నిజమైన భద్రత—ఇప్పుడు మరియు నిరంతరం
యెహోవా దేవుడు తన ప్రజలకు భద్రత కలుగజేయగలడనడంలో సందేహమే లేదు. ఆయన “సర్వశక్తుడు.” (కీర్తన 68:14) ఆయన విశేష నామం యొక్క భావం, “తానే కర్త అవుతాడు.” ఇది ఆయనను, విశ్వమంతటిలో తన వాగ్దానాలను నెరవేర్చడానికి, తన చిత్తాన్ని తుదముట్టించడానికి ఏ అవాంతరాన్నైనా అధిగమించగల ఏకైక వ్యక్తిగా గుర్తిస్తుంది. దేవుడు తానే ఇలా చెబుతున్నాడు: “ఆలాగే నా నోటనుండి వచ్చువచనమును ఉండును. నిష్ఫలముగా నాయొద్దకు మరలక, అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలముచేయును.”—యెషయా 55:10, 11.
దేవుడు తనయందు విశ్వాసముంచే వారికి భద్రతను చేకూరుస్తాడు. ఆయన వాక్యం ఇందుకు అభయమిస్తుంది. జ్ఞానియైన సొలొమోను రాజు దైవిక ప్రేరేపణతో ఇలా చెప్పాడు: “యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును.” ఆయన ఇంకా ఇలా అన్నాడు: “యెహోవాయందు నమ్మిక యుంచువాడు సురక్షితముగా నుండును.”—సామెతలు 18:10; 29:25.
దేవుని సేవకులకు భద్రత
తనపై ఆధారపడినవారికి యెహోవా ఎల్లప్పుడూ భద్రత చేకూర్చాడు. ఉదాహరణకు, ప్రవక్తయైన యిర్మీయా దేవుని కాపుదలను పొందాడు. బబులోను సైన్యాలు మతభ్రష్ట యెరూషలేమును చుట్టుముట్టినప్పుడు, ప్రజలు “తూనికె ప్రకారముగా బహు చింతతో రొట్టె” భుజించవలసి వచ్చింది. (యెహెజ్కేలు 4:16) పరిస్థితి ఎంత సంక్లిష్టంగా తయారైందంటే, కొంతమంది స్త్రీలు తమ స్వంత పిల్లలను ఉడకబెట్టుకొని తిన్నారు. (విలాపవాక్యములు 2:20; 4:10) యిర్మీయా నిర్భయంగా ప్రకటించినందున నిర్బంధంలో ఉంచబడినప్పటికీ, “పట్టణములో రొట్టెలున్నంత వరకు రొట్టెలు కాల్చువారి వీధిలోనుండి అనుదినము ఒక రొట్టె అతనికి” లభించేలా యెహోవా చూశాడు.—యిర్మీయా 37:21.
బబులోనీయులు యెరూషలేమును స్వాధీనపర్చుకున్నప్పుడు, యిర్మీయా చంపబడనూ లేదు, బబులోనుకు ఖైదీగా కొనిపోబడనూ లేదు. బదులుగా, “[బబులోను] రాజదేహసంరక్షకుల కధిపతి అతనికి బత్తెమును బహుమానమును ఇచ్చి అతని సాగ”నంపెను.—యిర్మీయా 40:5.
శతాబ్దాల తర్వాత యేసు క్రీస్తు దేవుని సేవకులకు ఇలా అభయమిచ్చాడు: “ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించుకొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.”—మత్తయి 6:31-33.
యెహోవా సేవకులకు ప్రస్తుత దిన బాధలన్నిటి నుండి దైవిక పరిరక్షణ లభిస్తుందని దీని భావమా? లేదు, దాని భావం అది కాదు. విశ్వాసులు హానికి అతీతులు కారు. నిజ క్రైస్తవులు అనారోగ్యులౌతారు, హింసననుభవిస్తారు, నేరానికి బలౌతారు, దుర్ఘటనల్లో మరణిస్తారు, మరి ఇతర విధాలుగా బాధను అనుభవిస్తారు.
