వృక్షంవలె
“పద్యాలు నావంటి మూర్ఖులచే రచించబడతాయి, కాని దేవుడు మాత్రమే ఒక వృక్షాన్ని సృష్టించగలడు.” వృక్షాల అనేక గుణాలను వివరిస్తూ, కవి జోయస్ కిల్‌మెర్ వాటిని సృష్టించినందుకు దేవునికి ఘనతనిచ్చాడు.
చాలా రకాలు, వైభవాలు, ఉపయోగాలు గల వృక్షాలను యెహోవా దేవుడు సృష్టించాడు. పొదలు, వృక్షాలు, వివరించలేనంత అందంగా వుంటాయి. అంతేకాక, వృక్షాలు ఆహారాన్ని, వంటచెరుకును, నివాసాన్ని ఇస్తాయి. నమూనాదారులు కర్రను ఉపయోగించే క్రొత్త మార్గాలను తెలుసుకొంటూనే వుంటారు.
రాజ్యాలను, పరిపాలకులను, వ్యక్తులను సూచించడానికి బైబిలులో వృక్షాలు కొన్నిసార్లు అలంకారార్థకంగా ఉపయోగించబడ్డాయి. (యెహెజ్కేలు 31:1-18; దానియేలు 4:10-26) యెహోవా రాజరికాన్నుండి వచ్చే సంతోషకరమైన, సమాధానకరమైన, ఫలవంతమైన పరిస్థితులకు, తన ప్రజల పునరుద్ధరణకు సంబంధించి వృక్షాలు ప్రస్తావించబడ్డాయి. (1 దినవృత్తాంతములు 16:33; యెషయా 55:12; యెహెజ్కేలు 34:27; 36:30) దేవుని ప్రజల ఆయుష్యము వృక్షాల ఆయుష్యమువలె ఉంటుందని కూడా లేఖనాలు వాగ్దానం చేస్తున్నాయి. (యెషయా 65:22) కొన్ని వృక్షాలు శతాబ్దాల వరకు జీవిస్తాయని మనం గ్రహించినప్పుడు దానికి గొప్ప భావం ఉంది.
దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించే వ్యక్తి ఇలా ఉంటాడని బైబిలు కీర్తనల రచయిత ఒకరు అన్నారు: “అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును.” పుష్కలంగా నీరున్న ప్రాంతంలో నాటబడిన ఫలవంతమైన వృక్షం, “యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించువాడు” అనుభవించే ఆత్మీయ క్షేమాభివృద్ధిని కీర్తనల రచయితకు జ్ఞప్తికి తెచ్చింది. (కీర్తన 1:1-3) మీరు దేవుని ధర్మశాస్త్రమందు, పరిశుద్ధ వాక్యమందు నిజంగా ఆనందిస్తే, మీ ఆయుష్యు వృక్షాల ఆయుష్యువలె ఉంటుంది. వాస్తవానికి, యెహోవా దేవుడు, యేసుక్రీస్తును గూర్చిన కచ్చితమైన జ్ఞానానికి అనుగుణంగా ప్రవర్తించడం ద్వారా, మీరు నిరంతర జీవిత నిరీక్షణను కలిగివుండవచ్చు.—యోహాను 17:3.