“సత్యమంటే ఏమిటి?”
ఎదురెదురుగా ఉన్న ఆ ఇద్దరు మనుష్యులు పూర్తి భిన్నమైన ఆలోచనలు గలవారు. వారిలో ఒకరు శంకితుడు, అత్యాశాపరుడు, సంపన్నుడు, తన ఇచ్ఛను తీర్చుకునేందుకు ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్న రాజకీయ వ్యక్తి. మరొకరు ఐశ్వర్యాన్ని, ప్రతిష్ఠను విసర్జించి, ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు తన ప్రాణాన్ని అర్పించేందుకు సిద్ధంగా ఉన్న ఓ బోధకుడు. ఈ వ్యక్తులకు ఒకే దృక్పథం లేదని పెద్దగా చెప్పనవసరం లేదు సుమా! ప్రత్యేకంగా ఒక్క విషయంలో వారు—అంటే సత్యాన్ని గూర్చి పూర్తి భిన్నాభిప్రాయాన్ని కల్గివున్నారు.
ఆ మనుష్యులు, పొంతిపిలాతు మరియు యేసుక్రీస్తు. యేసు నిందిత నేరస్థునిగా పిలాతు ఎదుట నిలుచుని ఉన్నాడు. ఎందుకు? దాని కారణం, అంటే వాస్తవానికి, తాను భూమిమీదికి వచ్చి తన పరిచర్యను చేపట్టిన కారణమంత ఒక్క మాటలో ఇమిడివుంది: అదే సత్యం అని యేసు వివరించాడు. “సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని” అని ఆయన చెప్పాడు.—యోహాను 18:37.
అందుకు పిలాతు ఇచ్చిన జవాబు గమనించదగిన ప్రశ్నే: ‘సత్యమంటే ఏమిటి?’ (యోహాను 18:38) అతనికి నిజంగా జవాబు కావాలా? బహుశ అవసరంలేదు. తనను గూర్చి యథార్థంగా అడిగిన ఏ ప్రశ్నకైనా జవాబిచ్చే స్వభావంగల మనిషే యేసు, కానీ పిలాతుకు మాత్రం జవాబు ఇవ్వలేదు. ఆ ప్రశ్నను అడిగిన తర్వాత, ప్రేక్షకులున్న గదిలోనుండి పిలాతు నేరుగా లోపలికి వెళ్లిపోయాడని బైబిలు చెబుతోంది. బహుశ రోమా పాలకుడు పూర్తి అపనమ్మకంతో, “సత్యమా? అదేమిటి? అలాంటిదేదీ లేదే!” అన్నట్లుగా ప్రశ్నించాడు.a
సత్యం విషయంలో పిలాతు సందేహాత్మక వైఖరి నేడు అసాధారణమేమీకాదు. సత్యం నిరపేక్షమైందని అనేకుల విశ్వాసం. మరో మాటలో చెప్పాలంటే, ఒక వ్యక్తికి నిజమైనదిగా కనిపించే ఒక విషయం మరో వ్యక్తికి అబద్ధం కావచ్చు, కనుక వారిద్దరూ చెప్పేది “సరియే.” ఈ విశ్వాసం ఎంతగా వ్యాప్తిలో ఉందంటే, దానికి ఓ పదం కూడా ఉంది: “నిరపేక్షతా వాదం.” సత్యాన్ని మీరు ఇదే వైఖరితో చూస్తున్నారా? అలాగైనట్లైతే, మీరు దాన్ని పూర్తిగా పరిశీలించకుండా ఈ వైఖరిని మీరు అంగీకరించి ఉండవచ్చునా? అలా కాకపోయినా, ఈ తత్వం మీ జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో మీకు తెలుసా?
సత్యం మీద దాడి
సంపూర్ణ సత్యముందనే అభిప్రాయాన్ని సవాలుచేసినవారిలో పొంతి పిలాతు మొదటివాడు కాడు. కొందరు ప్రాచీన గ్రీకు తత్వశాస్త్రవేత్తలు అలాంటి సందేహాలను బోధించడాన్ని తమ జీవిత వృత్తిగా చేసుకున్నారు కూడా! పిలాతుకు అయిదు శతాబ్దాలకు పూర్వం జీవించిన, పరామినిడెస్ (ఐరోపా అస్తిత్వానికి పితామహునిగా పరిగణించబడుతున్నాడు) నిజమైన జ్ఞానాన్ని పొందడం అసాధ్యమని విశ్వసించాడు. “పురాతన తత్వశాస్త్రవేత్తల్లో గొప్పవాడు” అని గౌరవించబడుతున్న డిమోక్రిటస్ ఇలా నొక్కి చెప్పాడు: “సత్యం ఎక్కడో అగాధంలో పాతుకుపోయింది. . . . ఏదీ మనకు కచ్చితంగా తెలియదు.” బహుశ వారందరికంటే ఎక్కువగా గౌరవించబడ్డ తనకు తెలిసిందెల్లా తనకు ఏమీ తెలియదని సోక్రటిస్ చెప్పాడు.
