భయం ఎప్పుడు అంతమౌతుంది?
నిజమైన భద్రత అన్నది 2,000 సంవత్సరాల క్రితం జీవించిన ఒక వ్యక్తితో సంబంధం కల్గివుందని తెలుసుకోవడం మీకు ఆశ్చర్యాన్ని కల్గిస్తుందా? ప్రేమను కనపర్చే అవసరతను చూపిస్తూ యేసుక్రీస్తు గణనీయమైన ఓ ఉపమానాన్ని చెప్పాడు: “ఒక మనుష్యుడు యెరూషలేమునుండి యెరికోపట్టణమునకు దిగి వెళ్లుచు దొంగలచేతిలో చిక్కెను; వారు అతని బట్టలు దోచుకొని, అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి.” ఇద్దరు ప్రయాణికులు ఆ బాధితుని పట్టించుకోకపోయినప్పటికీ, కనికరం గల ఒక సమరయుడు దయను కనపర్చాడు. నేడు నేరానికి గురైన వారిని ఎవరు పట్టించుకుంటారు? భయం నుండి ఎలాంటి విడుదల దొరుకుతుందని మనం అపేక్షించగలం?—లూకా 10:30-37.
దేవునియందు విశ్వాసముందని చెప్పుకుంటూనే, నీతి నియమాలను మానవుడే అమలుపర్చాలని అనేకులు అనుకుంటారు. కఠినమైన శిక్షా విధులు లేక ఎక్కువ జీతాలను ఇచ్చే పోలీసులను ఉంచడం దౌర్జన్యంతో కూడిన నేరాన్ని అంతమొందించగలదా? భద్రతను కొంతమేరకైనా అందించేందుకు న్యాయాన్ని అమలుపర్చే ఏజెన్సీలు, చేసే తమ యథార్థమైన ప్రయత్నాలను ఆపకుండా, మాదకద్రవ్య దుర్వినియోగం, పథకం ప్రకారం చేసే నేరం మరియు పేదరికాలు వంటి వాటిని నివారిస్తున్నాయని మీరు నమ్ముతున్నారా? అయినా, నీతి విషయంలో మనకు గల ఆకలి దప్పులు వ్యర్థంకానవసరం లేదు.—మత్తయి 5:6.
కీర్తన 46:1 ఇలా చెబుతోంది: ‘దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు.’ ఈ మాటలు ఓ చక్కని పద్యం మాత్రమే కాదని మనం చూస్తాం.
మీకు తెలిసినట్లుగానే, అంతర్యుద్ధాల్లోనూ ఉగ్రవాదుల దాడుల్లోనూ క్రూరంగా చంపబడడాన్ని గూర్చి వార్తా మాధ్యమాలు ప్రతిరోజూ నివేదిస్తున్నాయి. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలు, ఇళ్లులేని పిల్లలను లేక ప్రత్యక్షసాక్షులనూ చంపివేసే స్థలాలయ్యాయి. జీవితానికి ఎందుకు విలువలేకుండా పోయింది? అలాంటి దౌర్జన్యానికి వివిధ కారణాలున్నప్పటికీ, మనం శ్రద్ధ నిలపాల్సిన కారణమొకటుంది.
దేవుని వాక్యమైన బైబిలు ప్రకారం ‘లోకమంతయు దుష్టునియందున్నది.’ (1 యోహాను 5:19) వాస్తవానికి, అపవాదియైన సాతానుని ఒక అబద్ధికుడని మాత్రమే కాకుండ “నరహంతకుడు” అని కూడా యేసుక్రీస్తు సూచించాడు. (యోహాను 8:44) శక్తిమంతుడైన ఈ ఆత్మీయప్రాణి మానవజాతిని పలువిధాల్లో ప్రభావితం చేస్తూ ఉద్ధృతమౌతున్న నేటి దౌర్జన్యాన్ని హెచ్చిస్తున్నాడు. “భూమీ సముద్రమా, మీకు శ్రమ; అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహుక్రోధము గలవాడై మీయొద్దకు దిగివచ్చియున్నాడని” ప్రకటన 12:12 చెబుతోంది. అయితే, సంతోషకరంగా, ఈ దుష్టవిధానం స్థానంలో ‘క్రొత్త ఆకాశము క్రొత్త భూమి’ చోటు చేసుకుని, మరి ‘వాటియందు నీతి నివసించును.’—2 పేతురు 3:13.
నూతన లోకాన్ని గూర్చిన అద్భుతమైన ఈ నిరీక్షణతో పాటు, మనకు ఇప్పుడు ఏ సహాయం ఉంది?