యెహోవా, హాని నుండి పూర్తి భద్రతను ఇంకా ఇవ్వకపోయినప్పటికీ, తన సేవకులకు కావలసినవి అందజేయడానికి, వారిని కాపాడడానికి ఆయన తన శక్తిని ఉపయోగిస్తాడని నివేదికలు చూపుతున్నాయి. క్రైస్తవులు వారి జీవితాల్లో బైబిలు సూత్రాలను అన్వయింపజేసుకుంటారు గనుక వారు అనేక సమస్యల నుండి కూడా కాపాడబడుతున్నారు. (సామెతలు 22:3) అంతేగాక, అవసర సమయాల్లో ఒకరికొకరు సహాయం చేసుకొనే ప్రేమగల, ఆత్మీయ సహోదర సహోదరీల ప్రపంచ వ్యాప్త సహవాసం యొక్క భద్రతను వారు అనుభవిస్తారు. (యోహాను 13:34, 35; రోమీయులు 8:28) ఉదాహరణకు, యూరపులోని యెహోవా సాక్షులు రువాండాలో యుద్ధ బీభత్సానికి గురైన తమ సహోదరుల దుర్భర పరిస్థితికి ప్రతిస్పందించి, వెంటనే వారికి విరాళంగా 65 టన్నుల వస్త్రాలను, 16,00,000 డాలర్ల విలువగల మందులను, ఆహారాన్ని, ఇతర వస్తువులను పంపించారు.—అపొస్తలుల కార్యములు 11:28, 29 పోల్చండి.
యెహోవా నిజక్రైస్తవులకు శ్రమలను అనుమతించినప్పటికీ, ఆయన వారికి బలాన్ని, సహాయాన్ని, సహించడానికి జ్ఞానాన్నీ ఇస్తాడన్న నిశ్చయత వారికి ఉంది. అపొస్తలుడైన పౌలు తన తోటి విశ్వాసులకు వ్రాస్తూ, ఇలా చెప్పాడు: “సాధారణముగా మనుష్యులకు కలుగు శోధనతప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింపగలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును.”—1 కొరింథీయులు 10:13.
దేవుడు తన ప్రజల కొరకు చేసినది
నేడు, లక్షలాదిమంది ప్రజలు దేవుని చిత్తాన్ని చేయడంలో ఆనందిస్తున్నారు. వారు దేవుని సేవ చేసేందుకు బలవంతం చేయబడడం లేదు; వారికి ఆయన తెలుసు, ఆయనను వారు ప్రేమిస్తున్నారు గనుక వారలా చేస్తున్నారు. ప్రతిఫలంగా, యెహోవా యథార్థవంతులైన తన సేవకులను ప్రేమిస్తున్నాడు గనుక విధేయులైన మానవజాతి నిరంతరం శాంతిని, ఆరోగ్యాన్ని, భద్రతను అనుభవించేలా భూమిని పరదైసుగా మార్చడానికి ఆయన సంకల్పించాడు.—లూకా 23:43.
దేవుడు దీన్ని తన నియమిత రాజైన యేసుక్రీస్తు పరిపాలించే పరలోక ప్రభుత్వం ద్వారా చేస్తాడు. (దానియేలు 7:13, 14) బైబిలు ఈ ప్రభుత్వాన్ని “దేవుని రాజ్యము” అని, “పరలోక రాజ్యము” అని పిలుస్తుంది. (1 కొరింథీయులు 15:50; మత్తయి 13:44) దేవుని రాజ్యం మానవ ప్రభుత్వాలన్నిటినీ నిర్మూలిస్తుంది. భూమిపై అనేక ప్రభుత్వాలు ఉండే బదులు, కేవలం ఒకే ప్రభుత్వం ఉంటుంది. అది మొత్తం భూమిపై నీతియుక్తంగా పరిపాలిస్తుంది.—కీర్తన 72:7, 8; దానియేలు 2:44.
ఆ రాజ్యం క్రింద జీవించడానికి యెహోవా అందరినీ ఆహ్వానిస్తున్నాడు. ఆయన దీన్నిచేసే ఒక మార్గం ఏమిటంటే, ఆ రాజ్యం మానవజాతి కొరకు ఏమి చేస్తుందో వివరించే గ్రంథం అంటే, బైబిలును విస్తృతంగా పంచిపెట్టడం మూలంగానే. బైబిలు ప్రపంచంలో విస్తృతంగా పంచిపెట్టబడుతున్న గ్రంథం, అది ఇప్పుడు మొత్తంగాను లేక భాగాలుగాను 2,000 కంటే ఎక్కువ భాషల్లో లభ్యమౌతోంది.