సత్యాన్ని తెలుసుకోవచ్చు అనే అభిప్రాయంపై దాడి మన కాలంవరకు కొనసాగింది. ఉదాహరణకు, జ్ఞానము మోసగింపబడగల మన జ్ఞానేంద్రియముల ద్వారా మనలను చేరుతుంది కనుక ఏ జ్ఞానమూ సత్యమని ధ్రువపర్చబడదని కొందరు తత్వశాస్త్రవేత్తలు చెబుతారు. ఫ్రెంచ్ తత్వశాస్త్రవేత్త మరియు గణితశాస్త్రవేత్తయైన రీని డిస్కార్టెస్, తనకు కచ్చితంగా తెలుసునని అనుకునే విషయాలన్నింటినీ పరిశీలించాలని నిర్ణయించుకున్నాడు. అన్నిటినీ అతను పరిత్యజించాడు కానీ నిర్వివాదమని అనిపించే ఒక్క సత్యాన్ని మాత్రం త్యజించలేదు అదే: “కొజిటొ ఎర్గొ సమ్,” లేక, “నేను ఆలోచించగల్గుతున్నాను, కనుక నేనున్నాను.”
నిరపేక్షతా వాద సంస్కృతి
నిరపేక్షత తత్వజ్ఞానులకు మాత్రమే పరిమితంకాదు. అది మత నాయకుల ద్వారా బోధించబడుతోంది, పాఠశాలల్లో ఉపదేశించబడుతోంది, వార్తామాధ్యమాల ద్వారా వ్యాప్తి చేయించబడుతోంది. ఎపిస్కోపియల్ బిషప్ జాన్ ఎస్. స్పాంజ్ కొన్ని సంవత్సరాల క్రితం ఇలా చెప్పాడు: “మనవద్ద . . . సత్యముందని మనం తలంచడం మానేయాలి, అంతేకాకుండ పరమ సత్యాన్ని ఎవ్వరూ పొందలేరనే మన దృక్పథానికి ఇతరులు రావాలి.” నేడు అనేకమంది మతనాయకుల్లా స్పాంజ్ ప్రబోధించిన నిరపేక్షతా వాదం కూడా, “ఎవరిది వారికే” అనే సిద్ధాంత పక్షం వహించి, బైబిలు నైతిక బోధలను వెంటనే విడనాడుతుంది. ఉదాహరణకు, సలింగ సంయోగులు ఎపిస్కోపియల్ చర్చిలో మరింత “హయిగా” ఉండేందుకుగాను, పౌలు కూడా ఓ సలింగసంయోగియని వాదిస్తూ స్పాంజ్ ఓ పుస్తకాన్ని వ్రాశాడు!
అనేక దేశాల్లో పాఠశాల విద్యా విధానాలు అలాంటి ఆలోచననే వృద్ధిచేస్తున్నట్లుగా ఉన్నాయి. ది క్లోసింగ్ ఆఫ్ ది అమెరికన్ మైండ్ అనే పుస్తకంలో అలెన్ బ్లూమ్ ఇలా వ్రాశాడు: “ఒక ప్రొఫెసరు ఒక విషయాన్ని పూర్తిగా నమ్మవచ్చు: విశ్వవిద్యాలయాన్ని చేరే ప్రతి విద్యార్థి సత్యం నిరపేక్షమైనదని నమ్ముతాడు, లేక కనీసం నమ్ముతున్నానని చెబుతాడు.” ఈ విషయంలో తన విద్యార్థుల విశ్వాసాన్ని సవాలు చేస్తే, “2+2=4 అన్న విషయాన్నే ఆయన సందేహిస్తున్నట్లుగా” వారు ఆశ్చర్యంతో ప్రతిస్పందిస్తారని బ్లూమ్ కనుగొన్నారు.
అదే అభిప్రాయం అనేక ఇతర మార్గాల ద్వారా ప్రోత్సహించబడుతోంది. ఉదాహరణకు, దూరదర్శని మరియు వార్తాపత్రిక విలేఖరులు, ఒక విషయంలోని నిజానిజాలను అందించడం కన్నా తరచూ తమ పాఠకులకు వినోదాన్ని అందించడంలోనే ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నట్లనిపిస్తుంది. అవి మరింత నాటకీయంగా కనిపించేందుకుగాను కొన్ని వార్తా కార్యక్రమాలు, వాటిని కల్పించాయి, లేక దొంగ ఫిలిమ్‌లను తయారు చేశాయి. అంతేకాకుండ వినోదంలో, సత్యం మీద గట్టి దెబ్బ వేయడం జరిగింది. మన తలిదండ్రులు, తాతలు ఏ విలువలకు మరియు నైతిక సత్యాలకు అనుగుణంగా జీవించారో అవి నేడు విశ్వవ్యాప్తంగా అపహాస్య దృష్టితో చూడబడుతున్నాయి.
నిస్సందేహంగా, ఈ నిరపేక్షతావాదం, నూతన భావాలను గ్రహించే మనస్సుకు ప్రతిబింబం, కనుక మానవజాతి మీద అది అనుకూల ప్రభావాన్ని కల్గివుంటుందని కొందరు వాదించవచ్చు. మరి నిజంగా అది అలా కల్గివుంటుందా? మరి మీపై దాని ప్రభావమేమిటి? సత్యం నిరపేక్షమైనదని లేక ఉనికిలో లేదని మీరు నమ్ముతున్నారా? అలాగైతే, దాని కొరకు వెదకడం సమయాన్ని వృథాచేసుకోవడం అని మీరు భావించవచ్చు. అలాంటి వైఖరి మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది.
[అధస్సూచీలు]
a బైబిలు విద్వాంసుడైన ఆర్. సి. హెచ్. లెనిస్కీ ప్రకారం, పిలాతు “వ్యక్తపర్చిన విధంలో ఎంతో కర్కశమైన పదాలను ఉపయోగించాడు. తన ప్రశ్న ద్వారా మతపర సత్యానికి సంబంధించిన విషయమేదైనప్పటికీ అది వ్యర్థమైన ఆలోచనేనని చెబుతున్నాడు.”