దానికి అనుకూలమైన జవాబును కనుగొనే ముందు యథార్థమైన క్రైస్తవులు కూడా నేరం నుండి రక్షించబడతారనే నిశ్చయత లేదని మనస్సులో ఉంచుకోవడం మంచిది. తాను వ్యక్తిగతంగా అనుభవించిన కొన్ని అపాయాలను అపొస్తలుడైన పౌలు వర్ణించాడు. “నదులవలననైన ఆపదలలోను, దొంగలవలననైన ఆపదలలోను, నా స్వజనులవలననైన ఆపదలలోను, అన్యజనులవలననైన ఆపదలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను” చిక్కుకున్నాడు. (2 కొరింథీయులు 11:26) అయినప్పటికీ పౌలు ఈ అపాయాలనుండి తప్పించుకోగలిగాడు. నేటి విషయం కూడా అంతే; మనం జాగ్రత్తగా ఉండడంవల్ల మన పనులను మామూలుగా చేసుకుపోగలం. మనకు సహాయపడగల కొన్ని విషయాలను మనం పరిశీలిద్దాం.
ప్రజలు ఇతరులను సన్నిహితంగా పరిశీలిస్తారు కనుక, ఇప్పుడు ఎవరైనా అపాయకరమైన పరిసరాల్లో నివసిస్తున్నట్లైతే, మంచి ప్రవర్తన ఒక రక్షణ కాగలదు. దొంగలు పథకం వేసుకుని దౌర్జన్యాలు చేసినప్పటికీ వారనేకులు తమను తాము సాధారణ ప్రజలుగానే పరిగణించుకుంటారు. వారు చేసే పనులను విమర్శించకండి, వారు ఏ పనిలో ఉన్నారో తెలుసుకునేందుకు ప్రయత్నించకండి. ఆ విధంగా, ప్రతీకారం తీసుకునేందుకు మీరు కారణమయ్యే సాధ్యతను మీరు తగ్గించుకోగలరు. ఎవరు క్రొత్త వస్తువులను కొన్నారు లేక ఇళ్లలో ఉండకుండా ఎవరు సెలవులకు వెళుతున్నారు అన్న విషయాలను తెలుసుకునేందుకు దొంగలు ప్రయత్నిస్తారనే విషయాన్ని మనస్సులో పెట్టుకోండి, దాన్ని బట్టి మీరు ఇతరులకు వేటిని బయల్పరుస్తున్నారన్న విషయంలో జాగ్రత్తగా ఉండండి.
పరిచారకులుగా తమకున్న పేరు తమకు విశేషమైన రక్షణనిచ్చిందని అనేకమంది యెహోవాసాక్షులు కనుగొన్నారు. సమాజంలోని ప్రజలకు సహాయపడేందుకు ఏ పక్షపాతం లేకుండా తమను తాము అర్పించుకునే అలాంటి క్రైస్తవులను గౌరవిస్తున్నామని నేరస్థులు కనపర్చారు. సాక్షులు హంతకులో లేక దొంగలో, లేక ‘పరులజోలికి పోవువారో’ కారు కనుక అపాయకరమైన వారు కారు.—1 పేతురు 4:15.
దేవుని నూతనలోకంలో భద్రత
యేసుక్రీస్తు ప్రవచించినట్లు “అక్రమము విస్తరించుట” విషయంలో మనం దుఃఖిస్తాము, కానీ ఎక్కువగా చింతించే కంటే, దేవుడు ఈ దుష్ట విధానాన్ని త్వరలోనే తీసివేస్తాడన్న విశ్వాసాన్ని మనం కల్గివుండవచ్చు. “ఈ రాజ్య సువార్త” ప్రకటనను గూర్చి ప్రవచించడం మాత్రమే కాకుండ, యేసు తన అనుచరులకు ఇలా జ్ఞాపకం చేశాడు: “అంతమువరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును.”—మత్తయి 24:12-14.
ఇతరులను పీడించుకుతినేవారు, అంటే కొన్నిసార్లు మనం విశ్వసించలేనంతటి క్రూరత్వంతో ప్రవర్తించేవారు నాశనం చేయబడతారని మనం నమ్మవచ్చు. సామెతలు 22:22, 23 ఇలా చెబుతోంది: “దరిద్రుడని దరిద్రుని దోచుకొనవద్దు గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు. యెహోవా వారి పక్షమున వ్యాజ్యెమాడును ఆయన వారిని దోచుకొనువారి ప్రాణమును దోచుకొనును.” దొంగలు, హంతకులు కామాపేక్షులు వంటి చెడుపనులను చేసేవారిని యెహోవా తీసివేస్తాడు. అంతేకాకుండ, ఆయన అలాంటి నేరాలకు గురైన వారిని లక్ష్యంచేయకుండా ఉండడు. వారు నష్టపోయినవాటిని ఆయన భర్తీచేసి, వారికి మరలా ఆరోగ్యాన్ని చేకూరుస్తాడు.
