కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 12/15 పేజీలు 19-22
  • మీకొక ఆరోగ్య పరీక్షా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీకొక ఆరోగ్య పరీక్షా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆరోగ్యం—ఏ మూల్యం చెల్లించి?
  • ఏ శక్తులు యిమిడి వున్నాయి?
  • జాగ్రత్త!
  • ఆరోగ్య సంరక్షణ విషయంలో లేఖనాల నిర్దేశాన్ని పాటిస్తూ ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • క్రైస్తవులు వైద్య చికిత్సలు చేయించుకోవచ్చా?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ‘మిమ్మల్ని మీరు రుజువు చేసుకుంటూ ఉండండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • మంత్రతంత్రాలు చేయడం, అలాంటి వినోదం చూడడం ప్రమాదకరమా?
    యువత అడిగే ప్రశ్నలు
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 12/15 పేజీలు 19-22

మీకొక ఆరోగ్య పరీక్షా?

వైద్య మరియు రోగనిర్థారణ విధానాలపై వ్యక్తుల కొరకు వాచ్‌టవర్‌ సంస్థ సిఫారసులు లేక నిర్ణయాలు చేయదు. అయితే కొన్ని విధానాలకు బైబిలు సూత్రాల వెలుగులో ప్రశ్నించదగిన అంశాలు ఉన్నట్లయితే, వీటి వైపు శ్రద్ధ చూపించబడుతుంది. అప్పుడు ప్రతి వ్యక్తి అందులో యిమిడివున్నదానిని సరిచూసుకుని ఏం చేయాలనేది నిర్ణయించుకోవచ్చు.

ప్రియమైన సహోదరులారా: నేను మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఒక [వైద్యురాలు] మంచి సాఫల్యాన్ని సాధించినట్లు కనిపిస్తుంది, కాని ఆమె ఉపయోగించే పద్ధతి నాకు అనుమానం కలుగజేస్తున్నది. . . . పరీక్ష ద్వారా సమస్య ఏమిటో ఆమె నిర్ధారిస్తుంది. తర్వాత ఏ విధమైన మందు యివ్వాలో, లేక దాన్ని ఎంత మోతాదులో ఉపయోగించాలో తెలుసుకోడానికి, ఆమె మందు సీసాను ఒక గ్రంథి లేక ఒక అవయవానికి దగ్గరగా చర్మంవద్ద వుంచుతుంది. రోగి యొక్క ఎత్తి వున్న చేతిని క్రిందికి లాగటానికి ఆమె ప్రయత్నిస్తుంది. చేతిని క్రిందికి లాగడానికి అవసరమయ్యే శక్తిని బట్టి ఆమె ఏ విధమైన మందునివ్వాలి, ఎంత మోతాదులో యివ్వాలి అనేది నిర్ణయిస్తుంది. సిద్ధాంతం ఏమిటంటే, ఎలక్ట్రాన్‌లు విద్యుత్‌ వలె సీసా యొక్క లోహపు మూత ద్వారా మందులో నుండి ఒక శరీర భాగానికి, దాన్ని బలపరుస్తూ ప్రయాణిస్తాయి. యిది వాటర్‌ విచ్చింగ్‌ (భూగర్భమందలి నీటి ఊటలను ధాతువులను, ఒక పంగల కర్ర సహాయమున గుర్తించు విధానము) వంటిదా?

అమెరికా, ఒరెగాన్‌ నుండి వచ్చిన ఈ ఉత్తరం, ఆహార సంబంధ అవసరతలను నిర్ణయించడానికి, మానసిక అంశాలను తూచి చూడడానికి, జ్ఞాపకాలను అంచనా వేయడానికి, అనుదిన జీవితాన్ని గూర్చిన ప్రశ్నలకు సమాధానమివ్వడానికి కొంతమంది ఉపయోగించే ఒక విధానాన్ని గూర్చినది. ఆ విధానం ఎంత సామాన్యమైనదైనప్పటికీ, ఉత్తరం వ్రాసిన వ్యక్తి అనుమానాలు సరైనవేనా?

