మీ జీవితం విధిచే నియంత్రించబడుతుందా?
“ఆలానాడో.” పశ్చిమ ఆఫ్రికా, మాలిలోని బాంబారా భాషలో ఈ మాటకు అర్థం, “అది దేవుని పని.” ప్రపంచంలోని ఆ భాగంలో ఇటువంటి నినాదాలు సర్వ సాధారణం. వోలోఫ్ భాషలోని లోకోక్తి ఇలా సాగుతుంది: “యాలా మో కో డెఫ్” (దేవుడు అది చేశాడు). ఒక డోగోన్ గ్రామ్య మాండలికంలో, “అమా బిరే” (దేవుడు దానిని కలుగజేశాడు) అని అంటారు.
ఇతర భూభాగాల్లో ఈ మాటలకు సమానార్థకాలు ఉన్నాయి. మరణము లేక ఏదైనా దుస్సంఘటన సంభవించినప్పుడు, “ఆయన సమయం వచ్చింది,” “అది దేవుని చిత్తము” అనే లోకోక్తులు తరచూ వినబడతాయి. పశ్చిమ ఆఫ్రికాలో, “తానొకటి తలిస్తే, దైవమొకటి తలచింది” వంటి నినాదాలు సాధారణంగా ప్రజా రవాణా వాహనాలపై పెయింటు చేయబడి, దుకాణాల్లో సూచనలుగా అంటించబడి ఉంటాయి. చాలామందికి అవి కేవలం అతిశయోక్తి మాటలు మాత్రమే. అయినా, తరచూ అవి విధివాదంలో పాతుకుపోయిన నమ్మకాన్ని ప్రతిబింబిస్తాయి.
అసలు విధివాదం అంటే ఏమిటి? ద వరల్డ్ బుక్ ఎన్‌సైక్లోపీడియా దానిని “మానవులు నియంత్రించలేని శక్తులచే సంఘటనలు నిశ్చయించబడతాయన్న విశ్వాసము” అని నిర్వచించింది. ఈ “శక్తులు” ఏవి? వేలాది సంవత్సరాల క్రితం, బబులోనీయులు ఒక వ్యక్తి యొక్క విధి అతని పుట్టుక సమయంలోని నక్షత్రాల సాపేక్షస్థితిచే శక్తిమంతంగా ప్రభావితం చేయబడతాయని విశ్వసించారు. (యెషయా 47:13 పోల్చండి.) గ్రీకులు విధి అనేది జీవపు దారాన్ని వడికి, కొలిచి, కత్తిరించే ముగ్గురు శక్తిమంతమైన దేవతల చేతులలో ఉందని విశ్వసించారు. అయినా, దేవుడే స్వయంగా ఒక వ్యక్తి విధిని నిర్ణయిస్తాడన్న ఆలోచనను క్రైస్తవమత సామ్రాజ్య వేదాంతులు పుట్టించారు!
ఉదాహరణకు, “సెయింట్” అగస్టీన్ జ్యోతిష్కుల “అబద్ధ మరియు హానికరమైన అభిప్రాయాలను” తిరస్కరించాడు. ఇంకొకవైపు, “దేవుడు అస్తిత్వంలో ఉన్నాడని ఒప్పుకుని, అదే సమయంలో ఆయనకు భవిష్యత్ విషయాల గురించి పూర్వజ్ఞానం ఉందనడాన్ని ఖండించడం అత్యంత సుస్పష్టమైన తప్పిదమై ఉంటుంది” అని ఆయన వాదించాడు. దేవుడు నిజంగా సర్వశక్తిమంతుడై ఉండాలంటే, “ఏదీ కూడా పూర్వనిశ్చితం కాక” విడిచిపెట్టబడకుండా, “ఆయన అన్ని విషయాలు అవి జరుగకముందే ఎరిగి ఉండాలి.” అయినా, జరిగేదంతా దేవునికి తెలిసే జరుగుతున్నప్పటికీ, మానవులు ఇంకా స్వేచ్ఛాచిత్తాన్ని కలిగివున్నారని అగస్టీన్ ఆవేశంతో వాదించాడు.—దేవుని నగరం, (ఆంగ్లం) పుస్తకం V, అధ్యాయాలు 7-9.
శతాబ్దాల తరువాత, ప్రొటెస్టెంటు వేదాంతి జాన్ కల్విన్, కొంతమంది “పరలోక రాజ్యపు పిల్లలుగాను, వారసులుగాను [దేవునిచే] ముందుగా నిర్ణయం చేయబడితే” ఇతరులు “ఆయన క్రోధాన్ని పొందడానికి” ముందుగా నిర్ణయం చేయబడ్డారు అని వాదిస్తూ, విషయాలను ఒక అడుగు ముందుకు తీసుకువెళ్లాడు!
ఈనాడు, విధి యందు నమ్మకం ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో గంభీరంగా తీసుకొనబడుతుంది. పశ్చిమ ఆఫ్రికాలోని ఊస్మాన్ అనే యౌవనుని అనుభవాన్ని పరిశీలించండి. ఆయన పాఠశాలలో ఉత్తమ విద్యార్థిగా ఉన్నాడు, కానీ సంవత్సరాంత పరీక్షలు వ్రాసినప్పుడు విఫలుడయ్యాడు! అంటే ఆయన ఒక సంవత్సరం మళ్లీ పాఠశాలలో చదవడమే కాకుండా, తన కుటుంబము, స్నేహితుల ముందు ఇబ్బందిని ఎదుర్కోవలసి వస్తుందన్నమాట. ఒక స్నేహితుడు అది దేవుని చిత్తమని చెప్పడం ద్వారా ఆయనను ఓదార్చడానికి ప్రయత్నించాడు. ఊస్మాన్ తల్లి అదే విధంగా ఆయన వైఫల్యానికి విధినే నిందించింది.
సానుభూతిని ప్రకటించడానికి వారు చేసే ప్రయత్నాలను అంగీకరించడానికి మొదట్లో ఊస్మాన్ సంతోషంగానే ఉన్నాడు. ఎంతైనా, ఆయన వైఫల్యం నిజంగా దేవుని చిత్తమైతే, దాన్ని నివారించడానికి ఆయన చెయ్యగలిగేదేమీ లేదు. కానీ ఆయన తండ్రి విషయాలను వేరుగా చూశాడు. పరీక్షలలో విఫలమవ్వడం అతని స్వంత తప్పేగాని—దేవునిది కాదని ఆయన ఊస్మాన్‌కు చెప్పాడు. ఊస్మాన్ తన చదువును నిర్లక్ష్యం చేశాడు కాబట్టి ఆయన విఫలమయ్యాడు.
విధి యందు తన విశ్వాసం చెదిరిపోవడంతో విషయాలను తనే పరిశోధించాలని ఊస్మాన్ నిర్ణయించుకున్నాడు. తరువాతి శీర్షికను పరిశీలించడం ద్వారా అదే చేయమని మేమిప్పుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.