ్యే సమయానికి వారిలో అనేకులు పెద్దవాళ్లైనప్పటికీ, నేను వారిని బైబిలు పఠించమని ప్రోత్సహించాను, వాళ్లను కూటాలకు సమావేశాలకు తీసుకువెళ్లాను. వారిలో ఐదుగురు నాతోపాటు యెహోవా సేవలో ఉండడం నాకు ఆనందంగా ఉంది. నాతోపాటు ఒకరు సంఘంలో పెద్దగా సేవచేస్తున్నారు. మరొకరు సమీపంలోని సంఘంలో పరిచర్య సేవకునిగా ఉన్నారు. నా పిల్లల్లో ఇద్దరు క్రమ పయినీర్లుగా సేవ చేస్తున్నారు.
నేను వెనక్కి చూసుకున్నప్పుడు, తన సేవకుణ్ణయ్యేందుకు నాకు సహాయం చేయడంలో యెహోవా చూపిన కృపాబాహుళ్యాన్నిబట్టి నేను ఆశ్చర్యపోతాను. యేసు చెప్పిన ఈ మాటలు ఎంత నిజమో కదా: “నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు”!—యోహాను 6:44.
[అధస్సూచీలు]
a “ప్రార్థించే వ్యక్తి” అనే భావంగల యరూబా పదం నుండి వచ్చింది. అది ఆత్మీయ స్వస్థతను ఆచరించే ఒక ఆఫ్రికా చర్చి సభ్యున్ని సూచిస్తుంది.