రాజ్యం గురించి బైబిలు ఏమి బోధిస్తుందో గ్రహించడానికి యెహోవా దేవుడు ప్రజలకు ప్రేమపూర్వకంగా సహాయం చేస్తాడు. ఉపదేశించడం ద్వారా, ఇతరులకు లేఖనాలను వివరించేందుకు తన ప్రజలను పంపడం ద్వారా ఆయనలా చేస్తున్నాడు. ఇప్పుడు 50 లక్షల కంటే ఎక్కువమంది యెహోవా సాక్షులు 230 కంటే ఎక్కువ దేశాల్లో దేవుని రాజ్యాన్ని గూర్చిన సువార్తను ప్రకటిస్తున్నారు.
అందరికీ నిజమైన భద్రతా?
ఆయన నీతియుక్తమైన కట్టడలకు అనుగుణ్యంగా ఉండడం ద్వారా దేవుని రాజ్య పౌరులుకండని ఇవ్వబడుతున్న ఆహ్వానాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారా? లేదు, ఎందుకంటే అనేకులకు దేవుని చిత్తాన్ని చేయాలన్న ఆసక్తి లేదు. తమ జీవితాలను మంచిగా మార్చుకోవడానికి వారికి సహాయం చేసే ప్రయత్నాలను వారు నిరాకరిస్తారు. వాస్తవానికి, యేసు తెల్పిన వారివలె వారు కనబరచుకుంటారు: “ఈ ప్రజలు కన్నులార చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని [దేవుని] వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు మూసికొనియున్నారు గనుక మీరు వినుటమట్టుకు విందురుగాని గ్రహింపనే గ్రహింపరు, చూచుటమట్టుకు చూతురుగాని యెంత మాత్రమును తెలిసికొనరు.”—మత్తయి 13:15.
దేవుని నీతియుక్తమైన కట్టడలకనుగుణంగా జీవించడానికి నిరాకరించే వారి మధ్య ఈ భూమిపై నిజమైన భద్రత ఎలా ఉండగలదు? ఉండలేదు. భక్తిహీనులు యెహోవా సేవ చేయాలని కోరుకునే వారి భద్రతకు ప్రమాదం కలుగజేస్తారు.
మారమని దేవుడు ప్రజలను బలవంతం చేయడు, కాని ఆయన దుష్టత్వాన్ని కూడా ఎంతోకాలం సహించడు. తన మార్గాల గురించి, సంకల్పాల గురించి ప్రజలకు బోధించడానికి తన సాక్షులను పంపడంలో యెహోవా సహనం చూపుతున్నప్పటికీ, ఆయన ఆలాగే ఎంతో కాలం జరుగనివ్వడు. యేసు క్రీస్తు ఇలా ప్రవచించాడు: “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.”—మత్తయి 24:14.
దేవుని కట్టడలను నిరాకరించేవారికి “అంతము” అంటే అర్థమేమిటి? అది వారికి ప్రతికూల తీర్పు మరియు నాశనమే. ‘దేవుని నెరుగనివారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతి దండన జరుగుతుందని, అట్టి వారు నిత్యనాశనమను దండన పొందుతారని’ బైబిలు తెలియజేస్తుంది.—2 థెస్సలొనీకయులు 1:6-9.
చిట్టచివరికి—నిరంతరం నిజమైన భద్రత!
యెహోవా యొక్క సమాధానకరమైన మార్గాలను నిరాకరించేవారి నాశనం తర్వాత, భూమిపైనుండే నీతిమంతుల ప్రయోజనార్థం దేవుని రాజ్యం మహిమకరమైన భద్రతా కాలాన్ని తెస్తుంది. (కీర్తన 37:10, 11) నేడు మనం జీవిస్తున్న లోకానికి, ఆ నూతన లోకానికి ఎంత వ్యత్యాసం ఉంటుందో కదా!—2 పేతురు 3:13.
