మిడతలవలె ఉన్నాము
వేసవిలో పచ్చిక బయలునందు నడుస్తుండగా, మీ దారినుండి ప్రక్కకు ఎగిరే అసంఖ్యాకమైన మిడతల్ని మీరెప్పుడైనా చూశారా? ఆలవోకగా వాటిని గమనించిననూ అవి ప్రతిచోట ఉన్నట్లు కన్పిస్తాయి. అవి నిరపాయకరమని, పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదని అన్పిస్తుంది.
అయినను, పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదనే ఆ మిడతలు, మానవజాతికి సరియైన చిహ్నముగా ఉన్నవి. కొందరు ప్రముఖులు తామెంతో ప్రధానులమని పరిగణించుకొన్ననూ, సృష్టికర్త మరోవిధంగా తలస్తున్నాడు. ఆయన ప్రవక్తయగు యెషయా ఇలా చెప్పాడు: “ఆయన భూమండలముమీద ఆసీనుడై యున్నాడు, దాని నివాసులు మిడతలవలె కనబడుచున్నారు.”—యెషయా 40:22.
వివేకమందు, శక్తినందు మానవుడేలాగు మిడుతలకంటే ఎంతో ఉన్నతుడై యున్నాడో అదేవిధంగా మహిమ, శక్తి, జ్ఞానమందు యెహోవా దేవుడు మానవులకంటే మరెంతో ఉన్నతంగా ఉన్నాడు. అయితే, దేవుని సర్వోన్నత లక్షణము ప్రేమ. మనమాయనను ప్రేమించి, ఆయనకు లోబడితే, మనల్ని గమనించి, సహాయంచేసి, రక్షించడానికి ఆయన సాటిలేని ప్రేమ ఆయనను పురికొల్పుతుంది. ఏ ప్రాముఖ్యతలేని వారిగా ఉన్ననూ యెహోవా మనతో ప్రేమగా వ్యవహరిస్తున్నాడు. కీర్తనల రచయిత యిలా చెప్పాడు: “ఉన్నతమందు ఆసీనుడైయున్న మన దేవుడైన యెహోవాను పోలియున్నవాడెవడు? ఆయన భూమ్యాకాశములను వంగిచూడ ననుగ్రహించుచున్నాడు. . . . ఆయన నేలనుండి దరిద్రులను లేవనెత్తువాడు.”—కీర్తన 113:5-8.
ఈ కీర్తన వివరించినట్లుగా, యెహోవా దీనులకు ప్రేమతో తన సహాయాన్ని విస్తరిస్తున్నాడు. అవును, ఆయనను ‘కనుగొనుటకు వినయముతో దేవుని వెదకువారికి’ ఆయన సహాయము చేస్తాడు. (అపొస్తలుల కార్యములు 17:27) అలా దేవుని కనుగొని ఆయనను సేవించువారు ఆయన దృష్టికి మిగుల విలువైన వారిగా ఉంటారు. (యెషయా 43:4, 10 పోల్చండి.) ఆ విధంగా చిన్నవైన మిడతలు, విధేయతగల మానవులకు తన స్నేహాన్ని, కృపను అనుగ్రహించు సర్వశక్తిగల సృష్టికర్త ప్రేమను, మన అల్పత్వాన్ని గుర్తుచేస్తున్నవి. దేవుని ప్రేమయెడల మెప్పును మీరు ప్రదర్శిస్తున్నారా?