అత్యంత అభివృద్ధి చెందుతున్న సంస్థతో కలిసి పనిచేయడం
రాబర్ట్ హాట్స్ఫెల్ట్ చెప్పినది
నేడు అనేకులు, సాయంకాల వార్తలను కలరులో చూడడం ఏమాత్రము అసాధారణమని పరిగణించకుండా, రిమోట్ కంట్రోల్ సహాయంతో తమ టివిని ఆన్ చేస్తారు. అయితే, నేను 12 ఏళ్ల బాలునిగా కళ్లు విశాలంగా తెరచి, సినిమా తెరమీద అసలు రూపంకంటే పెద్ద రూపంలో ఓ వ్యక్తి మాట్లాడటాన్ని చూసిందంతా నిన్న జరిగినట్లుంది.
అబ్బే అదేమంత ప్రాముఖ్యమైన వార్త కాదే, అని మీరనుకోవచ్చు. అయితే, నలుపు తెలుపుల మూగ చిత్రాలున్న ఆ కాలంలో అంటే 1915లో నాకు మాత్రం, అది ఆధునిక దిన అద్భుతంలా తోచింది. గడ్డం ఉన్న ఓ గౌరవనీయమైన వ్యక్తి తెరపై కనిపించి యిలా అన్నాడు: “సృష్టిని గూర్చి ఫోటో-డ్రామాను ఐ.బి.ఎస్.ఎ., అంటే ఇంటర్నేషనల్ బైబిల్ స్టూడెంట్స్ అసోసియేషన్ వారు అందిస్తున్నారు.” తర్వాతి రెండు గంటలపాటు, మా కళ్ల ముందు బైబిలు కథ కదలాడింది. దాని లేఖనాధార వర్తమానం స్పష్టంగా సేదదీర్చే విషయంగా ఉంది. అయితే, మోషన్ పిక్చరు ఫిల్మ్, రంగురంగుల స్లైడ్స్, దానికి తోడుగా వినిపిస్తున్న మాటలు నిజంగా నా అవధానాన్ని చూరగొన్నాయి.
అప్పట్లో నేను దాన్ని గ్రహించలేదు కానీ ఆ మహత్తర సాంకేతిక పరిజ్ఞానం యెడల నాకున్న యౌవనకాల ఉత్సాహం, భూమిపై అత్యంత అభివృద్ధి చెందుతున్న సంస్థతో కలిసి పనిచేసే నా జీవిత వృత్తికి అది నాంది పలికింది.
తొలిరోజులు
మా నాన్నగారు 1891లో జర్మనీ నందలి డిలెన్బర్గ్ నుండి, అమెరికా నందలి ఎలెర్నె పెన్సిల్వేనియాలో జర్మనీ జాతివారున్న ప్రాంతానికి మారారు. తర్వాత ఆయన జర్మన్ కుటుంబంలోని ఓ అమ్మాయిని కలిశారు, వాళ్లు వివాహం చేసుకున్నారు. నేను జూలై 7 1903లో పుట్టాను, జర్మనీ ఇంగ్లీషు భాషలు మాట్లాడుతూ పెరిగాను. మొదటి ప్రపంచ యుద్ధం 1914లో ప్రారంభమవ్వడానికి కొన్ని రోజుల ముందు క్షయవ్యాధి మా తలిదండ్రులనిద్దరినీ పొట్టన బెట్టుకుని, నన్ను ఓ అనాథగా విడిచిపెట్టింది. ఇంచుమించు అదే సమయానికి మా తాతగారు గుండెపోటుతో మరణించారు.
మా మేనత్త మినా బ్యోమర్ దయతో నన్ను తన కుటుంబంలో చేర్చుకుంది. “నాకు అయిదుగురు పిల్లలున్నారు, ఇంకొకడు కూడా. ఏం పోయింది,” అన్నది. నా తలిదండ్రులు లేని లోటున్నప్పటికీ, మేనత్త మినా నన్ను బాగా చూసుకుంది.
మా మేనత్త ఎంతో కాలంగా బైబిలు విద్యార్థుల (యెహోవాసాక్షులను అప్పట్లో అలా పిలిచేవారు) అలెఘనె సంఘంలో సభ్యురాలిగా ఉంది. వాచ్‌టవర్ సొసైటి యొక్క నాటి అధ్యక్షుడైన సహోదరుడు సి. టి. రస్సల్ గారు, 1909కి ముందు ఆ సంఘంలోనే హాజరయ్యేవాడు. మేనత్త మినా నన్ను కూటాలకు తీసుకువెళ్లేది. అప్పట్లో మా కుటుంబం, పఠించడానికి లేక ప్రకటించడానికి క్రమబద్ధమైన నిర్ణయంతో ప్రయత్నం చేయకపోయినప్పటికీ, కూటాల వద్ద మేము విన్న వాటన్నిటినీ మాకు తెలిసిన ప్రజలతో మేము పంచుకునేవారము.
