కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 9/15 పేజీలు 14-19
  • మీ సహనానికి దైవభక్తిని అమర్చుకొనుడి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీ సహనానికి దైవభక్తిని అమర్చుకొనుడి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దైవభక్తి అంటే ఏమిటి
  • దైవభక్తిని మనమెట్లు పొందెదము?
  • గృహమందు దైవభక్తిని ఆచరించుట
  • దైవభక్తి మరియు పరిచర్య
  • మీ సహనానికి భక్తిని అమర్చుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • బాప్తిస్మముపొందిన క్రైస్తవులుగా దైవభక్తిని వెంబడించుము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • యేసుయొక్క దైవభక్తి మాదిరిని అనుసరించుము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • దైవభక్తిని గూర్చిన పరిశుద్ధమర్మమును నేర్చుకొనుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 9/15 పేజీలు 14-19

మీ సహనానికి దైవభక్తిని అమర్చుకొనుడి

“మీ విశ్వాసమునందు . . . సహనమును, సహనమునందు భక్తిని . . . అమర్చుకొనుడి.”—2 పేతురు 1:5, 6.

1, 2. (ఎ) నాజీ అధీనమందున్న దేశాల్లో 1930వ దశాబ్ద ఆరంభకాలంలో యెహోవాసాక్షులకు ఏమి సంభవించింది, ఎందుకు? (బి) ఈ కఠిన పరీక్షను యెహోవా ప్రజలెట్లు భరించారు?

అది 20వ శతాబ్దపు చరిత్రలో గాఢాంధకారం అలుముకున్న కాలం. నాజీ ఆధిపత్యమున్న దేశాల్లో 1930వ దశాబ్ద ప్రథమార్థంలో వేలాదిమంది యెహోవాసాక్షులు అన్యాయంగా బందింపబడి కాన్‌సెంట్రేషన్‌ క్యాంపుల్లో పడవేయబడ్డారు. ఎందుకు? ఎందుకనగా వారు ధైర్యంగా తటస్థ వైఖరిని అవలంభించి హిట్లరుకు జై అని చెప్పుటకు తిరస్కరించారు. అందువల్ల వారికేమి సంభవించింది? “SS-సైనికులు బైబిలు విద్యార్థులను [యెహోవాసాక్షులను] చూసినంత కౄరాతికౄరంగా . . . మరే ఇతర బందీల గుంపులను చూడలేదు. వారిని నిరంతరం మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెట్టారు, ఈ లోకంలోని ఏ భాషా ఆ చిత్రహింసల్ని వర్ణించలేదు.”—కార్ల్‌ విట్టిగ్‌, ఒక మాజీ జర్మను ప్రభుత్వాధికారి.

2 సాక్షులు దానినంతటిని ఎలా సహించారు? ది నాజీ స్టేట్‌ అండ్‌ ది న్యూ రిలీజియన్స్‌: ఫైవ్‌ కేస్‌ స్టడీస్‌ ఇన్‌ నాన్‌-కన్‌ఫార్మిటి, అనే తన పుస్తకంలో డా. క్రిస్టీన్‌ ఇ. కింగ్‌ యిలా వ్రాసింది: “కేవలం [ఇతర మతగుంపులకు భిన్నంగా] సాక్షులను లొంగదీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది.” ఔను, వందలాదిమంది విషయంలో అది మరణం వరకు సహించుటగా ఉన్ననూ మొత్తానికి యెహోవాసాక్షులు స్థిరంగా నిలబడ్డారు.

3. తీవ్ర శ్రమల్ని సహించుటకు యెహోవాసాక్షులను ఏది బలపర్చింది?

3 నాజీ జర్మనీలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా యెహోవాసాక్షులు అట్టి శ్రమలు సహించడానికి వారినేది బలపర్చింది? వారి దైవభక్తినిబట్టి వారి పరలోకపు తండ్రి సహించుటకు వారికి సహాయం చేశాడు. “భక్తులను శోధనలోనుండి తప్పించుటకు . . . ప్రభువు సమర్థుడు” అని అపొస్తలుడైన పేతురు వివరిస్తున్నాడు. (2 పేతురు 2:9) దానికిముందు అదే లేఖలో, పేతురు క్రైస్తవులకు ఈ సలహానిచ్చాడు: “మీ విశ్వాసమునందు . . . సహనమును, సహనమునందు భక్తిని . . . అమర్చుకొనుడి.” (2 పేతురు 1:5, 6) కాబట్టి సహనం భక్తితో సన్నిహితంగా ముడిపెట్టబడివుంది. వాస్తవానికి, అంతం వరకు సహించుట అంటే, మనం ‘దైవభక్తిని వెంబడిస్తూ’ దానిని ప్రదర్శిస్తూ ఉండాలి. (1 తిమోతి 6:11) అయితే ఈ దైవభక్తి అంటే కచ్చితంగా ఏమిటి?

