చర్య గైకొనడానికి విశ్వాసం ఆయనను కదిలించింది
ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు చెర నుండి వెలుపలికి నడిపించమని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినప్పుడు, “ప్రభువా, ఇంతకు మునుపైనను, నీవు నీ దాసునితో మాటలాడినప్పటి నుండియైనను, నేను మాట నేర్పరినికాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని” చెబుతూ, తనను విడిచి పెట్టమని మోషే మొదట అర్థించాడు. (నిర్గమకాండము 4:10) అవును, అలాంటి బాధ్యతాయుతమైన పని కొరకు తాను యోగ్యున్నని మోషే భావించలేదు.
అలాగే నేడు, యెహోవా సేవకులలో అనేకులు కొన్నిసార్లు తమకు అప్పగింపబడిన విధుల్ని నిర్వర్తించడానికి తాము తగమని భావిస్తారు. ఉదాహరణకు, థీయడోర్ అనే ఒక క్రైస్తవ అధ్యక్షుడు ఇలా చెబుతున్నాడు: “యెహోవా నన్ను చేయమని అడుగుతున్న పనులన్నిటిలోకి, ప్రాంతీయ పరిచర్య అత్యంత కష్టమైనది. నేను చిన్నవానిగా ఉన్నప్పుడు, నేను త్వరగా తలుపు దగ్గరికి వెళ్లి బెల్ నొక్కినట్లు నటించి ఎవరూ వినలేదని, నన్ను ఎవరూ చూడలేదని అనుకుంటూనిశ్శబ్దంగా వెళ్లిపోయేవాణ్ణి. నేను పెరిగి పెద్దవాణ్ణయ్యాక, అలా చేయడం మానేశాను, కాని ఇంటింటికి వెళ్లడమనే తలంపు నన్ను శారీరకంగా అనారోగ్యుణ్ణి చేసింది. ఈనాటికి కూడా, పరిచర్యకు వెళ్లేముందు నాకు కడుపులో తిప్పుతుంది, అయినా నేను ఎలాగైనా వెళ్లతాను.”
మోషే మరియు థీయడోర్ వంటి ఆధునిక దిన సాక్షులు అలాంటి భయాలను ఎదుర్కోడానికి ఏది తోడ్పడింది? బైబిలు ఇలా సమాధానమిస్తుంది: “విశ్వాసమునుబట్టి అతడు [మోషే] అదృశ్యుడైనవానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధిగలవాడై . . . ఐగుప్తును విడిచిపోయెను.”—హెబ్రీయులు 11:27.
వాస్తవానికి, యెహోవాయందు విశ్వాసముంచడం ద్వారా, మోషే తన అయోగ్యతా భావాలను అధిగమించి న్యాయాధిపతిగా, ప్రవక్తగా, జాతీయ నాయకునిగా, ధర్మశాస్త్ర నిబంధన మధ్యవర్తిగా, సేనా నాయకునిగా, చరిత్రకారునిగా, బైబిలు రచయితగా తన నియమిత విధులను నిర్వర్తించగలిగాడు.
అదే విధంగా, మోషే వలె మనకు విశ్వాసం ఉన్నప్పుడు, మనం ‘అదృశ్యుడైన వానిని చూస్తున్నట్లుగా’ నడుస్తాము. అలాంటి విశ్వాసం, మనం అయోగ్యులమని భావిస్తున్నప్పుడు కూడా, మనం మన క్రైస్తవ బాధ్యతల్ని నిర్వర్తించడానికి తోడ్పడుతూ, ధైర్యాన్ని కలిగిస్తుంది.