అధికారానికి సంతోషంగా లోబడుట
‘హృదయపూర్వకముగా లోబడినవారైతిరి.’—రోమీయులు 6:17.
1, 2. (ఎ) నేడు లోకంలో ఎలాంటి ఆత్మ ఉంది, దాని మూలం ఏమిటి, దాని ప్రభావం ఏమిటి? (బి) యెహోవా సమర్పిత సేవకులు తాము వేరని ఎలా చూపిస్తారు?
“అవిధేయులైనవారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తి” నేడు దిగ్భ్రాంతి గొలిపేలా గోచరమౌతుంది. అది, “వాయుమండల సంబంధమైన అధిపతి” అయిన సాతాను నుండి ఉద్భవించిన కళ్లెంలేని స్వాతంత్ర్య ఆత్మ. ఈ ఆత్మ, ఈ “వాయువు” లేక స్వార్థము, అవిధేయతలతో నిండిపోయిన ఈ బలమైన దృఢవైఖరి మానవజాతిలోని అనేకులపై “అధికారం” లేక శక్తిని ప్రదర్శిస్తుంది. అధికార సంక్షోభం అని పిలువబడిన దాన్ని లోకం ఎందుకు ఎదుర్కొంటుందనే దానికి ఒక కారణము ఇదే.—ఎఫెసీయులు 2:2.
2 సంతోషకరంగా, యెహోవా సమర్పిత సేవకులు నేడు తమ ఆత్మీయ ఊపిరి తిత్తులను కలుషిత “వాయువు” లేక తిరుగుబాటు ఆత్మతో నింపుకోరు. “దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చునని” వారికి తెలుసు. అపొస్తలుడైన పౌలు ఇంకా ఇలా చెబుతున్నాడు: “గనుక మీరు అట్టివారితో పాలివారై యుండకుడి.” (ఎఫెసీయులు 5:6, 7) బదులుగా, నిజ క్రైస్తవులు “[యెహోవా యొక్క] ఆత్మతో నింపబడుటకు” ప్రయాసపడతారు, “పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది” అయిన “పైనుండివచ్చు జ్ఞానమును” వారు తీసుకుంటారు.—ఎఫెసీయులు 5:17, 18; యాకోబు 3:17.
యెహోవా సర్వాధిపత్యానికి ఇష్టపూర్వకంగా లోబడుట
3. ఇష్టపూర్వకంగా లోబడడానికి కీలకం ఏమిటి, చరిత్ర మనకు ఏ గొప్ప పాఠాన్ని నేర్పుతోంది?
3 ఇష్టపూర్వకంగా లోబడడానికి న్యాయసమ్మతమైన అధికారాన్ని గుర్తించడమే కీలకము. యెహోవా సర్వాధిపత్యాన్ని నిరాకరించడం సంతోషాన్ని తీసుకురాదని మానవజాతి చరిత్ర చూపిస్తున్నది. అలాంటి నిరాకరణ ఆదాము హవ్వలకుగాని, తిరుగుబాటు చేయడానికి వారిని ప్రేరేపించిన అపవాదియగు సాతానుకుగాని సంతోషాన్ని తీసుకురాలేదు. (ఆదికాండము 3:16-19) దిగజారిపోయిన అతని ప్రస్తుత స్థితిలో, సాతాను “బహు క్రోధము” కలిగివున్నాడు ఎందుకంటే తనకు సమయము కొంచెమే ఉందని అతనికి తెలుసు. (ప్రకటన 12:12) మానవజాతి సంతోష సమాధానములు అవును, విశ్వమంతటి సంతోష సమాధానములు యెహోవా నీతియుక్త సర్వాధిపత్యాన్ని విశ్వవ్యాప్తంగా గుర్తించుటపై ఆధారపడి ఉన్నాయి.—కీర్తన 103:19-22.
4. (ఎ) యెహోవా తన సేవకులు ఏ విధమైన విధేయత కల్గి, లోబడివుండాలని కోరుతున్నాడు? (బి) మనం దేని గురించి నిర్ధారణ కలిగి ఉండాలి, కీర్తనల గ్రంథకర్త దీన్ని ఎలా వ్యక్తపర్చాడు?
