పరిణతి చెందాలనే నా నిర్ణయం
కార్ల్ డకావో చెప్పినది
“పరిణతి చెందడం లేక పాపంలో పడిపోవడం, ఏది?” జూన్ 15, 1948 కావలికోట (ఆంగ్లం) నందలి ఒక శీర్షిక యొక్క పేరు అది. అమెరికా పొలాల్లో ఆత్మీయ ప్రమాదంలో పడిపోయే పరిస్థితి నుండి దక్షిణమెరికాలో 43 సంవత్సరాల కంటే ఎక్కువ కాలనిడివి గల మిషనరీ సేవకు మారడానికి ఆ శీర్షిక నన్ను పురికొల్పింది.
నేను 1914 మార్చి 31న, మిన్నెసొటానందలి వెర్గాస్లో, చెట్టు దుంగలతో చేయబడిన ఒక చిన్న ఇంట్లో నలుగురు మగపిల్లలలో మూడవ వానిగా జన్మించాను. నా యౌవనపు తొలి సంవత్సరాలు ఆనందంగా గడిచాయి. నాన్నతో కలిసి చేపలు పట్టడం నాకు గుర్తుంది. అయితే, అమ్మ తరచూ అనారోగ్యంగా ఉండేది, ఇంటిపనిలో ఆమెకు సహాయం చేసేందుకు నేను ఐదవ తరగతిలో పాఠశాల విడిచిపెట్టవలసి వచ్చింది. నాకు 13 సంవత్సరాలు ఉండగా, ఆమె అనారోగ్యం క్యాన్సర్‌గా ధ్రువీకరించబడింది.
తాను ఎక్కువకాలం జీవించనని అమ్మకు తెలిసిపోయింది అందుకే, నేను ఆమె స్థానం తీసుకునేలా ఆమె నాకు తర్ఫీదివ్వడం ప్రారంభించింది. ఆమె వంటగదిలో కూర్చుని ఎలా వండాలి, ఎలా బేక్ చేయాలి అనేదానిపై సూచనలిచ్చేది. అంతేగాక, బట్టలు ఉతకడం, తోట గురించి శ్రద్ధ వహించడం, ఒక వంద కోడిపిల్లల గురించి శ్రద్ధ తీసుకోవడం ఆమె నాకు నేర్పింది. ప్రతి రోజు బైబిలులో నుండి ఒక అధ్యాయం చదవమని కూడా ఆమె నన్ను ప్రోత్సహించేది, నాకు చదివే సామర్థ్యం చాలా తక్కువగా ఉన్నప్పటికీ నేను చదివేవాడిని. నాకు పదినెలలు తర్ఫీదిచ్చాక, 1928 జనవరి 27న అమ్మ మరణించింది.
యుద్ధం మా జీవితాలను మార్చింది
సెప్టెంబరు 1939లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యాక, ప్రతి ఆదివారం మా లూథరన్ చర్చిలో సైన్యాల గురించి ప్రార్థనలు చేయబడేవి. మా అన్నయ్య ఫ్రాంక్ చంపకూడదని నిర్ణయించుకున్నాడు, కాబట్టి సైన్యంలో భాగంగా యుద్ధం చేయడానికి ఆయన నిరాకరించినప్పుడు, ఆయన నిర్బంధించబడ్డాడు. ఆయన న్యాయవిచారణలో ఇలా వ్యాఖ్యానించాడు: “నేను అమాయకులైన ప్రజలను చంపకముందే, మీరు నన్ను కాల్చివేయవచ్చు!” ఆయన వాషింగ్టన్ రాష్ట్రానికి దూరంగా మిక్నెల్ ద్వీపం నందు ఒక సంవత్సరం చెరసాలలో ఉండేలా శిక్ష విధించబడ్డాడు.