ఆరోగ్యం—ఏ మూల్యం చెల్లించి?

ప్రాచీన కాలం నుండి ప్రజలు తాము ఎందుకు రోగగ్రస్థులవుతారో, ఎలా స్వస్థత పొందవచ్చో అర్థం చేసుకోడానికి ప్రయత్నించారు. ఇశ్రాయేలీయులకు ఒక ప్రయోజనం ఉండేది, అదేమిటంటే తాము పాపులమని వారికి తెలుసు, అనేక వ్యాధులు సోకడం లేక వ్యాప్తి చెందడం వంటివాటిని అరికట్టడానికి వారికి సహాయం చేసిన దైవిక చట్టాలు వారికున్నాయి. (లేవీయకాండము 5:2; 11:39, 40; 13:1-4; 15:4-12; ద్వితీయోపదేశకాండము 23:12-14) అయినా, దేవుని ప్రజలు తమ కాలం నాటి అర్హులైన వైద్యుల సహాయాన్ని కూడా పొందారు.—యెషయా 1:6; 38:21; మార్కు 2:17; 5:25, 26; లూకా 10:34; కొలొస్సయులు 4:14.

ప్రాచీన బబులోను ఐగుప్తులలోని ప్రజలకు ఎంత భిన్నం! వారి “వైద్యులు” సహజ పదార్థాల ద్వారా చికిత్సలు చేసేవారు, అయినా వారి అనేక “చికిత్సలు” యిప్పుడు చిట్కా వైద్యాలు అని చెప్పవచ్చు. ఒక వైద్యుడు అంధత్వానికి పంది కళ్లలోని అసహ్యమైన ద్రవం, ఫెళుసుగా ఉండే ఒక లోహపదార్థము, జేగురు మన్ను, మరియు తేనె ద్వారా చికిత్స చేసేవాడని ఒక ఐగుప్తు యొక్క చిత్రాకార లిపి తెలియజేస్తుంది. ఈ మిశ్రమ ద్రవం రోగి చెవిలో పోయబడేది. యీ చికిత్స “నిజంగా అద్భుతం” అని ఒక ప్రాచీన యోగ్యతా ప్రమాణము చెబుతున్నది. దాని విచిత్రం లేక మర్మం అది ఆకర్షించేలా చేసింది.

బబులోనీయులు మరియు ఐగుప్తీయులు తరచు నిగూఢమైన శక్తులను ప్రేరేపించేవారు.a యాజకుడు మరియు వైద్యుడు అయిన ఒక వ్యక్తి, రోగిలోనుండి ఏదో బలం లేక శక్తి గొర్రెలోకి వెళ్లి ప్రభావం కలుగజేయగలదని నమ్మి, రోగిని దాని ముక్కులోకి గాలి ఊదమని కోరుతాడు. ఆ గొర్రె చంపబడేది, దాని కాలేయం రోగి వ్యాధిని లేక అతని భవిష్యత్తును తెలియజేయగలదని చెప్పబడుతుంది.—యెషయా 47:1, 9-13; యెహెజ్కేలు 21:21.

అయితే ప్రాచీన ఇశ్రాయేలులో దేవునికి భయపడే వైద్యుడు అభిచార సంబంధ ఆచారాలను అనుసరించి వుండకపోవచ్చు. దేవుడు జ్ఞానయుక్తంగా యిలా ఆజ్ఞాపించాడు: “శకునముచెప్పు సోదెగానినైనను, మేఘశకునములనుగాని సర్పశకునములనుగాని చెప్పువానినైనను, చిల్లంగివానినైనను, మాంత్రికునినైనను, . . . మీ మధ్య ఉండనియ్యకూడదు. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు.” (ద్వితీయోపదేశకాండము 18:10-12; లేవీయకాండము 19:26; 20:27) అదే నేడు దేవుని క్రైస్తవ సేవకులకు కూడా వర్తిస్తుంది. జాగ్రత్త కలిగివుండడం మంచిది.

