సృజనాత్మకత—దేవుని నుండి ఒక ఉదార బహుమానం
యెహోవా తన సృష్టి పనుల యందు ఆనందిస్తాడు. (కీర్తన 104:31) సృజించే పని నుండి ఆయన పొందే సంపూర్ణమైన తృప్తి ఆదికాండము 1:31 నందు యిలా వ్యక్తపర్చబడింది: “దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగ నుండెను.”
యెహోవా ఈ ఆనందాన్ని తన వరకే పరిమితం చేసుకోలేదు. ఆయన ప్రతినిధిగా, లేక ఉపకరణంగా వుండే ఆధిక్యతను యేసుకు ఇచ్చాడు, యేసు ద్వారానే మిగిలినవన్నీ సృష్టించబడ్డాయి. (యోహాను 1:3; కొలొస్సయులు 1:16, 17) “ప్రధాన శిల్పిగా” యేసు “నిత్యము [యెహోవా] సన్నిధిని ఆనందించు” చుండెను కూడా.—సామెతలు 8:30, 31.
అయితే సృజనాత్మక సామర్థ్యం పరలోకానికి మాత్రమే పరిమితం కాదు. “అది మానవజాతిలో కూడా ఒక భాగంగా వుంది” అని హౌ క్రియేటివ్ ఆర్ యు? అనే తన పుస్తకంలో యూజీన్ రూడ్సెప్ వ్రాస్తున్నాడు. ఇది యాదృచ్ఛికమేమి కాదు, ఎందుకంటే మానవుడు దేవుని స్వరూపమందు సృజింపబడ్డాడు. (ఆదికాండము 1:26) అందుకే యెహోవా సంతృప్తినిచ్చే సృజనాత్మక సామర్థ్యాలను మానవజాతికి అనుగ్రహించాడు.—యాకోబు 1:17.
గనుక, ఆశ్చర్యపోనక్కరలేని విధంగా, పాడడం, ఆడడం, వడకడం, వంటచేయడం, శిల్ప కళ మరితర సృజనాత్మక పనుల గురించి బైబిలు అనుకూలంగా మాట్లాడుతుంది. (నిర్గమకాండము 35:25, 26; 1 సమూయేలు 8:13; 18:6, 7; 2 దినవృత్తాంతములు 2:13, 14) గుడారాన్ని నిర్మించడంలో సహాయం చేసేందుకు “విచిత్రమైన పనులను కల్పించుటకు” బెసలేలు అనే శిల్పి తన నైపుణ్యాన్ని ఉపయోగించాడు. (నిర్గమకాండము 31:5) సంచార జీవనానికి ఒక సృజనాత్మక సౌకర్యమైన గుడారాన్ని గొర్రెల కాపరియైన యాబాలు కనుగొని వుండవచ్చు. (ఆదికాండము 4:20) దావీదు సంగీతవేత్త, స్వరకర్త మాత్రమే కాదు, క్రొత్త సంగీత వాయిద్య సాధనాలను విస్తృతపర్చినవాడు కూడా. (2 దినవృత్తాంతములు 7:5; కీర్తన 7:17; ఆమోసు 6:5) ఎర్ర సముద్రం గుండా ఇశ్రాయేలీయులు అద్భుతరీతిగా తప్పింపబడినప్పుడు ఉత్సవం జరుపుకున్న సమయంలో చేసిన ఆనందకరమైన నాట్యానికి మిర్యాము నాట్య కూర్పు చేసివుండవచ్చు.—నిర్గమకాండము 15:20.
సత్యారాధనను వృద్ధి చేయడంలో సృజనాత్మకత తరచూ ఒక సంపద వంటిదే. యేసు తన వర్తమానాన్ని అందజేయడానికి ఉపమానాలను, వస్తుమూలక పాఠాలను సృజనాత్మకంగా ఉపయోగించాడు. ఆయన అనుచరులు కూడా అలాగే “వాక్యమందును ఉపదేశమందును ప్రయాస” పడాలని కోరబడ్డారు. (1 తిమోతి 5:17) అవును, వారి ప్రకటనాపని కేవలం దినచర్య కాదు. అది సృజనాత్మకమైన బోధనా పద్ధతులు అవసరమైన ఒక కళ వంటిది. (కొలొస్సయులు 4:6) తమ పిల్లలకు బోధించేటప్పుడు ఇది విశేషంగా ప్రాముఖ్యం.—ద్వితీయోపదేశకాండము 6:6, 7; ఎఫెసీయులు 6:4.
అలా, సృష్టించడం తనకు ఇచ్చే ఆనందాన్ని యెహోవా యితరులతో పంచుకుంటాడు. ఎంతటి ఉదారమైన బహుమానం!