4 అయినా, అద్భుతంగా సమతూకం చేయబడిన ఆయన లక్షణాలనుబట్టి, ఉదాసీన వైఖరిగల విధేయతతో యెహోవా సంతృప్తి చెందడు. నిశ్చయంగా ఆయన శక్తిమంతుడు, అయినా క్రూరపరిపాలకుడు కాడు. ఆయన ప్రేమగల దేవుడు, తన తెలివిగల ప్రాణులన్నీ ప్రేమనుబట్టి ఇష్టపూర్వకంగా విధేయత చూపించాలని కోరుతున్నాడు. ఆయనకు నిత్యము విధేయత చూపించడం కంటే మంచిది మరొకటి లేదని నిర్ధారించుకొని, ఆయన నీతియుక్తమైన, న్యాయమైన అధికారం క్రింద తమ్మునుతాము ఉంచుకోడానికి హృదయపూర్వకంగా ఎన్నుకోటాన్నిబట్టి తన సర్వాధిపత్యానికి లోబడియుండాలని ఆయన వారిని కోరుతున్నాడు. యెహోవా తన విశ్వంలో ఉండాలని కోరుకునే వ్యక్తి కీర్తనల గ్రంథకర్త వ్రాసిన భావాలతో ఏకీభవిస్తాడు: “యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్లజేయును యెహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. యెహోవాయందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి.” (కీర్తన 19:7-9) యెహోవా నూతన లోకంలో జీవించాలంటే ఆయన సర్వాధిపత్య నీతి మరియు యథార్థత యందు సంపూర్ణమైన నమ్మకం కలిగివుండటమే మన దృక్పథమైయుండాలి.
మన రాజుకు సంతోషభరితంగా లోబడడం
5. యేసు తాను చూపిన విధేయత వల్ల ఎలాంటి ప్రతిఫలాన్ని పొందాడు, మనం ఇష్టపూర్వకంగా దేనిని అంగీకరించాలి?
5 తన పరలోక తండ్రికి లోబడడంలో క్రీస్తుయేసు తానే ఒక ఉన్నతమైన ఉదాహరణగా ఉన్నాడు. “ఆయన . . . మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపాడని” మనం చదువుతాము. పౌలు ఇంకా ఇలా తెలియజేస్తున్నాడు: “అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.” (ఫిలిప్పీయులు 2:8-11) అవును, మన నాయకుడు, పరిపాలిస్తున్న రాజైన క్రీస్తుయేసు యెదుట మనం ఆనందంగా మోకాళ్లు వంచుతాము.—మత్తయి 23:10.
6. జనములకు యేసు ఎలా ఒక సాక్షిగా, ఒక నాయకునిగా నిరూపించుకున్నాడు, ఆయన “రాజరిక పరిపాలన” మహాశ్రమల తర్వాత కూడా ఎలా కొనసాగుతుంది?
6 మన నాయకునిగా క్రీస్తు గురించి యెహోవా ఇలా ప్రవచించాడు: “ఇదిగో జనములకు సాక్షిగా అతని నియమించితిని జనములకు రాజుగాను అధిపతిగాను అతని నియమించితిని.” (యెషయా 55:4) యేసు తన భూపరిచర్య ద్వారా, తన మరణపునరుత్థానముల తర్వాత పరలోకం నుండి ప్రకటించే పనికి నడిపింపు నివ్వడం ద్వారా, సమస్త జనులకు తన తండ్రి యొక్క “నమ్మకమైన సత్యసాక్షిగా” తనను చూపుకున్నాడు. (ప్రకటన 3:14; మత్తయి 28:18-20) అలాంటి జనముల గుంపు, క్రీస్తు నాయకత్వం క్రింద “మహా శ్రమలను” తప్పించుకొనే “గొప్ప సమూహము” ద్వారా అధికంగా విస్తరించడంలో ప్రాతినిధ్యం వహించ బడుతున్నాయి. (ప్రకటన 7:9, 14) కాని యేసు నాయకత్వం అంతటితో ముగియదు. ఆయన “రాజరిక పరిపాలన” వెయ్యేండ్ల వరకు ఉంటుంది. విధేయులైన మానవుల కొరకు, ఆయన “ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి” అనే తన పేరుకు తగినట్లు రుజువు చేసుకుంటాడు.—యెషయా 9:6, 7; ప్రకటన 20:6.