ఈ సమయంలోనే “ఫొటో-డ్రామా” నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తింది. నాకు మెకానికల్ విషయాలంటే యిష్టం గనుక, ఫొటోలు తీసే కొత్త సాంకేతిక పద్ధతులు, శబ్దచిత్రాల కలయిక, టైమ్-లాఫ్స్ ఫొటోగ్రఫీ నన్ను ముగ్ధుణ్ణి చేశాయి. టైమ్-లాఫ్స్ ఫొటోగ్రాఫ్‌తో చేసిన పూవు విచ్చుకోవడాన్ని చూడడం ఎంతో పులకరింత కల్గజేసింది.
పందొమ్మిది వందల పదహారులో సహోదరుడైన రస్సల్ మరణించడం వల్ల మేమెంతో దుఃఖించాం. మేము అలెఘనెలోనే ఉంటున్నాము గనుక, కార్నెగీ హాలులో ఆయన అంత్యక్రియలకు మేము హాజరయ్యాము. ఇక్కడే సహాదరుడైన రస్సల్ ఇ. ఎల్. ఈటన్‌తో 1903లో వాదించాడు. సహోదరుడైన రస్సల్ బైబిలు జ్ఞానాన్ని కించపర్చాలనే ఉద్దేశంతో, సి. టి. రస్సల్ను ఆరు రోజుల వాదోపవాదాలకు సవాలు చేసిన ఈ మెథోడిస్టు ఎపిస్కోపాలియన్ పరిచారకుని గూర్చిన కథలెన్నింటినో నేను విన్నాను. అయితే, రస్సలే ‘నరకాన్ని నీళ్లతో ఆర్పివేసినట్లు’ చెప్పబడింది. పీటర్స్‌బర్గ్‌లో సుపరిచిత పూర్తికాల సేవకురాలైన సారా కాలిన్‌కు రస్సల్ దంపతులు వ్యక్తిగతంగా తెలుసు. అంత్యక్రియల సమయంలో మారియా రస్సల్ కొన్ని పూలతో, “నా ప్రియమైన భర్తకు” అనే చీటీని శవపేటికలో పెట్టడం ఆమె చూసింది. మారియా ఆయన్నుండి కొన్ని ఏళ్ల క్రితమే వేరైనప్పటికీ, ఆమె ఆయన్ని యింకా తన భర్తగానే గుర్తించింది.
సంవత్సరాలు గడిచేకొలది, నా భవిష్యత్ వృత్తి కొరకు ఉపయోగపడే సాంకేతిక నైపుణ్యతను పొందే అనేక అవకాశాలు నాకు కలిగాయి. నా సంరక్షణకర్తయైన మా పెద్ద మామ బిల్డింగ్ కాంట్రాక్టర్‌గా పని చేసేవాడు. నా పాఠశాల సెలవుల్లో పాత భవనాలలో గ్యాస్ దీపాల స్థానే విద్యుద్దీపాలను పెడుతున్న ఎలక్ట్రీషియన్లతో పనిచేయమని పంపేవాడు. మా పాఠశాలలోని పిల్లలు 1918లో ఔత్సాహిక రేడియో టెలిగ్రాఫ్ పరికరాన్ని తయారుచేశారు. మేము సాయంకాలాల్లో పఠించడానికీ, విద్యుచ్ఛక్తి, అయస్కాంత శక్తితో బయట ప్రయోగాలు చేయడానికీ కూడుకునేవాళ్లం. ఓ స్నేహితుడూ నేను కలిసి 1926లో చిన్ననాటి కలను సాధించాలనుకున్నాము. అదేంటంటే, ఓడలో పనిచేసి లోకాన్ని చుట్టి రావాలన్నది. రేడియో టెలిగ్రాఫ్ ఆపరేటర్ల కొరకు ఏర్పాటు చేసిన రేడియో కార్పొరేషన్ ఆఫ్ అమెరికా స్కూల్లో మేము చేరాము.