దైవభక్తి అంటే ఏమిటి

4, 5. దైవభక్తి అంటే ఏమిటి?

4 “దైవభక్తికి” (యుసేబియా) ఉపయోగింపబడిన గ్రీకు నామవాచకాన్ని అక్షరార్థంగా “యుక్తమైన పూజ్యభావం”a అని అనువదించవచ్చును. (2 పేతురు 1:6, కింగ్‌డం ఇంటర్లీనియర్‌) అది దేవునియెడల పూర్ణహృదయ ప్రేమభావాన్ని తెలుపుచున్నది. డబ్ల్యు. ఇ. వైన్‌ చెప్పిన ప్రకారం క్రియా విశేషణమగు యుసెబెస్‌కు, అక్షరార్థంగా “దేవుని యెడల పరిశుద్ధ భయంచే నడిపించబడుతూ అంకితభావంతోచేసే కార్యమందు వ్యక్తపర్చబడే శక్తిని” తెలియజేసే “సరియైన పూజ్యభావం” అని అర్థం.—2 పేతురు 2:9, Int.

5 అందువలన “దైవభక్తి” అనే మాట యెహోవాకు ప్రీతికరమైనది చేయుటకు మనల్ని పురికొల్పునట్లు ఆయనయెడల చూపే పూజ్యభావాన్ని లేదా భక్తిని సూచిస్తున్నది. మనం హృదయపూర్వకంగా దేవుని ప్రేమిస్తాము గనుక కష్టభరితమైన శ్రమలున్నను దీనిని చూపించడం జరుగుతుంది. ఇది మనం జీవించే జీవనవిధానంలో వ్యక్తపర్చబడునట్లు యెహోవాతోవున్న యథార్థమైన, వ్యక్తిగతమైన సన్నిహితత్వమై యుంది. తాము “సంపూర్ణభక్తి . . . కలిగి, నెమ్మదిగాను సుఖముగాను బ్రదుకు”టకు ప్రార్థించుడని నిజ క్రైస్తవులకు ఉద్బోధించబడింది. (1 తిమోతి 2:1, 2) నైఘంటికులైన జె. పి. లో మరియు ఇ. ఎ. నిడే చెప్పిన ప్రకారము, “అనేక భాషల్లో 1 తిమో. 2.2 నందలి [యుసేబియా]ను ‘దేవుడు ఉద్దేశించినట్లుగా జీవించుట’ లేదా ‘మనమెలా జీవించాలని దేవుడు చెప్పాడో అలా జీవించుట’ అని అనువదించుట యుక్తమైయుంటుంది.”

6. సహనానికి, దైవభక్తికి మధ్యగల సంబంధమేమిటి?

6 ఇప్పుడు మనం సహనానికి, దైవభక్తికిగల సంబంధాన్ని మరింత శ్రేష్ఠంగా గుణగ్రహించగలం. దేవుడు ఉద్దేశించినట్లుగా అంటే దైవభక్తితో జీవిస్తాం గనుక లోకం మనల్ని ద్వేషిస్తుంది, అందువల్ల అది మనకు విశ్వాస సంబంధమైన శ్రమల్ని కలుగజేస్తుంది. (2 తిమోతి 3:12) మన పరలోకపు తండ్రితో మనకు సన్నిహితమైన వ్యక్తిగత సంబంధం లేనట్లయితే, అట్టి శ్రమల్ని సహించునట్లు మనల్ని మరేది పురికొల్పలేదు. అంతేకాకుండ, అటువంటి హృదయపూర్వక భక్తికి యెహోవా ప్రతిస్పందిస్తాడు. ఎంత వ్యతిరేకతవున్ననూ, తనయెడల భక్తివున్న కారణంగా తనను ప్రీతిపర్చుటకు పోరాడుచున్న వారిని పరలోకంనుండి పరికించి చూడటం ఆయనకెలా ఉంటుందో ఒకసారి ఊహించండి. “భక్తులను శోధనలోనుండి తప్పించుటకు” ఆయన కార్యోన్ముఖుడై ఉన్నాడనుటలో ఆశ్చర్యం లేదు!

7. దైవభక్తిని ఎందుకు పెంపొందించుకోవాలి?

