సింగపూర్ ఆరాధనా స్వాతంత్ర్యాన్ని అణచివేసింది
ఫిబ్రవరి 24, 1995 సాయంకాలాన సింగపూర్ నగరంలోని నాలుగు ఇళ్లపై పోలీసులు దాడిచేశారు. మొత్తం 69 మంది నిర్బంధింపబడ్డారు.a వారిలో 71 సంవత్సరాల వృద్ధ మహిళ, 15 సంవత్సరాల అమ్మాయిలిద్దరు ఉన్నారు. ఎందుకు? నేరం లేక విద్రోహ చర్యకు పాల్పడినందుకా? కాదు. వారిలో ఎవరూ కూడా, కొంచెమైనా ప్రమాదకరమైనదని అవినీతికరమైనదని లేక సంఘ వ్యతిరేకమైనదని పరిగణించబడగల్గిన దేనిలోను పాల్గొనలేదు. వారు తమ తోటి సింగపూర్ నివాసుల నైతిక విలువలకు, భద్రతకు, క్షేమానికి ఏ ప్రమాదాన్ని కలుగజేయలేదు. అయినప్పటికీ, పోలీసులు నాలుగు ఇళ్లను గాలించి ఆ తర్వాత, బైబిలు పఠించి సంఘ సహవాసాన్ని ఆనందించాలని వచ్చిన 69 మందిని పోలీసు స్టేషనుకు తీసుకువెళ్లారు. వారు అక్కడ రాత్రంతా ఉంచబడ్డారు, ప్రశ్నించబడ్డారు, వారి వేలిముద్రలు ఫోటోలు తీసుకోబడ్డాయి—అవును, సాధారణ నేరస్థుల్లానే చూడబడ్డారు! ఈ సమయంలో—హీనమైన పరిస్థితుల్లో దాదాపు 18 గంటలు—న్యాయబద్ధమైన సలహా తీసుకోకుండా వారు ఆటంకపర్చబడ్డారు, తాము ఎక్కడ ఉన్నామో కుటుంబ సభ్యులకు తెలియజేయడానికి ఫోను చేసేందుకు కూడా వారికి అనుమతివ్వబడలేదు. అలాంటి ఆకస్మిక చర్య శాంతియుతమైన, చట్టానికి లోబడే ఈ పౌరులను ఎంతగా ప్రభావితం చేసి ఉండవచ్చో ఒకరు ఊహించవచ్చు!
నాజీ జర్మనీ యొక్క వినాశకరమైన దినాలు మరియు రష్యా తూర్పు ఐరోపాలలోని కమ్యూనిస్టు యుగం యొక్క పరిస్థితులను ఈ ఘట్టం జ్ఞాపకానికి తెచ్చింది. పరిశుభ్రమైన, సంపన్నమైన ఆ ఆధునిక నగరంలో అలాంటిది కనుగొంటానని సింగపూర్‌ను సందర్శించడానికి వచ్చే యాత్రికుడు ఊహించలేడు. ఇరవైయవ శతాబ్దపు ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి యొక్క అద్భుతమని సింగపూర్ పేరుగాంచింది. అది తన పౌరుల వాక్, మత, సమావేశ స్వాతంత్ర్యాలతో సహా ప్రాథమిక మానవ హక్కులకు హామీ ఇచ్చే ప్రజాస్వామ్య రాజ్యమని ప్రకటింపబడింది.
అయితే, ఫిబ్రవరిలో నిర్బంధింపబడినవారు, కేవలం బైబిలు పఠించి క్రైస్తవ సహవాసాన్ని పంచుకోవడానికి కలిసి సమావేశమైన యెహోవాసాక్షులు గనుకనే వారినొక గురిగా పెట్టుకోవడం జరిగింది. వారిపై చేయబడిన ఆరోపణ ఏమిటంటే, వారు “చట్టవ్యతిరేక సమాజపు సమావేశానికి హాజరు కావడమే.”