బేతేలులో కొత్త జీవితం
మేము హాజరయ్యే రేడియో పాఠశాల న్యూయార్క్ పట్టణంలో ఉండేది కనుక, ఒక పాతబడిన మసోనిక్ ఆలయపు అద్దె ఆడిటోరియమ్‌లో జరిగే బైబిలు విద్యార్థుల కూటాలకు హాజరయ్యేందుకు నేను నదిని దాటి బ్రూక్లిన్ వెళ్లేవాణ్ణి. అప్పట్లో, న్యూయార్క్ నగర ప్రాంతమంతటికీ ఒకే ఒక సంఘంవుండేది. నేను వ్యాపార రేడియో లైసెన్సుకొరకు చదువుతున్నానని తెలుసుకున్న బేతేలులోని (బైబిలు విద్యార్థుల ముఖ్యకార్యాలయ కుటుంబం ఉండే గృహము) సహోదరులు, “ఓడ పనికి ఎందుకెళతావు? మనకో రేడియో స్టేషన్ యిక్కడే ఉంది, దానికో ఆపరేటరుకావాలి” అని, యింటర్వ్యూ కొరకు కార్యాలయానికి రమ్మని వారు నన్ను ఆహ్వానించారు. బేతేలు అంటే బైబిలు విద్యార్థుల ముఖ్యకార్యాలయమని తప్ప దాని గురించి నాకింకేమీ తెలియదు.
సహోదరులు నన్ను కొన్ని ప్రశ్నలు అడిగి, నేను నా చదువు ముగించి, లైసెన్సు సంపాదించి, ఆ తర్వాత బేతేలుకు రమ్మని సలహా యిచ్చారు. నేను డిగ్రీ పొందిన తర్వాత, నడి సముద్రంలోకి వెళ్లే ఓడను ఎక్కే బదులు, నాకున్న కొన్ని బట్టలను సర్దుకుని, బేతేలుకు వెళ్లే సబ్వే రైలు ఎక్కాను. నేను యెహోవాకు సమర్పించుకుని, కొన్ని ఏళ్లుగా ప్రకటనా పనిలో భాగం వహిస్తున్నప్పటికీ, బేతేలుకు చేరిన రెండువారాల తర్వాతగానీ, అంటే డిసెంబరు 1926లో గానీ బాప్తిస్మం తీసుకోలేదు. అప్పట్లో అది అసాధారణమేమి కాదు.
ఆ రోజుల్లో 150 మంది సభ్యులతో, బేతేలు చాలా నిండుగా ఉండేది. ప్రతి రూములోనూ నలుగురు సహోదరులుండేవారు. మేమందరమూ కలిసి తింటూ, పనిచేస్తూ ఒకే భవన సముదాయంలో పడుకుంటూ, న్యూయార్క్ పట్టణంలోని ఒకే ఒక సంఘానికి అందరం హాజరయ్యేవారం గనుక నేను యించుమించు అందరితోనూ పరిచయమేర్పర్చుకున్నాను. కొత్త బేతేలు గృహము 1927లో 124 కొలంబియా హైట్స్‌లో పూర్తయ్యింది, అక్కడ మేము ఒక గదిలో యిద్దరం చొప్పున ఉండే అవకాశం దొరికింది.
అంతేకాకుండా కొత్త ఫ్యాక్టరీ 117 ఆడమ్స్ స్ట్రీట్ నందు 1927లో ప్రారంభమైంది. యాభై ఐదు కాంకార్డ్ స్ట్రీట్‌లో ఉన్న పాత ఫ్యాక్టరీ నుండి పరికరాలను మార్చడానికి నేను సహాయపడ్డాను. రేడియో పరికరాలతో సహా ఫ్యాక్టరీ లిఫ్టులు, ప్రింటింగ్ ప్రెస్‌లు, లాండ్రి సామాగ్రి, నూనె దీపాలు, అవి విద్యుచ్ఛక్తితో నడుస్తున్నట్లైతే నేను వాటిని బాగు చేసేవాణ్ణి.
అయితే, బేతేలు అంటే కేవలం ఫ్యాక్టరీయే కాదు. ప్రతి పుస్తకం, ప్రతి ట్రాక్ట్, ప్రతి పత్రిక వెనుక వినయస్థులైన కష్టపడి పనిచేసే సేవకుల గుంపు ఉంది. లోకంలో పేరు ప్రతిష్ఠలు సంపాదించడం వారి ధ్యేయం కాదు. బదులుగా, వారు కేవలం ప్రభువు పనిని తుదముట్టించాలనుకునే వాళ్లు—అలాగే చేయవలసిన పని కూడా ఎంతో ఉండేది!
సహోదరుడైన రూథరఫర్డ్తో సహవాసం
సంస్థ యొక్క రెండవ అధ్యక్షుడైన జోసెఫ్ ఎఫ్. రూథర్‌ఫర్డ్‌తో పనిచేసే ఆధిక్యత వల్ల నేను ఎంతో ప్రయోజనం పొందాను. ఆయన ఆరడుగుల కంటే ఎత్తుగా ఉండి, బొద్దుగా కాకపోయినా బలంగా పొందికగా రూపుదిద్దబడిన మనిషి. ఆయనను గూర్చి తెలుసుకునేంతవరకు బేతేలులోని అనేకమంది యౌవనులకు ఆయనంటే కొంత భయం ఉండేది. ఆయన పఠిస్తూ ఎల్లప్పుడు లిఖిత సమాచారాన్ని సిద్ధపరుస్తూ ఉండేవాడు.
