“నామములోనికి” బాప్తిస్మము
ఈ శతాబ్దపు ప్రారంభాన ఐగుప్తు ఇసుక ప్రాంతాలలో దొరికిన వేలాది ప్రాచీన లౌకిక పాపిరస్ ప్రతుల అధ్యయనం, క్రైస్తవ గ్రీకులేఖనముల వివరణకు ఎంతో ఆసక్తికరంగా తోడ్పడుతుంది. ఎట్లు? వాటిలో ఉపయోగింపబడిన కొన్ని పదాల పద్ధతిని పరిశీలించుట ద్వారా అదే పదాలు లేఖన సంబంధంగా ఎలా ఉపయోగించబడ్డాయో మనం బాగుగా తెలిసికొనుటకు సహాయం దొరుకుతుంది.
ఒక ఉదాహరణ ఏమంటే, యేసు పరలోకమునకు వెళ్లేముందుగా: “మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు, కుమారునియొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మమియ్యుడి” అని ఆజ్ఞాపించినప్పుడు, “నామములోనికి” అను మాట యేసు ఉపయోగించినదే. అయితే యేసు భావమేమిటి?—మత్తయి 28:19.
లౌకిక వ్రాతలలో “నామమున,” “నామములోనికి” అనే పదాలు “ఒకని ఖాతా పేరున” జీతాన్ని చెల్లించే సంబంధంగా ఉపయోగించబడినట్లు విద్వాంసులు కనుగొన్నారు. పాప్రి మూలంగా లభించిన నిదర్శనాన్నిబట్టి, థియోలజి ప్రొఫెసర్ డా. జి. అడాల్ఫ్ డైస్‌మాన్ నమ్మేదేమంటే “ప్రభువు నామము పేరిట బాప్తిస్మము తీసుకొనుట, లేక దేవుని కుమారుని నామమందు విశ్వసించుట అను మాటల క్రింద ఉన్న భావము, బాప్తిస్మము లేక విశ్వాసమనేది దేవునికి లేక దేవుని కుమారునికి సంబంధించినదనునదియే.”—డైస్‌మాన్స్ ఇటాలిక్స్.
యేసు కాలమునాటి యూదులును అలాంటి మాటనే ఉపయోగిస్తున్నట్లు, థియొలాజికల్ డిక్షనరీ ఆఫ్ ది న్యూ టెస్ట్‌మెంట్ లో వివరించబడిన విషయం ఆసక్తికరంగా ఉంది: “ఒక అన్యమతస్థుని యూదా మతములోకి చేర్చుకొనాలంటే అతనికి ‘అన్యుడనే పేరుమీదే’ సున్నతి జరిగేది. అతనిని నిబంధనలోనికి తీసుకొనడానికి ఈ సున్నతి . . .‘నిబంధన పేరు మీద జరిగేది.’” ఆవిధముగా యూదులు కానివారు నిబంధన అధికారము క్రింద యూదామత ప్రవిష్టుడగుటచే అతనితో సంబంధము నెలకొల్పబడేది.
అందువలన ఒక క్రైస్తవుడు సమర్పించుకొనిన తరువాత పొందే బాప్తిస్మమునుబట్టి యెహోవా దేవునితో, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో, పరిశుద్ధాత్మతో అతనికి సన్నిహిత సంబంధమేర్పడుతుంది. అలా మారిన వ్యక్తి తన నూతన జీవిత విధానములో వారివారి అధికారాన్ని గుర్తిస్తాడు. పేర్లు చెప్పబడిన ఈ ముగ్గురి విషయంలో ఇది ఎలా నిజమో పరిశీలించండి.
దేవుని అధికారమును గుర్తించుటద్వారా మనము ఆయనకు సమీపస్తులమై, ఆయనతో సంబంధ మేర్పరచుకుంటాము. (హెబ్రీయులు 12:9; యాకోబు 4:7, 8) యేసుక్రీస్తు విమోచనా క్రయధన బలి విలువ ద్వారా కొనబడినవారమై దేవుని దాసులుగా ఆయన సొత్తైయుందుము. (1 కొరింథీయులు 3:23; 6:20) అపొస్తలుడైన పౌలు మొదటి శతాబ్దపు క్రైస్తవులతో మీరు మీకు సత్యము నందించిన వారి మనుష్యులుకాక, క్రీస్తువారైయున్నారని కూడా చెప్పెను. (1 కొరింథీయులు 1:12, 13; 7:23; మత్తయి 16:24తో పోల్చండి.) కుమారుని నామములోనికి బాప్తిస్మము పొందుటయనేది ఈ వాస్తవమును గుర్తించుటతోపాటు, యేసే “మార్గమును, సత్యమును, జీవమునై” యున్నాడని గుర్తించడమైయున్నది.—యోహాను 14:6.
యెహోవాతోను, యేసుక్రీస్తుతోను సరైన సంబంధము కలిగియుండుటకు పరిశుద్ధాత్మ కూడా ప్రాముఖ్యము. పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మము తీసుకొనుటయనేది దేవుడు మనతో వ్యవహరించు విషయాలలో పరిశుద్ధాత్మ పాత్రను గుర్తించుటను చూపిస్తుంది. అది మనద్వారా పనిచేయడాన్ని నిరోధించకుండా, దానికి వ్యతిరేకంగా ప్రవర్తించకుండా దాని నడిపింపును మనము అనుసరించుటకు ఇష్టపడతాము. (ఎఫెసీయులు 4:30; 1 థెస్సలొనీకయులు 5:19) పరిశుద్ధాత్మ అనే పదాన్ని లేక భావాన్ని ఒక వ్యక్తిగా వర్ణించుటలో ఏ సమస్య లేదు. ఎందుకంటే “నిబంధన పేరున” అనే ఉపయోగము కూడా యూదా మతములో వేరే భావాన్నివ్వలేదు.
సమర్పణ, బాప్తిస్మం సమయములో మన నూతన సంబంధములో ఏమి ఇమిడివుందో జాగ్రత్తగా తలంచవలసిన అవసరమున్నది. దానికొరకు యేసుక్రీస్తు మాదిరి ఆయన విమోచన క్రయధనపు ఏర్పాటులో ప్రదర్శించబడిన దేవుని చిత్తానికి లోబడి, ప్రపంచవ్యాప్తముగానున్న దేవుని సేవకులందరిని ప్రేమ మరియు ఐక్యతలో నడిపించు పరిశుద్ధాత్మ ద్వారా దానిని చేయవలసివున్నాము.