7. క్రీస్తుయేసు మనల్ని “జీవజలముల బుగ్గ” యొద్దకు నడిపించాలని మనం కోరుకుంటే, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మనం ఏమి చేయాలి, యేసు మరియు యెహోవాచే మనము ప్రేమించబడేలా చేసేదేమిటి?
7 యథార్థ హృదయంగల మానవులను గొర్రెపిల్ల అయిన క్రీస్తుయేసు నడిపించే “జీవజలముల బుగ్గ” నుండి మనం ప్రయోజనం పొందాలనుకుంటే, రాజుగా ఆయన అధికారానికి మనం సంతోషంగా లోబడతామని మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన క్రియల ద్వారా నిరూపించుకోవాలి. (ప్రకటన 7:17; 22:1, 2; కీర్తన 2:12ను పోల్చండి.) యేసు ఇలా చెప్పాడు: “మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు; నన్ను ప్రేమించువాడు నా తండ్రివలన ప్రేమింపబడును; నేనును వానిని ప్రేమించి, వానికి నన్ను కనబరచుకొందునని చెప్పెను.” (యోహాను 14:15, 21) యేసు మరియు ఆయన తండ్రిచే ప్రేమించబడాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వారి అధికారానికి లోబడండి.
అధ్యక్షులు ఆనందంగా విధేయత చూపిస్తారు
8, 9. (ఎ) సంఘాభివృద్ధి కొరకు క్రీస్తు ఏమి ఏర్పాటు చేశాడు, ఈ వ్యక్తులు మందకు ఏ విషయంలో మాదిరిగా ఉండాలి? (బి) ప్రకటన గ్రంథంలో క్రైస్తవ అధ్యక్షుల విధేయత ఎలా సూచించబడింది, న్యాయపరమైన విషయాలను నిర్వహిస్తున్నప్పుడు వారు “వినయంగల హృదయమును” ఎలా కలిగివుండగలరు?
8 “సంఘము క్రీస్తునకు లోబడియున్నది.” దాని అధ్యక్షునిగా, సంఘాన్ని “నిలువబెట్ట” వలెనని ఆయన ‘మనుష్యులలో ఈవులను’ అనుగ్రహించాడు. (ఎఫెసీయులు 4:8, 11, 12; 5:24) ఆత్మీయంగా పెద్దలైన ఈ మనుష్యులకు “అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక” ‘దేవుని మందను పైవిచారణ చేయుమని’ “మందకు మాదిరులుగా ఉండుడి” అని చెప్పబడింది. (1 పేతురు 5:1-3) మంద యెహోవాది, క్రీస్తు దాని “మంచి కాపరి.” (యోహాను 10:14) యెహోవా మరియు క్రీస్తు శ్రద్ధ వహించమని తమకు అప్పగించిన గొర్రెల నుండి అధ్యక్షులు ఇష్టపూర్వక సహకారాన్ని తగినరీతిగానే కోరతారు కాబట్టి, వారు కూడా లోబడడం విషయంలో మంచి మాదిరికర్తలుగా ఉండాలి.—అపొస్తలుల కార్యములు 20:28.
