మీరెప్పుడైనా అడవిని తగులబెట్టారా?
మేమెప్పుడూ తగులబెట్టలేదే అని మీరు చెప్పవచ్చు. ఆగండి! బహుశా మీరు తగులబెట్టి ఉండవచ్చు. యాకోబు మాటలు వినండి: “నాలుక కూడ చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును!”—యాకోబు 3:5.
నాలుక అనేది సంభాషించుటకు అత్యవసరమైన అవయవము, కాని అది ఎంతగా దుర్వినియోగపరచబడుతుందో! ప్రజలు నాలుకను అబద్ధమాడుటకు, దూషించుటకు ఉపయోగిస్తారు. దానితో ఇతరులను కఠినంగా విమర్శిస్తారు, వారి కీర్తిని భంగపరుస్తారు, వారిని మోసం చేస్తారు. అల్లరిమూకలు వారి నాలుకతో విప్లవం లేపుతారు. అడాల్ఫ్ హిట్లర్ తన నాలుకతో ఒక రాజ్యాన్ని యుద్ధం చేయడానికి సన్నద్ధం చేశాడు—నిజంగా “అడవిని తగులబెట్టడమే!”
మంచి ఉద్దేశాలుగలవారు కూడా “నిప్పంటించుటకు” కారకులు కాగలరు. మీరెప్పుడైనా, ఏదన్నా ఒకటి అనిన తర్వాత, అలా అనకుండా ఉండాల్సిందని అనుకున్నారా? అలాగయితే, “యే నరుడును నాలుకను సాధుచేయనేరడు” అన్న యాకోబు మాటలను అర్థం చేసుకోగలరు.—యాకోబు 3:8.
ఏలాగయినను, మన నాలుకను సద్వినియోగపరచుటకు మనం ప్రయత్నం చేయవచ్చు. కీర్తనల రచయితవలె మనమిలా నిస్సంకోచంగా చెప్పగలం: “నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును.” (కీర్తన 39:1) మనం ఇతరులను కఠినంగా విమర్శించుటకు బదులు, వాళ్ళను మనం బలపరచుటకు ప్రయత్నం చేయవచ్చు. ప్రజలను మనం దూషించుటకు బదులు, వారి మంచితనాన్ని గురించి చెప్పవచ్చు. ఇతరులను మోసగించి వంచించే బదులు, సత్యమును గూర్చి మాట్లాడి ఉపదేశించవచ్చు. మంచి హృదయముతో ప్రేరేపించబడినపుడు, నాలుక స్వస్థపరచే అద్భుతమైన మాటలు పలుకగలదు. యేసుక్రీస్తు ప్రజలకు రక్షణను గూర్చి బోధించుటకు తన నాలుకను అద్భుతమైన రీతిలో ఉపయోగించాడు.
నిజంగా, “జీవమరణములు నాలుక వశము.” (సామెతలు 18:21) మీ నాలుక మరణకరంగానుందా లేక జీవదాతగానుందా? అది “అడవికి నిప్పు” అంటించడం మొదలెడుతుందా లేక నిప్పార్పుతుందా? కీర్తనల రచయిత దేవునికి యిలా ప్రార్థించాడు: “నీ ఆజ్ఞలన్నియు న్యాయములు నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును.” (కీర్తన 119:172) కీర్తనల రచయితవలె మనం మంచి దృక్పథాన్ని అలవరచుకుంటే, మనం కూడా మన నాలుకను మేలుచేయుటకు ఉపయోగించవచ్చు.
[32వ పేజీలోని చిత్రం]
U.S. Forest Service photo