వాస్తవానికి, “కీడు చేయుట మాని మేలు చేయు”వారు అటు రాబోవు మహా శ్రమలను తప్పించుకోవడం ద్వారాగానీ, మృతులలోనుండి పునరుత్థానమైనవారిగాగానీ నిత్యజీవాన్ని పొందుతారు. “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.” (కీర్తన 37:27-29) అలాంటి ప్రయోజనాలు యేసు విమోచన బలిద్వారా అందుతాయి. (యోహాను 3:16) అయితే పునరుద్ధరించబడిన పరదైసులోని జీవితం ఎలా ఉంటుంది?
దేవుని రాజ్యంలోని జీవితం నిజంగా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. యెహోవా ఇలా ప్రవచిస్తున్నాడు: ‘నా జనులు విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానములయందును సుఖకరమైన నివాసములయందును నివసించెదరు.’ (యెషయా 32:17) నిత్య జీవాన్ని పొందేవారందరూ తమ వ్యక్తిత్వంలో మార్పులు చేసుకుని ఉంటారు. ఎవ్వరూ కూడా దుష్టులుగా అన్యాయస్థులుగా ఉండరు, లేక అలాంటి వ్యక్తికి ఎవరూ గురయ్యే అవకాశం ఉండదు. ప్రవక్తైన మీకా ఇలా చెబుతున్నాడు: “ఎవరి భయములేకుండ ప్రతివాడును తన ద్రాక్షాచెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును.” (మీకా 4:4; యెహెజ్కేలు 34:28) నేడున్న అపాయకరమైన పరిసరాలకు ఎంత భిన్నంగా ఉంటుందో కదా!
[6వ పేజీలోని బాక్సు]
జాగ్రత్తగా ఉండండి
అనేక మంది నేరస్థులు నేరాన్ని తమ వృత్తిగా చేసుకుంటూ ఎప్పుడూ పనిచేస్తుంటారు. మీవైపు తుపాకీని గురిపెట్టేది ఒకరే అయినప్పటికీ వారు ఇద్దరూ ముగ్గురున్న గుంపులుగా పనిచేయవచ్చు. ఆ నేరస్థుడు ఎంత చిన్నవాడైతే అంత అపాయకారియని ఎంతో స్పష్టంగా కనబడుతోంది. మీరు దానికి గురైనట్లైతే ఏమి చేయగలరు?
ఆ దొంగను భయపెట్టకుండా ఉండేందుకుగాను ప్రశాంతంగా ఉండండి—అతని అనుభవలేమి ప్రాణాంతకం కావచ్చు. మీరు ఒక యెహోవాసాక్షి అయినట్లైతే, మీరు వారిలో ఒకరని తెలియపర్చండి. అయినప్పటికీ, ఆ దొంగకు ఏమి కావాలో అది ఇచ్చేసేందుకు సిద్ధంగా ఉండండి. మీరు ఆలస్యం చేస్తే ప్రమాదం అధికమౌతుంది. ఆ తర్వాత, గుర్తింపు కాగితాలనూ లేక తిరిగి వెళ్లేందుకు బస్సు చార్జీలను అడగడం క్షేమకరమని మీరు భావించవచ్చు.
తరచూ నేరస్థుడెవరో మీరు చెప్పలేరు. కొందరు దొంగలు మాదకద్రవ్యానికి అలవాటుపడినవారు లేక వృత్తిరీత్యా నేరస్థులు, మరి కొందరు కేవలం తిండికొరకు దొంగతనం చేస్తారు. ఏ సందర్భంలోనైనా, పెద్ద మొత్తంలో డబ్బు తీసుకువెళ్లకండి. ఆభరణాలు, బంగారు ఉంగరాలూ లేక ఖరీదైన గడియారాలు కనిపించేట్లు పెట్టుకోకండి. ఏ భయమూ కనపర్చకుండా మామూలుగా నడవండి, ప్రయాణించండి. గుర్తించామన్నట్లుగా వ్యక్తులపై మీ దృష్టిని కేంద్రీకరించకండి. వీధి కాల్పులు జరిగేటప్పుడు, మీరు నేలమీద పడిపోండి; బట్టలను తర్వాత ఉతుక్కోవచ్చు.—రియో డి జనిరియోలోని ఓ మునుపటి పోలీసు.
[5వ పేజీలోని చిత్రం]
ప్రశాంతంగా ఉండి, ఆ దొంగ కావాలన్నవాటిని ఇచ్చేయండి. మీరు ఆలస్యం చేస్తే, అపాయం పెరుగుతుంది