ఆనందరహితమైన ప్రపంచంలో ఆనందమయం
“ఎంత కాదన్నా ఇది సాతాను శతాబ్దమే,” అనే మాటలతో జనవరి 26, 1995న ది న్యూయార్క్ టైమ్స్‌లో ఒక సంపాదకీయం ఆరంభమైంది. “జాతి, మత లేక వర్గ కారణాల్ని బట్టి లక్షలాదిమంది ఇతర ప్రజల్ని చంపడం విషయంలో ఇంత గొప్ప అభిరుచిని, కాంక్షను ఏ యుగంలోనూ ప్రజలు చూపించలేదు.”
నాజీ మరణ శిబిరాల్లో నిర్బంధింపబడిన నిరపరాధులైన బాధితుల విమోచనపు 50వ వార్షికోత్సవం, పైన చెప్పబడిన సంపాదకీయం వంటి సంపాదకీయాల్ని వ్రాసేలా చేసింది. అయినా, అదే విధమైన క్రూర హత్యలు ఆఫ్రికా, తూర్పు ఐరోపా ప్రాంతాల్లో ఇంకా జరుగుతూనే ఉన్నాయి.
ప్రణాళికాబద్ధమైన సామూహిక హత్యలు, జాతి ప్రక్షాళనలు, తెగలకు సంబంధించిన వధలు—అవి ఏమని పిలవబడినా—గొప్ప విచారానికి కారణమౌతున్నాయి. అయినా, అటువంటి హింసలమధ్యా ఆనందమయమైన ప్రజలు ఉన్నారు. ఉదాహరణకు, 1930లలోని జర్మనీవైపుకి దృష్టి సారిద్దాం.
ఏప్రిల్ 1935 నాటికి హిట్లర్ మరియు అతని నాజీ పార్టీచే అన్ని రకాలైన ప్రభుత్వోద్యోగాల నుండి యెహోవాసాక్షులు నిషేధించబడ్డారు. సాక్షులు, క్రైస్తవ తటస్థ వైఖరిని అనుసరించినందున అరెస్టు చేయబడ్డారు, నిర్బంధించబడ్డారు మరియు నిర్బంధ శిబిరాలకు పంపించబడ్డారు కూడా. (యోహాను 17:16) 1936 ఆగస్టు నెల చివరలో యెహోవాసాక్షుల్ని సామూహికంగా అరెస్టులు చేయడం జరిగింది. వారిలో వేలాదిమంది నిర్బంధ శిబిరాలకు పంపించబడ్డారు, వారిలో అనేకమంది అంటే చనిపోకుండా ఉన్నవారు అక్కడే 1945 వరకూ ఉంచబడిరి. అయితే, సాక్షులు శిబిరాల్లో తాము గురైన పాశవిక చర్యలకు ఎలా ప్రతిస్పందిచారు? తాము ఆనందరహితమైన పరిస్థితుల్లో ఉన్నా వారు ఆనందాన్ని కాపాడుకోగల్గడం అనేది ఆశ్చర్యదాయకంగా అన్పించవచ్చు.
“బురదలోని బండ”
శిబిరాల్లో ఉన్న ఓ కాథోలిక్కు మహిళను బ్రిటీష్ చరిత్రకారిణియైన క్రిస్టీన్ కింగ్ ఇంటర్వ్యూ చేసింది. “నేనెన్నడూ మర్చిపోలేని ఒక పదబందాన్ని ఆమె ఉపయోగించింది, జీవితంలోని భీతిని గూర్చి, తాను జీవించిన అసహ్యకరమైన పరిస్థితులను గూర్చి ఆమె ఎంతో వివరంగా తెలియజేసింది. మరియు ఆమెకు సాక్షులు తెలుసని, ఆ సాక్షులు బురదలోని బండ వంటివారని, వారు ఆ జిగటమంటిలో గట్టినేలలా ఉన్నారని ఆమె చెప్పింది. గార్డులు కవాతు చేస్తున్నప్పుడు థూ అని చీదరించుకొనని ప్రజలు వారు మాత్రమేనని ఆమె చెప్పింది. విద్వేషంతోగాక ప్రేమ, నిరీక్షణ మరియు ఓ సంకల్పం ఉందనే భావనతో ఈ పరిస్థితిని ఎదుర్కొన్న ప్రజలు వారు మాత్రమేనని ఆమె చెప్పిందని” డాక్టర్ క్రిస్టీన్ కింగ్ తెలియజేసింది.
