రాజ్య ప్రచారకుల నివేదిక
“సహకార స్ఫూర్తికి ఓ నిదర్శనం”
స్పెయిన్ శిఖరాల దక్షిణాది అంచున జిబ్రాల్టర్ అనే ఓ పెద్ద సున్నపురాయితో చేసిన ఏకశిల కనిపిస్తుంది. వందలాది సంవత్సరాలుగా, ఈ రాయి రాజకీయ వివాదానికీ, అంతర్జాతీయ అనంగీకారానికి ఓ మూగ సాక్షిగా నిలిచింది. దీనికి భిన్నంగా, యిటీవల, జిబ్రాల్టర్ రాయి, ఈనాడు లోకంలో అరుదుగా కనిపించే ఐక్యతా సహకారాల ప్రదర్శనకు ప్రతీకగా నిలిచింది.
ఆ రాయికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో స్పెయిన్‌లోని లా లీనియా అనే పట్టణం ఉంది. అక్కడ, యెహోవాసాక్షుల రాజ్యమందిర నిర్మాణం, తమ శక్తిని సమయాన్ని వినియోగించడానికి ఉత్సాహవంతులైన వందలకొలది స్వచ్ఛంద సేవకులను ఒక చోటికి సమకూర్చింది. సృష్టికర్తయైన యెహోవా దేవుని ఆరాధన కొరకు ఓ అనుకూలమైన స్థలాన్ని కట్టడానికి వారు పూనుకున్నప్పుడు, వారు చేపట్టిన పనితో పోలిస్తే జిబ్రాల్టర్ రాయి కున్న తేజోవంతమైన వైభవం వెలవెలపోయింది.
ప్రపంచ మందలి ఆ భాగంలో ఉన్న రాజ్య ప్రచారకులు ఈ నివేదికను పంపిస్తున్నారు:
“సెప్టెంబరు 24, 1993 శుక్రవారం మధ్యాహ్నం మొదలుకుని, తొమ్మిదివందల ఉత్సాహభరితులైన స్వచ్ఛంద సేవకులు రేయింబగళ్లూ పనిచేశారు. ఆదివారం సాయంత్రం ఏడు గంటలకల్లా, ఆ భవనం యెహోవాసాక్షుల రాజ్య మందిరమని గుర్తించే ఓ కొత్త సైన్ బోర్డును నిలువబెట్టారు. అంతేకాదు ఆ ఆకర్షణీయమైన భవనాన్ని దాని మొట్టమొదటి బహిరంగ కూటానికి ఉపయోగించారు.
“సమీపంలో ఉన్న జిబ్రాల్టర్ నందలి అనేకమంది సాక్షులు తమ స్పెయిన్ సహోదరులకు సహాయం చేయడానికి సరిహద్దును దాటి వచ్చారు. ‘రాజకీయ విభేదాలు మా అంతర్జాతీయ సహోదర స్ఫూర్తిని అణగద్రొక్క లేవు,’ అని జిబ్రాల్టర్ నివాసియైన ఓ స్వచ్ఛంద సేవకుడు అన్నాడు. ఆయన యింకా యిలా అన్నాడు: ‘కొన్ని సంవత్సరాల క్రితం జిబ్రాల్టర్ నందు మా రాజ్య మందిరాన్ని నిర్మించేటప్పుడు మాకు సహాయపడడానికి లా లినియా నుండి స్నేహితులు వచ్చారు, యిప్పుడు వారు చేసినదానికి ప్రతిగా మేము కూడా చేయడానికి ఎంతో సంతోషిస్తున్నాము.
“యెహోవాసాక్షుల రెండు సంఘాలు మరియు అన్‌డాలుసియన్ ప్రాంతంలోని నిష్ణాతులైన సహాయకుల ప్రయత్నాలకు మద్దతుగా లా లినియా పట్టణం అవసరమైన స్థలాన్ని విరాళంగా యివ్వడానికి నిర్ణయించుకుంది. ‘పారంపర్యానుసారంగా, స్పెయిన్ స్థానిక అధికారులు కాథోలిక్ చర్చిలను నిర్మించడానికి ఎల్లప్పుడూ భూమిని యిస్తూవచ్చారు,’ అని నిర్మాణ స్థలాన్ని సందర్శించడానికి వచ్చిన లా లినియా మేయరు వివరించారు. ‘ఇతర మత శాఖలకు కూడా అలాగే ఎందుకు చేయకూడదు? స్వచ్ఛందసేవకుల నిస్వార్థతకు నేను ముగ్ధుడనయ్యాను, వారికి మద్దతు అవసరమని నేను భావిస్తున్నాను. నేటి విభాగిత లోకంలో యిలాంటి స్ఫూర్తి చాలా అవసరం.’
ఆయన “ఆ రాజ్య మందిరాన్ని, ‘సహకార స్ఫూర్తికి ఓ నిదర్శనం’ అని పేర్కొన్నారు. వాస్తవానికి, మనుష్యులను ముగ్ధులను చేసే అసలు విషయం ఆ భవన నిర్మాణం గానీ దాని వైశాల్యం గానీ కావు. బదులుగా, ఆ ప్రాంతంలోని అనేకులను ముగ్ధులను చేసిందేమంటే, దాన్ని కేవలం స్వచ్ఛంద సేవకులే నిర్మించడం అంతేకాకుండా దాన్ని కేవలం 48 గంటల్లో నిర్మించటమే!”
లా లినియా మరియు దాని సమీప ప్రాంతాల్లోని యెహోవాసాక్షులు, గలతీయులు 6:10లో చెప్పినదానికి తగినట్లుగా నడుచుకుంటున్నారు. అక్కడ అపొస్తలుడైన పౌలు తన తోటి విశ్వాసులకు యిలా ఉద్బోధించాడు: “కాబట్టి మనకు సమయము దొరకినకొలది అందరియెడలను, విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలు చేయుదము.”