కరువు, కొరత ఇక ఉండవు. ప్రతి ఒక్కరికి తినడానికి పుష్కలంగా ఉంటుంది. ‘సమస్త జనులు క్రొవ్వినవాటితో విందును ఆస్వాదిస్తారని’ బైబిలు తెలియజేస్తుంది. (యెషయా 25:6) ఆహార కొరత ఉండదు, ఎందుకంటే “దేశములోను పర్వత శిఖరములమీదను సస్యసమృద్ధి కలుగును.”—కీర్తన 72:16.
ప్రజలు ఇక ఎంతమాత్రం పూరిపాకల్లోనూ, మురికివాడల్లోనూ నివసించరు. దేవుని రాజ్యం క్రింద, అందరికీ మంచి గృహాలుంటాయి మరియు తమ స్వంత పొలంలో పండిన ఆహారాన్ని వారు భుజిస్తారు. బైబిలు ఇలా వాగ్దానం చేస్తుంది: “జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు, ద్రాక్షతోటలు నాటించుకొని వాటి ఫలముల ననుభవింతురు.”—యెషయా 65:21.
సర్వత్రావున్న నిరుద్యోగానికి బదులు, ప్రతిఫలదాయకమైన పని ఉంటుంది, ప్రజలు దాని నుండి మంచి ఫలితాలను పొందుతారు. దేవుని వాక్యం ఇలా చెబుతుంది: “నేను ఏర్పరచుకొనినవారు తాము చేసికొనినదాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. వారు వృథాగా ప్రయాసపడరు.”—యెషయా 65:22, 23.
రాజ్య పరిపాలన క్రింద, ప్రజలు రోగంతో బాధపడి మరణించరు. “నాకు దేహములో బాగులేదని అందులో నివసించువాడెవడును అనడు” అని దేవుని వాక్యం మనకు అభయమిస్తోంది.—యెషయా 33:24.
త్వరలోనే వాస్తవం కానున్న భూ పరదైసులో బాధ, నొప్పి, దుఃఖం, మరణం తీసివేయబడతాయి. అవును, చివరికి మరణం కూడా ఉండదు! ప్రజలు పరదైసులో నిరంతరం జీవిస్తారు! దేవుడు “వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెనని” బైబిలు మనకు తెలియజేస్తుంది.—ప్రకటన 21:4.
“సమాధానకర్తయగు అధిపతి” అయిన యేసు క్రీస్తు పరిపాలన క్రింద, భూమిపై జీవితం తుదకు నిజంగా భద్రత కలిగి ఉంటుంది. వాస్తవానికి, నీతియుక్తమైన ప్రేమపూర్వకమైన ఒకే ప్రభుత్వం క్రింద అంటే దేవుని రాజ్యం క్రింద ప్రపంచవ్యాప్త భద్రత ఉంటుంది.—యెషయా 9:6, 7; ప్రకటన 7:9, 17.
[4వ పేజీలోని చిత్రం]
“మానవ భద్రత రేపటి యందు నమ్మకాన్ని . . . రాజకీయ మరియు ఆర్థిక పరిస్థితి యొక్క స్థిరత్వమందు [విశ్వాసాన్ని] సూచిస్తుంది.”—ఆసియాలో నివసించే ఒక స్త్రీ
[5వ పేజీలోని చిత్రం]
“అన్నిటికంటే ముఖ్యంగా మీరు అభద్రత కలిగి ఉన్నట్లు భావించేలా చేసేది దౌర్జన్యం, నేరమే.”—దక్షిణ అమెరికాలో నివసిస్తున్న ఒక వ్యక్తి
[6వ పేజీలోని చిత్రం]
“ఆక్రమించుకునే . . . సమయంలో నేను భద్రత కలిగి ఉన్నట్లు భావించలేదు. ఒక దేశం యుద్ధం చేస్తున్నట్లయితే, ప్రజలు భద్రత కలిగి ఉన్నట్లు ఎలా భావిస్తారు?”—మధ్య ప్రాచ్యంలోని ఒక ప్రాథమిక పాఠశాల విద్యార్థి
[7వ పేజీలోని చిత్రం]
“నేను బలాత్కారానికి గురికాకుండా రాత్రి సమయంలో వీధుల్లో నడవగలనని నాకు తెలిసినప్పుడు నేను భద్రత కలిగి ఉన్నట్లు భావిస్తాను.”—ఆఫ్రికాలోని ఒక పాఠశాల విద్యార్థిని