యుద్ధసమయంలో కచ్చితంగా తటస్థంగా ఉన్నందున చెరసాలలో వేయబడిన దాదాపు 300 మంది యెహోవాసాక్షులను ఫ్రాంక్ అక్కడ కనుగొన్నాడు. (యెషయా 2:4; యోహాను 17:16) త్వరలోనే ఆయన వారితో సహవసించడం ప్రారంభించాడు, అక్కడ చెరసాలలోనే బాప్తిస్మం తీసుకున్నాడు. మంచి ప్రవర్తనను బట్టి ఆయన శిక్ష తొమ్మిది నెలలకు తగ్గించబడింది. నవంబరు 1942లో ఫ్రాంక్ విడుదల చేయబడ్డాడన్న వార్త మేమందుకున్నాము, ఆ తర్వాత త్వరలోనే దేవుని రాజ్యాన్ని గూర్చిన సువార్త గురించి ఆయన మాకు చెప్పాడు. ఆ సందేశాన్ని మా బైబిళ్లతో జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, ఫ్రాంక్ మాకు బోధిస్తున్నది సత్యమేనని మేము గ్రహించగలిగాము.
ఆత్మీయ పురోభివృద్ధికి అవాంతరాలు
మా చిన్నాన్నతో కలిసి నివసించడానికి 1944లో నేను మోన్టానా నందలి మాల్టా ప్రాంతానికి వెళ్లాను. మాకిద్దరికి ఒక విషయంలో సామ్యత ఉండేది అదేమిటంటే మా ఇద్దరి భార్యలు వివాహమైన ఆరు నెలలకే మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. నేను ఆయనకు పొలం పనిలోను, వంట పనిలోను సహాయం చేస్తున్నందుకు ఆయన ఆనందించాడు, మేమిద్దరం మా లాభాలను సమానంగా పంచుకున్నాము. నేను ఆయనతోనే కలిసి ఉంటే తన 640 ఎకరాలకు నేను వారసున్ని కాగలనని మా చిన్నాన్న నాతో చెప్పాడు. పొలంపని చేయడానికి అవి ఫలవంతమైన సంవత్సరాలు, దాన్ని నేనెంతగా ఆనందించానో! మాకు ప్రతి సంవత్సరం పుష్కలమైన పంట పండేది, ఎనిమిది గాలన్ల బరువుకు సరిపడే గోధుమలు దాదాపు 3.16 డాలర్లకు అమ్మబడేవి.
మాల్టాలో సాక్షుల చిన్న సంఘం యొక్క కూటాలకు నేను హాజరవ్వడం మా చిన్నాన్నకు ఇష్టముండేది కాదు. నేను 1947 జూన్ 7న మా చిన్నాన్నకు తెలియకుండా, వోల్ఫ్ పాయింట్నందు యెహోవాసాక్షుల ప్రాంతీయ సమావేశంలో బాప్తిస్మం తీసుకున్నాను. అక్కడ ఒక క్రైస్తవ సహోదరుడు నన్ను పయినీరును, లేక పూర్తికాల పరిచారకున్ని అవ్వమని ఆహ్వానించాడు. నా జీవితాన్ని అలాంటి పనికొరకు వినియోగించాలన్నది నా హృదయపూర్వక కోరిక అయినప్పటికీ, మా చిన్నాన్న పరిచర్య కొరకు నన్ను అంత సమయం వెచ్చించనివ్వడని నేను వివరించాను.
తర్వాత కొంతకాలానికి, నన్ను పూర్తికాల పరిచారకున్ని అవ్వమని కోరుతూ ఒక స్నేహితుడు నాకు వ్రాసిన ఉత్తరాన్ని మా చిన్నాన్న తెరిచి చదివాడు. విపరీతమైన ఆగ్రహం తెచ్చుకొని, మా చిన్నాన్న నాతో నిష్కర్షగా ఇలా చెప్పాడు—ప్రకటించడం మానేయి లేదా ఇక్కడి నుండి వెళ్లిపో. అలా నిష్కర్షగా చెప్పడం మంచిదయ్యింది, ఎందుకంటే పొలంపని నాకు ఎంత ఇష్టమంటే నా స్వంతగా నేను దాన్ని విడిచిపెట్టి ఉండేవాడినో కాదో నాకు తెలియదు. కాబట్టి నేను మిన్నెసొటానందలి మా కుటుంబం వద్దకు తిరిగి వెళ్లాను, అప్పటికి వాళ్లందరూ బాప్తిస్మం తీసుకొని డెట్రాయిట్ లేక్స్ సంఘంతో సహవసిస్తున్నారు.
మొదట్లో పయినీరు సేవ చేయడానికి నా కుటుంబం నన్ను ప్రోత్సహించింది, కాని 1948లో వాళ్లు ఆత్మీయంగా చల్లబడిపోవడం మొదలుపెట్టారు. ఆ సమయంలోనే, “పరిణతి చెందడం లేక పాపంలో పడిపోవడం, ఏది?” అనే ఆ శీర్షిక నాకు అవసరమైన ఆత్మీయ ప్రోత్సాహాన్నిచ్చింది. “పురోగమిస్తున్న జ్ఞానంతోపాటు ఉండడానికి ఇష్టపూర్వకంగా నిరాకరిస్తే చాలా దుఃఖకరమైన పరిణామాలు తప్పకుండా వస్తాయి” అని అది హెచ్చరించింది. ఆ శీర్షిక ఇలా తెలియజేసింది: “మనం అలాగే నిలిచివుండి వెనుకబడి పోలేము, కాని మనం నీతియందు అభివృద్ధి సాధించాలి. పడిపోకుండా ఉండడానికి అభివృద్ధి, ఆగకపోవడం అత్యంత గొప్ప శక్తులు.”
మా కుటుంబం వేరే సాకులు చెప్పినప్పటికీ, ధనవంతులు కావాలన్న కోరిక వాళ్లకున్న అసలు సమస్య అని నా నమ్మకం. పొలంపనిలో ఎక్కువ సమయాన్ని, ప్రకటన పనిలో తక్కువ సమయాన్ని వెచ్చించడం వల్ల వచ్చే ఆర్థిక లాభాలను వారు చూడగలుగుతున్నారు. ధనం కొరకైన కోరిక యొక్క ఉరిలో చిక్కుకోవడానికి బదులు, నేను పయినీరు సేవ చేయడానికి పథకం వేసుకున్నాను. అది అంత సుళువు కాదని నాకు తెలుసు, అసలు నేనది చేయలేనేమో అని కూడా అనుకున్నాను. కాబట్టి 1948లో, కావాలనే, సంవత్సరం యొక్క అత్యంత హీనమైన వాతావరణం ఉండే నెల అయిన డిశంబరులో పయినీరు సేవ చేయడానికి అర్జీ పెట్టుకోవడం ద్వారా నన్ను నేను పరీక్షించుకున్నాను.
పయినీరు సేవను చేపట్టడం
యెహోవా నా ప్రయత్నాలను ఆశీర్వదించాడు. ఉదాహరణకు, ఒక రోజు వాతావరణం, వీస్తున్న చల్లని గాలులను పరిగణలోకి తీసుకోకపోయినా మైనస్ 27 డిగ్రీల సెల్సియస్ ఉంది. నేను మామూలుగా నా వీధి సాక్ష్యపు పని చేస్తున్నాను, తరచూ నా చేతులను మారుస్తూ—చల్లగా అయిన దాన్ని జేబులో ఉంచుకొని, మరో చెయ్యి కూడా చల్లగా అయ్యేదాక దానితో పత్రికలను పట్టుకుంటూ, తర్వాత మరో చేతిని మారుస్తూ, ఇలా చేస్తున్నాను. ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. కొంతసేపటి నుండి అతడు నా చర్యను గమనిస్తున్నానని చెప్పి, ఇలా అడిగాడు: “ఆ పత్రికలలో అంత ప్రాముఖ్యమైనది ఏముంది? వాటిని నేను చదవగలిగేలా ఆ రెండూ నాకివ్వు.”
ఈ మధ్య కాలంలో, మా కుటుంబంతో సహవసించడం నా ఆత్మీయతను ప్రమాదంలో పడవేస్తున్నట్లు నేను గమనించాను, కాబట్టి నేను వాచ్‌టవర్ సంస్థకు విజ్ఞప్తి చేసుకుంటే, నాకు మోన్టానా, మిల్జ్ నగరంలో క్రొత్త పని అప్పగించబడింది. అక్కడ నేను, ఇప్పుడు సంఘాధ్యక్షుడు అని పిలువబడుతున్న కంపెనీ సేవకునిగా పనిచేశాను. రెండు మీటర్ల వెడల్పు మూడు మీటర్ల పొడవుగల బండిలో నివసిస్తూ, ఒక డ్రైక్లీనింగ్ వ్యాపారంలో పార్ట్‌టైమ్ పనిచేస్తూ నన్ను నేను పోషించుకున్నాను. కొన్నిసార్లు నా కెంతో ఇష్టమైన కోతపనికి వెళ్లేవాన్ని.
ఈ సమయంలో, మా కుటుంబం యొక్క ఆత్మీయ పరిస్థితి క్షీణించిపోవడం గురించి నేను వినేవాన్ని. చివరికి, వాళ్లు మరియు డెట్రాయిట్ లేక్స్ సంఘంలోని ఇతరులు యెహోవా సంస్థకు వ్యతిరేకంగా తయారయ్యారు. సంఘంలోని 17 మంది రాజ్య ప్రచారకుల్లో, కేవలం 7 మంది మాత్రమే విశ్వాసంగా మిగిలి ఉన్నారు. నేను కూడా యెహోవా సంస్థను విడిచిపెట్టేలా చేయాలని మా కుటుంబం నిశ్చయించుకుంది, కాబట్టి దానికి మరింత అభివృద్ధి సాధించడం మాత్రమే పరిష్కారమని నేను గుర్తించాను. కాని ఎలా?
మిషనరీ సేవను చేపట్టుట
న్యూయార్క్ నగరంలో 1950లో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో, వాచ్‌టవర్ బైబిల్ గిలియడ్ పాఠశాల యొక్క 15వ తరగతి నుండి మిషనరీ విద్యార్థులు పట్టభద్రులు కావడం నేను చూశాను. ‘యెహోవాను పరాయి దేశంలో సేవించడానికి వెళ్తున్న వారిలో నేను కూడా ఉంటే ఎంతబాగుంటుంది’ అని నేను తలంచాను.
నేను ఒక అర్జీ పెట్టుకున్నాను, 1951 ఫిబ్రవరిలో ప్రారంభమైన గిలియడ్ యొక్క 17వ తరగతి సభ్యునిగా నేను అంగీకరించబడ్డాను. న్యూయార్క్ ఉత్తర ప్రాంతంలోని ఒక వ్యవసాయ క్షేత్రంలోవున్న పాఠశాల స్థలం సుందరంగా ఉంది. తరగతి సమయం అయిపోయిన తర్వాత, పొలంలో పనిచేయడం, అంటే ఆవులతో గాదెలో లేక బయట చేలలో పనిచేయడం నాకు ఎంతో ఇష్టంగా ఉండేది. కాని, ఆ సమయంలో రాజ్య వ్యవసాయ క్షేత్రం యొక్క అధ్యక్షునిగావున్న జాన్ బూత్ డ్రైక్లీనింగ్‌లో అనుభవం ఉన్న వాడిని నేనొక్కడినేనని వివరించాడు. కాబట్టి నేను ఆ పని చేయడానికి నియమించబడ్డాను.
కేవలం ఐదవ తరగతి మాత్రమే చదివినవారికి గిలియడ్ అంత సుళువేమికాదు. రాత్రి 10:30కి లైట్లు ఆర్పవలసి ఉన్నప్పటికీ, నేను తరచూ మధ్యరాత్రి వరకు చదువుకునేవాన్ని. ఒకరోజు ఉపదేశకుల్లో ఒకరు నన్ను తన కార్యాలయానికి రమ్మని పిలిచాడు. ఆయనిలా చెప్పాడు, “కార్ల్, నీవు అంత మంచి శ్రేణులను కలిగిలేవని నేను చూడగలుగుతున్నాను.”
నాకు నేను ఇలా అనుకున్నాను, ‘వాళ్లు నన్ను గిలియడ్ విడిచిపెట్టి వెళ్లమంటారేమో.’
అయితే, నేను రాత్రి ఎక్కువసేపు మేల్కొనకుండానే నా సమయాన్ని నేను ఎలా చక్కగా ఉపయోగించుకోవచ్చనే దానికి ఆ ఉపదేశకుడు ప్రేమపూర్వకంగా కొంత సలహా ఇచ్చాడు. నేను భయంగా ఇలా అడిగాను, “నేను ఇక్కడ గిలియడ్‌లో కొనసాగగలిగేంత మంచిగా ఉన్నానా?”
“ఓ, తప్పకుండా, కాని నీవు డిప్లొమా కొరకు అర్హునివి కాగలవో లేదో నాకు తెలియదు” అని ఆయన సమాధానమిచ్చాడు.
పాఠశాల అధ్యక్షుడైన నేథన్ హెచ్. నార్ మాటల నుండి నేను ఓదార్పు పొందాను. తమ పని నియామకాల్లో అలాగే కొనసాగిన మిషనరీల విశ్వాస్యతల కంటే వారి శ్రేణులు నన్ను ఎక్కువగా మెప్పించలేదని ఆయన విద్యార్థులకు చెప్పాడు.
స్పానిష్ నాకు చాలా కష్టమైన సబ్జెక్టు, కాని నేను, మా ఇంటి వద్ద నాకు బాగా అలవాటైన చల్లని వాతావరణం గల అలాస్కానందు నాకు పని అప్పగించబడుతుందని నిరీక్షిస్తున్నాను. అంతేగాక, నేను అప్పుడు ఆంగ్లంలో ప్రకటించవచ్చు. కాని విద్య మధ్యలో నేను దక్షిణ అమెరికానందలి ఈక్వెడార్‌కు నియమింపబడినట్లు తెలుసుకున్నప్పుడు నేనెంత ఆశ్చర్యపోయి ఉంటానో మీరు ఊహించవచ్చు. అవును, నేను స్పానిష్ భాష మాట్లాడవలసి ఉంటుంది, అక్కడ వాతావరణం విపరీతమైన వేడిగా ఉంటుంది.
ఒకరోజు గిలియడ్ పాఠశాల వద్ద ఒక ఎఫ్.బి.ఐ. ఏజెంటు నన్ను కలవడానికి వచ్చాడు. డెట్రాయిట్ లేక్స్‌లో మన సంస్థను విడిచిపెట్టిన ఒక కంపెనీ సేవకుని కుమారుని గురించి అతడు అడిగాడు. కొరియా యుద్ధం జరుగుతుంది, ఈ యౌవనుడు తాను ఒక యెహోవాసాక్షుల సేవకున్ని గనుక తనను సైనిక సేవనుండి మినహాయించమని కోరుతున్నాడు. అతడు ఇక యెహోవాసాక్షుల్లో ఒకడు కాదని నేను వివరించాను. ఆ ఏజెంటు వెళ్లిపోతూ, నాతో ఇలా అన్నాడు: “మీ దేవుడు నీ పనిలో నిన్ను దీవించుగాక.”
