యెహోవాను శుభ్రమైన చేతులతో ఆరాధించండి
ప్రేరేపింపబడిన వాడై, కీర్తనల గ్రంథకర్త అయిన దావీదు ఇలా పాడాడు: “నిర్దోషత్వంలోనే నా చేతులు కడుగుకొందును యెహోవా, నీ బలిపీఠముచుట్టు ప్రదక్షిణము చేయుదును.”—కీర్తన 26:6, NW.
ఈ పదాలను కూర్చడంలో, బలిపీఠం పైకెక్కి అగ్నిపై తమ బలులను అర్పించే లేవీయాజకుల ఆచారాన్ని దావీదు సూచిస్తుండవచ్చును. అయితే, ఈ ఆరాధనాక్రియను చేసే ముందు, యాజకులు తమ కాళ్లు చేతులను కడుగుకోవలసి ఉండేది. అది అంత చిన్న విషయమేమీ కాదు. ఈ ముందుచూపు చర్యను ఒక యాజకుడు తీసుకోకపోతే అది అతని ప్రాణాన్నే తీయగలదు!—నిర్గమకాండము 30:18-21.
అలంకారికమైన రీతిలో కడుగుకోవడం ఆత్మీయ మరియు నైతిక శుభ్రతకు దారితీస్తుంది. (యెషయా 1:16; ఎఫెసీయులు 5:27) నేడు మనం యెహోవా సేవ చేయడం ద్వారా, ఆయన “బలిపీఠముచుట్టు ప్రదక్షిణము” చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే మనం శుభ్రమైన చేతులతో అలా చేయాలని ఆయన కోరుతున్నాడు—దావీదు చెప్పినట్లు, అవి “నిర్దోషత్వంలోనే” కడుగబడిన ‘చేతులై’ ఉండాలి. అదొక మామూలు అవసరత కాదు, ఎందుకంటే అవినీతిని ఆచరించే వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనరు. (గలతీయులు 5:19-21) దైవిక పనుల్లో జీవితాన్ని గడపడం, అనైతికంగా ప్రవర్తించేందుకు ఒకరికి అనుమతినివ్వదు. అందుకే అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి, దానిని లోపరచుకొనుచున్నాను.”—1 కొరింథీయులు 9:27.
దైవిక అంగీకారాన్ని, నిజమైన సంతోషాన్ని వెదికే వారు శుభ్రమైన చేతులతో యెహోవాకు సేవచేయాలి. దావీదు వలె, వారు ‘యథార్థహృదయులై నీతిని బట్టి’ నడుచుకొంటారు.—1 రాజులు 9:4.