సహోదరుడైన రూథర్‌ఫర్డ్‌కు మంచి హాస్య స్వభావం ఉంది. సహోదరుడైన రస్సల్ ఉన్నప్పటినుండి బేతేలు కుటుంబంలో ఉన్న యిద్దరు అవివాహిత వృద్ధ సహోదరీలు ఉండేవారు. వారు ఎల్లప్పుడు గంభీరమైన ముఖాలతో, తమాషా విషయమైనా సరే పెద్దగా నవ్వడం సరికాదని నమ్మేవారు. కొన్నిసార్లు రాత్రి భోజనం సమయంలో సహోదరుడైన రూథర్‌ఫర్డ్ అందరినీ నవ్వించే ఏదో ఓ కథ చెప్పేవాడు, అది ఈ యిద్దరు సహోదరీలకూ చికాకు కలిగించేది. అయినా గంభీరమైన భోజన సమయ చర్చలను కూడా ఆయన నడిపించేవాడు.
సహోదరుడైన రూథర్‌ఫర్డ్ మంచి వంటగాడు, స్నేహితులకు వండిపెట్టడంలో ఆనందించేవాడు. ఒకసారి బేతేలు వంటవారు కోళ్లను కోస్తూ కొన్ని కోడి ఎముకలను ముక్కలు ముక్కలు చేశారు. ఆయన వంట గదిలోకి వెళ్లి కోడిని కోసే సరైన పద్ధతిని వారికి చూపించాడు. తన ఆహారంలో ముక్కలు ముక్కలైన కోడి ఎముకలుండడం ఆయనకు యిష్టంలేదు.
స్టాటన్ ఐలండ్లోని మన రేడియో స్టేషనైన డబ్ల్యుబిబిఆర్లో, లేక అనుకోకుండా అనేక సందర్భాలలో సహోదరుడైన రూథర్‌ఫర్డ్ పఠన గదిలో ఆయనను కలిసేవాణ్ణి. ఆయన ఎంతో దయాపూర్ణుడు, అంతేకాదు ఆయన బోధించేవాటిని తాను ఆచరించేవాడు. ఆయన చేయనిదాన్ని యితరులనుండి కోరడు. అనేక ఇతర మత సంస్థల్లోని వ్యక్తుల్లా కాకుండా, సహోదరుడైన రూథర్‌ఫర్డ్ ఎంతో ఉన్నతమైన ఆత్మీయ, నైతిక ప్రవర్తనను కల్గివుండేవాడు. ఆయన స్పష్టంగా యెహోవా రాజ్యం కొరకు జీవించాడు.
కష్టతరమైన ఆర్థిక సమయాలు
నేను బేతేలులో చేరిన కొన్ని సంవత్సరాల తర్వాత ప్రపంచం గొప్ప ఆర్థిక మాంథ్యంలోకి ప్రవేశించింది. వస్తువుల ధరలు తగ్గడంతో ద్రవ్య మార్కెట్లు కూలిపోయాయి. ఉద్యోగాలు తక్కువగా ఉండేవి, విరాళాలు మితంగా ఉండేవి. బేతేలు విరాళాలపై నడిచేది, మరి పని జరగడానికి కావలసినంత ఎల్లప్పుడూ ఉండేలా యెహోవా చూసేవాడు. అక్కడున్న ప్రతివారు కోరేది అది కాకపోయినప్పటికీ మేమెన్నడూ ఆహారం లేకుండా లేము. మేము వీలున్నంతమట్టుకు మితంగా ఖర్చుపెట్టే వాళ్లం, అంతేకాకుండా బేతేలులో లేని సహోదరులు తమకు చేతనైనంత మట్టుకు సహాయం చేసేవారు.
మా ఫ్యాక్టరీకి నమ్మకమైన అధ్యక్షుడు సహోదరుడు రాబర్ట్ మార్టిన్, 1932లో చనిపోయారు. ఇరవై ఏడేండ్ల నేథన్ నార్ ఆయన స్థానంలో నియమించబడ్డాడు. ఆయన సమర్థవంతమైన యౌవనుడు. ఆయన్ను ఫ్యాక్టరీ అధ్యక్షునిగా అంగీకరించడానికి ఎవరైనా యిబ్బంది పడినట్లు నాకు జ్ఞాపకం లేదు. ఇతర నమ్మకమైన సహోదరులు, వారిలో జాన్ కర్జెన్, జార్జ్ కెలి, డగ్ గలబ్రేత్, రాల్ఫ్ లెఫ్లర్, ఎడ్ బెకర్—వీరంతా నా ప్రియ తోటి పనివారు—తమ నైపుణ్యాన్ని బుద్ధి సూక్ష్మతనూ రాజ్యసేవ కొరకు హృదయపూర్వకంగా వినియోగించారు.—నిర్గమకాండము 35:34, 35 పోల్చండి.