ఆ యౌవనుడు కొరియా మొదటి పోరాటాల్లో ఒకదానియందు చంపబడ్డాడని నేను తర్వాత తెలుసుకున్నాను. దేవుని సంస్థతో పరిణతి చెందియుండాల్సిన ఆ వ్యక్తికి ఎంతటి దుఃఖకరమైన పరిణామం!
చివరికి, 1951 జూలై 22న మా ఆనందభరితమైన పట్టభద్రులమయ్యే దినం వచ్చింది. మా కుటుంబంలోని వారెవరూ హాజరుకాలేదు, కాని నేను సాధించిన అభివృద్ధిని బట్టి నేను డిప్లొమా అందుకున్నప్పుడు నా ఆనందం పరిపూర్ణమయ్యింది.
ఒక విదేశీ ప్రాంతానికి తగినట్లు సర్దుకొనుట
ఒకసారి నేను నా పని నియామకంలో ఉండగా, అమ్మ ఇచ్చిన తర్ఫీదు నిజంగా ఉపయోగకరమైనదని నేను కనుగొన్నాను. వంటచేయడం, చేతితో బట్టలు ఉతుక్కోవడం, ధారాపాతంగా వచ్చే నీళ్లు లేకపోవడం నాకు క్రొత్తవేమి కాదు. కాని స్పానిష్ భాషలో ప్రకటించడం మాత్రం క్రొత్తదే! కొంతకాలం వరకు నేను ఒక ముద్రించబడిన స్పానిష్ ప్రసంగాన్నే ఉపయోగించేవాణ్ణి. నేను స్పానిష్ భాషలో బహిరంగ ప్రసంగం ఇవ్వడానికి దాదాపు మూడు సంవత్సరాలు పట్టింది, అదికూడా నోట్సును విస్తృతంగా ఉపయోగిస్తూ ఇచ్చాను.
నేను 1951లో ఈక్వడార్ను చేరినప్పుడు, అక్కడ 200 కంటే తక్కువమంది రాజ్యప్రచారకులున్నారు. మొదటి 25 లేక అంతకంటే ఎక్కువ సంవత్సరాల వరకు శిష్యులను చేసే పని చాలా మెల్లిగా జరుగుతున్నట్లుగా అనిపించింది. కాథోలిక్ల లేఖనరహిత ఆచారాల నుండి మన బైబిలు బోధలు చాలా వేరుగా ఉండేవి, ఒకే వివాహ జతకు నమ్మకంగా ఉండడమనే బైబిలు ఉపదేశాలను మనం హత్తుకొని ఉండడం ప్రాముఖ్యంగా పేరుగాంచలేదు.—హెబ్రీయులు 13:4.
అయినప్పటికీ, మేము ఎంతో బైబిలు సాహిత్యాన్ని అందజేయగలిగేవాళ్లం. అరటి తోటల నడుమ నెలకొనివున్న మచాల పట్టణమందలి మా పరిచర్య దీనికి ఉదాహరణ. మేము అక్కడికి 1956లో వెళ్లినప్పుడు నేను నికోలస్ వెస్లీ ఇద్దరమే సాక్షులము. ఆ రోజుల్లో రహదార్ల నిర్మాణపనిలో ఉపయోగించే డంప్ ట్రక్కులపై మేము ఉదయాన్నే బయలుదేరేవాళ్లము. మేము కొంత దూరం ప్రయాణించిన తర్వాత, ప్రజలకు సాక్ష్యమిస్తూ అక్కడ నుండి వెనక్కి మేము నివసించే స్థలానికి తిరిగి వచ్చేవాళ్లం.