9 మొదటి శతాబ్దంలో, అభిషక్త అధ్యక్షులు సంఘానికి శిరస్సుగా ఉన్న క్రీస్తుకు తాము చూపు విధేయతకు సూచనగా, ఆయన కుడి “చేత” లేక కుడి“చేతిలో” ఉన్నట్లు చెప్పబడ్డారు. (ప్రకటన 1:16, 20; 2:1) నేడు కూడా ఎంత మాత్రము తక్కువగాక యెహోవాసాక్షుల సంఘాలలోని అధ్యక్షులు క్రీస్తు నడిపింపుకు విధేయత చూపించి, ‘దేవుని బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై ఉండాలి.’ (1 పేతురు 5:6) న్యాయసంబంధ విషయాలను పరిశీలించమని కోరబడినప్పుడు, సొలొమోను తను యథార్థంగా ఉన్న సంవత్సరాల్లో చేసినట్లే: “కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకముగల హృదయము దయచేయము” అని వారు యెహోవాకు ప్రార్థించాలి. (1 రాజులు 3:9) ఒక పెద్ద యెహోవా మరియు క్రీస్తుయేసు దృష్టించినట్లే విషయాలను దృష్టించి, పరలోకంలో చేయబడిన నిర్ణయానికి వీలైనంత సన్నిహితంగా పోలివుండే నిర్ణయాన్ని భూమిపై కూడా చేయగలిగేలా విధేయత గల హృదయం అతన్ని కదిలిస్తుంది.—మత్తయి 18:18-20.
10. గొర్రెలను యేసు దృష్టించే విషయంలో అధ్యక్షులందరు ఆయనను అనుసరించుటకు ఎలా ప్రయత్నించాలి?
10 అలాగే ప్రయాణ కాపరులు, సంఘ పెద్దలు గొర్రెలను చూడడంలో క్రీస్తు మాదిరిని అనుసరించడానికి ప్రయత్నించాలి. పరిసయ్యుల వలె అనుసరించడానికి కష్టమైన అనేక కట్టడలను యేసు వారిపై విధించలేదు. (మత్తయి 23:2-11) గొర్రెలవంటి వారితో ఆయన ఇలా చెప్పాడు: “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.” (మత్తయి 11:28-30) ప్రతి క్రైస్తవుడు “తన బరువు తానే భరించుకొనవలెన”న్నది నిజమే అయినప్పటికీ, అధ్యక్షులు యేసు మాదిరిని గుర్తుంచుకొని, క్రైస్తవ బాధ్యత యొక్క వారి భారము “సుళువుగాను,” “భారము తేలికగాను,” మోయడానికి ఆనందకరంగాను ఉండేలా భావించడానికి తమ సహోదరులకు సహాయం చేయాలి.—గలతీయులు 6:5.
దైవపరిపాలనా విధేయత
11. (ఎ) ఒక వ్యక్తి శిరస్సత్వాన్ని గౌరవించి కూడా ఎలా నిజంగా దైవపరిపాలనకు లోబడకుండా ఉండవచ్చు? వివరించండి. (బి) దైవపరిపాలనకు నిజంగా లోబడేవారిగా ఉండటం అంటే దాని భావమేమిటి?
11 దైవపరిపాలన అంటే దేవుని పరిపాలన. దానిలో 1 కొరింథీయులు 11:3 నందు వ్యక్తపర్చబడిన శిరసత్వ సూత్రం యిమిడి ఉంది. కాని దాని భావం అంతకంటే ఎక్కువే ఉంది. ఒక వ్యక్తి శిరస్సత్వం యెడల గౌరవాన్ని చూపిస్తున్నట్లు కనిపించినప్పటికీ, ఆ మాట యొక్క పూర్తి భావంలో దైవపరిపాలనకు లోబడేవాడై ఉండకపోవచ్చు. ఇదెలా సాధ్యము? ఉదాహరణకు, ప్రజాస్వామ్యం అంటే ప్రజల పరిపాలన. ప్రజాస్వామ్యవాది అంటే “ప్రజాస్వామ్య ఆదర్శాలను నమ్మేవ్యక్తి.” ఒక వ్యక్తి ప్రజాస్వామ్యవాదినని చెప్పుకొని, ఎన్నికలలో పాల్గొని, చురుకైన రాజకీయవేత్తగా కూడా ఉండవచ్చు. కాని, అతని సాధారణ ప్రవర్తనలో, అతడు ప్రజాస్వామ్య స్ఫూర్తిని, దానిలో ఇమిడివున్న సూత్రాలన్నిటిని నవ్వులపాలు చేసేలా ప్రవర్తిస్తే, ఆయన నిజంగా ప్రజాస్వామ్యవాది అని చెప్పవచ్చా? అలాగే, నిజంగా దైవపరిపాలనకు లోబడడమంటే, కేవలం పేరుకు మాత్రం శిరస్సత్వానికి లోబడడం కంటే ఒక వ్యక్తి ఎక్కువే చేయాలి. ఆయన యెహోవా మార్గాలను, లక్షణాలను అనుకరించాలి. అన్ని విధాలలో ఆయన యెహోవాచే నడిపించబడాలి. యెహోవా పూర్ణ అధికారాన్ని తన కుమారునికి ఇచ్చాడు గనుక, దైవపరిపాలనకు లోబడడమంటే యేసును అనుకరించడమని కూడా భావము.
12, 13. (ఎ) దైవపరిపాలనలో ప్రాముఖ్యంగా ఏమి యిమిడివుంది? (బి) దైవపరిపాలనకు సంబంధించినవారిగా ఉండటంలో అనేక నియమాలకు లోబడియుండటం యిమిడివుందా? వివరించండి.
12 ప్రేమచే పురికొల్పబడిన ఇష్టపూర్వక విధేయతను యెహోవా కోరుతున్నాడని జ్ఞాపకముంచుకోండి. ఆయన విశ్వాన్ని పరిపాలించే పద్ధతి అదే. ఆయన ప్రేమ యొక్క మూర్తిమంతము. (1 యోహాను 4:8) క్రీస్తు యేసు “దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై” యున్నాడు. (హెబ్రీయులు 1:3) ఆయన నిజ శిష్యులు పరస్పరం ప్రేమించుకోవాలని ఆయన కోరుతున్నాడు. (యోహాను 15:17) కాబట్టి, దైవపరిపాలనకు లోబడడంలో విధేయత కలిగివుండడం మాత్రమే కాక, ప్రేమ కలిగివుండడం కూడా యిమిడివుంది. విషయాన్ని ఈ విధంగా క్లుప్తీకరించవచ్చు: దైవపరిపాలన అంటే దేవుని పరిపాలన; దేవుడు ప్రేమాస్వరూపి; కాబట్టి దైవపరిపాలన అంటే ప్రేమ పరిపాలన.
13 దైవపరిపాలనకు లోబడేవారిగా ఉండడానికి సహోదరులు అన్ని రకాలైన సూత్రాలను పాటించాలని ఒక పెద్ద అనుకోవచ్చు. అప్పుడప్పుడు “నమ్మకమైనవాడును, బుద్ధిమంతుడునైన దాసుడు” ఇస్తున్న సలహాలను తీసుకుని కొంతమంది పెద్దలు శాసనాలను తయారు చేశారు. (మత్తయి 24:45) ఉదాహరణకు, సంఘములోని సహోదరులతో త్వరగా పరిచయం పెంచుకోడానికి రాజ్యమందిరంలో ఎప్పుడూ ఒకే స్థలంలో కూర్చోకుండా ఉండటం కొంతమేరకు మంచిదని ఒకసారి సలహా ఇవ్వబడింది. ఇది ఆచరణాత్మకమైన సలహాగా ఇవ్వబడిందే గాని, తు.చ. తప్పక పాటించవలసిన శాసనము కాదు. కాని కొంతమంది పెద్దలు దాన్ని ఒక శాసనంగా మార్చడానికి ఇష్టపడి, దాన్ని పాటించని వారు దైవపరిపాలనకు లోబడేవారు కాదని భావించవచ్చు. అయినా, ఒక ఫలానా స్థలంలో కూర్చోడానికి ఒక సహోదరుడు లేక ఒక సహోదరి ఇష్టపడుతున్నారంటే దానికి అనేక మంచి కారణాలు ఉండవచ్చు. ఒక పెద్ద అలాంటి విషయాలను ప్రేమపూర్వకంగా పరిగణలోకి తీసుకోకపోతే, తన మట్టుకు తాను నిజంగా దైవపరిపాలనకు లోబడిన వాడౌతున్నాడా? దైవపరిపాలనకు లోబడే వారిగా ఉండడానికి “మీరు చేయు కార్యములన్నియు ప్రేమతో చేయుడి.”—1 కొరింథీయులు 16:14.
ఆనందంతో సేవచేయుట
14, 15. (ఎ) యెహోవాను సేవించడంలో కొంతమంది సహోదరులు లేక సహోదరీలు కలిగియున్న ఆనందాన్ని ఒక పెద్ద ఎలా పోగొట్టగలడు, ఇది ఎందుకు దైవపరిపాలన కాదు? (బి) మనం మన పరిచర్య కొరకు వెచ్చించే సమయం కంటే పరిచర్య యెడల మనం వ్యక్తపర్చే ప్రేమను ఎక్కువగా మెచ్చుకుంటానని యేసు ఎలా చూపించాడు? (సి) పెద్దలు దేన్ని పరిగణలోకి తీసుకోవాలి?
14 దైవపరిపాలనకు లోబడడమంటే యెహోవాను ఆనందంగా సేవించడమని కూడా భావము. యెహోవా “శ్రీమంతుడగు దేవుడు.” (1 తిమోతి 1:11) ఆయన తన ఆరాధికులు తనను ఆనందంగా సేవించాలని కోరుతున్నాడు. ఇశ్రాయేలీయులు “అనుసరించి గైకొనవలసిన” కట్టడలలో ఇది కూడా చేరివుందని, నియమాలను హత్తుకొని ఉండేవారు గుర్తుంచుకోవాలి: ‘నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించవలెను.’ (ద్వితీయోపదేశకాండము 12:1, 18) యెహోవా సేవలో మనం ఏది చేసినప్పటికీ, అది మనకు ఆనందంగా ఉండాలేగాని, భారంగా ఉండకూడదు. యెహోవాను సేవించడంలో తాము ఏమి చేయగలరో దానిని చేయడానికి సహోదరులు ఆనందకరమైన భావం పొందేలా అధ్యక్షులు ఎంతో చేయవచ్చు. దానికి విరుద్ధంగా, పెద్దలు జాగ్రత్తగా లేకపోతే, కొంతమంది సహోదరుల ఆనందాన్ని వారు పోగొట్టవచ్చు. ఉదాహరణకు, సాక్ష్యమిచ్చేపనిలో సంఘం యొక్క సగటు గంటలు గడిపినవారిని లేక అంతకంటే ఎక్కువ చేసినవారిని మెచ్చుకొని వారితో పోల్చి అన్నే గంటలు చేయలేకపోయినవారిని అంటే అలా చేయలేకపోయినందుకు తగిన కారణం గలవారిని విమర్శిస్తున్నట్లు స్పష్టమయితే దాన్ని వారు ఎలా భావిస్తారు? ఇది వారు అనవసరంగా తప్పుచేశామన్న భావన కలిగి వారు తమ ఆనందాన్ని పోగొట్టుకొనేలా చేయదా?
15 బహిరంగ సాక్ష్యమివ్వడంలో కొందరు గడిపే కొన్ని గంటలు చిన్న వయస్సు, మంచి ఆరోగ్యం, ఇతర పరిస్థితుల దృష్ట్యా ప్రకటించడంలో ఇతరులు గడిపే అనేక గంటలకంటే ఎంతో కష్టపడి చేసేవై ఉండవచ్చు. ఈ విషయంలో పెద్దలు వారికి తీర్పుతీర్చ కూడదు. వాస్తవానికి, “తీర్పుతీర్చుటకు అధికారమును” తండ్రి యేసుకు ఇచ్చాడు. (యోహాను 5:27) ఆమె ఇచ్చినది సగటు కంటే తక్కువగా ఉందని యేసు బీద విధవరాలిని విమర్శించాడా? లేదు, ఆ రెండు చిన్న నాణాలు ఆమెకు నిజంగా ఎంత విలువైనవో ఆయన గ్రహించాడు. అవి “తన లేమిలో తనకు కలిగినదంతయు, అనగా తన జీవనమంత” అయ్యున్నవి. యెహోవా యెడల ఎంతటి మిక్కుటమైన ప్రేమను అవి సూచించాయి! (మార్కు 12:41-44) తమ సంఖ్య “సగటు” కంటే తక్కువ ఉన్నవారి ప్రేమపూర్వక ప్రయత్నాల యెడల పెద్దలు ఏమైనా తక్కువ అవగాహన కలిగివుండాలా? యెహోవా యందలి ప్రేమ దృష్ట్యా, అలాంటి ప్రయత్నాలు సగటుకంటే ఎంతో ఎక్కువే!
16. (ఎ) అధ్యక్షులు తమ ప్రసంగంలో సంఖ్యలను వాడినట్లైతే, వారు వివేచనను, మంచి సమతూకాన్ని ఎందుకు చూపించవలసిన అవసరం ఉంది? (బి) సహోదరులు తమ సేవను అధికం చేసుకోడానికి వారికి శ్రేష్టమైన విధంగా ఎలా సహాయం చేయవచ్చు?
16 ఈ వ్యాఖ్యానాలు ఇప్పుడు ఒక కొత్త “నియమముగా” అంటే, సంఖ్యలు—సగటు సంఖ్యలు ఎన్నడూ ప్రస్తావించకూడదని చెబుతున్నట్లు, అర్థం చేసుకోబడాలా? ఎంతమాత్రం కాదు! ఇక్కడ విషయమేమంటే, సహోదరులు తమ పరిచర్యను విస్తృతపర్చుకొనేలా ప్రోత్సహించడంలో, వారు చేయగలిగినదాన్ని ఆనందంగా చేసేట్లు సహాయం చేయడంలోనూ, అధ్యక్షులు సమతూకాన్ని చూపించాలనేదే. (గలతీయులు 6:4) తలాంతులను గూర్చి యేసు చెప్పిన ఉపమానంలో, యజమాని తన ఆస్తిని తన దాసులకు “ఎవని సామర్థ్యము చొప్పున వానికి” ఇచ్చాడు. (మత్తయి 25:14, 15) అలాగే పెద్దలు ప్రతి రాజ్య ప్రచారకుని సాధ్యతలను దృష్టిలోకి తీసుకోవాలి. దీనికి వివేచన అవసరము. అధికంగా చేయడానికి కొంతమందికి నిజంగా ప్రోత్సాహం అవసరం కావచ్చు. వారు తమ పరిచర్యను సరిగ్గా వ్యవస్థీకరించుకోడానికి తగిన సహాయాన్ని మెచ్చుకోవచ్చు. పరిస్థితి ఏదైనప్పటికీ, వారు చేయగలిగేది ఆనందంగా చేయడానికి సహాయం అందివ్వబడితే, సాధ్యమైనచోట తమ క్రైస్తవ పరిచర్యను విస్తృత పర్చుకోడానికి ఆ ఆనందం వారిని తప్పకుండా బలపరుస్తుంది.—నెహెమ్యా 8:10; కీర్తన 59:16; యిర్మీయా 20:9.
ఆనందంగా లోబడడం నుండి వచ్చే సమాధానము
17, 18. (ఎ) ఆనందంగా లోబడడం మనకు సమాధానాన్ని, నీతిని ఎలా తేగలదు? (బి) దేవుని ఆజ్ఞలను మనం నిజంగా ఆలకిస్తే మనం ఏమి పొందగలము?
17 యెహోవా యొక్క న్యాయపరమైన సర్వాధిపత్యానికి ఆనందంగా లోబడడం మనకు గొప్ప సమాధానాన్ని తెస్తుంది. యెహోవాకు చేసే ప్రార్థనలో కీర్తనల గ్రంథకర్త ఇలా అన్నాడు: “నీ ధర్మశాస్త్రమును ప్రేమించువారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్రిల్లుటకు కారణమేమియులేదు.” (కీర్తన 119:165) దేవుని ధర్మశాస్త్రానికి విధేయత చూపించడం ద్వారా మనకు మనం ప్రయోజనం కలుగజేసుకుంటాము. యెహోవా ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పాడు: “నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు—నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను ఆలకించిన యెడల నీ క్షేమము నదివలెను నీ నీతి సముద్రతరంగముల వలెను ఉండును.”—యెషయా 48:17, 18.
18 క్రీస్తు విమోచన బలి మనకు దేవునితో సమాధానాన్ని కలుగజేస్తుంది. (2 కొరింథీయులు 5:18, 19) క్రీస్తు విమోచన రక్తమందు మనకు విశ్వాసముంటే, మన బలహీనతలను అధిగమిస్తూ దేవుని చిత్తాన్ని మనస్సాక్షి పూర్వకంగా ఎడతెగక ప్రయత్నం చేస్తే, మనం అపరాధ భావన నుండి ఉపశమనం పొందుతాము. (1 యోహాను 3:19-23) అలాంటి విశ్వాసం, క్రియలతో కూడినదైతే, అది మనకు యెహోవా యెదుట నీతియుక్తమైన స్థానాన్ని, “మహా శ్రమలను” తప్పించుకొని యెహోవా నూతన లోకంలో నిరంతరం జీవించే అద్భుతమైన నిరీక్షణను యిస్తుంది. (ప్రకటన 7:14-17; యోహాను 3:36; యాకోబు 2:22, 23) మనం నిజంగా ‘దేవుని ఆజ్ఞలను ఆలకించిన యెడల’ మాత్రమే దానినంతటిని మనం అనుభవించగలము.
19. ఇప్పటి మన సంతోషం, మన నిత్యజీవ నిరీక్షణ దేనిపై ఆధారపడి ఉంటాయి, మన హృదయపూర్వక నమ్మికను దావీదు ఎలా వ్యక్తపర్చాడు?
19 అవును, యిప్పటి మన ఆనందము, పరదైసు భూమిపై నిరంతర జీవితాన్ని గూర్చిన మన నిరీక్షణ, విశ్వ సర్వాధిపతియైన ప్రభువుగా యెహోవా అధికారానికి మనం ఆనందంగా లోబడటంపైనే ఆధారపడి ఉంటాయి. “యెహోవా, భూమ్యాకాశముల యందుండు సమస్తమును నీ వశము; మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి; యెహోవా, రాజ్యము నీది, నీవు అందరిమీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని యున్నావు. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావముగల నీ నామమును కొనియాడుచున్నాము” అను దావీదు భావాలతో ఎప్పుడూ మనం ఏకీభవించుదముగాక.—1 దినవృత్తాంతములు 29:11, 13.
జ్ఞాపకముంచుకోవాల్సిన విషయాలు
◻ తన సేవకులు ఏ విధమైన విధేయత కల్గి, లోబడివుండాలని యెహోవా కోరుతున్నాడు?
◻ యేసు తాను చూపిన విధేయతనుబట్టి ఎలాంటి ప్రతిఫలాన్ని పొందాడు, మన క్రియల ద్వారా మనం ఏమి నిరూపించుకోవాలి?
◻ గొర్రెలను గూర్చి యేసు శ్రద్ధ తీసుకునే విషయంలో అధ్యక్షులందరు ఆయనను అనుకరించుటకు ఎలా ప్రయత్నించాలి?
◻ దైవపరిపాలనకు లోబడేవారిగా ఉండటంలో ఏమి యిమిడి ఉంది?
◻ ఆనందంగా లోబడడం మనకు ఏ ఆశీర్వాదాలను తెస్తుంది?
[24వ పేజీలోని చిత్రం]
వారు చేయగల దాన్ని ఆనందంగా చేయడానికి పెద్దలు మందను ప్రోత్సహిస్తారు
[26వ పేజీలోని చిత్రం]
తనకు హృదయపూర్వకంగా విధేయత చూపేవారిని బట్టి యెహోవా ఆనందిస్తాడు