ఎటువెళ్లేది, పరలోకానికా లేక నరకానికా?
“మీకు ఎటువెళ్లే అవకాశాలు ఎక్కువున్నాయి, పరలోకానికా నరకానికా?”
అసలు ఈ ప్రశ్న యిటీవల ఒక సర్వేలో అమెరికా నందలి విభిన్న వర్గాల వారికి వేయబడింది. ఫలితాలను ప్రిన్స్టన్ మత పరిశోధక కేంద్రం దాని రిలిజియన్ ఇన్ అమెరికా 1992-1993 నందు ప్రచురించింది.
మీరైతే ఎలా సమాధానమిచ్చి ఉంటారు? మీ సహధర్మచారి గాని లేక మీ ప్రియమైన వారు గాని చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్లే అవకాశాల మాటేంటి? మీరుగాని లేక వారుగాని చివరకు నరకానికి వెళ్లే అవకాశముందని మీరు అనుకుంటున్నారా?
డెబ్భై ఎనిమిది శాతం మంది తాము పరలోకానికి వెళ్లే అవకాశాలు బాగావున్నాయనీ, ఎంతో చక్కగా ఉన్నాయని తలంచారు, 40 ఏళ్ల క్రితం కంటే యిప్పుడు ఎక్కువమంది అలా జవాబిచ్చారు. మరి నరకం? దాదాపు 77 శాతం మంది తాము నరకానికి పోయే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అన్నారు.
వారి జవాబులు సరైన బైబిలు జ్ఞానంపై ఆధారపడినవేనా? పది మందిలో నలుగురు, తాము అయిదు సంవత్సరాల క్రితం మత కూటాలకు హాజరైనంతగా యిప్పుడు హాజరుకావడంలేదని ఒప్పుకున్నారు. కేవలం 28 శాతం మంది బైబిలు పఠన గుంపులతో కూడుతున్నట్లు, 27 శాతం మంది మతపర బోధనా తరగతులకు హాజరౌతున్నట్లు చెప్పారు.
మీరు బైబిలును జాగ్రత్తగా చదివినట్లైతే, మీరు కొన్ని ఆశ్చర్యకరమైన వాస్తవాలను తెలుసుకుంటారు. ఉదాహరణకు, కొన్ని బైబిలు అనువాదాలు పేర్కొన్నట్లుగా, యేసు చనిపోయిన తర్వాత “నరకానికి” వెళ్లాడని బైబిలు సూటిగా చెబుతోంది. (అపొస్తలుల కార్యములు 2:31, కింగ్ జేమ్స్ వర్ష్న్; “హేడిస్” న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్) మరణించిన తర్వాత రాజైన దావీదుగాని బాప్తిస్మమిచ్చు యోహానుగాని పరలోకానికి వెళ్లలేదని దేవుని వాక్యం నిరూపిస్తోంది. (మత్తయి 11:11; అపొస్తలుల కార్యములు 2:29) అవి వాస్తవాలు, కేవలం మత సర్వేలో తేలిన అభిప్రాయాలుకావు.
మీకు సంబంధించిన యితర వాస్తవాలు యిలా ఉన్నాయి: యేసు అపొస్తలులు, పరిమిత సంఖ్యలో ఉన్నవారు మాత్రమే పరలోకానికి కొనిపోబడి, యేసుతో రాజులుగా పరిపాలిస్తారని బైబిలు బోధిస్తోంది. అయినప్పటికి, చనిపోయినవారిలో అధిక శాతం మానవుని సహజ సమాధిలోకే వెళ్లారు. దేవుడు వారిని పునరుత్థానం చేసి, భూమిపై వారిని సజీవులుగా చేసి పునరుద్ధరించబడిన భూపరదైసులో సంపూర్ణమైన సంతోషకరమైన నిరంతర జీవితాన్ని ఉత్తరాపేక్షగా అందిస్తాడు.
ఆ నిరీక్షణకు నమ్మదగిన ఆధారాన్ని మీ బైబిలునుండే చూపి మీకు సహాయపడ్డానికి యెహోవాసాక్షులు ఎంతగానో సంతోషిస్తారు.