రేడియోతో పనిచేయడం
మన సంస్థ పూర్తిగా అందుబాటులో ఉన్న దేన్నైనా ఉపయోగించి రాజ్య సువార్తను వ్యాప్తి చేయడానికి సమర్పించుకుంది. ప్రపంచమంతా రాజ్యాన్ని గూర్చి తెలుసుకోవాలి, కానీ మేము కేవలం కొన్ని వేల మంది మాత్రమే ఉన్నాము. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో రేడియో సాంకేతిక పరిజ్ఞానం యింకా పసిప్రాయంలోనే ఉంది. అయితే, ఆ సమయంలో, యితరులతో మాట్లాడే ఈ మూలాన్ని యెహోవా దయచేశాడని బుద్ధి కుశలతగల సహోదరులు భావించారు. కనుక 1923లో న్యూయార్క్ పట్టణములో స్టాటెన్ ప్రాంతంలో వారు డబ్ల్యుబిబిఆర్ రేడియో స్టేషన్‌ని నిర్మించడానికి పూనుకున్నారు. ఇది న్యూయార్క్‌లోని ఐదు నియోజక వర్గాల్లో ఒకటి.
కొన్నిసార్లు మన స్టేషన్లో నేనొక్కడినే ఆపరేటర్‌గా ఉండేవాణ్ణి. నేను స్టాటెన్ ఐలండ్‌లో నివసించేవాణ్ణి గానీ ఎలక్ట్రికల్ లేక మెకానికల్ పనులు చేయడానికి మూడు గంటల టెర్రీ బోట్లోను, సబ్వే రైలులోను ప్రయాణం చేసి, బ్రూక్లిన్ ఫ్యాక్టరీకి వచ్చేవాణ్ణి. మన రేడియో స్టేషన్‌ని యితరులపై ఆధారపడని దానిగా చేయడానికి, మేము డీసిల్తో నడిచే విద్యుత్ ఉత్పాదక కేంద్రాన్ని అందులో ప్రారంభించాము. స్టాటన్ ఐలండ్‌లో మన స్వంత మంచి నీటి బావులూ, అక్కడి సిబ్బందికి అలాగే బ్రూక్లిన్ బేతేలు కుటుంబానికి ఆహారాన్ని అందజేసే ఓ తోట కూడా మనకు ఉండేది.
ఎంతో కాలానికి అధిక సహాయం లభించేంతవరకూ, నేను కూటాలకూ, పరిచర్యకూ హాజరుకాకుండా రేడియో పని నన్ను ఆటంకపర్చేది. మా సంవత్సరిక సెలవుదినాలు తప్ప బయిటి ఫంక్షన్లకూ వారాంత విహారానికి సమయం ఉండేది కాదు. “ఇంత తీరికలేని పని వల్ల బేతేలును విడిచిపెట్టాలని నీవెప్పుడూ అనుకోలేదా?” అని ఒకరెవరో నన్ను అడిగారు. యథార్థంగా “లేదు” అని నేను జవాబిచ్చాను. అంతమంది సమర్పిత సహోదర సహోదరీలతో కలిసి పనిచేయడం సంతోషకరం, అది ఓ ఆధిక్యత. అంతేకాదు అక్కడ చేయవలసిన పని ఏదో ఒకటి ఉంటూనే ఉండేది, చేయడానికి ఏదొక కొత్త ప్రణాళిక ఉండేది.
పురికొల్పే రేడియో నాటకాలను మేము తయారు చేసి, ప్రసారం చేసేవాళ్లం. ప్రత్యేక రికార్డులు అందుబాటులో లేకపోవడంవల్ల మా స్వంత పద్ధతులను తయారు చేసుకోవల్సివచ్చేది. చల్ల గాలి లేక ఓ పెను తుఫాను శబ్దాన్ని సృష్టించగల ఓ పరికరాన్ని మేము తయారు చేశాము. కొబ్బరి చిప్పలను ఒత్తుగా పేర్చిన చెక్కలపై కొట్టగా వచ్చిన శబ్దం రాతినేల వీధుల్లో గుర్రపు సవ్వడిగా వినిపించేది. ప్రతి నాటకంలోను ప్రత్యేకమైన పనితనం కన్పించేది. ఇతరత్రా ధ్యానం మళ్లించే అవకాశాలు అంతగా లేని ఆ రోజుల్లో ప్రజలు రేడియో దగ్గర కూర్చుని శ్రద్ధగా వినేవారు.
