పాఠకుల ప్రశ్నలు
‘వాకిట పాపము పొంచియుండును; నీ యెడల దానికి వాంఛ కలుగును’ అని దేవుడు కయీనును హెచ్చరించాడు, ఇది క్రూరమృగాన్ని, దాని ఆహారాన్ని సూచిస్తున్నట్లు ఉంది. (ఆదికాండము 4:7) జలప్రళయానికి ముందు జంతువులు గడ్డిని మాత్రమే తింటే, అలాంటి భాషను ఎందుకు ఉపయోగించాలి?
వాటి చారిత్రక పరిస్థితిలో అసలు సరిపోని విధంగా అనిపించేలాంటి వాస్తవాలు లేక చారిత్రక మార్పులను ప్రతిబింబించే అనేక లేఖనాలను మనం మోషే వ్రాసిన పుస్తకాలలో కనుగొంటాము.
ఉదాహరణకు, ఆదికాండము 2:10-14 నందలి వృత్తాంతం ఏదెను తోట భౌగోళిక వివరాలను తెల్పుతుంది. ఒక నది “అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది” అని మోషే వ్రాశాడు. కాని, జలప్రళయం తరువాత జన్మించిన షేము కుమారుడైన అష్షూరు అనే పేరును బట్టి అష్షూరు దేశమునకు ఆ పేరు వచ్చింది. (ఆదికాండము 10:8-11, 22; యెహెజ్కేలు 27:23; మీకా 5:6) లభించిన ఆధారాన్ని బట్టి మోషే, తన కచ్చితమైన ప్రేరేపిత వృత్తాంతంలో, పాఠకులకు పరిచయమైయున్న ఒక ప్రాంతాన్ని ఉదహరించుటకు “అష్షూరు” అనే పదాన్ని మోషే ఊరకనే ఉపయోగించాడు.
ఆదికాండము తొలి అధ్యాయాల నుండి మరో ఉదాహరణను పరిశీలించండి. ఆదాము, హవ్వ పాపం చేసి, తోటలో నుండి వెళ్లగొట్టబడిన తరువాత, వారు తిరిగి రాకుండా యెహోవా వారిని అడ్డగించాడు. ఎలా? ఆదికాండము 3:24 ఇలా చెబుతున్నది: “అప్పుడాయన ఆదామును వెళ్లగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవ వృక్షమునకుపోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను.” “ఖడ్గజ్వాలను” అన్న మాటను గమనించండి. దేవుడు ఖడ్గాలను కనిపెట్టాడా?
మనకు ఖడ్గాలు అని తెలిసినవాటిని మన ప్రేమగల సృష్టికర్త మొదట కనిపెట్టాడని మనం ఓ ముగింపుకు రానవసరం లేదు. కాలుతున్నదేదో ఒకటి దూతల యెదుట తిరుగుతుండటాన్ని ఆదాము, హవ్వ చూశారు. కచ్చితంగా అది ఏమిటి? మోషే ఆదికాండము పుస్తకాన్ని రాసే సమయానికి, ఖడ్గాలు అందరికీ బాగా తెలుసు, యుద్ధాలలో వాటిని ఉపయోగించేవారు. (ఆదికాండము 31:26; 34:26; 48:22; నిర్గమకాండము 5:21; 17:13) కాబట్టి “ఖడ్గజ్వాల” అని మోషే వ్రాసిన పదాలు, ఏదెను ప్రవేశం ద్వారం వద్ద ఏమి ఉండేవో దృశ్యీకరించుకోవటానికి పాఠకులకు సహాయం చేశాయి. మోషే కాలంలో పరిచయమున్న సమాచారం అటువంటి వాటిని అర్థం చేసుకొనుటకు సహాయం చేసింది. మోషే ఉపయోగించిన భాష సరైనదైయుండవచ్చు, అందుకే యెహోవా దాన్ని బైబిల్లో ఉండనిచ్చాడు.—2 తిమోతి 3:16.
ఇప్పుడు ఆదికాండము 4:7 గురించి ఏమిటి? అక్కడ దేవుడు కయీనును ఇలా హెచ్చరించాడు: “నీవు సత్క్రియ చేసిన యెడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని యెడల వాకిట పాపము పొంచి యుండును; నీ యెడల దానికి వాంఛ కలుగును నీవు దానిని ఏలుదువనెను.” ముందు గమనించినట్లుగా, ఇక్కడ ఉపయోగించబడిన భాష, ఇతర జంతువులపై హఠాత్తుగా దాడిచేయుటకు పొంచివుండే ఆకలిగొన్న క్రూరమృగాన్ని సూచిస్తున్నట్లుంది.
అయితే, ఆదాము హవ్వ జంతువులతో సమాధానంగా ఉన్నట్లు బైబిల్లో ఆధారముంది. మానవులకు సన్నిహితంగా జీవించటం ద్వారా ప్రయోజనం పొందుతూ, కొన్ని జీవులకు మానవులతో కలిసి జీవించటం అనుకూలంగా కూడా ఉండివుండవచ్చు. ఇతర క్రూర జంతువులు సహజంగానే మానవుల నుండి దూరంగా జీవించే అలవాటు కలిగి ఉండవచ్చు. (ఆదికాండము 1:25, 30; 2:19) అయినా, అవి ఇతర జంతువులపైగాని, మానవులపైగాని జంతువులు దాడిచేసేవని బైబిలు చెప్పడంలేదు. ఆదిలో దేవుడు జంతువులకు, మానవులకు కూడా కూరమొక్కలనే ఆహారంగా ఇచ్చాడు. (ఆదికాండము 1:29, 30; 7:14-16) ఆదికాండము 9:2-5 తెల్పుతున్నట్లు, జలప్రళయం తరువాతి వరకు అది మారలేదు.
మరి ఆదికాండము 4:7లో దేవుడు కయీను కిచ్చిన హెచ్చరికను గూర్చి మనం చదివే మాటేమిటి? ఇతర జంతువులపై హఠాత్తుగా దాడిచేయుటకు పొంచివుండే ఆకలిగొన్న క్రూరమృగాన్ని మోషే కాలంలో సుళువుగా అర్థం చేసుకోగలిగేవారు, మనం కూడా అర్థం చేసుకుంటాం. కాబట్టి, మళ్లీ, జలప్రళయం తరువాతి ప్రపంచంలోని పాఠకులకు తెలిసిన భాషను మోషే ఉపయోగించివుండవచ్చు. కయీను అలాంటి జీవిని ఎన్నడూ చూడకపోయినప్పటికీ, ఒక ఆకలిగొన్న క్రూర మృగంతో పోల్చబడిన పాపకరమైన కోరికను గూర్చిన హెచ్చరిక భావాన్ని అతను గ్రహించివుండవచ్చు.
మనపై ఎక్కువ ప్రభావాన్ని చూపవలసిన ముఖ్యమైన విషయాలు ఇవి: కయీనును హెచ్చరించడంలో దేవుడు చూపిన దయ, సలహాను దీనంగా అంగీకరించడం యొక్క విలువ, అసూయ అనేది ఒకరిని ఎంత సుళువుగా కలుషితం చేయగలదు, మన కొరకు లేఖనాలలో దేవుడు వుంచిన ఇతర దైవిక హెచ్చరికలను మనమెంత గంభీరంగా తీసుకోవాలి అనే విషయాలే.—నిర్గమకాండము 18:20; ప్రసంగి 12:12; యెహెజ్కేలు 3:17-21; 1 కొరింథీయులు 10:11; హెబ్రీయులు 12:11; యాకోబు 1:14, 15; యూదా 7, 11.