వాస్తవానికి, సింగపూర్ సంఘం అధికారిక రిజిస్టరులో నుండి కొట్టివేయబడి బైబిళ్లతో సహా వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించిన సాహిత్యం నిషేధింపబడినప్పటినుండి అంటే 1972 నుండి యెహోవాసాక్షులు సింగపూర్‌లో తమ న్యాయబద్ధమైన గుర్తింపును కోల్పోయారు. ఆ చర్య ఏ అభియోగంపై తీసుకొనబడిందో వాటిని సవాలు చేయడానికి అవకాశం కూడా ఇవ్వబడలేదు. ఇటీవల, నిషేధింపబడిన బైబిలు సాహిత్యం కలిగివున్నారని ఫిబ్రవరి 1994లో నేరం మోపబడిన నలుగురు సాక్షుల విషయంలో ఈ అధికారిక పక్షపాతం యొక్క న్యాయబద్ధత సింగపూర్ కోర్టుల్లో సవాలు చేయబడింది. వారిపై మోపబడిన తప్పులకు వ్యతిరేకంగా చేయబడిన అప్పీలుకు 1994 ఆగస్టులో విచారణ జరిగింది, ఆ తర్వాత వెంటనే అది కొట్టి వేయబడింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తియైన యాంగ్ పెంగ్ హౌ తన అభిప్రాయాన్ని తరువాతి నెలలో వెల్లడిచేశాడు. అందులో మత స్వాతంత్ర్యాన్ని అధిగమించడం ఏమీ లేదని, యెహోవాసాక్షులు సైనిక సేవలో పాల్గొనరు గనుక వారు జాతీయ భద్రతకు ప్రమాదమనే ఆధారంగా ఆరోపణలు న్యాయమైనవేనని ఆయన తీర్మానించాడు. ఫిబ్రవరి 17, 1995న నలుగురు సాక్షులు ఈ వ్యతిరేకమైన తీర్మానాన్ని సింగపూర్ అప్పీలు కోర్టుకు తీసుకు వెళ్లడానికి అనుమతి కోరారు. ఆ అభ్యర్థన నిరాకరించబడింది.
ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సింగపూర్ ముద్రణాలయంలో ఈ చివరి తీర్మానానికి ప్రాముఖ్యత ఇవ్వబడింది. నిస్సందేహంగా, ఈ కోర్టు తీర్మానం తత్ఫలితంగా వచ్చిన ప్రాచుర్యం తర్వాత జరిగిన సంఘటనలకు ముంగుర్తుగా ఉంది. ఒక వారంలోనే 69 మంది సాక్షులు నిర్బంధించబడ్డారు. బ్రిటన్, ఫ్రాన్సు మరియు లక్సెంబర్గ్ పౌరులైన వీరిలో నలుగురికి వ్యతిరేకంగా చేయబడిన ఆరోపణలు ఆ తర్వాత కొట్టివేయబడ్డాయి. అయితే వీరికి కూడా ఆ అనుభవం భయానకంగానే ఉండింది. ఒక వ్యక్తి తన భార్యతో కలిసి సింగపూర్‌లోనే అనేక సంవత్సరాలుగా నివసిస్తూ, ఉద్యోగం చేశాడు. వారు తమ ఉద్యోగాలను, అద్దె ఇళ్లను పోగొట్టుకున్నారు, అనేకమంది సన్నిహిత స్నేహితులకు వీడ్కోలు చెప్పేందుకు బలవంతం చేయబడ్డారు.
మిగిలిన 63 మంది పెద్దవాళ్లు నిషేధిత సమాజానికి చెందినవారని ఆరోపించబడ్డారు, కొందరు నిషేధింపబడిన సాహిత్యాన్ని కలిగివున్నట్లు కూడా వారిపై అభియోగం మోపబడింది. వారు కనీసం మూడు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాలి లేదా 3,000 సింగపూర్ డాలర్లు (2,110 అమెరికా డాలర్లు) జరిమానా చెల్లించాలి లేదా రెండూ చేయవలసి ఉంటుంది. పదిహేను సంవత్సరాల అమ్మాయిలిద్దరూ ప్రత్యేకంగా బాలల కోర్టులో హాజరయ్యారు.