7 అయితే, మనం దైవభక్తితోనే జన్మించలేదు, లేదా భక్తిపరులైన తలిదండ్రుల నుండి యాంత్రికంగా దానిని పొందలేదు. (ఆదికాండము 8:21) కాబట్టి మనం దానిని పెంపొందించుకోవాలి. (1 తిమోతి 4:7, 10) దైవభక్తిని మన సహనానికి, ఆలాగే మన విశ్వాసానికి అమర్చుకొనుటకు మనం కృషిసల్పాలి. దీనికొరకు “పూర్ణజాగ్రత్త” అవసరమని పేతురు చెబుతున్నాడు. (2 పేతురు 1:5) కాబట్టి ఈ దైవభక్తిని మనమెట్లు పొందగలము?

దైవభక్తిని మనమెట్లు పొందెదము?

8. అపొస్తలుడైన పేతురు చెప్పిన ప్రకారము, దైవభక్తిని పెంపొందించుకొనుటకు కీలకమేమి?

8 దైవభక్తిని పొందడానికి అవసరమైన కీలకాన్ని అపొస్తలుడైన పేతురు వివరిస్తున్నాడు. ఆయనిట్లన్నాడు: “తన మహిమనుబట్టియు, గుణాతిశయమునుబట్టియు, మనలను పిలిచినవాని గూర్చిన అనుభవజ్ఞానమూలముగా ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసినవాటినన్నిటిని మనకు దయచేయుచున్నందున, దేవునిగూర్చినట్టియు మన ప్రభువైన యేసునుగూర్చినట్టియునైన అనుభవజ్ఞానమువలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక.” (2 పేతురు 1:2, 3) కాబట్టి మన విశ్వాసానికి, సహనానికి దైవభక్తిని అమర్చుటకు, మనం యెహోవా దేవునిగూర్చి, యేసుక్రీస్తును గూర్చి కచ్చితమైన, అనగా నిండైన లేదా సంపూర్ణమైన జ్ఞానమందు ఎదగాలి.

9. దేవుని గూర్చిన, క్రీస్తును గూర్చిన కచ్చితమైన జ్ఞానమంటే కేవలం వారిని ఎరుగుటకంటె ఎక్కువ ఇమిడివుందని చెప్పడాన్ని ఎలా ఉదహరించవచ్చును?

9 దేవుని గూర్చి క్రీస్తును గూర్చి అనుభవజ్ఞానం కలిగివుండుట అంటే దాని భావమేమి? దానియందు కేవలం వారెవరో తెలిసికొనుటకంటె ఎక్కువ ఇమిడియుంది. దృష్టాంతమునకు: మీ ప్రక్కింటి వారెవరో మీకు తెలిసియుండవచ్చు, బహుశ మీరాయన్ని పేరుతో పిలిచి నమస్కారం చెబుతుండవచ్చును. అంతమాత్రాన మీరాయనకు పెద్దమొత్తంలో డబ్బు అప్పుగా ఇస్తారా? ఆ వ్యక్తి నిజంగా ఎలాంటివాడో తెలుసుకోనిదే మీరివ్వరు. (సామెతలు 11:15 పోల్చండి.) అదేప్రకారం, యెహోవాను, యేసుక్రీస్తును కచ్చితంగా, సంపూర్ణంగా తెలుసుకోవడమంటే వారు ఉనికిలో ఉన్నారని, వారిపేర్లు తెలుసని నమ్ముటకంటే ఎక్కువ అర్థం దానికున్నది. చివరకు ప్రాణాలు పోయినాసరే వారి నిమిత్తమై శ్రమలు సహించుటకు ఇష్టపడాలంటే, మనం నిజంగా వారిని సన్నిహితంగా తెలుసుకొని యుండాలి. (యోహాను 17:3) దీనిలో ఏమి యిమిడియుంది?

10. యెహోవాను గూర్చి, యేసును గూర్చి కచ్చితమైన జ్ఞానము కలిగివుండుటలో ఏ రెండు సంగతులు ఇమిడివున్నాయి, ఎందుకు?