సంస్థ, 1920వ పడి, మరియు 1930వ పడి తొలి భాగంలో, ఒకే ఒక కార్యక్రమం కొరకు అనేకమైన స్టేషన్లలను పలుమార్లు కలిపి రేడియో కార్యక్రమాలను అందించడంలో చరిత్రను సృష్టించింది. అలా రాజ్య వర్తమానం ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమందిని చేరింది.
ఫోనోగ్రాఫ్
మేము, 1930వ పడి మధ్యకాలంలోను, 1940వ పడి తొలి కాలంలోను, రేడియో ప్రసారం కొరకు ప్రత్యేకించి ఉపయోగించేవి మరియు ఫోనోగ్రాఫ్లూ యితర శబ్ద పరికరాలను స్వయంగా డిజైన్ చేసి తయారు చేశాము. ఒక ప్రత్యేకమైన అద్దమంత నునుపుగల బీస్వాక్స్ డిస్క్‌ల నుండి మాస్టర్ రికార్డులను లేత్ మిషన్ సహాయంతో తయారు చేశాము తర్వాత మేము ప్రతి మాస్టర్ రికార్డులో ఏ లోపంలేదని నిర్ధారించడానికి దాన్ని మైక్రోస్కోప్ క్రిందపెట్టి జాగ్రత్తగా పరిశీలించేవాళ్లం. అందులో ఏ లోపాలన్నా ఉంటే, రికార్డు కార్యక్రమాన్ని మరలా చేసి, మరోసారి లేత్ మీద కోసేవాళ్లం. ఆ తర్వాత బీస్వాక్స్ డిస్క్‌పై రికార్డుచేసే కంపెనీకి పంపించేవాళ్లం, అక్కడవాళ్లు ఫోనోగ్రాఫ్లనూ బ్రాడ్కాస్ట్ ఫోనోగ్రాఫ్లనూ తయారు చేసేవాళ్లు.
నాకు బాగుగా జ్ఞాపకమున్న ఓ మరువలేని సంఘటన 1933లో, “శాంతి సౌభాగ్యాలపై పరిశుద్ధ సంవత్సరపు ప్రభావం” అనే అంశంపై సహోదరుడైన రూథర్‌ఫర్డ్ యిచ్చిన ప్రసంగం. ఆ సంవత్సరాన్ని “శాంతి సంవత్సరంగా” పోపు ప్రకటించాడు, అయితే దాన్ని బయల్పర్చి, దాని వల్ల పరిశుద్ధమైందేదీ రాబోదని రేడియో కార్యక్రమం ద్వారా ఫోనోగ్రాఫ్ ద్వారా మేము చూపించాము. మేము చెప్పినట్లుగానే, ఆ సంవత్సరంలో కాథోలిక్ చర్చి మద్దతుతో హిట్లర్ అధికారానికి వచ్చాడు, యిక శాంతికొరకైన ఆశలన్నీ మటుమాయమయ్యాయి.
అమెరికాలో, చర్చి అనుకున్నదాన్ని నెరవేర్చడానికి కాథోలిక్ యాక్షన్ ఆర్గనైజేషన్ అనేది స్థాపించబడింది. వాళ్లు తమ చర్చికి చెందిన వ్యక్తులనే ప్రముఖ వార్తాపత్రికలు, పత్రికలూ పుస్తక ప్రచురణల సంపాదకీయ బోర్డుల్లో నియమించుకున్నారు. వాళ్లు రాజకీయాల్లో తలదూర్చి మా బైబిలు ప్రసంగాలను ప్రసారంచేసే ఏ రేడియో స్టేషన్నైనా బాయ్‌కాట్ చేస్తామని బెదిరించారు. కాథోలిక్ కార్యాచరణ గుంపులు న్యూజెర్సీ ప్రాంతంలో అనేకమంది సాక్షులపై దాడులు చేశాయి, ప్రత్యేకంగా అవి ఉత్కంఠతను రేపిన దినాలు!
ప్రాంతీయసేవలో సంతోషకరమైన పని
పెరుగుతున్న రాజ్య ప్రచారకులు 1950వ పడి మధ్య కాలంలో యింటివద్దే అనేకమంది ప్రజలను కలుస్తూవచ్చారు. ప్రజలు బైబిలు సత్యాలను అర్థంచేసుకోడానికి రేడియో కంటే ఈ పద్ధతి ఎంతో ప్రభావితంగా ఉన్నట్లు నిరూపించబడింది. కనుక 1957లో డబ్ల్యుబిబిఆర్ను అమ్మి, వనరులను యితర దేశాల్లోని మిషనరీ పనిని విస్తృతపర్చడానికి ఉపయోగించాలని నిర్ణయించబడింది.