జాతీయ గుర్తింపుకు, ఐక్యతకు ప్రమాదకరం కాదు
ప్రపంచమంతటిలో, వారు నివసిస్తున్న దాదాపు 200 కంటే ఎక్కువ దేశాల్లో యెహోవాసాక్షులు మంచివారని, నిజాయితీగలవారని, చట్టానికి విధేయత చూపే ప్రజలని పేరుపొందారు. వారు ఏ విధమైన వినాశకర, ప్రభుత్వ వ్యతిరేక చర్యలో పాల్గొనడాన్నైనా దృఢంగా నిరాకరిస్తారని గుర్తింపబడ్డారు, వారు అటువంటి క్రైస్తవ వ్యతిరేక చర్యలో పాల్గొంటే వారు బహిష్కరించబడతారు లేక వెలివేయబడతారు. నిజంగా, సింగపూర్ ప్రభుత్వం వారి గురించి భయపడవలసినదేమి లేదు. వారు సింగపూర్ జాతీయ భద్రతకు లేక జాతీయ గుర్తింపు మరియు ఐక్యతా భావానికి వారు ఎంతమాత్రం ప్రమాదకరం కాదు. (రోమీయులు 13:1-7) వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ అధ్యక్షుడైన మిల్టన్ జి. హెన్షెల్ మార్చి 21, 1995న సింగపూర్ ప్రధానమంత్రియైన గో చాక్ టాంగ్‌కు వ్రాసిన లేఖలో ఇది స్పష్టంగా తెలియజేయబడింది. మా పాఠకుల ప్రయోజనార్థం ఈ లేఖ ఇక్కడ పునర్ముద్రింపబడింది.
వ్యాపార, ప్రభుత్వ, ప్రయివేటు రంగసంస్థల్లోని స్వేచ్ఛను ప్రేమించే ప్రజలు సింగపూర్‌లో ఈ పరిస్థితి ఎలా పరిణమిస్తుందో చూడాలని ఆసక్తితో గమనిస్తున్నారు. సింగపూర్ ప్రభుత్వం తన స్వంత రాజ్యాంగంచే మరియు దేశాల అంతర్జాతీయ సమాజంచే రూపొందించబడిన ప్రాథమిక మానవ హక్కులకు అనుగుణంగా చర్య తీసుకుంటుందా? కచ్చితంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులు సింగపూర్‌లోని తమ తోటి ఆరాధికుల గురించి ఎంతో శ్రద్ధ కలిగివున్నారు. వారు తమ ప్రార్థనల్లో వారిని జ్ఞాపకం చేసుకుంటూ, “యెహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు” అని బైబిలునందు కనుగొనబడే ఈ నిశ్చయతను గుర్తుంచుకుంటారు.—కీర్తన 37:28.
[అధస్సూచీలు]
a ఈ 69 మంది నిర్బంధింపబడిన తర్వాతి నెలలనుండి, మరో 11 మంది సాక్షులు నిర్బంధింపబడి, చట్టవ్యతిరేక సాహిత్యం ఉన్నట్లు ఆరోపించబడ్డారు.
[30వ పేజీలోని బాక్సు]
మార్చి 21, 1995
గోహా చాక్ టాంగ్
ప్రధాన మంత్రి
ఇస్తానా అన్నెక్స్
సింగపూర్ 0923
రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్
లీ క్వాన్ ఈవు
సీనియర్ మంత్రి
ప్రధాన మంత్రి కార్యాలయం
460 అలెక్సాండ్రా రోడ్డు
37-00 పిఎస్ఏ బిల్డింగ్
సింగపూర్ 0511
రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్
డియర్ సర్స్:
సింగపూర్ నుండి ఫిబ్రవరి 25, 1995న విడుదలైన ఇటీవలి రాటర్స్లో వచ్చిన వార్త ఎంతో కలవరపర్చేదిగా ఉంది. యెహోవాసాక్షుల బైబిలు పఠన కూటాలు పోలీసులచే నిలిపివేయబడి, 69 మంది నిర్బంధింపబడ్డారని అది నివేదించింది. ఈ నివేదిక ప్రపంచం యొక్క ఆసక్తిని సింగపూర్‌లోని యెహోవాసాక్షుల పరిస్థితి వైపుకు మళ్లించింది, అక్కడ వారి చర్యలు, సాహిత్యం 20 కంటే ఎక్కువ సంవత్సరాల నుండి నిషేధం క్రింద ఉన్నాయి.
దాదాపు 200 కంటే ఎక్కువ దేశాల్లో చట్టం యొక్క పూర్తి రక్షణతో స్వేచ్ఛగా పనిచేస్తున్న ఒక మతసంబంధమైన సంస్థ, ప్రజాస్వామ్యపు సూత్రాలను అవలంబించే దేశమైన సింగపూర్‌లో మాత్రమే ఎందుకు నిషేధించబడాలో అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది. సింగపూర్ యొక్క రాజ్యాంగం తన పౌరులకు ఆరాధనా స్వాతంత్ర్యాన్ని హామీ ఇస్తుందనే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే ఇది మరింత కలవరపర్చేదిగా ఉంది.
యెహోవాసాక్షులు జాతీయ భద్రతకు ఎక్కడా, ఎన్నడూ ఏ విధమైన ప్రమాదం తీసుకురాలేదు. వాస్తవానికి, వారు శాంతికాముకులని, కష్టపడి పనిచేసేవారని, నైతికంగా మంచివారని, చట్టానికి లోబడేవారని ప్రపంచమంతటా వారికి పేరు ఉంది, మీరు మీ దేశంలో ఈ లక్షణాలను ప్రోత్సహిస్తారని నేను నమ్ముతున్నాను.
క్రైస్తవులకివ్వబడిన బైబిలు ప్రమాణాలను యెహోవాసాక్షులు కచ్చితంగా హత్తుకొని ఉండడాన్ని బట్టి కొన్నిసార్లు వారి స్థానం అపార్థం చేసుకొనబడడం లేక తప్పుగా ప్రాతినిధ్యం వహించబడడం నిజమే. కాని, తన కాలంనాటి ప్రభుత్వానికి, అంటే “కైసరుకు” వ్యతిరేకంగా ఉన్నట్లు తప్పుగా చెప్పబడిన క్రైస్తవత్వపు మూలపురుషుడైనవాని విషయంలో కూడా ఇది నిజం కాదా? యెహోవాసాక్షులు యేసుక్రీస్తు మరియు తొలి క్రైస్తవుల మాదిరిని మాత్రమే అనుసరిస్తారు. వారు తాము నివసించే ప్రాంతంలోని ప్రభుత్వాన్ని గౌరవిస్తారు, తమ పన్నులు చెల్లిస్తారు, మంచి నైతికసూత్రాలను వృద్ధి చేస్తారు. వారు మనస్సాక్షిగల, నీతిమంతులైన పౌరులు. యెహోవాసాక్షులు ఎన్నడూ ఏ దేశంలోను ఏ విధమైన వినాశకర కార్యంలోను భాగం వహించలేదు, సింగపూర్‌లో వారి ఉనికి మీ దేశ జాతీయ ఆసక్తులకు ఏ ప్రమాదాన్ని కలిగించదని నేను మీకు హామీ ఇవ్వగలను.
ఇటీవలి వార్తాప్రచార నివేదికల మూలంగా, సింగపూర్‌లో యెహోవాసాక్షులకు వ్యతిరేకంగా మీ ప్రభుత్వం తీసుకున్న అణిచివేసే చర్యలు అందరికీ తెలిసిపోయాయి. ప్రాముఖ్యంగా ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారి 1.2 కోట్ల సహవాసులకు ఎంతో చింత కల్గిస్తున్న విషయం. పరిస్థితిని చక్కపర్చేందుకు, మీ దేశంలో రాజ్యాంగం హామి ఇస్తున్న ఆరాధనా స్వేచ్ఛను, మనస్సాక్షిని యెహోవాసాక్షులకు అందజేసేందుకు మీరు మీ మంచి అధికారాన్ని ఉపయోగించమని నేను మిమ్మల్ని కోరుతున్నాను.
యెహోవాసాక్షుల ప్రతినిధులతో సూటియైన చర్చ మా సంస్థ గురించి, కార్యాల గురించి ఉన్న అపార్థాలను తీసివేసేందుకు సహాయం చేస్తుందని నేను విశ్వసిస్తున్నాను, సింగపూర్ ప్రభుత్వం యెహోవాసాక్షుల గురించి భయపడవలసినది ఏమీ లేదని నేను మళ్లీ హామీ ఇస్తున్నాను. అలాంటి కూటమిని ఏర్పాటు చేయడానికి నేను సంతోషిస్తాను.
నేను మీ సమాధానం కొరకు ఎదురు చూస్తుంటాను.
గౌరవపూర్వకంగా మీ,
మిల్టన్ జి. హెన్షెల్
అధ్యక్షుడు
[31వ పేజీలోని చిత్రసౌజన్యం]
Nik Wheeler/H. Armstrong Roberts