మంచు, మంటలున్న దేశమందు సహనముతో ప్రకటించుట
ఉత్తర అట్లాంటిక్ నందు ఉత్తర అమెరికా యూరప్ మార్గమధ్యంలో ఐస్‌ల్యాండ్ ఉంది. ఉత్తర అక్షాంశానికి దిగువన ఉన్ననూ, అక్కడి వాతావరణం అనుకున్న దానికంటె చల్లగా ఉంటుంది, అక్కడ వేడినీటి ప్రవాహాలుండుట ధన్యము. ఐస్‌ల్యాండ్, యూరప్‌లోకెల్లా అతిపెద్ద హిమప్రాంతమును, ప్రపంచంలో అతిచురుకైన అగ్నిపర్వతాలున్న ప్రదేశమైనందున అది మంచు, మంటలున్న దేశమని పిలువబడుతున్నది. అనేక వేడినీటి బుగ్గలకు, అగ్నిపర్వత ప్రాంతపు గంధకపు వేడి గాలులకు, ఆవిరికి అది పేరుగాంచింది.
యూరప్‌లోని ఈ రెండవ అతిపెద్ద ద్వీపంలో నివసించే 2,60,000 నివాసులు వైకింగ్ సంతతివారు, వీరు 1,100 సంవత్సరాలకు పూర్వం నుండే ఈ దేశంలో స్థిరనివాసమేర్పరచుకున్నారు. ఐస్‌ల్యాండిక్ భాషకూడ, వైకింగ్ కాలంనాటి స్కాండినేవియన్ భాషలంత ప్రాచీనమైనదే. అది ఎలాంటి మార్పుల్లేకుండా ఇంకా అలానేవుంది, ఎందుకంటే ఐస్‌ల్యాండ్ దేశస్థులు దాదాపు 13వ శతాబ్దంలో వ్రాయబడిన తమ పురాతన గ్రంథాల్ని చదవడానికి చాలా ఇష్టపడతారు.
పదహారవ శతాబ్దం వచ్చేటప్పటికి బైబిలు ఐస్‌ల్యాండిక్‌లోకి అనువదింపబడటం ఆరంభమైంది. “క్రొత్త నిబంధన” 1540లోను పూర్తి బైబిలు 1584లోను వాడుకలోకి వచ్చాయి. తొంభై శాతంకంటే ఎక్కువమంది ప్రజలు ఇవాంజిలికల్ లూథరన్ చర్చికి చెందినవారు, అదే ఆ దేశ జాతీయ మతం. బైబిలు దాదాపు ప్రతి గృహమందు కన్పించినను, అది దేవుని వాక్యమని కొందరు మాత్రమే విశ్వసిస్తారు. చాలామంది ఐస్‌ల్యాండ్ ప్రజలు మతం విషయంలో విశాల దృక్పథాలతో, సాధారణంగా స్వేచ్ఛాభావాలు గలవారిగా ఉంటారు.
ఐస్‌ల్యాండ్‌కు సువార్త చేరుట
మొట్టమొదట రాజ్యసువార్తను విన్న ఐస్‌ల్యాండ్ దేశస్థులు అప్పటికి కెనడాలో నివసిస్తున్నారు. వారిలో జార్జి ఫ్యోల్నర్ లిండాల్ ఒకరు. ఆయన తలిదండ్రులు ఐస్‌ల్యాండ్‌కు చెందినవారు, ఆయన ఐస్‌ల్యాండిక్ మాట్లాడేవాడు. తన జీవితాన్ని యెహోవా దేవునికి సమర్పించుకున్న కొద్దికాలానికే, ఆయన సువార్త ప్రకటించు పూర్తికాల పరిచారకుడయ్యాడు. ఆయన తన 40వ ఏట అనగా 1929లో ఈ మంచు, మంటలున్న దేశప్రజలకు సువార్త తీసుకొచ్చాడు.
ఒకే వ్యక్తికి అదెంతటి బృహత్తర కార్యం! ఉత్తర దక్షిణాల మధ్య దాదాపు 320 కిలోమీటర్లు, తూర్పు పడమర మధ్య దాదాపు 500 కిలోమీటర్లుగల దేశం ఈ ఐస్‌ల్యాండ్. సముద్రపు నీటిపాయలు, కాలువలతో సహా దాని తీరప్రాంతం 6,400 కిలోమీటర్లుంది. ఆ కాలంలో సరైన రహదారులుగాని, ఎలాంటి వాహనాలు లేదా అటుయిటు ప్రయాణించడానికి ఆధునిక సదుపాయాలుగాని లేవు. అయినను, సహోదరుడైన లిండాల్ పది సంవత్సరాల కాలంలో మొత్తం ద్వీపమంతా ప్రచారంచేసి, వేలాది పుస్తకాలు పంచిపెట్టాడు. ఆయన పడవల్లో తీరప్రాంతాలకు ప్రయాణించాడు, ఆయన వ్యవసాయ క్షేత్రాల్ని సందర్శించేటప్పుడు రెండు గుర్రాల్ని వాడేవాడు. ఒకటి తనను, రెండవది పుస్తకాల్ని ఇతర సామగ్రిని మోయడానికి ఆయన ఉపయోగించేవాడు.
ఐస్‌ల్యాండ్‌లో దాదాపు 18 సంవత్సరాల వరకు సహోదరుడైన లిండాల్ ఒక్కడే సాక్షిగా ఉన్నాడు. తానెంత పాటుపడిననూ, ఆ కాలంలో ఎవరూ రాజ్యం కొరకు స్థిరంగా నిలబడటాన్ని ఆయన చూడలేదు. మార్చి 25, 1947లో వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్‌నుండి పట్టభద్రులు రావడంతో ఆయన దీర్ఘకాల ఒంటరి పోరాటం ముగిసింది. కోతకు ఎక్కువమంది పనివారి కొరకు పనివారిని పంపుమని ఆయన చేసిన ప్రార్థనలకు చివరకు యెహోవా జవాబిచ్చినందుకు ఆయన పొందిన ఆనందాన్ని మీరూహించవచ్చును. (మత్తయి 9:37, 38) తను 1953లో కెనడాకు తిరిగివచ్చు పర్యంతము సహోదరుడైన లిండాల్ ఐస్‌ల్యాండ్‌లోనే సేవచేశారు.
కోతకు మరెక్కువమంది పనివారు
ఆ 1947లో వచ్చిన మిషనరీలు డానిష్ సహోదరులు. రెండు సంవత్సరముల తర్వాత మరెక్కువమంది మిషనరీలు అక్కడకు చేరుకున్నారు. ఐస్‌ల్యాండ్‌కు వచ్చిన కొంతమంది స్నేహితులతో వారు కలిసి ప్రచారపు పనిచేస్తూ, వేలాది సాహిత్యములను అందించారు. ఐస్‌ల్యాండ్ దేశస్థులు చాలావరకు మంచి చదువరులైనను, ఎక్కువమంది సువార్తకు స్పందించలేదు. దాదాపు 27 సంవత్సరాలపాటు నాటి నీరుపోసిన తర్వాత, సహనపరులైన సహోదరులు తమ శ్రమఫలితాలను చూడసాగారు. ఏడుగురు రాజ్య పక్షమున నిలిచి 1956లో తమ జీవితాల్ని యెహోవాకు సమర్పించుకున్నారు.
గత పది సంవత్సరాల్లో, రాజ్య ప్రచారకుల సంఖ్య రెండింతలకంటె ఎక్కువైనది. ఇప్పుడక్కడ ఏడు సంఘాలు ఒక ఐసొలేటెడ్ గుంపుతో కలిసి మొత్తం 280 మంది సువార్త ప్రకటిస్తున్నారు. మనమీ సంఘాల్ని సందర్శించి రావడానికి అలా ద్వీపమంతా తిరిగొద్దాం.
రాజధాని చుట్టుప్రక్కల
ఆ సంవత్సరాలన్నింటిలో సహించిన సహోదర సహోదరీలు ఎంతగానో ఆశీర్వదింపబడ్డారు. ఇప్పుడు రాజధాని నగరమైన రేక్‌జావిక్‌లో పురోగమిస్తున్న రెండు సంఘాలున్నాయి. బ్రాంచి కార్యాలయమందేవున్న రాజ్యమందిరంలో వారు కూడుకుంటున్నారు. అది 1975లో ప్రతిష్ఠింపబడింది.
ఆ 1956లో బాప్తిస్మం పొందిన ఏడుగురిలో ఫ్రెథ్‌రిక్, ఆదాకూడ వున్నారు. ఫ్రెథ్‌రిక్ యిలా అంటున్నాడు: “మిషనరీలు ఉండిన మేడమీది చిన్న గదిలో కూటాలు జరిపించడం నాకింకా గుర్తుంది. అక్కడ 12 కుర్చీలుపట్టే స్థలముండేది, అయితే కొన్నిసార్లు మామూలుగా వచ్చేవారికంటే ఎక్కువమంది వచ్చినప్పుడు, దానికి ఆనుకొనియున్న మరోచిన్న గది తలుపు తెరిచేవారము. నేడు రెండు సంఘాలతో రాజ్యమందిరం నిండిపోవడం ఎంత భిన్నంగావుందో!”
మొదటి సమావేశములు నిర్వహింపబడినప్పుడు ఫ్రెథ్‌రిక్ ఫుడ్ సర్వీస్ డిపార్టుమెంట్ ఇన్‌చార్జిగా ఉండేవాడు. “చాలావరకు ఆ పనంతా నేనే చేసేవాడిని, అదే సమయంలో, ప్రతిదిన కార్యక్రమంలో నాకు మూడు నాలుగు ప్రసంగ భాగాలుండేవి. వంటశాలలో పనిచేసేటప్పుడు ఆప్రన్ ధరించేవాడిని. ప్రసంగమిచ్చే సమయం వచ్చినప్పుడు, కోటు వేసుకుని హాల్లోకి పరుగెత్తేవాడిని. నేను ధరించిన ఆప్రన్ తీసివేయమని సహోదరులు అనేకమార్లు గుర్తుచేయడం కూడ జరిగింది. కార్యక్రమ ప్రసంగ భాగాల్ని నిర్వహించగల పెద్దలతోసహా సమావేశముల కిప్పుడు 400 నుండి 500 మంది వరకు హాజరగుతున్నారు. ఫుడ్ సర్వీస్ డిపార్టుమెంటులో పనిచేయుటకు ఇష్టపడుచున్న వారుకూడా చాలామంది ఉన్నారు.”
రేక్‌జావిక్‌కు అతి సమీపంలో కెఫ్లావిక్ సంఘముంది, ఇది పశ్చిమంగా దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనం వెళ్లే దారిలో లావా క్షేత్రాలున్నాయి. ఐస్‌ల్యాండ్‌లో పదిశాతం ప్రాంతం లావాతో కప్పబడివుంది. ఈ క్షేత్రాల్లో మొదట పాకుడు, నాచు మొలుస్తుంది, కొంచెం పాతబడిన లావా క్షేత్రాల్లో అడవి బెర్రిమొక్కలు, చిన్నచిన్న తుప్పల్ని మీరు చూస్తారు.
కెఫ్లావిక్ సంఘంలో 19 మంది ప్రచారకులున్నారు, ఇది 1965లో నెలకొల్పబడింది. దీనికి సమీపంలోనే అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది, అమెరికా సైనిక స్థావరం కూడా ఇక్కడేవుంది. సాక్షులు ఎన్నటికిని ఆ స్థావరంలో ఇంటింటికి వెళ్లి సేవచేయలేకపోయినను, అక్కడ అనేక బైబిలు పఠనాలు నిర్వహింపబడ్డాయి, వారిలో కొంతమంది సత్యంకూడ నేర్చుకున్నారు.
రేక్‌జావిక్‌కు తూర్పుగా 55 కిలోమీటర్ల దూరానగల సెల్‌ఫోస్‌లో మరో సంఘం ఉంది. ఇక్కడ మనం ఐస్‌ల్యాండ్‌లో అతిపెద్ద పాలకేంద్రంతో సహా, పచ్చని వ్యవసాయ భూముల్ని, పశువుల్ని, గొర్రెల్ని చూస్తాము. మనం చక్కని లోయప్రాంతపు క్వెరాగెర్‌థీ పట్టణంగుండా వెళ్తాము. దూరంగా, ఆ లోయప్రాంతమంతా వేడినీటి బుగ్గలనుండి పారే నీటిపాయల్ని చూడవచ్చు. ఇది దేశంలోనే అతి ఎక్కువ ఆవిరి అలుముకున్న ప్రాంతం. హాట్-హౌస్ టొమాటోలు, దోసకాయలు, వివిధ రకాల పుష్పాలు పండించులాగున, ఈ వనరుల్ని ఉపయోగించడానికి ఇక్కడ అనేక హరిత గృహాల్ని నిర్మించడం జరిగింది.
ఈ ప్రాంతంలో, 19 మంది రాజ్య ప్రచారకులుగల చురుకైన చిన్న సంఘమొకటి వుంది. ఈ సంఘం 1988లో నెలకొల్పబడే సమయంలో ఈ చిన్న గుంపుకు సహాయపడేందుకు రేక్‌జావిక్ నుండి సెకూర్థర్, గ్వోథరన్ స్వావ ఇక్కడకు వచ్చారు. ఇక్కడ సెకూర్థర్ ఒక్కడే సంఘ పెద్ద. ఆయన పది సంవత్సరాల క్రితం యెహోవాసాక్షి కాకమునుపు, వివిధ బ్యాండ్లలో డ్రమ్స్ వాయించే పేరుగాంచిన సంగీతకారుడై యుండెను. నేడు ఆయన కిటికీలు శుభ్రపరిచే పనివానిగా జీవనం సాగిస్తున్నాడు, ఆయన సంగీతం నేర్పిస్తుంటాడు. విదూషకునిగా ఆయన జీవన విధానం, మాదక ద్రవ్యాలు సేవించడం, అతిగా త్రాగడం, విచ్ఛిన్నమైన వివాహంవంటి ఎన్నో సమస్యల్ని ఆయనకు తెచ్చిపెట్టింది. అయితే, జీవితంలో ఒక సంకల్పం కలిగివుండి, యెహోవాను సేవిస్తున్నందుకు ఆయనిప్పుడు ఎంత సంతృప్తిగా ఉన్నాడో!
తూర్పు తీరం
సెల్‌ఫోస్‌ను వదిలి, మనమిప్పుడు చాలావరకు ఇరుకైన, మట్టిరోడ్డుపై 680 కిలోమీటర్లు ప్రయాణించి, తూర్పు తీరమందలి రాథర్‌ఫ్యోర్‌థియోర్ పట్టణమందలి తర్వాతి సంఘానికి వెళ్తున్నాము. అరగంటలోపే మనకు ఐస్‌ల్యాండ్‌లో అత్యంత పేరుగాంచిన హెక్లా అగ్నిపర్వతం కనబడుతుంది. ఈ శతాబ్దంలో అది ఇప్పటికి నాలుగుసార్లు ప్రేలింది.
నాటకీయంగా 1973లో వెస్ట్‌మానెయార్ (వెస్ట్‌మాన్) అగ్నిపర్వత విస్ఫోటనం జరిగింది. ఆ పరిసరప్రాంత జనాబా మొత్తం 5,300 మంది కొన్ని గంటల్లోనే సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లిపోయారు. పట్టణం బాగుచేయబడిన తర్వాత అక్కడి నివాసులు క్రమేణి తిరిగివచ్చారు. ఇప్పుడక్కడ ఇద్దరు సాక్షులు నివసిస్తూ, ఆ చిన్న సమాజపు ప్రజలకు సువార్త ప్రకటిస్తున్నారు. మరో రెండు గంటల ప్రయాణంలో మనం ఐస్‌ల్యాండ్‌లో బహు సుందరమైన, అతిపెద్ద హిమప్రాంతమైన వాట్‌నయెకుటెల్‌ను సందర్శిస్తాము, దీని వైశాల్యం 8,300 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. మార్గంలో మనం మరెన్నో జలపాతాల్ని, నదుల్ని చూస్తాము.
దాదాపు పదిగంటల ప్రయాణం తర్వాత మనం మన గమ్యాన్ని చేరుకున్నాము. రాథర్‌ఫ్యోర్‌థియోర్‌లో ఐస్‌ల్యాండ్‌నందు ఈ మధ్యే నెలకొల్పబడిన 12 మంది ప్రచారకులున్న సంఘంవుంది. ఈ ప్రాంతంలో 1988 ద్వితీయార్థంలో ఒక మిషనరీ గృహం స్థాపించబడే వరకు సాక్షులెవరూ లేరు. ఐస్‌ల్యాండ్‌లో 1963 నుండి సేవచేస్తున్న, స్వీడిష్ మిషనరీ దంపతులైన కెల్, ఐరిస్‌లను 15,000 జనాభావున్న ఈ పల్లె ప్రాంతానికి నియమించడం జరిగింది. దాదాపు 500 కిలోమీటర్ల పొడవున్న తీరప్రాంతంలో చేపలుపట్టు పల్లెల్లో అనేకమంది నివసిస్తారు.
కెల్ యిలా వివరిస్తున్నాడు: “ఐస్‌ల్యాండ్‌లో ఈ ప్రాంతమందు రాజ్యసేవను యెహోవా ఎంతగానో ఆశీర్వదించాడనుటలో ఎలాంటి సందేహం లేదు. జనవరి 1, 1993న సంఘం నెలకొల్పబడింది, ఆలాగే మేము చక్కని అభివృద్ధి సాధిస్తున్న ఆయావ్యక్తులతో అనేక బైబిలు పఠనాలు నిర్వహిస్తున్నాము. సహోదరుడైన లిండెల్ గుర్రంపై ప్రయాణం చేసినప్పటికంటె ప్రయాణ సౌకర్యాలు మారిననూ, కొద్ది గంటలే వెలుతురుండే శీతాకాలపు నెలల్లో ఫోర్‌వీల్ జీపుతో కూడ మంచుగల కొండదారుల గుండా ప్రయాణించడం అంత సులభం కాదు. ఒకసారి మా జీపు ఒక మంచుదారి నుండి ప్రక్కకుజారి పల్లంలోకి రెండు మూడు పల్టీలు కొట్టింది. మాకెలాంటి గాయాలు తగలకుండా తప్పించుకొన్నందుకు మేమెంత సంతోషించామో!”
ఐస్‌ల్యాండ్‌లో 30 సంవత్సరాలున్న తర్వాత, ఐరిస్ యిలా అంటోంది: “చాలా సంవత్సరాలుగా సహాయం చేయడానికి ఇతర దేశాలనుండి అనేకమంది వచ్చారు. వివిధ కారణాల్నిబట్టి వారిలో అనేకులు తిరిగి వెళ్లిపోవాల్సి వచ్చిననూ, నాటి నీరుపోయడంలో వారు నిశ్చయంగా ఒక గొప్ప పాత్ర వహించారు. మేము ఇక్కడే ఉండగల్గినందుకు ఎంతో సంతోషిస్తున్నాము ఎందుకంటే పంట చేతికి రావడాన్ని చూసే ఆధిక్యత మాకిప్పుడు లభించింది. ఇక్కడ కూడ యెహోవా తన పనిని త్వరపెట్టుచున్నాడు.”
క్రొత్తవారు తమ తోటి ఉద్యోగులకు సాక్ష్యమిస్తున్నందున ఎంతో అభివృద్ధి సాధించబడుతుంది. ఆట్లె మిషనరీల నుండి సత్యాన్ని నేర్చుకుని, తాను పనిచేస్తున్న నిర్మాణాలు చేపట్టే కంపెనీలో ఇతరులతో మాట్లాడ్డం ఆరంభించాడు. ఇప్పుడు ఆ ఉద్యోగుల్లో ఇద్దరు ప్రకటించే పనిలో భాగం వహిస్తున్నారు, వారిలో ఒకాయన తన భార్యతో కలిసి 1992 నవంబరులో బాప్తిస్మం తీసుకున్నాడు. తోటి ఉద్యోగస్తుల్లో మూడవ వ్యక్తి సాక్షులతో బైబిలు పఠనం చేస్తున్నాడు.
ఉత్తరంగా ప్రయాణించుట
రాథర్‌ఫ్యోర్‌థియోర్ వదిలి మనం పశ్చిమంగా వెళ్తున్నాము. తర్వాతి సంఘం 300 కిలోమీటర్ల దూరంలో, ఆకిరారె పట్టణంలో ఉంది. అక్కడ పనిచేయడానికి 1950 ప్రథమార్థంలో ప్రత్యేక పూర్తికాల ప్రచారకుల్ని నియమించడం జరిగింది. మొదటినుండే, అచ్చట కొంతమంది మతనాయకుల నుండి సేవకు తీవ్ర వ్యతిరేకత ఆరంభమైంది. యెహోవాసాక్షులకు వ్యతిరేకంగా ప్రజల్ని హెచ్చరిస్తూ స్థానిక వార్తాపత్రికల్లో శీర్షికలు ప్రచురింపబడ్డాయి. ఆ పట్టణ ప్రజల్లో చాలామందికి అభిచారమందు ప్రవేశముంది. అయితే వివిధ పయినీర్లు, మిషనరీలు చూపిన సహనం కారణంగా నేడు 35 మంది రాజ్య ప్రచారకులతో చురుకైన ప్రేమగల సంఘం అక్కడవుంది.
ఒక పెద్దగా ఇక్కడ సేవచేస్తున్న ఫియోరిక్ మునుపు ఒక జాలరి. ఆయన 1982లో ఒక జిల్లా సమావేశానికి హాజరైన తర్వాత, తాను సత్యం నేర్చుకుంటున్నానని గ్రహించాడు. తన కుటుంబానికి, స్నేహితులకు, తోటి పనివారికి సాక్ష్యమివ్వాలనే తీర్మానంతో ఆయన ఆకిరారెకి తిరిగివచ్చాడు. సంఘం కొరకు ఎక్కువ సమయాన్ని కేటాయించుటకు, ఫియోరిక్ జాలరిగా తన ఉద్యోగం మానుకోవాలని పథకం వేసుకున్నాడు. తానొక యెహోవాసాక్షి కాబోతున్నందున, వివాహమయ్యే పర్యంతం తామెంత మాత్రం కలిసి జీవించకూడదని ఆయన తన స్నేహితురాలైన హెల్గెకు చెప్పాడు. తానొక ‘అవిశ్వాసిని వివాహం చేసుకోలేడు’ గనుక ఆమెకూడా బైబిలు పఠించాలని ఫియోరిక్ ఆమెను కోరాడు. (1 కొరింథీయులు 7:39) ఆయన ఆశ్చర్యపడునట్లు హెల్గె పఠనం ఆరంభించింది. వారు 1983 ఫిబ్రవరిలో వివాహం చేసుకుని ఆ తర్వాత కొద్దికాలానికే బాప్తిస్మం పొందారు. యుక్తకాలంలో ఫియోరిక్ తల్లి, చెల్లెలు కూడ సత్యాన్ని అంగీకరించారు.
మన చివరి గమ్యం ఆక్రెనెస్. ఇది ఆకిరారెకి 350 కిలోమీటర్ల దూరంలో, మూడు పర్వత ప్రాంతాలు, అనేకమైన అందమైన లోయల అవతల ఉంది. మనం ఇప్పటివరకు ప్రయాణించిన అనేక ఇరుకైన మట్టి రోడ్లకు భిన్నంగా, ఇక్కడ రోడ్డు చక్కగా వేయబడిన కారణంగా ప్రయాణం హాయిగావుంది. ఆక్రెనెస్‌లో ఐస్‌ల్యాండ్‌లోకెల్లా అతిచిన్న సంఘం మనకుంది. అక్కడ ఐదుగురు ప్రచారకులే ఉన్నారు, వారిలో ఇద్దరు పెద్దలుగా సేవచేస్తున్నారు. వారందరు రెండు కుటుంబాల వారే, అయితే వారు మాసిదోనియ పిలుపుకు ప్రత్యుత్తరమిచ్చి రేక్‌జావిక్‌లోని పెద్ద సంఘాల్ని విడిచి ఎక్కువ అవసరతవున్న ఈ చిన్న పట్టణంలో సేవచేసేందుకు ఇక్కడకొచ్చి స్థిరపడ్డారు. (అపొస్తలుల కార్యములు 16:9, 10) ఇప్పటికి రెండు సంవత్సరాలకు పైగా వారు, యెహోవా తప్పక అభివృద్ధి కలుగజేయుననే నమ్మకంతో ఎంతో ఓపికగా ఈ ప్రాంతమందు సువార్త ప్రకటిస్తున్నారు—1 కొరింథీయులు 3:6.
అభివృద్ధికి అనుకూల ఉత్తరాపేక్షలు
భూమియందుత్పత్తి అయిన ఉష్ణశక్తి, కృత్రిమ వెలుగుద్వారా హరిత గృహాల్లో ఐస్‌ల్యాండ్ రైతులు వివిధ రకాల ఫలాలు, కూరగాయలు ఇతర మొక్కల్ని పెంచగల్గుతున్నారు. అదేప్రకారం, ఆత్మీయ సత్యంతో, మృదు స్వభావంతో, యెహోవా పరిశుద్ధాత్మ ఆశీర్వాదంతో సిద్ధపడిన సాక్షులు ఐస్‌ల్యాండ్‌లో అద్భుత ఫలితాల్ని సాధిస్తున్నారు.
ఈ సంవత్సరం క్రీస్తు మరణ జ్ఞాపకార్థ దినాచరణకు 542 మంది హాజరయ్యారు, ఆలాగే అక్కడిప్పుడు దాదాపు 200 గృహ బైబిలు పఠనములు నిర్వహింపబడుతున్నవి. అనియమిత ప్రాంతాల్లో సేవచేసే ప్రోత్సాహానికి లభించే అనుకూల ప్రతిస్పందన, మంచి కాపరియగు యేసుక్రీస్తు స్వరాన్ని ఈ సువిశాల దేశమందలి గొర్రెవంటి ప్రజలు వింటారనే నమ్మకం మనకు కలిగిస్తుంది. (యోహాను 10:14-16) గత 64 సంవత్సరాలుగా మంచు, మంటలుగల దేశంలో సువార్త ప్రకటించుటలో ఎంతో ఓపికను ప్రదర్శించిన నమ్మకమైన రాజ్యప్రచారకులకు అదెంత ఆనందాన్నిస్తుందో గదా!
[24వ పేజీలోని చిత్రం]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
ఆకిరారె
ఆక్రెనెస్
కెఫ్లావిక్
సెల్‌ఫోస్‌లో
వెస్ట్‌మానెయార్
రాథర్‌ఫ్యోర్‌థియోర్
హెక్లా
గిజెర్
వాట్‌నయెకుటెల్
రేక్‌జావిక్
[క్రెడిట్ లైను]
Based on map by Jean-Pierre Biard