ఇటీవలి సంవత్సరాల్లో అనేకమంది ప్రజలు “ప్రత్యామ్నాయ” రోగనిర్థారణా నిపుణతలు, చికిత్సల వైపు మళ్లుతున్నారు. ఇది పూర్తిగా వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోవలసిన విషయం. (మత్తయి 7:1; రోమీయులు 14:3, 4 పోల్చండి.) ఏ క్రైస్తవుడైనా, జీవితాలను తప్పకుండా రక్షించే పనియైన పరిచర్య వెనుకపడేంతగా వివాదాస్పదమైన ఆరోగ్య అంశాలలో మునిగిపోతే అది దుఃఖకరము. (1 తిమోతి 4:16) నూతన లోకంలో వైద్యవిధానాలు, మూలికలు, ఆహార నియమాలు, లేక హోలిస్టిక్‌ పథ్యం వంటివాటి చేత వ్యాధి స్వస్థపర్చబడి పరిపూర్ణ ఆరోగ్యం పొందడం జరుగుతుందని బైబిలు చెప్పడం లేదు. వాస్తవానికి, యేసు విమోచన బలి మూలంగా పాపం క్షమించబడడం ద్వారా మాత్రమే పూర్తి స్వస్థత చేకూరగలదు.—యెషయా 33:24; ప్రకటన 22:1, 2.

ఏ శక్తులు యిమిడి వున్నాయి?

ప్రారంభంలోని ఉత్తరంలో చెప్పబడిన కండరాల పరీక్షా విధానం గురించి ఒక క్రైస్తవుడు తన స్వంత నిర్ణయం చేసుకునే విషయంలో ఏమి పరిశీలించవలసి వుంటుంది?

కండరాల బలాన్ని లేక ప్రతిస్పందనను పరీక్షించే కొన్ని పద్ధతులు ప్రాచీన వైద్యంలో ఒక భాగం, కొన్ని దాని విలువను ప్రశ్నించవచ్చు. ఉదాహరణకు, బాల పక్షవాతం కండరాలను బలహీనపర్చవచ్చు, దీనికి చికిత్సలో కీనెస్యాలజీ—“కండరాలు మరియు కండరాల కదలికల అధ్యయనం”—అని పిలువబడేది కూడా చేరివుండవచ్చు. కీనెస్యాలజీ గుండెపోటు బాధితులకు ఉపశమన చికిత్సగా కూడా ఉపయోగించబడుతుంది. అలాంటి చికిత్సను అనేకమంది ప్రజలు గ్రహించుకోగలరు.

ఈ శీర్షికారంభమందలి ఉత్తరంలో వివరించబడిన కండరాల పరీక్ష గురించి ఏమిటి? ఈ విధమైన “కీనెస్యాలజీ” కొన్ని ఆహారాలు, మూలికలు, లేక విటమిన్లు ఒక వ్యక్తికి సహాయం చేయగలవా లేక హాని చేయగలవా అని తెలుసుకునే ప్రయత్నంలో ఉపయోగించబడింది. అదెలా ఉపయోగించబడుతుందంటే, ఒక వ్యక్తి తన చేతిని చాపి వుంచుతాడు, వైద్యుడు కండరాల బలాన్ని పరీక్షించడానికి దాన్ని క్రిందికి లాగుతాడు. తర్వాత వైద్యుడు ఒక పోషకపదార్థాన్ని లేక మరో పదార్థాన్ని అతని నోటిలో, అతని కడుపు మీద, అతని చేతిలో వేస్తాడు. తర్వాత చేతి కండరాలు మళ్లీ పరీక్షించబడతాయి. అతనికి ఆ పోషకపదార్థం అవసరమైతే, అతని చేతి పరీక్ష బలమైనదని చెప్పబడుతుంది; అది అతనికి సరిపడకపోతే, కండరాలు బలహీనంగా వుంటాయి.b

దీన్ని ప్రయత్నించినవారు యిది పనిచేస్తుందని, దాని ప్రభావం శరీరంలో వుండే శక్తులపై ఆధారపడి వుంటుందని నమ్ముతారు. ఆధునిక విజ్ఞానం వివరించలేక పోయినప్పటికీ, సంభవించే లేక గమనించ గలిగిన అనేక విషయాలు వున్నాయని వారు తర్కిస్తారు. కాబట్టి, వైద్యులు యిప్పటికి యింకా కనుగొన లేకపోయినప్పటికీ లేక వీటిని అంగీకరించక పోయినప్పటికీ, శక్తులకు, పదార్థాలకు మధ్య శక్తియొక్క ఆధారాలు లేక పరస్పర చర్య వుండగలవని వారు ఆరోపిస్తారు.

మరో వైపున, అప్లయిడ్‌ కీనెస్యాలజీ అనే పుస్తకం యిలా తెలియజేస్తుంది: “చేతిలో పదార్థాన్ని వుంచుకుని కండరాలను పరీక్షించడం ద్వారా పోషక పదార్థాల వంటి రసాయన పదార్థాల విలువ నిర్థారించబడుతుందని కొన్నిసార్లు [పుస్తకాలు] నేర్పిస్తాయి. ఈ విధమైన పరీక్షలో ఏదైనా నమ్మదగినది వుందనడాన్ని సూచించే రుజువేమి లేదు. . . . ఒక తాత్విక దృక్పథం ఎంత బలమైనదిగా వుండగలదంటే, వైద్యం చేసే వ్యక్తి ముందే అనుకున్న తలంపు పరీక్షా విధానంలో కచ్చితమైన సమాచారాన్ని పొందడానికి అవాంతరం కాగలదు. చేతితో చేసే కండరాల పరీక్షలో అనుభవంగల పరీక్షకుడు తన స్వంత యిష్టప్రకారం సులభంగా, పరీక్షను కేవలం స్వల్పంగా . . . మార్చడం ద్వారా రోగి యొక్క కండరాలు బలహీనంగా గాని లేక బలంగా గాని కనిపించేలా చేయగలడు.”

జాగ్రత్త!

అయితే, కొన్ని కండరాల పరీక్షలు దీన్ని మించి వుంటాయి. “ప్రత్యామ్నాయ పరీక్ష” అని చెప్పబడిన దాన్ని గమనించండి. పరీక్షించలేనంత బలహీనంగావున్న ఒక వృద్ధుడు లేక ఒక శిశువు విషయంలో దీన్ని అనుసరించవచ్చు. ప్రత్యామ్నాయంగా వుండే వ్యక్తి శిశువును తాకుతున్నప్పుడు, వైద్యుడు ప్రత్యామ్నాయంగా వున్న వ్యక్తి చేతిని పరీక్షిస్తాడు. ఇది పెంపుడు జంతువుల విషయంలో కూడా అన్వయించబడింది; ప్రత్యామ్నాయ వ్యక్తి కొలీ, జర్మన్‌ షెపర్డ్‌ లేక యితర అనారోగ్యంగావున్న పెంపుడు జంతువుపై తన చేతిని వుంచినప్పుడు అతని చెయ్యి పరీక్షించబడుతుంది.

అలాంటి చర్యలకు తీర్పుతీర్చడం మన పనికాదు, కాని మనమిలా ప్రశ్నించుకోవచ్చు, ‘ఈ ప్రభావాల వెనుకనున్నది శారీరక శక్తులా?’ కాస్మిక్‌ కిరణాలు, మైక్రో తరంగాలు, వివిధ రకాల విద్యుదయస్కాంత కిరణప్రసారము వంటివాటి ఉనికిని వైజ్ఞానికులు నిరూపించారు. అయినా, ప్రాణులన్నీ, చివరికి శిశువులు మరియు పెంపుడు జంతువులు కూడా తమ నుండి బయటికి ప్రవహించి రెండో వ్యక్తిపై పరీక్షించదగిన ప్రభావాన్ని చూపగల శక్తులను తమలో కల్గివున్నాయా? శక్తులు బయటికి ప్రవహించి ఒక గొర్రెపై ప్రభావాన్ని చూపగలవని బబులోనీయులు తలంచారు. మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోవచ్చు, ‘మానవులు లేక జంతువులకు సంబంధించి అలాంటిదే నేడు సంభవించగలదని నేను నమ్ముతానా? లేక ఆ ప్రభావాలకు మరో వివరణ వుండగలదా?’

కొందరు స్వస్థపర్చేవారు, వ్యక్తి యొక్క “శక్తులను” లోహపు చుట్ట లేక లోలకము వంటివాటి ద్వారా కొలవ గలమని చెబుతారు. రోగి శక్తిక్షేత్రం, ఇవి స్వస్థపర్చే వ్యక్తి “శక్తి క్షేత్రం”తో అంతర్‌చర్య జరిగినప్పుడు యివి కదులుతాయని చెప్పబడుతుంది. ఒకప్పుడు పరిశోధనా శాస్త్రవేత్తగా వుండి, ఈ రంగంలో అభ్యాసం చేసిన, రచయిత్రి, కొన్నిసార్లు ఒక లోలకమును ఉపయోగించడం ద్వారా రోగనిర్థారణ చేస్తుంది. తాను “మానవ శక్తి క్షేత్రాన్ని” లేక వ్యక్తుల చుట్టువుండే రంగుల తేజస్సును చూడగలనని కూడా ఆమె చెబుతుంది. శరీరంలోని కంతులను, రక్త నాళాలను, లేక రోగకారకములైన క్రిములను అలాగే భవిష్యత్తును చూడడానికి తాను “అంతర్దృష్టి” ఉపయోగిస్తానని ఆమె చెబుతుంది.c

మునుపు చెప్పినట్లుగా, చేతి బలం ద్వారా శక్తులను కొలవడమనేది మానసిక భావాలను పరీక్షించడానికి కూడా ఉపయోగించబడింది. విస్తృతంగా పంచిపెట్టబడిన ఒక పుస్తకం యిలా తెలియజేసింది: “మీరు ఒక చిన్న మానసిక భావాల పరీక్షను పొందాలనుకుంటే, వినపడేలా యిలా అడగండి ‘మీకు ఏదైనా సమస్య వుందా?’ మళ్లీ పరీక్షించండి. ఉపయోగించబడిన పదార్థం రోగికి మంచిది కాకపోతే అప్పుడప్పుడు చేయి బలహీనమౌతుంది.” కొందరు అలాంటి పరీక్షను “ఫలానా శారీరక, మానసిక లేక ఆత్మీయ రుగ్మత ఏ వయస్సులో సంభవించిందో గుర్తించడానికి” ఉపయోగిస్తారు. ప్రతిదిన విషయాలపై ‘అవును లేక కాదు’ అనే నిర్ణయాలు చేయడానికి కూడా యిది ఉపయోగించబడుతుంది.

అలాగే, అలాంటి కండరాల పరీక్ష (కీన్యెసాలజీ) చేసేవారనేకులు, తాము చేసేది యిప్పుడు వివరించినదాని నుండి వేరుగా వుంటుందని, అభిచారం యిమిడి లేదని, లేక తాము మానసిక పరీక్ష చేయమని చెబుతారు. అయినప్పటికీ, వారు చేసేది, కొన్ని ప్రత్యేకమైన శక్తులు గల ప్రజల వల్ల మాత్రమే పరీక్షించబడగలిగిన లేక చూడగలిగిన, ప్రతి మనిషిలో వుండే శక్తుల యందలి విశ్వాసం మీదనే ఆధారపడి వుందా?

అలాంటి అంశాలను క్రైస్తవులు తక్కువగా భావించరు. దేవుడు ఇశ్రాయేలీయులకు యిలా ఉపదేశించాడు: “అమావాస్యయు విశ్రాంతిదినమును సమాజకూట ప్రకటనమును జరుగుచున్నవి పాపులగుంపుకూడిన ఉత్సవసమాజమును నేనోర్చజాలను.” (యెషయా 1:13) ఆ జనాంగము మతభ్రష్టమైనదైనప్పుడు, వారు ‘శకునమును చిల్లంగితనమును వాడుకచేసేవారు.’ (2 రాజులు 17:17; 2 దినవృత్తాంతములు 33:1-6) సాక్ష్యాధారంగా, వారు ప్రత్యేకమైన ఆచారాల ద్వారా సమాచారాన్ని పొందేవారు, వారు ‘దయ్యాలకు సంబంధించిన మాటలు’ పలికేవారు.—జెకర్యా 10:2.

కొన్ని కండరాల పరీక్షలు రోగికి లేక వైద్యునికి ఏ హాని కలిగించకుండా, క్షేమకరమైనవిగా వుండవచ్చు. అయినా, స్పష్టంగా, అంతర్దృష్టి, మర్మమైన తేజస్సు, లోలకము యొక్క ఉపయోగం వంటివి కొన్ని దయ్యాలకు సంబంధించిన లేక మానవాతీతమైన అంశాలు కలిగివుండవచ్చు. క్రైస్తవులు వ్యర్థమైన శక్తులను అనుసరించకూడదు. అలాంటి వాటితో వారు ప్రయోగం కూడా చేయకూడదు, ఎందుకంటే వారు సాతాను యొక్క గూఢమైన విషయాల గురించి ఆసక్తి కలిగిలేరు. (ప్రకటన 2:24) బదులుగా, దేవుని వాక్యం ఖండించే అభిచార సంబంధమైన ఆచారాలకు సంబంధించినట్లుగా వుండే దేనిని గురించైనా జాగ్రత్త కలిగివుండడం కారణసహితమైనది.—గలతీయులు 5:19-21.

వైద్యుడు ఏం చేస్తాడనేది అతని బాధ్యత, ప్రతి ఒక్కరి ఆరోపణలు లేక పద్ధతులకు తీర్పు తీర్చి, పునఃపరిశీలించడం మన ఉద్దేశం కాదు. ఈ పద్ధతులు కొన్నింటిలో వ్యర్థమైన శక్తి వుందని మీరు భావిస్తే కూడా, వాటిని ప్రయత్నించినవారు తెలియక, అభిచారంలో భాగం వహిస్తున్నామని గ్రహించక చేశారన్నది సుస్పష్టము. అది బహుశా మంచి ఆరోగ్యం పొందాలన్న వారి తీవ్రమైన కోరిక యొక్క సూచన కావచ్చు. అయినా, అలాంటి ఆచారాలలో భాగం వహించినవారు, ఆత్మీయంగా చిక్కుల్లోపడి దానిలో భాగం వహించడానికి తీసుకునే చర్య శారీరకంగా ప్రయోజనకరమైనది కాదని తర్వాత నిర్ణయించుకున్నారు.

మళ్లీ, అలాంటి వ్యక్తిగత విషయాల గురించి ఏమి చేయాలనేదాని గురించి ప్రతి ఒక్కరు తామే నిర్ణయించుకోవాలి. అయినా, క్రైస్తవులు దేవుని యీ ఉపదేశాన్ని గుర్తుంచుకోవాలి: “జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకియైనవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును.” (సామెతలు 14:15) అది ఆరోగ్య సంబంధమైన వాటికి కూడా వర్తిస్తుంది.

సత్యారాధన నుండి దేవుని సేవకులను దూరం చేయాలని సాతాను ఆసక్తి కలిగివున్నాడు. క్రైస్తవులు వేరే ఆసక్తుల యెడల ఆకర్షింపబడేలా చేయడం ద్వారా అలా చేయగలిగితే అపవాది ఆనందిస్తాడు. వారిని అభిచారములోకి నడపగల దయ్యాలకు సంబంధించిన ఆచారాలు, లేక అలా కనిపించే వాటిచే వారు ఆకర్షించబడితే అతడు యింకా ఎక్కువగా ఆనందిస్తాడు.—1 పేతురు 5:8.

క్రైస్తవులు మోషే ధర్మశాస్త్రం క్రింద లేకపోయినప్పటికీ, నిగూఢమైన ఆచారాల యెడల యెహోవా దేవుని దృక్పథం మారలేదు. మునుపు చెప్పినట్లుగా, వారి మధ్యలో “శకునము చెప్పు సోదెగానినైనను, మేఘశకునములనుగాని సర్ప శకునములనుగాని చెప్పువానినైనను, చిల్లంగివానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలకునినైనను” ఉండనీయ కూడదని దేవుడు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు. “వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. . . . నీవు నీ దేవుడైన యెహోవాయొద్ద యథార్థపరుడవై యుండవలెను.”—ద్వితీయోపదేశకాండము 18:10-13.

గనుక, నేడు క్రైస్తవులుగా ‘మనము పోరాడునది ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతో కాబట్టి, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవడంలో కొనసాగడం’ ఎంత జ్ఞానయుక్తమైనది!—ఎఫెసీయులు 6:11, 12.

[అధస్సూచీలు]

a ఇంకా అనేకమంది ప్రజలు షామాన్లను, మాంత్రికులను, లేక అలాంటి స్వస్థపర్చేవారిని సంప్రదిస్తుంటారు. షామాన్‌ అంటే “రోగులను బాగుపరచడానికి, దాచబడినదాన్ని వెలికి తీయడానికి, సంఘటనలను అదుపు చేయడానికి మంత్రవిద్యను ఉపయోగించే యాజకుడు.” మాంత్రికుడు, లేక షామాన్‌ మూలికలను మాంత్రిక ఆచారాలను (మర్మమైన శక్తులను ప్రేరేపిస్తూ) కలపవచ్చు. జాగ్రత్తగల, యథార్థవంతుడైన క్రైస్తవుడు, అభిచారం స్వస్థత చేకూర్చగలదైనప్పటికీ, అలాంటి దానిలో యిమిడి వుండడాన్ని విసర్జిస్తాడు.—2 కొరింథీయులు 2:11; ప్రకటన 2:24; 21:8; 22:15.

b ఇది సాధారణమైన వివరణ, కాని పరీక్షించే పద్ధతి మారవచ్చు. ఉదాహరణకు, రోగిని అతని బొటన వ్రేలు మరియు చూపుడు వ్రేలు ఒక దగ్గరికి చేర్చిపట్టుకోమని చెప్పి, వైద్యుడు వాటిని వేరు చేయడానికి ప్రయత్నిస్తాడు.

c ఆమె యిలా వ్రాస్తుంది: “అద్భుతమైనవిగా ఉన్న యీ సంఘటనలన్నీ ఎలా జరుగుతున్నాయి? . . . నేను ఉపయోగించే పద్ధతి లేయింగ్‌ ఆన్‌ ఆఫ్‌ హాండ్స్‌, ఫెయిత్‌ హీలింగ్‌ లేక స్పిరిచ్యుయల్‌ హీలింగ్‌ అని పిలువబడుతుంది. అది మర్మమైనది ఎంతమాత్రం కాదు, కాని అది ఎంతో సూటిగా వుంది . . . ప్రతి ఒక్కరికి ఒక శక్తి క్షేత్రం లేక భౌతిక శరీరాన్ని చుట్టివుండి దాన్ని గూర్చి తెలియజేసే తేజస్సు వుంటుంది. ఈ శక్తి క్షేత్రం ఆరోగ్యంతో సన్నిహిత సంబంధం కలిగివుంది. . . . అధిక ఇంద్రియ గ్రహణశక్తి అనేది ఒక విధమైన ‘చూడడం,’ దానిలో మీరు సాధారణ దృష్టిని ఉపయోగించకుండా మీ మనస్సులో ఒక దృశ్యాన్ని ఏర్పరచుకోవడం చేరివుంది. అది ఊహ కాదు. అది కొన్నిసార్లు దివ్యదృష్టి అని కూడా చెప్పబడుతుంది.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి