మతం మీ అవసరతలను తీరుస్తుందా?
గాలి, నీరు, ఆహారం, నివాసం అన్నవి మానవ అవసరతలుగా విశ్వవ్యాప్తంగా గుర్తించబడ్డాయి. అవి లేకపోతే మీరు కొరతను, మరణాన్ని ఎదుర్కొంటారు. అయినా, పూర్వం, ఇశ్రాయేలీయుల నాయకుడైన మోషే, ఆహారం లేక నీటి కంటే ఎంతో ప్రాముఖ్యమైన మరో మానవ అవసరత గురించి తెలియజేశాడు. మోషే ఇలా చెప్పాడు: “ఆహారమువలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతిమాటవలన నరులు బ్రదుకుదురు.”—ద్వితీయోపదేశకాండము 8:3.
ఈ గూఢమైన మాటల్లో, మోషే మన మతసంబంధమైన లేక ఆత్మీయ సంబంధమైన అవసరతలను తీర్చుకొనుట యొక్క ప్రాముఖ్యతను చూపించాడు. వాటిని తీర్చుకోవటంపైన మన జీవితాలే ఆధారపడి ఉన్నాయని ఆయన సూచించాడు. వారి 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో ఇశ్రాయేలీయులు అక్షరార్థంగా ‘యెహోవా సెలవిచ్చిన మాటల వలననే’ జీవించారు. అందువల్లనే మరణకరమైన అనుభవమైవుండేదాని నుండి వాళ్లు తప్పించుకున్నారు. దేవుని ఆజ్ఞానుసారంగా, మన్నా అని పిలువబడిన ఆహారం అద్భుతరీతిగా ఆకాశం నుండి కురిసింది. వాళ్ల దాహం తీర్చటానికి నీళ్లు రాళ్లల్లో నుండి ఉబికివచ్చాయి. అయితే, దేవుడు వారి భౌతిక అవసరతలను తీర్చడం కంటే ఎక్కువే చేశాడు. మోషే ఇలా చెప్పాడు: ‘ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించుచుండెను.’—ద్వితీయోపదేశకాండము 8:4, 5; నిర్గమకాండము 16:31 32; 17:5, 6.
నైతికంగా లేక మతపరంగా ఏది తప్పో ఏది ఒప్పో అనేది తెలుసుకోవటానికి ఇశ్రాయేలీయులు ఏ సహాయం లేకుండా విడిచిపెట్టబడలేదు. వారు స్వయంగా దేవుని యొద్ద నుండే నడిపింపును పొందారు. ఆరోగ్యకరమైన ఆహారం, కచ్చితమైన పారిశుద్ధ్య అలవాట్లు, సరైన నైతిక మరియు మతపరమైన సూత్రాలను కలిగివున్న విశేష చట్టబద్దమైన పద్ధతిగల మోషే ధర్మశాస్త్రాన్ని ఆయన వారికిచ్చాడు. అలా దేవుడు ఇశ్రాయేలీయుల ఆరోగ్య, ఆత్మీయ క్షేమాన్ని పెంపొందింప జేశాడు. వారు ‘యెహోవా సెలవిచ్చిన మాటల వలననే’ జీవించారు.
ఆ విధంగా ఇశ్రాయేలీయులు ఇతర జనాంగాల నుండి పూర్తి వేరుగా ఉండేవారు. మోషే కాలంలో ఐగుప్తు మొట్టమొదటి ప్రపంచాధిపత్యంగా పరిపాలించింది. అది ఎంతో మతపరమైన దేశంగా ఉంది. వరల్డ్ బుక్ ఎన్‌సైక్లోపీడియా ఇలా చెబుతుంది: “ప్రకృతి యొక్క ప్రతి ఆకృతిని, మానవ ప్రతి చర్యను అనేకమంది దేవతలు (దేవుళ్లు, దేవతలు) ప్రభావితం చేస్తారని ప్రాచీన ఐగుప్తీయులు నమ్మేవారు. అందుకే వారు అనేకమంది దేవతలను పూజించేవారు . . . ప్రముఖ దేవతలతో పాటు ఐగుప్తు యొక్క ప్రతి నగరంలో, ప్రతి పట్టణంలో ప్రజలు తమ స్వంత ప్రత్యేకమైన దేవున్ని కూడా ఆరాధించేవారు.”
ఇలా అనేకమంది దేవుళ్లను ఆరాధించడం ఐగుప్తీయుల ఆత్మీయ అవసరతలను తీర్చిందా? తీర్చలేదు. ఐగుప్తు మూఢనమ్మకంలోను, హీనమైన లైంగిక ఆచారాలలోను మునిగిపోయిన దేశంగా తయారయ్యింది. జీవితాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందింపజేయటానికి బదులు, ఐగుప్తీయుల జీవితం “క్షయ వ్యాధులకు” దారితీసింది. (ద్వితీయోపదేశకాండము 7:15) కాబట్టి, ఐగుప్తీయుల దేవుళ్లను బైబిలు ‘హేయమైన విగ్రహాలు’ అని పిలుస్తూ, వాటి గురించి నీచంగా మాట్లాడటంలో ఆశ్చర్యం లేదు.—యెహెజ్కేలు 20:7, 8.
ఈనాడు కూడా అలాంటి పరిస్థితే ఉంది. అనేకమంది కనీసం ఏదో విధమైన మత విశ్వాసాన్ని కలిగివుంటారు; కొంతమంది తమను తాము దేవుడు లేని వారిగా చెప్పుకుంటారు. అయితే స్పష్టంగా, సామాన్యంగా మతం మానవజాతి యొక్క ఆత్మీయ అవసరతలను తీర్చటంలో విఫలమైంది. ప్రజలు నిజంగా “యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన” జీవిస్తున్నట్లయితే, నేడు యుద్ధం, జాతివైషమ్యం, ఆకలి, నిర్దాక్షిణ్యమైన దారిద్ర్యం వంటి సమస్యలుండేవా? నిజంగా ఉండేవి కాదు! అయినప్పటికీ, తమ మతాన్ని మార్చుకోవడం గురించి ఎక్కువమంది ప్రజలు ఆలోచించరు. అంతెందుకు, కొంతమంది మతాన్ని గురించి చర్చించటానికి లేక తాజా మతసంబంధ ఉద్దేశాలవైపు దృష్టి సారించటానికి కూడా ఇష్టపడటంలేదు!
ఉదాహరణకు, పశ్చిమాఫ్రికా నందలి ఘానాలో ఒక వ్యక్తి ఒక క్రైస్తవ పరిచారకునితో ఇలా అన్నాడు: “దేవుడు యూదులకు వారి ప్రవక్తల ద్వారా ఎలా తనను తాను బయల్పరచుకున్నాడో, అలాగే ఆఫ్రికా దేశస్థులమైన మాకు దేవుడు మా శక్తివంతమైన అర్చకులు, అర్చకురాండ్ర ద్వారా తనను తాను బయల్పరచుకున్నాడని నేను నమ్ముతున్నాను. ఆఫ్రికా దేశస్థులమైన మాలో కొంతమంది మా స్వంత అర్చకులను గుర్తించడంలో విఫలులై బదులుగా యేసు, మహమ్మదు, మరితరుల గురించి మాట్లాడటం శోచనీయం.”
అనేక సాంప్రదాయబద్ధమైన ఆఫ్రికా సమాజాలలో, క్రైస్తవత్వం మంచి కంటే ఎక్కువ హానినే కలుగజేసిన విదేశీ విధానంగా, తెల్లవారి మతంగా దృష్టించబడుతుంది. వేరే ఉద్దేశాలను పరిశీలించటానికి ఇష్టపడకపోవటం మీ ఆత్మీయ అవసరతలను తీర్చుకునే ప్రయత్నాలకు సహాయపడుతుందా లేక ఆటంకపరుస్తుందా? ఒక ఆఫ్రికా సామెత ఇలా చెబుతుంది: “కేవలం మీరు ఆకలిగొని ఉన్నంత మాత్రాన ఆహార పాత్రలోకి మీరు రెండు చేతులను ముంచరుకదా.” ప్రాముఖ్యంగా పాత్రలో ఏముందో మీకు తెలియనప్పుడు, అలా తినే అలవాటు అమర్యాదకరమైంది, ప్రమాదకరమైంది కూడా! అయినా, అనేకులు ఆలోచనాపూర్వకంగా పరీక్షించడం ద్వారా కాక మనోభావం లేక కుటుంబ సాంప్రదాయం ఆధారంగా తమ మతాన్ని ఎంపిక చేసుకుంటారు.
మీ ఆత్మీయ అవసరతలను తీర్చే ఆరాధన ‘మీ తర్కశక్తితో చేసే పరిశుద్ధ సేవయై’ ఉండాలి. (రోమీయులు 12:1) అది సమాచారంతో కూడినదై, వివేకయుక్తమైనదై ఉండాలి. కాబట్టి మనం, ఒకరు తమ మతాన్ని ఎంపిక చేసుకొనే విషయాన్ని ఆఫ్రికా దేశస్థుని దృష్టికోణం నుండి పరిశీలిద్దాము. అయినా, తదుపరి అంశం అన్ని ప్రాంతాల పాఠకులకు ఆసక్తి కలిగించేదై ఉంటుంది.
[3వ పేజీలోని చిత్రం]
మోషే మన ఆత్మీయ అవసరతను తీర్చుకొనుట యొక్క ప్రాధాన్యతను చూపించాడు
[4వ పేజీలోని చిత్రం]
క్రైస్తవమత సామ్రాజ్య మిషనరీలతో ఆఫ్రికాకున్న అనుభవం బైబిలు యెడల కొంతమంది మనస్సును మూసివేసింది