నేను 1955లో బ్రూక్లిన్‌లోని బెడ్ఫోర్డ్ సంఘానికి నియమించబడ్డాను, అక్కడ నేను క్రమంగా వాచ్‌టవర్ పఠనాన్ని నిర్వహించేవాణ్ణి. అంతేకాకుండా సంస్థ నన్ను ఉత్తర న్యూయార్కు, పెన్సిల్వేనియా, కొనెక్టికట్, న్యూజర్సీ వంటి ప్రాంతాలకు ప్రయాణ ప్రసంగీకునిగా పంపింది. బెడ్ఫోర్డ్ సంఘానికి నన్ను నియమించినప్పుడు నాలో నేను యిలా అనుకున్నాను, ‘నేనిప్పుడు 50 ఏళ్లు పైబడినవాణ్ణి. ఇప్పుడే నాకు వీలున్నంతమట్టుకు నేను పరిచర్యలో ఎక్కువగా భాగం వహించడం మంచిది. ఆ తర్వాత నాకు నడుము నొప్పి రావచ్చు, అప్పుడు నేను దాన్ని చేయడంలో అంతగా ఆనందించకపోవచ్చు.’
రాజ్య విత్తనాన్ని, రేడియో ద్వారా అన్ని సంవత్సరాలు ప్రసారం చేసే పనిలో సాంకేతిక విభాగమందు పనిచేసిన తర్వాత బైబిలు సత్యాలను వ్యక్తుల్లో సూటిగా నాటి ఆ విత్తనాలకు నీళ్లు పోయడం నిజంగా ఆహ్లాదకరంగా ఉంది. సంఘంతో పనిచేయడం నిజంగా ఆనందకరమని నేను కనుగొన్నాను. వివిధ సహోదరులు, నేను వారి సహవాసంలో సుఖంగా ఉండేటట్లు చేసి నన్ను తమ కుటుంబాల్లోకి చేర్చుకున్నారు. ఇప్పుడు పెద్దవాళ్లైన కొందరు అప్పటి పిల్లలు యిప్పటికీ నన్ను తాతయ్యా అని పిలుస్తుంటారు. నా కాళ్లకు, పాదాలకు వచ్చిన సమస్య నన్ను మెట్లెక్కకుండా, సబ్వే రైళ్లలో ప్రయాణించకుండా ఆటంకపర్చే వరకూ అంటే 30 ఏళ్ల పాటు మేం ప్రాంతీయసేవలో కలిసి ఎంతో ఆహ్లాదంగా పనిచేశాము. నేను 1985లో బ్రూక్లిన్ హైట్స్ సంఘంలోకి బదిలీ అయ్యాను, అది బేతేలులోనే సమకూడుతుంది.
యెహోవా సంస్థ గొప్ప విస్తరణను అనుభవిస్తుండగా, సుదూర ప్రాంతాల్లోని యెహోవాసాక్షుల పెద్ద సమావేశాలకు హాజరయ్యాను గనుక, విదేశాలలో ఆయన ఆశీర్వాదాలను నేను వ్యక్తిగతంగా చూసే భాగ్యం నాకు కలిగింది. చివరికి నేను ప్రపంచమంతా చూడగల్గాను! బేతేలు సభ్యులమైన మేము 1950వ పడి నుండి లండన్, పారిస్, రోమ్, న్యూరెమ్బర్గ్, కోపెన్‌హాగెన్‌లోని స్థలాలను చూడగల్గాము. మేము మునుపటి బాంబర్లుగా ఉండి, ప్రస్తుతం ప్రయాణికులను తీసుకు వెళ్లేందుకు మార్చబడిన విమానాలలో, పడవలూ, రైళ్ల ద్వారా ప్రయాణించాము. ఆ యాత్రలు చూడదగినవిగా ఉండేవి. అయితే, ఔత్సాహిక సహోదర సమూహమే అంతకంటే చూడ ముచ్చటైన దృశ్యాలు. తర్వాతి దశాబ్దాలలో తూర్పు దేశాలకు, మరలా పశ్చిమ ఐరోపాకు అంతేకాకుండా యింకా యిటీవల తూర్పు ఐరోపాకు ప్రయాణించాము. పోలెండు, జర్మనీ, జెకొస్లోవాకియాలోని అద్భుతమైన సమావేశాలు మహాద్భుతంగా ఉన్నాయి. నేను మొదట చేరినప్పటికీ యిప్పటికీ మా దైవపరిపాలన కుటుంబం ఎంతగా పెరిగింది!
దైవిక నడిపింపు
సంస్థ తీసుకున్న చిన్న అడుగులనిపించినవే తర్వాత పెద్ద మెట్లుగా మారాయి. సాక్ష్యపు పనికొరకు మాకు సహాయపడే కొత్త కల్పనా ప్రణాళికలపై మేము పనిచేసినప్పుడు, యింత విస్తారమైన అభివృద్ధిని ఎవరూహించారు? యెహోవా నడిపింపుకు ప్రతిస్పందిస్తూ మేము విశ్వాసంలో ముందడుగు వేశాము.
అభివృద్ధి చెందుతున్న ఈ సంస్థ, ప్రపంచవ్యాప్తంగా శ్రద్ధ తీసుకునేందుకు సహాయపడే అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని లేక స్వయంగా తయారుచేసుకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడానికి భయపడలేదు. రాజ్య వర్తమానాన్ని ప్రకటించడంలో ఉపయోగించిన పద్ధతుల్లో యింటింటికి ప్రకటించడం, రేడియో నెట్వర్కులను ఉపయోగించడం, ఫోనోగ్రాఫ్ సాక్ష్యం, ప్రజల యిళ్లలో బైబిలు పఠనాలను నిర్వహించడం ఉన్నాయి. తొలి రోజుల్లో మా స్వంత ముద్రణను నెలకొల్పడం, యిప్పుడు కంప్యూటర్ ఫొటోటైప్సెట్టింగ్నూ ఆఫ్సెట్ ముద్రణను అనేక భాషల్లో ఉపయోగించగల్గడం బారీ కార్యసాధనలే. వాచ్‌టవర్ గిలియడ్ బైబిలు పాఠశాల, దైవపరిపాలనా పాఠశాల, క్రమమైన సమావేశాలన్నీ యెహోవా దేవునికి ఆయన కుమారునికి మహిమ తీసుకురావడంలో ఓ భాగం వహించాయి. ఈ సంఘటనలన్నింటినీ వ్యక్తిగతంగా చూసి, వాటిలో పాల్గొనటం, నాకు ఆధిక్యతగా ఉంది.
భూమిపై యెహోవా ఆత్మ నడిపించే సంస్థ ఏమి చేయాలి ఎలా చేయాలన్న విషయాల్లో నడిపింపును పొందుతుందని నాకు స్పష్టమైంది. ఆయన విశ్వవ్యాప్త సంస్థ అంటే దృశ్యమైంది గానీ, అదృశమైంది గానీ, కలిసి పనిచేస్తాయి.
ఓ యౌవనుడిగా సముద్రయానాన్ని నేను విడిచిపెట్టినందుకు నేను ఎన్నడూ బాధపడలేదు. అంతెందుకు, యెహోవా సంస్థలోనే ఎంతో ఉప్పొంగింపజేసే, అర్థవంతమైన సంఘటనలు సంభవించాయి కదూ! కనుక “పరలోక పిలుపు”లోని నా పయనం ఎన్నెన్నో ఆనందాలతో ఆశీర్వాదాలతో, ఏ బాధలూ లేకుండా ఉంది.—ఫిలిప్పీయులు 3:13, 14.
యౌవనులకు నేను ఎల్లప్పుడు 1914ను జ్ఞాపకముంచుకోమని చెబుతాను, అంటే, కీర్తన 19:14. అది యిలా అంటుంది: “యెహోవా, నా ఆశ్రయమా, నా విమోచకుడా, నా నోటి మాటలును నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక.” మనం చేసే ప్రతి దానిలోనూ యెహోవాను ప్రీతిపర్చాలని కోరుకుంటాము, అంతేకాకుండా దావీదు ప్రార్థించినట్లు ప్రార్థిస్తాము: “యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యము ననుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము.” (కీర్తన 25:4, 5) ఆ మాటల్లో ఎంతో భావం ఉంది. వాటిని జ్ఞాపకముంచుకోవడం, మనం యెహోవా అభివృద్ధి చెందుతున్న సంస్థతో నడవడానికి, సరైన దారిలో, సరైన మార్గంలో నడుస్తూ ఉండడానికి సహాయపడుతుంది.
[23వ పేజీలోని చిత్రం]
సహోదరుడైన రూథర్‌ఫర్డ్ తన స్నేహితులకు వంటవండి పెట్టడంలో ఆనందించేవాడు.
[25వ పేజీలోని చిత్రం]
డబ్ల్యుబిబిఆర్ రేడియో స్టేషన్ కంట్రోల్స్వద్ద రాబర్ట్ హాట్స్ఫెల్ట్
[26వ పేజీలోని చిత్రం]
సహోదరుడైన హట్స్ఫెల్ట్ యిటీవలి ఫొటో