మనస్సులో కోపం నిలుపుకోవద్దు
ఎవరైనా మిమ్మల్ని గాయపరచినప్పుడు వారిపట్ల కోపాన్ని నిలుపుకోకుండా ఉండటం అన్నిటికంటే ఎక్కువ సవాలుతో కూడినదానివలె అనిపించవచ్చు. అలాంటి పరిస్థితుల కొరకు బైబిలు ఆచరణయోగ్యమైన సలహాను కలిగి ఉంది. “కోపపడుడి గాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీ కోపము నిలిచియుండకూడదు,” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు.—ఎఫెసీయులు 4:26.
ఎవరైనా మనకు హాని కలిగిస్తే, కొంత కోపపడటం సాధారణమే. “కోపపడుడి” అని పౌలు చెప్పినప్పుడు ఆగ్రహించడం కొన్నిసార్లు సరైనదే అని దానర్థం, అంటే సరిగ్గా న్యాయం జరుగనప్పుడు లేక అసభ్యంగా ప్రవర్తించినప్పుడు. (2 కొరింథీయులు 11:29 పోల్చండి.) అయితే దాన్ని తీర్చుకోకుండా ఉంటే, న్యాయబద్ధమైన ఆగ్రహం కూడా గొప్ప పాపానికి దారితీస్తూ విపత్కర పరిణామాలను కలిగి ఉండగలదు. (ఆదికాండము 34:1-31; 49:5-7; కీర్తన 106:32, 33) కాబట్టి, కోపగించుకునేలా రెచ్చగొట్టబడ్డారని మీరు భావిస్తే మీరేమి చేయగలరు?
చిన్న తప్పిదాలు ఇమిడి ఉన్న అనేక సందర్భాల్లో, విషయాన్ని మీ హృదయంలో పరిష్కరించుకుని మీరు ‘ఊరకుండవచ్చు’ లేక గాయపర్చిన వాన్ని సమీపించి సంగతిని గురించి చర్చించవచ్చు. (కీర్తన 4:4; మత్తయి 5:23, 24) ఏ విధంగానైనా, కోపం పెరిగి అది భయానకమైన ఫలితాలను ఇవ్వకముందే త్వరితంగా విషయాలను ఓ కొలిక్కి తెచ్చుకోవడం శ్రేష్ఠం.—ఎఫెసీయులు 4:31.
యెహోవా మన పాపాలను చివరకు మనం వాటిని చేశామని కూడా తెలియని వాటిని ఆయన ఉదారంగా క్షమిస్తున్నాడు. అదే విధంగా మనమూ మన తోటి మానవుని అల్ప తప్పిదాన్ని క్షమించలేమా?—కొలొస్సయులు 3:13; 1 పేతురు 4:8.
ఆసక్తికరంగా, “క్షమించు” అనే పదం కొరకు ఉపయోగింపబడిన గ్రీకు పదం, “వదిలేయడం” అనే అక్షరార్థమైన అర్థాన్ని కలిగివుంది. క్షమించడమంటే మనం తప్పును తగ్గించడం లేక చూసిచూడనట్లు ఉండాలని కాదు. కోపం నిలుపుకోవడం మీకు భారాన్ని కలిగిస్తుంది మరి క్రైస్తవ సంఘం యొక్క ఐక్యతను పాడు చేస్తుంది అని గ్రహించి, దాన్ని వదిలేయడం అందులో ఇమిడి ఉండవచ్చు. అంతేకాకుండా కోపం నిలుపుకోవడం మీ ఆరోగ్యానికి కూడా ప్రమాదకరం కావచ్చు!—కీర్తన 103:9.