ఒక ఫలానా రోజున, నేను నిక్ ఇద్దరిలో ఎవరు ఎక్కువ పత్రికలు అందజేయగలమో చూడాలనుకున్నాము. మధ్యాహ్నానికల్లా నేను నిక్ కంటే ఎక్కువ పత్రికలు అందించాను, కాని సాయంత్రానికి మేమిద్దరం చెరి 114 పత్రికలు అందించాము. మా మాగజైన్ రూట్లలో ప్రతి నెల మేము వందలకొలది పత్రికలు అందించాము. నేను ఆరుసార్లు ఒక నెలలోనే వెయ్యి కంటే ఎక్కువ పత్రికలు అందించాను. ఆ పత్రికల నుండి ఎంతమంది బైబిలు సత్యాలు నేర్చుకోగలరో ఆలోచించండి!
మచాలనందు, ఈక్విడార్‌లో సంఘం యొక్క మొదటి స్వంత రాజ్యమందిరాన్ని నిర్మించే ఆధిక్యత కూడా మాకు లభించింది. అది 1960లో, అంటే 35 సంవత్సరాల క్రితం. ఆ తొలిరోజుల్లో, మా కూటాలకు కేవలం 15 మంది హాజరయ్యేవారు. నేడు మచాలలో 11 వృద్ధి చెందుతున్న సంఘాలు ఉన్నాయి!
అమెరికాకు ఒక పర్యటన
నేను 1970వ దశాబ్దపు చివరి భాగంలో సెలవుపై అమెరికాకు తిరిగివచ్చి, మా అన్నయ్య అయిన ఫ్రాంక్‌తో కొన్ని గంటలు కలిసి గడిపాను. అతడు నన్ను కారులో ఒక గుట్టపైకి తీసుకుని వెళ్లాడు, అక్కడి నుండి రెడ్ నది లోయ వెంబడి చాలా దూరం వరకు చూడవచ్చు. కోతకు సిద్ధంగా ఉండి ధాన్యంతో, బరువుగావున్న గోధుమ పంట గాలికి ఊగుతూ సుందరంగా ఉంది. మూడు పాయలుగల షయేన్ నది దూరంలో కనిపిస్తూంది. మా అన్నయ్య తన మామూలు ధోరణిలో సంభాషణ ప్రారంభించడంతో ఆ శాంతికరమైన సౌందర్యం యొక్క ఆనందానికి అంతరాయం కల్గింది.
“అక్కడ దక్షిణ అమెరికాలో నీవు పిచ్చివాడిలా తిరుగుతూ ఉండకపోతే, ఇదంతా నీది కూడా అయివుండేది!”
“ఫ్రాంక్” అని నేను వెంటనే నివారించాను. “మాటలు అక్కడే ఆపేసెయ్యి.“
అతడు మరో మాట మాట్లాడలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత, అతడు ఉత్తర డాకోటాలో మొత్తం వెయ్యి కంటే ఎక్కువ ఎకరాలుగల మూడు అందమైన గోష్ఠాలను, అలాగే తాను వారసుడయ్యిన మోన్టానాలో మా చిన్నాన్న యొక్క 640 ఎకరాలను విడిచిపెట్టి హఠాత్తుగా అంగవికృత రోగంతో మరణించాడు.
ఇప్పుడు మా కుటుంబంలోని వారందరూ మరణించారు. కాని కొన్ని సంవత్సరాల క్రితం మేమందరం యెహోవాసాక్షులుగా మా జీవితాలను ప్రారంభించిన డెట్రాయిట్ లేక్స్‌లో, నాకు 90 కంటే ఎక్కువమంది క్రైస్తవ సహోదరులు సహోదరీలు గల ఆత్మీయ కుటుంబం ఉంది.
ఆత్మీయంగా పరిణతి చెందడంలో కొనసాగడం
ఇక్కడ ఈక్విడార్‌లో గత 15 సంవత్సరాలలో ఆత్మీయ కోత విషయంలో పుష్కలమైన పంటలు పండాయి. అక్కడ 1980లో, 5,000 మంది రాజ్య ప్రచారకులుండగా, ఇప్పుడు 26,000 కంటే ఎక్కువమంది ఉన్నారు. వీరిలో దాదాపు వందమంది బాప్తిస్మం తీసుకొనేందుకు సహాయం చేసే ఆశీర్వాదాన్ని నేను పొందాను.
నేను 1951లో 150 గంటల కోటాను చేరుకోవడానికి కష్టపడినంతకంటే, ఇప్పుడు, 80 సంవత్సరాల వయస్సులో పరిచర్యనందు నెలకు 30 గంటలు సంపాదించడానికి నేను ఎక్కువ కష్టపడతాను. నాకు 1989లో వస్తిగ్రంథి క్యాన్సర్ ఉందని నేను తెలుసుకున్నప్పటి నుండి, నేను నా చికిత్సపొందే సమయాన్ని చదువుకోవడానికి ఉపయోగించడం ద్వారా ప్రయోజనం పొందాను. ఆ సంవత్సరం నుండి నేను బైబిలు మొత్తం 19 సార్లు, యెహోవాసాక్షులు—దేవుని రాజ్య ప్రచారకులు (ఆంగ్లం) అనే పుస్తకాన్ని 6 సార్లు చదివాను. ఈ విధంగా నేను ఆత్మీయంగా పరిణతి చెందడంలో కొనసాగుతాను.
అవును, అమెరికా పొలాల్లో వస్తుసంబంధ ప్రయోజనాల పంట కోసే అవకాశాలు నాకు ఉండినవి. కాని ఆత్మీయ కోతలో నేను అనుభవించిన ఆనందంతో పోలిస్తే వస్తుసంబంధ సంపదలు లెక్కలోకి రావు. నేను నా మిషనరీ పని అంతటిలో 1,47,000 కంటే ఎక్కువ పత్రికలు మరియు 18,000 కంటే ఎక్కువ పుస్తకాలు పంచిపెట్టానని ఇక్కడ ఈక్వడార్నందలి బ్రాంచి నాకు తెలియజేస్తున్నది. వీటిని నేను ఆత్మీయ విత్తనాలుగా పరిగణిస్తాను, వీటిలో అనేకం అప్పుడే మొలకెత్తాయి; మరి ఇతరమైనవి ఈ రాజ్య సత్యాల గురించి ప్రజలు చదువుతుండగా వారి హృదయాల్లో ఇంకా మొలకెత్తే అవకాశంవుంది.
నా ఆత్మీయ పిల్లలందరితో, మన దేవుడైన యెహోవాను సేవించడానికి ఎంపిక చేసుకున్న లక్షలాదిమంది ఇతరులతో కలిసి దేవుని నూతన లోకంలోకి ప్రవేశించడానికి పరిణతిచెందడం కంటే శ్రేష్ఠమైనది మరొకటి నేను తలంచలేను. డబ్బు ఒకరిని ఈ దుష్టలోకాంతము నుండి కాపాడలేదు. (సామెతలు 11:4; యెహెజ్కేలు 7:19) అయితే, మనలో ప్రతి ఒక్కరం పరిణతి చెందడానికి ఎదగడంలో కొనసాగితే—మన ఆత్మీయ పని యొక్క ఫలితం నిశ్చయంగా కొనసాగుతుంది.
[24వ పేజీలోని చిత్రం]
మోన్టానానందలి మైల్స్ నగరంలో, 1949లో పయినీరు సేవచేయడానికి సిద్ధం
[24వ పేజీలోని చిత్రం]
మా మిషనరీ గృహం కొరకు 1952లో నీళ్లు కొనడం
[25వ పేజీలోని చిత్రం]
మచాలనందు 1957లో ప్రకటించడం
[25వ పేజీలోని చిత్రం]
నేను 1989లో అనారోగ్యం పాలైనప్పటి నుండి నేను బైబిలు మొత్తం 19 సార్లు చదివాను