‘బురదలోని బండ’గా ఉండడానికి యెహోవాసాక్షులకు సహాయం చేసినదేమిటి? యెహోవాయందలి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తునందలి అచంచలమైన విశ్వాసమే. కాబట్టి వారి క్రైస్తవ ప్రేమ, ఆనందాల్ని అణచివేయడానికి హిట్లరు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
ఈ విశ్వాస పరీక్షను విజయవంతంగా ఎదుర్కొన్న ఐదు దశాబ్దాల తర్వాత ఇద్దరు శిబిర హతశేషులు జ్ఞాపకం చేసుకుంటున్న దానిని వినండి. ఒకామె ఇలా చెబుతోంది: “అతి క్రూరమైన పరిస్థితుల్లో యెహోవా ఎడల నా ప్రేమను, కృతజ్ఞతా భావాన్ని రుజువు చేసుకొనే అసమానమైన ఆధిక్యత నాకుందని గ్రహించి ఆనందంతో తబ్బిబ్బయ్యాను. దీన్ని చేయడానికి నన్నెవరూ బలవంతం చేయలేదు! బదులుగా, మమ్మల్ని బలవంతం చేయడానికి ప్రయత్నించిన వాళ్లు, మేము దేవుని కన్నా అధికంగా హిట్లర్‌కు లోబడేలా చేయడానికి మమ్మల్ని బెదిరించడం ద్వారా ప్రయత్నించిన మా శత్రువులే. కాని వారు సఫలులు కాలేదు! నేను ఇప్పుడు మాత్రమే కాదుగాని నా మంచి మనస్సాక్షిని బట్టి, నేను చెరసాలలో ఉన్నప్పుడు కూడా సంతోషంగానే ఉన్నాను.”—మరియా హామ్‌బక్, 94 ఏండ్ల వయస్సు.
మరో సాక్షి ఇలా చెబుతున్నాడు: “నేను నిర్బంధింపబడిన రోజుల్ని కృతజ్ఞతానందాలతో జ్ఞాపకం చేసుకుంటాను. హిట్లర్ ఆధ్వర్యంలోని చెరసాలల్లోనూ నిర్బంధ శిబిరాల్లోనూ నేను గడిపిన సంవత్సరాలు కష్టమైనవి, పరీక్షలతో నిండినవి. అయినా అవి, యెహోవాయందు సంపూర్ణ నమ్మకాన్ని కల్గివుండడాన్ని నాకు బోధించాయి గనుక వాటిని కోల్పోవాలని నేను కోరుకొనేవాడిని కాదు.”—యోహానస్ నాయ్‌బాకర్, 91 ఏండ్ల వయస్సు.
“యెహోవాయందు సంపూర్ణ నమ్మకాన్ని కల్గివుండడమే,” యెహోవాసాక్షులు అనుభవించిన ఆనందానికి కీలకం. ఆవిధంగా, ఆనందరహితమైన ప్రపంచం వారి చుట్టూ ఉన్నప్పటికీ వారు ఆనందమయులు. ఇటీవలి నెలల్లో జరిగిన “ఆనందమయ స్తుతికర్తలు” జిల్లా సమావేశాల్లో వారి ఆనందం స్పష్టమైంది. ఈ ఆనందమయ సమావేశాల్ని మనం క్లుప్తంగా పునర్విచారిద్దాం.
[4వ పేజీలోని చిత్రం]
మరియా హామ్‌బక్