10 యెహోవాను గూర్చి యేసును గూర్చి కచ్చితమైన, లేదా సంపూర్ణమైన జ్ఞానాన్ని పొందుటలో రెండు సంగతులు ఇమిడివున్నాయి: (1) వారిని వ్యక్తులుగా అంటే వారి లక్షణాల్ని, భావాల్ని, విధానాల్ని తెలుసుకొనుట (2) వారి మాదిరిని అనుకరించుట. దైవభక్తినందు యెహోవాతో హృదయపూర్వకమైన, సన్నిహితమైన వ్యక్తిగత సంబంధాన్ని కలిగియుండుట ఇమిడియుంది, అది మనం మన జీవితాల్ని జీవించే విధానంలో స్పష్టమై యుంటుంది. కాబట్టి, దానిని సంపాదించుటకు మనం మానవులుగా మనకు సాధ్యమైనంతమేరకు యెహోవాను వ్యక్తిగతంగా తెలుసుకొని వుండాలి, ఆయన చిత్తాన్ని, ఆయన విధానాల్ని బాగుగా ఎరిగియుండాలి. ఆయన స్వరూపమందు సృజింపబడిన మనం యెహోవాను నిజంగా ఎరిగియుండుటకు, అట్టి జ్ఞానాన్ని ఉపయోగించాలి, ఆయనవలె ఉండుటకు కృషిచేయాలి. (ఆదికాండము 1:26-28; కొలొస్సయులు 3:10) తాను చెప్పిన దానిలోను, చేసిన దానిలోను యేసు పరిపూర్ణంగా యెహోవాను అనుకరించాడు గనుక, దైవభక్తిని వృద్ధిచేసుకొనుటలో యేసును పరిపూర్ణంగా తెలిసికొనుట మిగుల విలువైన సహాయకంగా ఉండగలదు.—హెబ్రీయులు 1:3.

11. (ఎ) దేవుని గూర్చి, క్రీస్తును గూర్చి మనమెట్లు కచ్చితమైన జ్ఞానం సంపాదించగలము? (బి) మనం చదివేదాన్ని ధ్యానించుట ఎందుకు ప్రాముఖ్యము?

11 కాని, దేవుని గూర్చి క్రీస్తును గూర్చి అట్టి కచ్చితమైన జ్ఞానాన్ని మనమెట్లు పొందగలము? బైబిలును, బైబిలు ఆధారిత సాహిత్యాలను పట్టుదలతో పఠించి పొందవచ్చును.b వ్యక్తిగత బైబిలు పఠనం ఫలితంగా మనం దైవభక్తిని సంపాదించిననూ, మనం చదివిన దానిని ధ్యానించుటకు, అనగా మననం చేయుటకు లేదా బాగుగా ఆలోచించుటకు సమయం తీసుకోవడం ఆవశ్యకము. (యెహోషువ 1:8 పోల్చండి.) ఇదెందుకు ప్రాముఖ్యము? దైవభక్తి అనగా దేవుని యెడల స్నేహపూరితమైన, హృదయ స్పందన అని గుర్తుంచుకోండి. లేఖనాల్లో ధ్యానించుట అనేకమార్లు అలంకారభావ హృదయానికి అనగా అంతరంగ పురుషునికి సంబంధం కలిగివుంది. (కీర్తన 19:14; 49:3; సామెతలు 15:28) మనం చదివే దానిని మెప్పుతో ధ్యానించినప్పుడు, అది మన భావాల్ని ఉత్తేజపరుస్తూ, మన భావోద్రేకాల్ని స్పర్శిస్తూ మన ఆలోచనను ప్రభావితంచేస్తూ మన అంతరంగ పురుషుని చేరుకుంటుంది. అప్పుడు మాత్రమే అట్టి పఠనం యెహోవాతో మనకున్న వ్యక్తిగత సంబంధాన్ని బలపరచి, ఒక సవాలుగా నిలిచిన పరిస్థితులు లేదా కష్టభరితమైన శ్రమల మధ్యనూ దేవుని ప్రీతిపరచేటట్లు జీవించుటకు మనలను పురికొల్పగలదు.

గృహమందు దైవభక్తిని ఆచరించుట

12. (ఎ) పౌలు చెప్పిన ప్రకారము, ఒక క్రైస్తవుడు దైవభక్తిని గృహములో ఎలా ఆచరించవచ్చును? (బి) నిజ క్రైస్తవులెందుకు వృద్ధ తలిదండ్రుల యెడల శ్రద్ధ చూపుదురు?

12 దైవభక్తిని మొదట గృహమందు ఆచరించాలి. అపొస్తలుడైన పౌలు ఇట్లంటున్నాడు: “ఏ విధవరాలికైనను పిల్లలుగాని మనుమలు గాని యుండిన యెడల, వీరు మొదట తమ యింటివారియెడల భక్తి కనుపరచుటకును, తమ తలిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను; ఇది దేవుని దృష్టికనుకూలమైయున్నది.” (1 తిమోతి 5:4) పౌలు వ్రాసినట్లుగా వృద్ధులైన తలిదండ్రుల యెడల శ్రద్ధచూపుట దైవభక్తిని వ్యక్తపర్చుటైయుంది. అది కేవలం తమ ధర్మమని కాకుండ, తలిదండ్రుల యెడల తమకున్న ప్రేమనుబట్టి నిజ క్రైస్తవులు వారిని పోషిస్తారు. అంతకంటె ఎక్కువగా, కుటుంబాన్ని పోషించడానికి యెహోవాయిచ్చే ప్రాముఖ్యతను వారు గుర్తిస్తారు. అవసరమైన సమయంలో తలిదండ్రులకు సహాయం చేయ నిరాకరించుట ‘విశ్వాసత్యాగము చేయుటతో’ సమానమని వారు పరిగణిస్తారు.—1 తిమోతి 5:8.

13. గృహమందు దైవభక్తిని ఆచరించుట ఎందుకు ఒక నిజమైన సవాలుగా ఉన్నది, అయితే ఒకని తలిదండ్రుల యెడల శ్రద్ధచూపుట ఫలితంగా ఎలాంటి తృప్తి లభిస్తుంది?

13 గృహమందు దైవభక్తిని ఆచరించుట అన్నిసమయాల్లో సులభం కాదనుటను అంగీకరించాల్సిందే. కుటుంబ సభ్యులు దూరదూరంగా నివసిస్తూ ఉండవచ్చు. పెరిగిన పిల్లలకు వారివారి కుటుంబాలుండి, ఆర్థికంగా వారు కష్టపడుతూ ఉండవచ్చును. తలిదండ్రుల్లో ఒకరియెడల చూపాల్సిన శ్రద్ధయొక్క స్థితి, స్థాయి ఆ శ్రద్ధచూపే వారి శారీరక, మానసిక భావోద్రేక ఆరోగ్యంపై ప్రభావం చూపగలదు. అయినప్పటికిని, తలిదండ్రుల యెడల శ్రద్ధచూపుట వలన ‘తగిన ఫలము లభించుటే’ కాదు “పరలోకమునందును, భూమిమీదను ఉన్న ప్రతి కుటుంబము” అచ్చియున్న ఆయనను ప్రీతిపరుస్తున్నామని తెలిసికొనుటలో నిజమైన తృప్తి లభించగలదు.

14, 15. తండ్రియెడల పిల్లలు చూపిన దైవిక శ్రద్ధకు ఒక ఉదాహరణను వివరించండి.

14 హృదయాన్ని స్పర్శించే ఈ ఉదాహరణను చూడండి. ఎలీస్‌, ఆయన ఐదుగురు సహోదర సహోదరీలు తమ తండ్రియెడల శ్రద్ధచూపవలసిన గడ్డు పరిస్థితి నెదుర్కొన్నారు. “మా నాన్నగారికి 1986లో గుండెపోటు వచ్చిన కారణంగా ఆయనకు పూర్తిగా పక్షవాతం వచ్చేసింది” అని ఎలీస్‌ అంటున్నాడు. ఆ ఆరుగురు పిల్లలు ఆయన అవసరతల యెడల, అంటే ఆయనకు స్నానం చేయించడం, వీపుమీద కురుపులు రాకుండా ఉండడానికి క్రమంగా ప్రక్కకు త్రిప్పి పడుకోబెట్టడం చేస్తున్నారు. “ఆయన కొరకు చదువుతాము, ఆయనతో మాట్లాడుతాము, ఆయన కొరకు సంగీతం వాయిస్తాము. ఆయనచుట్టూ జరిగే ఇవన్నీ ఆయన గమనిస్తున్నాడో లేదో మాకు తెలియదు గాని, ఆయన గమనిస్తున్నాడనే పూర్తి భావంతోనే మేము అవన్నీ చేస్తున్నాము.”

15 తమ తండ్రి యెడల ఆ పిల్లలెందుకు అంత శ్రద్ధ వహిస్తున్నారు? ఎలీస్‌ ఇట్లంటున్నాడు: “మా అమ్మ 1964లో చనిపోయిన తర్వాత, మానాన్నగారే స్వయంగా మమ్మల్ని పెంచిపెద్ద చేశారు. అప్పట్లో మా వయస్సులు 5 నుండి 14 సంవత్సరాల మధ్య ఉండింది. అప్పట్లో మాకు సహాయం చేయడానికి ఆయనుండేవారు; ఇప్పుడాయనకు మేమున్నాము.” అంతటి శ్రద్ధను చూపడం సులభమేమీ కాదు, కొన్నిసార్లు పిల్లలకు నిరుత్సాహంకూడా కలుగుతుంది. “అయితే మా తండ్రి పరిస్థితి ఒక తాత్కాలిక సమస్యేనని మాకు తెలుసు, మా నాన్నగారు తిరిగి మంచి ఆరోగ్యం పొందేటువంటి, మా అమ్మను మేము తిరిగి కలుసుకొనగల్గే కాలం కొరకు మేము ఎదురుచూస్తున్నాము” అని ఎలీస్‌ అన్నాడు. (యెషయా 33:24; యోహాను 5:28, 29) అంకితభావంతో తలిదండ్రుల యెడలచూపే అట్టి శ్రద్ధ, నిశ్చయంగా తలిదండ్రులను సన్మానించుమని పిల్లలను ఆజ్ఞాపిస్తున్నవాని హృదయాన్ని సంతోషపర్చాలి!c—ఎఫెసీయులు 6:1, 2.

దైవభక్తి మరియు పరిచర్య

16. పరిచర్యలో మనం చేసేదానికి ఏది ప్రాథమిక కారణమైయుండాలి?

16 ‘ఎడతెగక నన్ను వెంబడించుడని’ యేసు ఇచ్చిన ఆహ్వానాన్ని అంగీకరించినప్పుడు, రాజ్య సువార్త ప్రకటించి, శిష్యులను చేయుడనే దైవాజ్ఞ క్రిందికి మనం వస్తాము. (మత్తయి 16:24; 24:14; 28:19, 20) స్పష్టంగా, ఈ “అంత్యదినములలో” పరిచర్యలో భాగం వహించుట క్రైస్తవుని బాధ్యతైయుంది. (2 తిమోతి 3:1) అయితే, ప్రకటించి బోధించాలనే మన ప్రేరణ కేవలం కర్తవ్యమని లేదా బాధ్యతనే దానికంటే మిన్నగా ఉండాలి. పరిచర్యలో ఏమి చేస్తున్నాము, ఎంత చేస్తున్నామనే దానికి యెహోవా యెడల మనకున్న లోతైన ప్రేమ ఒక ప్రాథమిక కారణమై యుండాలి. “హృదయమందు నిండియుండు దానినిబట్టి నోరు మాటలాడును” అని యేసు చెప్పాడు. (మత్తయి 12:34) ఔను, మన హృదయాలు యెహోవా కొరకైన ప్రేమతో నిండివున్నప్పుడు, ఆయనను గూర్చి ఇతరులకు సాక్ష్యమివ్వాలని మనం గట్టిగా భావిస్తాము. దేవుని యెడల మనకున్న ప్రేమ మన ప్రేరణగా ఉన్నప్పుడు, మన పరిచర్య మన దైవభక్తిని అర్థవంతంగా వ్యక్తపరుస్తుంది.

17. పరిచర్య యెడల మనమెట్లు సరియైన ఉద్దేశాన్ని పెంపొందించుకొనవచ్చును?

17 పరిచర్య యెడల సరియైన ఉద్దేశాన్ని మనమెలా పెంపొందించుకోవచ్చును? తనను ప్రేమించుటకు యెహోవా మనకు దయచేసిన ఈ మూడు కారణాల్ని మెప్పుతో ధ్యానించండి. (1) యెహోవా మనకిప్పటికే చేసినవాటిని బట్టి ఆయనను మనం ప్రేమిస్తాము. విమోచన క్రయధనం దయచేయుటలో ఆయన అత్యంత గొప్ప ప్రేమ చూపగల్గాడు. (మత్తయి 20:28; యోహాను 15:13) (2) యెహోవా మనకిప్పుడు చేస్తున్నవాటిని బట్టి ఆయనను మనం ప్రేమిస్తాము. మన ప్రార్థనలకు ప్రత్యుత్తరమిచ్చే యెహోవాతో మనం సంభాషణా స్వేచ్ఛను కలిగివున్నాము. (కీర్తన 65:2; హెబ్రీయులు 4:14-16) రాజ్యాసక్తులకు ప్రాముఖ్యతనిచ్చే కొలది, మన జీవితావసరాలు తీర్చబడటం మనం చూస్తాము. (మత్తయి 6:25-33) మనమెదుర్కొనే సమస్యలతో వ్యవహరించుటకు మనకు సహాయంచేసే ఆత్మీయాహారాన్ని మనం నిలకడగా పొందెదము. (మత్తయి 24:45) ఈ లోకాన్నుండి నిజంగా మనల్ని వేరుగావుంచే ప్రపంచవ్యాప్త క్రైస్తవ సహోదరత్వంలో భాగమైయుండే ఆశీర్వాదాన్ని మనం కలిగివున్నాము. (1 పేతురు 2:17) (3) యెహోవా మనకొరకు ఇంకాచేయనైయున్న వాటినిబట్టి కూడ ఆయనను మనం ప్రేమిస్తాము. ఆయన ప్రేమనుబట్టియే మనము “వాస్తవమైన జీవమును” అనగా భవిష్యత్తులో నిత్యజీవాన్ని కలిగివున్నాము. (1 తిమోతి 6:12, 19) మన పక్షముగా యెహోవా చూపిన ప్రేమను మనం ఆలోచించినప్పుడు, ఆయనను గూర్చి ఆయన అమూల్యమైన సంకల్పాల్ని గూర్చి అంకితభావంతో ఇతరులకు చెప్పుటయందు భాగము వహించులాగున నిశ్చయముగా మన హృదయాలు మనల్ని పురికొల్పుతాయి. పరిచర్యలో ఏమిచేయాలో, ఎంతచేయాలో ఇతరులు మనకు చెప్పాల్సిన పనిలేదు. మనం చేయగల్గినంతా చేయుటకు మన హృదయాలు మనల్ని పురికొల్పుతాయి.

18, 19. పరిచర్యలో భాగం వహించుటకు ఒక సహోదరి ఎట్టి అడ్డంకును అధిగమించింది?

18 సవాలుచేసే పరిస్థితులెదురైననూ, దైవభక్తితో ఉత్తేజపర్చబడిన హృదయం మాట్లాడుటకు ఉరకలేస్తుంది. (యిర్మీయా 20:9 పోల్చండి.) మరీ సిగ్గుపడే క్రైస్తవ స్త్రీయైన స్టెల్లా విషయం దీన్ని చూపిస్తుంది. బైబిలు పఠనం ఆరంభించిన మొదట్లో ఆమె, ‘నేనెన్నడూ ఇంటింటికి వెళ్లి చెప్పలేను’ అనుకుంది. ఆమెయిలా వివరిస్తోంది: “నేనన్ని సమయాల్లో ఏం మాట్లాడకుండా ఉండేదాన్ని. ఎవరినీ సమీపించి సంభాషించగల్గేదాన్ని కాదు.” ఆమె తన పఠనం కొనసాగిస్తుండగా, యెహోవాయెడల ఆమె ప్రేమ వృద్ధియై, ఆయనను గూర్చి ఇతరులకు చెప్పాలనే దహించే కోరిక ఆమెకు కలిగింది. “నా బైబిలు ఉపదేశకురాలితో, ‘మాట్లాడాలని నేనెంతో కోరుకుంటున్నాను, అయితే నేనలా చేయలేకపోతున్నందుకు నేనెంతో బాధపడుతున్నాను’ అని చెప్పడం నాకింకా గుర్తుంది. దానికామె, “స్టెల్లా, మాట్లాడాలనే కోరిక నీకున్నందుకు కృతజ్ఞత కలిగివుండు’ అని చెప్పింది. అది నేను ఎన్నడూ మరచిపోలేను.”

19 త్వరలోనే, స్టెల్లా తన ప్రక్కింటావిడకు సాక్ష్యమివ్వడం ఆరంభించింది. ఆ తర్వాత ఆమె ఒక గొప్పకార్యాన్ని అనగా మొదటిసారిగా ఇంటింటి పరిచర్యలో భాగం వహించింది. (అపొస్తలుల కార్యములు 20:20, 21) ఆమె దానినిలా గుర్తుతెచ్చుకొంటోంది: “నేను చెప్పాల్సిన విషయాల్ని వ్రాసిపెట్టుకున్నాను. ఆ వ్రాసిపెట్టుకున్నది నాముందే ఉన్ననూ, దానిని చదివి చెప్పడానికి నాకు చెమటలు పట్టేశాయి.” ఇప్పుడు, 35 సంవత్సరాల తర్వాత కూడ స్టెల్లా తన నైజాన్నిబట్టి సిగ్గుపడుతుంది. అయితే, ఆమె ప్రాంతీయ పరిచర్యను ప్రేమిస్తూ, దానిలో అర్థవంతమైన భాగం కలిగివుండుటలో కొనసాగుతుంది.

20. హింసగాని, చెరసాలగాని యెహోవా సమర్పిత సాక్షుల నోళ్లు మూయించలేవని ఏ ఉదాహరణ చూపుతున్నది?

20 హింసగాని, చెరసాలగాని యెహోవా సమర్పిత సాక్షుల నోళ్లు మూయించలేవు. ఉదాహరణకు, జర్మనీలోని ఎర్నెస్ట్‌ మరియు హిల్డెగార్ట్‌ జెలీజర్‌ల విషయం తీసుకోండి. వారి విశ్వాసం కారణంగా వారిద్దరు కలిసి నాజీ కాన్‌సెంట్రేషన్‌ క్యాంపుల్లో, కమ్యూనిస్టు జైళ్లల్లో 40 సంవత్సరాలకు పైగా గడిపారు. జైల్లో సహితం వారు ఇతర బందీలకు సాక్ష్యమివ్వడం మానలేదు. హిల్డెగార్ట్‌ యిలా గుర్తుతెచ్చుకుంటోంది: “జైలు అధికారులు నన్ను చాలా ప్రమాదకరమైన వ్యక్తిగా పరిగణించారు, ఎందుకంటే ఒక మహిళా గార్డు చెప్పినట్లుగా, రోజంతా నేను బైబిలును గూర్చే మాట్లాడాను. అందుకే నన్ను బేస్‌మెంట్‌ గదిలో పడేశారు.” చివరకు వారు విడుదలైనప్పుడు ఈ జెలాజర్‌ సహోదర సహోదరీలు తమ పూర్తికాలాన్ని క్రైస్తవ పరిచర్యకు వినియోగించారు. వారిద్దరు మరణాంతం వరకు నమ్మకంగా సేవచేశారు, బ్రదర్‌ జెలీజర్‌ 1985లో, ఆయన భార్య 1992లో చనిపోయారు.

21. మన సహనానికి దైవభక్తిని అమర్చుటకు మనమేమి చేయాలి?

21 దేవుని వాక్యాన్ని పట్టుదలతో పఠించి, నేర్చుకున్న దానిని మెప్పుతో ధ్యానించుటకు సమయం తీసుకోవడం ద్వారా, మనం యెహోవా దేవున్ని గూర్చిన, యేసుక్రీస్తును గూర్చిన కచ్చితమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుతాము. దీని ఫలితంగా మనం అమూల్యమైన లక్షణమగు దైవభక్తిని సంపూర్ణంగా పొందిన వారమౌతాము. క్రైస్తవులుగా మనకు సంభవించే వివిధ శ్రమల్ని సహించడానికి దైవభక్తి మినహా మనకు మరో మార్గం లేదు. కాబట్టి మనం అపొస్తలుడైన పేతురు సలహాను పాటిస్తూ, ఎడతెగక ‘మన విశ్వాసానికి సహనాన్ని, మన సహనానికి దైవభక్తిని అమర్చుకుందాం.’—2 పేతురు 1:5, 6.

[అధస్సూచీలు]

a యుసేబియా (eu·se΄bei·a)ను గూర్చి విలియమ్‌ బార్‌క్లే యిలా వ్రాస్తున్నాడు: “పూజ్యభావము లేదా ఆరాధన అనే అర్థంగల [మూల] పదమందు seb ఒక భాగం. సరియైన అనడానికి గ్రీకులో Eu ఉపయోగించబడింది; కాబట్టి eusebeia అంటే సరియైన రీతిలో, యుక్తంగా ఆరాధించుట, పూజ్యభావం చూపుటైయుంది.”—న్యూ టెస్ట్‌మెంట్‌ వర్డ్స్‌.

b దేవుని వాక్య జ్ఞానాన్ని వృద్ధిచేసుకోవడానికి ఎలా పఠించాలనే చర్చకొరకు, కావలికోట ఆగష్టు 15, 1993 పుటలు 12-17 చూడండి.

c వృద్ధ తలిదండ్రుల యెడల దైవభక్తినెలా ప్రదర్శించవలెనను పూర్తి చర్చకొరకు, కావలికోట డిశంబరు 1, 1987 చూడండి.

మీ జవాబులేమి?

◻ దైవభక్తి అంటే ఏమిటి?

◻ సహనానికి, దైవభక్తికి మధ్యగల సంబంధమేమి?

◻ దైవభక్తిని పెంపొందించుకొనుటకు కీలకమేమై యున్నది?

◻ ఒక క్రైస్తవుడు గృహమందు ఎలా దైవభక్తిని ఆచరించవచ్చును?

◻ పరిచర్యలో మనం చేసేదానికి ఏది ప్రాథమిక కారణమైయుండాలి?

[18వ పేజీలోని చిత్రం]

రావెన్స్‌బ్రూక్‌లో నాజీ కాన్‌సెంట్రేషన్‌ క్యాంపునందు బందింపబడిన యెహోవాసాక్షులు ఎంతో సహనాన్ని, దైవభక్తిని ప్రదర్శించారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి